డీలిమిటేషన్.. అమెరికా పద్ధతి మేలు
ABN , Publish Date - May 13 , 2026 | 12:07 AM
భారతదేశంలో తాజా జనగణన పూర్తయిన తర్వాత... యాభయ్యేళ్ల కిందటి లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయడం సహేతుకం కాదని ఉత్తరాది రాష్ట్రాలు గొడవ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు జనాభా నియంత్రణ...
భారతదేశంలో తాజా జనగణన పూర్తయిన తర్వాత... యాభయ్యేళ్ల కిందటి లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయడం సహేతుకం కాదని ఉత్తరాది రాష్ట్రాలు గొడవ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు జనాభా నియంత్రణ నాటి పోకడల్ని చూపించి దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న రభస ఎంత సహేతుకమో.. భవిష్యత్తులో కొత్త జనాభా లెక్కలను చూపించి ఉత్తరాది రాష్ట్రాలు గొడవ చేస్తే అది కూడా అంతే సహేతుకం అనిపించుకుంటుంది. ఈ వివాదం ఎప్పటికీ తెగదా? డీలిమిటేషన్‌కు నిత్య విఘ్నం తప్పదా? దరిమిలా మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావడం కుందేటికొమ్మును వెతికి తేవడమే అవుతుందా? అనే సందేహాలు కలగడం సహజం. మరి తరుణోపాయం ఏమిటి? గందరగోళం లేని వ్యవస్థ కావాలి. లోక్‌సభ సీట్ల పునర్విభజన విషయంలో సహేతుకమైన మార్గం అనుసరించి, రాజ్యసభ సీట్ల విషయంలో కొన్ని మార్పుచేర్పులు చేసుకోవడం మంచిది. ఈ విషయంలో అమెరికా ఎగువసభ వ్యవస్థీకృతమైన పద్ధతిని అనుసరిస్తే... ప్రపంచంలో అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత వన్నెకెక్కుతుంది.
భారత్‌లో మాదిరిగానే అమెరికాలో కూడా అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థలుగా రెండంచెల సభలు ఉంటాయి. మనకు లోక్‌సభ, రాజ్యసభల లాగా అమెరికాలో కాంగ్రెస్, సెనేట్ వ్యవస్థలు ఉంటాయి. కాకపోతే అమెరికాలో ఈ రెండు సభల ప్రతినిధులను కూడా ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. భారత్ మాదిరిగా ఇక్కడ కూడా రెండు సభలూ ఆమోదిస్తే తప్ప చట్టాలు రూపుదిద్దుకోవు. అయితే అమెరికాలో ఎగువసభగా వ్యవహరించదగిన సెనేట్ కూర్పు భిన్నమైనది. సెనేట్‌కు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి, పోటీచేసే సమయానికి ఆ రాష్ట్ర నివాసితుడై ఉండాలి. భారత్‌లో అలా కాదు. శాసనసభ్యులు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. కేంద్రంలోని పెద్ద పార్టీలు తాము పునరావాసం కల్పించదలచుకున్న నాయకులను తమకు బలం ఉన్న రాష్ట్రాలపై రుద్దేస్తారు. స్థూలంగా గమనిస్తే అమెరికాలో సెనేట్ వ్యవస్థ ప్రస్తుతం భారత్‌లో డీలిమిటేషన్ ప్రక్రియకు సవాలుగా నిలుస్తున్న సందేహాలకు జవాబు అవుతుంది.
అమెరికా అంటేనే అనేక రాష్ట్రాలను గుదిగుచ్చిన ఫెడరల్ వ్యవస్థ. సహజంగా ఇక్కడ కూడా కొన్ని పెద్ద రాష్ట్రాలు, కొన్ని చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా దిగువ సభ కాంగ్రెస్‌లో రాష్ట్రాలవారీగా ఉండే సభ్యుల సంఖ్యలో తేడా ఉంటుంది. సెనేట్‌లో అలా కాదు. ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సభ్యులు వంతున ఉంటారు. ఇందులో పెద్ద, చిన్న రాష్ట్రాలనే తేడా లేదు. అంటే ఏ ఒక్క రాష్ట్రం గళాన్ని కూడా అణచివేయడం కుదరదు. అన్ని రాష్ట్రాలకూ సమానమైన ప్రాతినిధ్యం ఉంటుంది.
భారత్‌లో అలాంటి వ్యవస్థ లేదు. రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌కు 31 మంది రాజ్యసభ ఎంపీలుంటే.. యావత్ ఈశాన్య రాష్ట్రాలకు, గోవా, పుదుచ్చేరి వంటి వాటికి కూడా ఒక్క రాజ్యసభ ఎంపీ వంతున మాత్రమే ప్రతినిధులుంటారు. దీనివల్ల ఆ రాష్ట్రాల స్వరాన్ని ఎగువసభలో బలంగా వినిపించడం ఒక మిథ్య. ఈ లోపాన్ని సరిదిద్ది, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం రాజ్యసభలో కల్పించాలి. అప్పుడు ఎలాంటి గందరగోళాలకు అవకాశం ఉండదు.
రాజ్యసభలో ప్రాతినిధ్యాల్ని అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉంచాలన్న ప్రతిపాదన కొత్తది కాదు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై 1969లో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రాజమన్నార్ కమిటీ అనేక సూచనలు చేసింది. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలనే సూచన కూడా వాటిలో ఉంది. అయితే అప్పట్లో ఆ కమిటీ సూచనలను కేంద్రం తిరస్కరించింది. 1977లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఒక విజ్ఞాపన పత్రాన్ని కేంద్రానికి అందించింది. రాజ్యసభకు కూడా లోక్‌సభతో సమానంగా అధికారాలను కల్పించడం అందులో కీలకమైనది. ఇది కూడా ఆచరణకు నోచుకోలేదు. కానీ డీలిమిటేషన్ అనే పదం చుట్టూ ముసురుతున్న వివాదాలు, అనుమానాల నేపథ్యంలో ఇప్పుడు రాజమన్నార్ కమిటీ సూచనల్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఏ పద్ధతిలో రాజ్యసభ సభ్యుల్ని ఎంపిక చేస్తారనేది పక్కన పెడితే.. రాజ్యసభ ఎంపీల సంఖ్యను అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉంచడం మంచి పద్ధతి. మన రాజకీయ పార్టీలు తమకు ఉపయోగపడిన వారిని, నేరుగా ప్రజల ఓట్లతో ఎన్నికల్లో గెలిచే సత్తాలేని అస్మదీయులను రాజ్యసభకు పంపుతుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది పునరావాస కేంద్రం. కేవలం ప్రజల ద్వారా ఎన్నికయ్యే లోక్‌సభ ఎంపీలు- ఓట్ల కోసం ప్రజలను ఆకర్షించడానికి తప్పుడు చట్టాలు చేయకుండా, దేశ విశాల ప్రయోజనాల్ని పణంగా పెట్టే పనులు చేయకుండా ఒక చెక్ పాయింట్ లాగా ఉండడానికి రాజ్యసభలో మేధావులను, పెద్దలను ఉంచాలనేది ఆలోచన. కాలక్రమంలో అది పునరావాసం, ఆశ్రితులకు అడ్డాగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో భారత్‌లో కూడా ఒక రాష్ట్రానికి ఇద్దరే రాజ్యసభ ఎంపీలు అంటే.. చాలా పార్టీలకు రుచించకపోవచ్చు. కానీ ప్రతి రాష్ట్రానికి సమానంగా ప్రాతినిధ్యం కల్పించడం మాత్రం సరైన పద్ధతే.
కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బిల్లు రాజ్యసభలోనూ నెగ్గితే తప్ప చట్టం కాదు గనుక.. ఈ వ్యవస్థ దేశవిశాల ప్రయోజనాలకు కాపు కాస్తుంది. డీలిమిటేషన్‌లో అన్యాయం జరుగుతుందని ఇవాళ ఒకరు, భవిష్యత్తులో మరొకరు నానా రభస చేసి, అసలు వ్యవస్థను ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుపడడానికి అవకాశం ఉండదు. ఈ దేశంలో చరిత్రాత్మకమైనదిగా మనం అనుకుంటున్న మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కూడా సులువవుతుంది.
కృష్ణమోహన్ దాసరి
పాత్రికేయుడు, డల్లాస్
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News