ఆంధ్ర విశ్వకళాపరిషత్ పేరు మార్చాలి!
ABN , Publish Date - May 15 , 2026 | 01:18 AM
1926లో విశాఖపట్నంలో నెలకొల్పిన ఆంధ్ర విశ్వకళాపరిషత్‌కి ఈ ఏడాదితో నూరేళ్ళు నిండాయి. ఒక గొప్ప ఆశయంతో ఎందరో గొప్ప వ్యక్తుల సహకారంతో, మరెందరో గొప్ప వ్యక్తుల పాలనతో సాగిన ఘనమైన...
1926లో విశాఖపట్నంలో నెలకొల్పిన ఆంధ్ర విశ్వకళాపరిషత్‌కి ఈ ఏడాదితో నూరేళ్ళు నిండాయి. ఒక గొప్ప ఆశయంతో ఎందరో గొప్ప వ్యక్తుల సహకారంతో, మరెందరో గొప్ప వ్యక్తుల పాలనతో సాగిన ఘనమైన చరిత్రంతా– మా తాతల మూతులు చూడండి నేతి వాసన వేస్తాయి అని మనవలు చెప్పుకునేట్టు శతవార్షిక సంబర సందడి జరిగింది. కళింగాంధ్రేతరులెవరో జరుపుకున్న సంబరం అన్పించింది తప్ప, కళింగ నేల జనం జరుపుకున్న సంబరం అనిపించలేదు. అతిథులుగా వచ్చిన వారిలో ఇద్దరో, ముగ్గురో కళింగ నేల వాణిజ్య ప్రముఖులో, రాజకీయ ప్రముఖులో తప్ప కళింగ నేల మేధావులు గానీ సాహితీవేత్తలు గానీ కళాకారులు గానీ, క్రీడాకారులు గానీ లేరు. ఆయా రంగాల్లో ప్రసిద్ధులు ఎందరో కళింగ నేలలో, ఆహ్వానిత అతిథుల సాటి వారే వున్నా... ఎవరికీ అతిథి గౌరవం దక్కలేదు.
వందేళ్ళ వార్షిక సందర్భంలో జరగాల్సిన విశ్వకళాపరిషత్ చారిత్రక ప్రయాణ సమీక్ష అయినా జరిగిందా అంటే... లేదు. అదే జరిగివుంటే గతం నుంచి నేర్చుకోవడం, వర్తమానాన్ని చక్కదిద్దుకోవడం, భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకోవడం జరిగేది. యూనివర్సిటీ యాజమాన్యం ఈ ప్రయత్నాలేమీ చేయలేదు. రోడ్ల మీద రికార్డింగ్ డ్యాన్సులు, వ్యాపార సినిమా కళాకారుల, వ్యాపార క్రీడాకారుల, వాణిజ్యవేత్తల ఉపన్యాసాలు తప్ప... సాహిత్య, సామాజిక, రాజకీయ అంశాల మీద చర్చలు, గోష్ఠుల ఊసు లేదు. ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు కళింగ నేల జనాలు గురి అయినారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఇక ముందయినా చేపట్టాల్సిన చర్యలు కొన్ని...
ఎప్పుడో సమిష్టి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు, విశ్వవిద్యాలయాలు మరెక్కడా లేనపుడు విశాఖలో ఆంధ్ర విశ్వకళాపరిషత్ నెలకొల్పారు. ఇపుడు సమిష్టి ఆంధ్ర విభజన అయింది. ఇప్పటి ఆంధ్రలో కూడా రాయలసీమకు, మధ్య ఆంధ్రకు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. కనక ఈ ఆంధ్ర విశ్వకళాపరిషత్ పేరుని ‘కళింగసీమ విశ్వకళాపరిషత్’ అని పేరు మార్పు చేయాలి. పేరు మార్పు సాధ్యం కాదంటే కనీసం కళింగ నేల విద్యార్థులకు ప్రత్యేక కోటా ఇవ్వాలి.
కళింగ సీమ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల అధ్యయనం కోసం ఒక ప్రత్యేక అధ్యయన పీఠం ఏర్పరచి, నిధులు కేటాయించి, సమర్ధులైన ఆచార్యుల పర్యవేక్షణలో వివిధ అంశాల ప్రసిద్ధుల సహకారంతో నిర్వహించాలి. దానివల్ల కళింగ నేల సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను పీఠం సూచిస్తుంది; కళింగ సీమ నుంచి కథ, నవల, నాటకం గత వందేళ్ళ నుంచి ప్రముఖంగా వస్తోంది. ఇవి కళింగ సీమ జన జీవితాలను చిత్రిస్తున్నాయి. వాటిని పాఠ్యాంశాలుగా పెట్టాలి; ఎక్కడెక్కడి వారికో కాదు డాక్టరేట్లు ఇవ్వాల్సింది, కళింగ సీమ ప్రముఖులకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాలి.
విశ్వవిద్యాలయానికి నిధులు, సిబ్బంది కొరత ఉంది. పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ విద్యాలయానికి పోటీ కాదు, కానీ ఆదర్శంగా నిలవాల్సిన యూనివర్శిటీ అనాథలా ఉంటోంది. ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టటం లేదు. వీటికోసం యూనివర్శిటీ యాజమాన్యం, విద్యార్థులు ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి; సిబ్బంది జీతాలను కూడా యూనివర్శిటీ రిజర్వు నిధుల నుంచి గత కొన్ని నెలలుగా చెల్లిస్తున్నారు.
ఇంకా కొన్ని చర్యల కోసం కళింగ సీమ మేధావులతో, ప్రజాస్వామిక వాదులతో చర్చలు జరిపి ఆంధ్ర విశ్వకళాపరిషత్ మరో వందేళ్ళు కళింగసీమ విజ్ఞాన కేంద్రంగా నిలవడానికి, నిలుపుకోడానికి ప్రభుత్వాలు, ప్రజలు ప్రయత్నించాలి.
అట్టాడ అప్పల్నాయుడు
కళింగ సీమ రచయితల, కళాకారుల వేదిక అధ్యక్షుడు
ఇవీ చదవండి:
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?