Share News

ఆశీర్వచన వస్త్రాలలో చేనేతకు ప్రాధాన్యమివ్వాలి

ABN , Publish Date - May 15 , 2026 | 01:10 AM

తెలుగు రాష్ట్రాలలో ప్రతి రోజూ లక్షలాది భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని ఆశీర్వచనాన్ని పొందుతున్నారు. దర్శనం అనంతరం భక్తులకు అందించే ఆశీర్వచన వస్త్రాలు కేవలం...

ఆశీర్వచన వస్త్రాలలో చేనేతకు ప్రాధాన్యమివ్వాలి

తెలుగు రాష్ట్రాలలో ప్రతి రోజూ లక్షలాది భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని ఆశీర్వచనాన్ని పొందుతున్నారు. దర్శనం అనంతరం భక్తులకు అందించే ఆశీర్వచన వస్త్రాలు కేవలం కానుక మాత్రమే కాదు... అవి విశ్వాసానికి ప్రతీక, భక్తి భావానికి గుర్తు, దైవానుగ్రహానికి చిహ్నం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం భక్తులకు అందించే వస్త్రాలకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అలాగే శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి దేవస్థానం, కనకదుర్గ అమ్మవారి దేవాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, బాసర జ్ఞానసరస్వతి దేవాలయం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

ప్రస్తుతం అనేక దేవాలయాల్లో పంపిణీ అవుతున్న వస్త్రాలు మరమగ్గాలు లేదా మిల్లుల ద్వారా తయారైన పాలిస్టర్ దారంతో ఉత్పత్తి అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమల వంటి క్షేత్రాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధించారు. అయితే ప్లాస్టిక్ ఆధారిత పాలిస్టర్ దారంతో తయారైన వస్త్రాలను భక్తులకు అందించడం ఒక విరుద్ధ పరిస్థితి. దేవాలయ పవిత్రత అంటే కేవలం ఆచార వ్యవహారాలు మాత్రమే కాదు... ప్రకృతి, సంప్రదాయ పరిరక్షణ కూడా అంతే ముఖ్యం.

చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానాన్ని కలిగివున్నాయి. సహజ పట్టు, కాటన్ దారాలతో చేతివృత్తిగా తయారయ్యే వస్త్రాలు సహజమైనవి, పర్యావరణ హితమైనవి, ఆధ్యాత్మిక వినియోగానికి అనుకూలమైనవి. దేవతామూర్తులకు సమర్పించే వస్త్రాలు, భక్తులకు అందించే ఆశీర్వచన వస్త్రాలు చేనేతలో తయారైతే, దైవసేవతో పాటు సంప్రదాయ పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది. దేవాలయాలకు ప్రతి సంవత్సరం లక్షలాది వస్త్రాలు అవసరమవుతాయి. ఈ అవసరాన్ని చేనేత రంగం ద్వారా తీర్చే విధానాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తే వేలాది కార్మికులకు స్థిరమైన ఉపాధి లభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అంతరించిపోతున్న సంప్రదాయ వృత్తులకు పునర్జీవం లభిస్తుంది.


భక్తులు దేవాలయం నుంచి పొందే ఆశీర్వచన వస్త్రాలను ఎంతో పవిత్రంగా భద్రపరుచుకుంటారు. ఇళ్లలో పూజల సమయంలో వాటిని వినియోగిస్తారు. అందువల్ల ఆ వస్త్రాల నాణ్యత, శుద్ధత అత్యంత ప్రాధాన్యమైన అంశం. దీనిని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సమగ్రంగా పరిశీలించాలి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ దేవాలయాల్లో ఆశీర్వచన వస్త్రాల తయారీలో చేనేతకు ప్రాధాన్యం కల్పించే విధానాన్ని రూపొందించాలి. భక్తి సంప్రదాయాలు కాలానుగుణంగా అభివృద్ధి చెందాలి. ఆధునికత పేరుతో సంప్రదాయాలను దూరం చేయకుండా, వాటిని మరింత శుద్ధంగా కొనసాగించాలి. దేవాలయం నుంచి వచ్చే ఆశీర్వచనం భక్తుడి జీవితంలో పవిత్రమైన జ్ఞాపకం. అది– సహజమైనది, స్వదేశీది, సంప్రదాయబద్ధమైనదిగా ఉండాలి.

గజం అంజయ్య

తడక యాదగిరి (ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ మాజీ సభ్యులు)

ఇవీ చదవండి:

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

Updated Date - May 15 , 2026 | 01:10 AM