Share News

ప్రజాస్వామ్య స్వేచ్ఛల పునరుద్ధరణే ముఖ్యం

ABN , Publish Date - Nov 05 , 2026 | 03:58 AM

ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం నాడు ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన ‘ఓట్‌ బచావో, దేశ్‌ బచావో’ ర్యాలీ విజయవంతమైంది. ఎన్ని లక్షల మంది ప్రజలు ఆ ర్యాలీకి హాజరయ్యారన్నది ఒక మొరటు చర్చ...

ప్రజాస్వామ్య స్వేచ్ఛల పునరుద్ధరణే ముఖ్యం

ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం నాడు ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన ‘ఓట్‌ బచావో, దేశ్‌ బచావో’ ర్యాలీ విజయవంతమైంది. ఎన్ని లక్షల మంది ప్రజలు ఆ ర్యాలీకి హాజరయ్యారన్నది ఒక మొరటు చర్చ మాత్రమే. ఎందుకంటే ఆ ర్యాలీ, నిర్వాహకుల, పరిశీలకుల అంచనాలకు మించిన సత్ఫలితాలను సాధించింది. అదే సమయంలో నెల రోజులుగా ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉధృత ఉద్యమంతో సంబంధమున్న ప్రతి ఒక్కరిపైన ఆ ర్యాలీ విజయం మరింత బృహత్తర బాధ్యతను మోపింది.

ర్యాలీ జరగక ముందే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కు వ్యతిరేకంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలే కాకుండా సమస్త ప్రతిపక్షాలూ సంఘటితమయ్యాయి. ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరిట ఈసీఐ పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నదనే విషయాన్ని ప్రతిపక్షాలన్నీ పూర్తిగా ఏకీభవిస్తున్నాయి. ర్యాలీకి దూరంగా ఉన్న ఆప్‌, డీఎంకే సైతం ఈసీఐ పాల్పడుతున్న ఓట్‌ చోరీని వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరచూ సమర్థిస్తున్న బిజూ జనతాదళ్‌, భారత రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ మొదలైనవి కూడా సర్‌ను వ్యతిరేకించాయి. ఇలా ఎన్నికల నిర్వహణ సంస్థపై సమస్త పార్లమెంటరీ ప్రతిపక్షాలూ అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం ఏ ప్రజాస్వామ్య సమాజంలోనూ మున్నెన్నడూ సంభవించలేదు.

‘ఓట్‌ బచావో దేశ్‌ బచావో’ ర్యాలీ, ఆ ర్యాలీ ముందు రోజు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రజా అభిశంసన కార్యక్రమం... ప్రతిపక్షం నిర్వచనాన్ని విస్తరించాయి. సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న పౌర సమాజ సంస్థల, ఉద్యమాల ప్రతినిధులు చాలామంది శనివారంనాటి ‘మాక్‌ పార్లమెంట్‌’లోను, ఆదివారం రామ్‌లీలా ర్యాలీలోను పాల్గొన్నారు. వీరిలో రైతు సంఘాల ప్రతినిధులతో పాటు అక్టోబర్‌ నిరసనల్లో పాల్గొన్న సమస్త యువజన సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇండియా కూటమి ర్యాలీకి మద్దతునివ్వాలని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునివ్వడం ఒక అసాధారణ విషయమే. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ధ్రువ్‌ రాఠీ, రైతు నాయకుడు రాకేశ్‌ తికాయిత్‌ తదితరులు కూడా రామ్‌లీలా ర్యాలీకి పూర్తి మద్దతునిచ్చారు.


సరే, సమస్య పరిష్కారమయ్యేంత వరకు నిరసనలు వెల్లువెత్తడం ఖాయం. భవిష్యత్తులో జరిగే నిరసనలన్నీ ఒకే ఛత్రఛాయన జరుగుతాయని ఆశించలేము. అయితే అక్టోబర్‌లో విభిన్న రీతుల్లో నిరసనలు తెలిపిన వారందరూ ఆదివారం నాటి ర్యాలీలో సమైక్యంగా వ్యవహరించారు. ప్రజలు ఏ విషయాన్నీ అంత తేలిగ్గా నమ్మరు కదా. ఓట్‌ చోరీ విషయమూ అంతే. వారికి నమ్మశక్యంగా లేని ఓట్‌ చోరీ అంశాన్ని తొట్టతొలుత ప్రజల ముందుకు తెచ్చిన రాహుల్‌గాంధీ ఆదివారం నాటి ర్యాలీతో విస్తృత ప్రతిపక్ష కూటమికి నైతిక నాయకుడుగా ఆవిర్భవించారు.

ఓట్‌ చోరీ కథనానికి ప్రజామోదం లభించడంలో ఓట్‌ బచావో దేశ్‌ బచావో ర్యాలీ ఒక నిర్ణయాత్మక ప్రాముఖ్యం గల సంఘటన. సర్‌ విషయమై సీఈసీతో ఎన్నికల కమిషనర్ల విభేదాల గురించి ఒక జాతీయ దినపత్రికలో వెలువడిన పరిశోధనాత్మక కథనాలు ఓటర్‌ జాబితాల సవరణలో అవకతవకలు, భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలు, చర్యలు ప్రజల దృష్టికి వచ్చాయి. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారమ్‌ 6, ఓటర్‌ జాబితాల నుంచి ఒకరి పేరును తొలగించాలని కోరడానికి ఉపయోగించే ఫారమ్‌ 7, ఓటర్‌ ఐడీలో వివిధ రకాల మార్పులు, చేర్పులు చేసేందుకు ఉపయోగపడే ఫారమ్‌ 8ని దుర్వినియోగపరిచిన తీరుతెన్నులు, జాబితాల నుంచి అసాధారణ రీతిలో పేర్లను తొలగించడం మొదలైనవన్నీ ప్రజలకు తెలిసివచ్చాయి. ఎన్నికల సంఘం ఆత్మరక్షణలో పడడం అనివార్యమయింది. సర్వోన్నత న్యాయస్థానం సైతం పలు ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేనంత సాంకేతికమైనవి. అయినప్పటికీ అక్టోబర్‌లో వెల్లువెత్తిన నిరసనలు, అంతిమంగా రామ్‌లీలా ర్యాలీ ప్రభావంతో ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఎక్కడో ఏదో తేడా ఉందన్న సత్యాన్ని వారు పసిగట్టారు. సీఈసీకి వ్యతిరేకంగా ప్రజా అభిశంసన ఈ కథనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది.

గమనించాల్సిన విషయమేమిటంటే ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించడం కోసమో లేక సర్‌ ప్రక్రియ పూర్తి ఉపసంహరణ కోసమో కాదు. గత పన్నెండేళ్లుగా కోల్పోయిన ప్రజాస్వామ్య ప్రదేశాన్ని తిరిగి దక్కించుకోవడం (రీ క్లెయిమింగ్‌ డెమొక్రటిక్‌ స్పేస్‌– ప్రభుత్వ నిర్ణయాలతో కోల్పోయిన విలువలు, హక్కులు, స్వేచ్ఛలను ప్రజలు పోరాటాల ద్వారా తిరిగి సాధించుకోవడం) గురించి కూడా. సర్‌ వ్యతిరేక, సీఈసీ వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంగా ప్రభవించేందుకు సంసిద్ధంగా ఉంది.


ఈ కీలక తరుణంలో రెజిమ్‌ ఛేంజ్‌ (అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని లేదా పాలనా వ్యవస్థను పూర్తిగా మార్చడం)కు పిలుపునివ్వడం అభిలషణీయం కాదు. అది అనవసర గందరగోళాన్ని సృష్టిస్తుంది. అటువంటి ఆలోచన చేయకపోవడమే ఉత్తమం. సాధారణ ప్రజాస్వామిక మార్గమైన ఎన్నికల ద్వారా రెజిమ్‌ ఛేంజ్‌ సాధించాలని డిమాండ్‌ చేయడంలో తప్పులేదు; అటువంటి మార్పుకు ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధం కానే కాదు. ఎన్నికల ద్వారా ప్రజాస్వామిక పరివర్తన అనే సాధారణ మార్గాన్ని ప్రజలు ఉపయోగించుకునేందుకు సదా అనుకూల పరిస్థితులను ఉంచే బాధ్యత ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు తదితర స్వతంత్ర రాజ్యాంగ సంస్థల పైన ఉంది. అది వాటి అనివార్య కర్తవ్యం. అయినా ప్రస్తుత దశలో అటువంటి ప్రజాస్వామిక సానుకూలత అనేది ప్రతిపక్షాల డిమాండ్‌గా మాత్రమే ఉంది. అది తప్పనిసరిగా సమస్త ప్రజల డిమాండ్‌గా ఉండనవసరం లేదు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఒక ప్రజా ఉద్యమం విజయవంతమయ్యేందుకు ఉండవలసిన సానుకూలతలు ఏమిటి? ఆ ఉద్యమం సహజంగా ఆందోళనలు చేస్తున్నవారి భావోద్వేగాలకు అనుగుణంగా జరగాలి. మరీ ముఖ్యంగా అత్యధిక మద్దతు సమకూరే ఒక ఉమ్మడి లక్ష్యానికి ఉద్యమకారులు అందరూ నిబద్ధమై ఉండితీరాలి. ఇటువంటి సానుకూలతలతో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే ఉద్యమం తప్పక విజయవంతమవుతుంది.

ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరగాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలకు పిలుపు అనేది విస్తృతమైనది. అది సీఈసీ రాజీనామాకు, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం–2023 రద్దుకు, సర్‌ ప్రక్రియ ఉపసంహరణకు చేస్తున్న డిమాండ్లకు మాత్రమే పరిమితమైనది కాకుండా ఒక సువిశాల, సునిశ్చిత లక్ష్య సాధనకు సంకల్పించినది. అంతేకాదు, ఇది భావ వ్యక్తీకరణ, భిన్నాభిప్రాయ ప్రకటన, నిరసన తెలుపడం మొదలైన ప్రజాస్వామిక స్వేచ్ఛల పునరుద్ధరణను కూడా అనివార్యం చేస్తుంది. రాజ్యవ్యవస్థ యథేచ్ఛగా అణచివేత విధానాలు, జడిపించే ఎత్తుగడలను అనుసరిస్తున్న ప్రస్తుత సందర్భంలో ఆ ప్రజాస్వామిక స్వేచ్ఛల పునరుద్ధరణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీలు తదితర స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలతో పాటు మీడియా సైతం తటస్థంగా తమ విధ్యుక్త ధర్మాలను నిర్వహించాలనే డిమాండ్‌ కూడా ప్రజాస్వామ్య ఉద్యమంలో ఒక ముఖ్య భాగంగా ఉండాలి. ఇవన్నీ జరిగి తీరాలి. స్పష్టంగా చెప్పాలంటే శాంతియుత, ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధమైన మార్గాలు అన్నిటినీ వాటి నిజమైన స్ఫూర్తితో, సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఇటువంటి ప్రజాస్వామ్య పరిణతి సత్ఫలితాలనివ్వనప్పుడే రెజిమ్‌ ఛేంజ్‌కు పిలుపునివ్వాలి.


ఈ దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు చాలా ప్రాధాన్యమున్నది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు మన ప్రజాస్వామ్యానికి ఒక అగ్నిపరీక్ష లాంటివి. ప్రస్తుత పాలకుల ఆధ్వర్యంలో ఎన్నికలు కనీస స్థాయిలోనైనా స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరుగుతాయా అన్న విషయాన్ని యూపీ ఎన్నికలు నిర్ధారిస్తాయి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రజాదరణకు మాత్రమే కాక, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతకే అవి ఒక పరీక్ష కానున్నాయి. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి ఈ అంశమే ప్రధాన కేంద్రబిందువు కావాలి.

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకై జరుగుతున్న ఉద్యమం రెండోదశలోకి ప్రవేశించింది. ఇది ఇప్పుడు కొండమీద నుంచి అత్యంత వేగంగా దుముకుతున్న నదిలా కన్పించకపోవచ్చు. మైదాన ప్రాంతంలోకి ప్రవేశించిన నదీ ప్రవాహం విశాలంగా, నెమ్మదిగా సాగుతుంది. ఈ నదీ ప్రవాహంలానే ప్రస్తుత ఉద్యమ తీరు కూడా. స్వచ్ఛందంగా, ఏకకాలంలో జరిగిన నిరసనల ద్వారా వెలువడిన ఉత్సాహం, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక సమన్వయ ఉద్యమానికి దారితీస్తున్న తరుణంలో ‘ఓట్‌ చోరీ’ సందేశం ప్రజల ఆలోచనల్లోకి మరింత లోతుగా చొచ్చుకుపోయే అవకాశమున్నది. పాలకుల మొండివైఖరి, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామాను అడ్డుకోవడం అనేవి భారత ప్రజాస్వామ్యానికి అంతిమంగా ఒక వరమే కావచ్చు.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి.

Updated Date - Nov 05 , 2026 | 03:58 AM