Share News

ప్రతిఘటనతోనే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ

ABN , Publish Date - Jul 30 , 2026 | 02:20 AM

రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక సమాజంలో వీధి నిరసన న్యాయసమ్మతమేనా? ఎన్నికలలో పోటీచేయడానికే ప్రాధాన్యమివ్వడం కాకుండా శాంతియుత, ప్రజాస్వామిక ప్రతిఘటనే ప్రతిపక్షాల పురోగతికి సరైన...

ప్రతిఘటనతోనే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ

రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక సమాజంలో వీధి నిరసన న్యాయసమ్మతమేనా? ఎన్నికలలో పోటీచేయడానికే ప్రాధాన్యమివ్వడం కాకుండా శాంతియుత, ప్రజాస్వామిక ప్రతిఘటనే ప్రతిపక్షాల పురోగతికి సరైన మార్గమని నేను ఇదే కాలమ్‌లో చేసిన వాదనకు ప్రతిస్పందనగా పలువురు నాకు ఆ ప్రశ్న వేశారు. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్‌ చీఫ్‌, దర్బారీ మీడియా యాంకర్‌–ఇన్‌–చీఫ్‌, అధికార పార్టీని సమర్థించే విద్యావేత్తలు నా వాదనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ వాదన ప్రజాస్వామ్య వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని, జాతి–వ్యతిరేకమని తప్పుపట్టారు.

అసాధారణంగా జరిగిన యువజనుల నిరసన పాలక పార్టీ వర్గాలకు కలిగించిన నిరుత్సాహం నుంచే ఆ విమర్శలు వచ్చాయనేది స్పష్టం. ప్రజల్లో ప్రగాఢంగా ఉన్న భయసంకోచాలకు తెరదించిన అపూర్వ ప్రజా నిరసన అది. నా వాదనపై వచ్చిన విమర్శల్లో నిజాయితీ లోపించింది. విమర్శకులు చాలా తెలివిగా, తమకు అనుకూలంగా నా వాదనలోని ‘శాంతియుత, ప్రజాస్వామిక’ అనే పదబంధాన్ని విస్మరించారు. ప్రజల్లో విభేదాలు సృష్టించి, మత సామరస్యాన్ని దెబ్బతీసిన రథయాత్రతో అధికారానికి వచ్చినవారు, న్యాయ, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించినవారు వ్యవస్థలను గౌరవించడం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు. రిజర్వేషన్లను వ్యతిరేకించినవారు, సామాజిక న్యాయ భావననే అంగీకరించనివారు స్వతంత్ర భారతదేశంలో పౌర శాసనోల్లంఘనకు వ్యతిరేకంగా అంబేడ్కర్‌ చేసిన వాదనలను ఉటంకిస్తున్నారు.

వాళ్ల విమర్శలు ఇలా ఉన్నాయి: ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక సమస్యను, ఎన్నికైన ప్రజాప్రతినిధులను విస్మరించి, రాజ్యాంగ సంస్థలను ఉపేక్షించి, వీధి నిరసన ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రజలను సమీకరించడం సమర్థనీయమేనా? సమస్యలు, వివాదాలను పరిష్కరించుకునేందుకు రాజ్యాంగ సంస్థలను గౌరవించవలసిన అవసరం లేదా? వీధి నిరసనలు అంటే మూకస్వామ్యాన్ని స్వాగతించడం కాదా? మూకస్వామ్యం ప్రబలమయితే నిర్ణయాలు సహేతుకంగా తీసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? మూకస్వామ్యం అరాచకానికి దారితీసి రాజ్యాంగబద్ధ పాలనను అసాధ్యం చేయదా? ఇది సమాజంలోని అణగారిన వర్గాల శ్రేయస్సుకు ఎలా దోహదం చేస్తుంది?

ఈ ప్రశ్నలు నిరపాయకరమైనవిగా కనిపిస్తున్నాయి. అయితే వాటిలో లోపాలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో సంస్థలు సక్రమంగా పనిచేస్తాయనే సునిశ్చిత విశ్వాసంతోనే ఆ ప్రశ్నలు వేయడం జరిగింది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో సంస్థలు, వ్యవస్థలు సక్రమంగా ఉంటాయనేది ఒక మిథ్య. సమీకృతమైన ప్రజలు ఉన్మాద హంతక మూకలు కారు. ఒక ఉమ్మడి లక్ష్యంతో అనియతంగా సమావేశమైన జన బాహుళ్యమది. అలిఖిత నైతిక నియమావళి వారి ప్రవర్తనను నిర్దేశిస్తుంది. దీనిని మరింత వివరంగా చూద్దాం.


ఆధునిక ప్రజాస్వామ్యాలు ప్రారంభంకాక ముందు లేదా వాటి తొలిదశలో ప్రజా సమూహాలు అందరికీ ఆమోదయోగ్యమైన, అప్పటికే సంప్రదాయపరంగా ఉన్న హక్కులను, పద్ధతులను అనుసరించేవని చరిత్రకారులు వివరించారు. 18వ శతాబ్దిలో ఇంగ్లాండ్‌లోని పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అప్పటి ప్రజలు లాభాపేక్షలేని ‘నైతిక ఆర్థిక వ్యవస్థ’ను (మోరల్‌ ఎకానమీ) కోరుకున్నారని ఈపీ థాంప్సన్‌ వివరించారు. సమష్టి శ్రేయస్సుకు భంగం కలగని రీతిలో ప్రజలు తమ ఆర్థిక, సామాజిక జీవితంలో వ్యవహరించేవారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, పాలనలో ప్రజల భాగస్వామ్యం అన్న భావనను ఉదారవాద ప్రజాస్వామ్యం కొత్తగా ఆవిష్కరించలేదు. సుదీర్ఘకాలంగా ఆచరణలో ఉన్న అసెంబ్లీలు, పిటిషన్లు, ప్రజాసమూహాల ఉమ్మడి నిరసన మొదలైన పద్ధతులను ఆధునిక ప్రజాస్వామ్యాలే వ్యవస్థీకృతం చేశాయి.

అందువల్ల, ప్రజాప్రతిఘటన లేదా ‘కలహశీల రాజకీయాల’ను ఆధునిక ప్రజాస్వామ్యాలు రూపుమాపలేవు. ప్రజాస్వామ్యం పనిచేసే తీరుతెన్నులలో అవి అంతర్భాగాలు. జవాబుదారీతనంతో కూడిన క్రమబద్ధమైన ప్రజాస్వామిక ఆచరణతో పాటు క్రమపద్ధతిలో లేని సామాన్య ప్రజల ఉమ్మడి కార్యాచరణ కూడా పనిచేసే ప్రజాస్వామ్య సజీవ లక్షణం. నిరసన ప్రదర్శనలు, సమ్మెలు, ధర్నాలు, బాయ్‌కాట్‌లు, శాసనోల్లంఘన మొదలైన అనియత పద్ధతుల రూపేణా తమ డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు సామాన్య పౌరులు ప్రయత్నిస్తుంటారు. ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామిక వైఫల్యానికి చిహ్నాలు కావని పశ్చిమ యూరోప్‌లో గత అయిదు శతాబ్దాల కాలంలో సామాన్య ప్రజల ఉమ్మడి కార్యాచరణను నిశితంగా అధ్యయనం చేసిన చార్లెస్‌ టిల్లీ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు. ప్రజాఉద్యమాలు వాస్తవానికి ప్రజాస్వామిక పాలన పరిణామ క్రమంలో ఉద్భవించినవేనని ఆయన అన్నారు. అవి వ్యవస్థ పట్ల శత్రుపూర్వకమైనవి కావు. ప్రజా నిరసనలు తరచూ వ్యవస్థాగత సంస్కరణలకు దారితీస్తాయి. వ్యవస్థల సానుకూల ప్రతిస్పందన ప్రజలు మరింతగా సంఘటితమయ్యేందుకు ఉద్దీపన అవుతుందని చార్లెస్‌ టిల్లీ నిర్ధారించారు.

గ్లోబల్‌ సౌత్‌ (ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా) ప్రజాస్వామిక వ్యవస్థల్లో ప్రజాసమీకరణల ప్రత్యేక పాత్రను గుర్తించడం చాలా ముఖ్యం. 20వ శతాబ్దంలో వలసపాలన నుంచి విముక్తమైన చాలా దేశాలు ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని అనుసరించాయి. అయితే చాలా దేశాలలో ఆ పాలనా పద్ధతులు ప్రభావశీలంగా అమలయేందుకు అవసరమైన సంస్థాగత ప్రాతిపదికలు బలహీనమైనవి. భారత్‌ లాంటి ప్రజాస్వామిక సమాజంలో ప్రజా ఉద్యమాలు, నిరసనలు సంస్థాగత లోపాలు, లొసుగులను అధిగమించేందుకు దోహదం చేస్తున్నాయి. భారత్‌లో పెద్ద ఎత్తున ప్రజ్వరిల్లే ప్రజా నిరసనలు సంస్థాగత వైఫల్యాలకు అత్యవసర ప్రతిస్పందనలు కావని, భారత ప్రజాస్వామ్య తార్కికతలో అవి అంతర్భాగాలని దీపేశ్‌ చక్రవర్తి అన్నారు. సమస్యల పరిష్కారానికి రాజ్య వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు మూకుమ్మడి నిరసనలు అనేవి ప్రభావశీలంగా పనిచేస్తున్నాయి, సందేహం లేదు. అసమానతల సమాజంలో ప్రజా నిరసనలు ప్రజాస్వామ్య పరిపుష్టికి తోడ్పడతాయని, అవి ప్రజాస్వామ్యానికి ప్రతికూలతలు కావని భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలలో ప్రజా ఉద్యమాలను తులనాత్మకంగా అధ్యయనం చేసిన పాట్రిక్‌ హెల్లర్‌ అభిప్రాయపడ్డారు.


న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద పోటెత్తిన యువజనుల నిరసన అసాధారణ నేపథ్యాన్ని మనం అంగీకరించాలి. వర్తమాన భారతదేశం సాధారణంగా పనిచేస్తున్న ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామిక జవాబుదారీతనం, ప్రతిస్పందనాత్మక స్వభావం కనిపించని కాలమిది. అవధులు లేని సంపూర్ణ అధికారాలకు పాలకులు ఆరాటపడుతున్నారు. తమ విధానాలపై ప్రజల అభిప్రాయాలను అలక్ష్యం చేస్తున్నారు. ప్రధాన స్రవంతి మీడియా ప్రభుత్వానికి పూర్తి విధేయత చూపుతోంది. పాలనపై విమర్శలకు ప్రాధాన్యమివ్వడం లేదు. అలాగే రాజ్యాంగబద్ధ సంస్థలూ అధికారపక్షం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. అవి అంతకంతకూ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతున్నాయి. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణకు స్వేచ్ఛ కొరవడుతోంది. ప్రతిపక్షాలను రూపు మాపేందుకు రాజ్యాధికారాలు దుర్వినియోగమవుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నాయి కానీ, అవి ఇంకెంత మాత్రం ప్రజల సంకల్పానికి తార్కాణాలుగా లేవు. ఎన్నికల బరిలోకి దిగిన అన్ని పక్షాలకు సమానావకాశాలు లభించడం లేదు. న్యాయవ్యవస్థ రాజ్యాంగ నిబంధనలను అమలు పరచలేకపోతోంది. అధికారపక్షం ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ ప్రమాణాలను పాటించడం లేదు. ఇటువంటి పరిస్థితులలో వీధులలో ప్రజలను సమీకరించి, నిరసన తెలపడమే ప్రజా ఆకాంక్షలను వ్యక్తం చేసేందుకు లభ్యమవుతున్న ఏకైక మార్గం. వీధి నిరసనలు న్యాయబద్ధమైనవి, ప్రజాస్వామ్యయుతమైనవి, సమర్థనీయమైనవి. జంతర్‌ మంతర్‌ వద్ద యువజనుల ధర్నా అందుకొక పరిపూర్ణ దృష్టాంతం. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు శాంతియుత నిరసన మార్గాన్ని ఎంచుకున్నందుకు ఆ యువజనులకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. వారి నిరసన వ్యవస్థపై తిరుగుబాటు కాదు. ప్రజాస్వామిక రాజకీయాలలో విశ్వాసాన్ని అది పునరుజ్జీవింపజేసింది. ఆ యువ ఉద్యమకారులు ప్రజాస్వామ్యానికి హాని చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని వారు పునరుద్ధరించారు.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 30 , 2026 | 02:20 AM