Share News

డీలిమిటేషన్‌ను అడ్డుకుంటే దక్షిణాదికి ద్రోహమే!

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:39 AM

ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ ప్రజాస్వామ్యానికి, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికికి అత్యంత కీలకమైనవి. గత సమావేశాల్లో రాజకీయ పంతాలకే ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే...

డీలిమిటేషన్‌ను అడ్డుకుంటే దక్షిణాదికి ద్రోహమే!

ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ ప్రజాస్వామ్యానికి, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికికి అత్యంత కీలకమైనవి. గత సమావేశాల్లో రాజకీయ పంతాలకే ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, సమాజ్‌వాదీ వంటి విపక్షాల సంకుచిత వైఖరి వల్ల 131వ రాజ్యాంగ సవరణ– డీలిమిటేషన్ బిల్లు ఆగిపోయింది. ప్రస్తుత సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును అధికారిక ఎజెండాలో పెట్టనప్పటికీ, సప్లిమెంటరీ బిల్లు రూపంలో తెచ్చే అవకాశాలు ఉన్నాయి. విపక్షాలు మళ్లీ ఏకతాటిపైకి వచ్చి అడ్డుకోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని పాటిస్తోంది.

లోక్‌సభలో శివసేన షిండే గ్రూపునకు చెందిన ఆరుగురు ఎంపీలకు విడిగా గ్రూప్ హోదా దక్కడం, తృణమూల్ కాంగ్రెస్ విలీనవర్గం ఆమోదం పొంది ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు రావడం, శరద్ పవార్ వర్గం కూడా బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే దిశగా అడుగులు వేస్తుండటం, విపక్ష కూటమిలోని డీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉండాలనే యోచనలో ఉండటం వంటి పరిణామాలు సభలో సరికొత్త రాజకీయ చిత్రపటాన్ని ఆవిష్కరించాయి. తాజా రాజకీయ లెక్కల ప్రకారం.. షిండే గ్రూప్, టీఎంసీ శకలాలు, స్వతంత్రులు, చిన్న పార్టీలు కలుపుకుని ఎన్డీఏ వైపు 315 నుంచి 319 మందిని దాటి బలంగా ఉండటంతో విపక్షాల పాత వ్యూహాలు ఇక సాగవు.

జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాల పునర్విభజన జరిగితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్న ఆందోళన పాతదే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, లోక్‌సభ స్థానాల కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరగాలి. 1976లో ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్యను 2000 సంవత్సరం వరకు స్తంభింపజేశారు. 2001లో వాజపేయి హయాంలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకొని, కుటుంబ నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా శిక్షించకూడదని గట్టిగా వాదించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 84వ రాజ్యాంగ సవరణలో కీలకపాత్ర వహించారు. తద్వారా ఈ స్తంభనను మరో 25 ఏళ్లు– 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు పొడిగించారు. ఆ చారిత్రక చొరవ వల్లనే గత పాతికేళ్లుగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ బలం, జాతీయ స్థాయి ప్రాధాన్యం రక్షించబడుతూ వచ్చాయి.


ఆర్టికల్ 81(3) నిబంధన ప్రకారం, 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా ఉన్న సీట్ల స్తంభన 2026తో ముగుస్తుంది. తదుపరి జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ అనివార్యం అవుతుంది. 2011 జనాభా లెక్కలను లేదా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా సీట్ల పునఃకేటాయింపు చేస్తే ఘోరమైన అసమతుల్యత ఏర్పడుతుంది. జనాభా విస్ఫోటనంతో ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరిగి, జనాభాను క్రమశిక్షణతో అదుపు చేసిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల సీట్ల శాతం జాతీయ స్థాయిలో దారుణంగా పడిపోతుంది. లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచకుండా పాత 543 స్థానాల పరిమితిలోనే పునర్విభజన చేస్తే, తమిళనాడు సీట్లు 39 నుంచి 32కి, కేరళ సీట్లు 20 నుండి 15కి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది సమాఖ్య స్ఫూర్తికే తీరని విఘాతం.

ఈ భౌగోళిక– రాజకీయ అసమతుల్యతను నివారించడానికి ఎన్డీఏ ప్రతిపాదించిన న్యాయబద్ధమైన రాజ్యాంగ రక్షణ కవచం– లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్ఠంగా 850 లేదా 50శాతం అదనపు స్థానాలకు పెంచడం అనే మోడల్– ఓడిపోయింది. కేంద్రం తెచ్చిన ‘ప్రొపోర్షనల్ ఇంక్రీజ్ మోడల్’ (సమాన నిష్పత్తి పెంపుదల విధానం) ప్రకారం జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రానికి ప్రస్తుతం ఎంత శాతంలో ఎంపీ సీట్ల ప్రాతినిధ్యం ఉందో, పార్లమెంట్ విస్తరణ తర్వాత కూడా అదే శాతం ప్రాతినిధ్యం కొనసాగుతుంది. అంటే ఎవరి జాతీయ వాటా తగ్గకుండా అందరికీ సీట్లు పెరుగుతాయి.

ఈ బిల్లు ప్రకారం, విస్తరణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత 25 లోక్‌సభ స్థానాలు 38కి, తెలంగాణలో 17 నుంచి 26 సీట్లకు, తమిళనాడులో 39 నుంచి 59 సీట్లకు పెరుగుతాయి. ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 129 లోక్‌సభ స్థానాలు ఏకంగా 195 స్థానాలకు పెరుగుతాయి. దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల మొత్తం ప్రాతినిధ్యం దాదాపు 24 శాతంగానే స్థిరంగా, ఉత్తరాది రాష్ట్రాల పెరిగిన జనాభాకు ప్రాతినిధ్య న్యాయం జరుగుతుంది. అదే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యానికి ఎలాంటి భంగం కలగదు. ఇది అసలైన ‘విన్–విన్’ పరిష్కారం. కానీ కాంగ్రెస్, దాని విపక్ష కూటమి పట్టుదలకు పోయి వాకౌట్ చేయడంతో, మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ లేక బిల్లు ఆగిపోయింది.


ఈ ఓటమిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరిగింది. విపక్షాల బాధ్యతారాహిత్య చర్య వల్ల దక్షిణాది సాధించింది ఏమీ లేదనే సత్యం ప్రజలకు అర్థమైంది. బహిరంగంగా దక్షిణాది ప్రయోజనాల గురించి మాట్లాడే కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు రాజకీయంగా మాత్రం దక్షిణాదిని రక్షించే ఏకైక నిర్మాణ వ్యవస్థను ధ్వంసం చేయడం.. వారి అంతర్గత వైరుధ్యాన్ని బయటపెట్టింది. కేవలం గుడ్డి వ్యతిరేకతతో, దేశ ప్రయోజనాలను, ముఖ్యంగా దక్షిణాది ప్రయోజనాలను, పణంగా పెట్టడానికి కూడా కాంగ్రెస్ వెనుకాడటం లేదు. దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ప్రాంతీయ ప్రయోజనాలతో పాటు జాతీయ సమగ్రతను కాపాడేలా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించింది.

గత సమావేశాల ఓటమినీ, తదనంతర పరిణామాలను నేపథ్యంగా ఉంచుకుని, ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు కేవలం ఆర్థిక కేటాయింపులకే పరిమితం కాకుండా, దేశ సమాఖ్య స్ఫూర్తిని రక్షించే డీలిమిటేషన్ సవరణపై పునఃచర్చకు వేదిక కావాలి. విపక్షాలు తమ పాత పంతాలను పక్కనబెట్టి, జాతీయ సమ్మతిని సాధించడానికి ముందుకు రావాలి.

ఈ సెషన్‌లో ప్రధానంగా మూడు అంశాలపై ఉభయసభల్లో చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోంది. ఒకటి, 50శాతం ప్రొపోర్షనల్ సీట్ల పెంపుదలను రాజ్యాంగ సవరణ బిల్లులో అంతర్భాగంగా చేర్చి, దక్షిణాది రాష్ట్రాల జాతీయ ప్రాతినిధ్య శాతం తగ్గదని చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వడం. రెండు, నియోజకవర్గాల సంఖ్య పెరగడం వల్ల ప్రతి ఎంపీ పరిధిలోని జనాభా భారం తగ్గి, ప్రజలకు– ప్రజాప్రతినిధికి మధ్య దూరం తగ్గడం. మూడు, 2023లో ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలు కావాలంటే చట్టసభల్లో 33శాతం స్థానాలు మహిళలకు దక్కాలంటే, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అత్యంత అవసరం. ఈ బిల్లును అడ్డుకోవడం అంటే మహిళల చట్టసభల హక్కును కాలరాయడమే.

ప్రొపోర్షనల్ సీట్ల పెంపు మోడల్ ఫెడరల్ వ్యవస్థకు రక్షణ కవచం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఇప్పటికైనా సంకుచిత పంథాను మార్చుకొని, దక్షిణాది ప్రయోజనాల రక్షణ కోసం, మహిళా సాధికారత కోసం ఈ పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్‌ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఈ సమావేశాలలోనే దీన్ని అనుబంధ బిల్లు రూపంలో ఎజెండాలోకి తెచ్చి ఆమోదింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నీలాయపాలెం విజయ్‌కుమార్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి

ఈ వార్తలనూ చదవండి:

తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై కేంద్రం క్లారిటీ..

పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని మరింత పెంచుతారా? కేంద్రం ఏమందంటే..

Updated Date - Jul 21 , 2026 | 01:39 AM