Share News

నాడు దిశానిర్దేశనం... నేడు సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:49 AM

విజయవాడలో 1965లో జరిగిన భారతీయ జనసంఘ్ జాతీయ మహాసభ సాధారణ రాజకీయ సమావేశం కాదు. అది స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి దిశా నిర్దేశనంతో పాటు...

నాడు దిశానిర్దేశనం... నేడు సమగ్రాభివృద్ధి

విజయవాడలో 1965లో జరిగిన భారతీయ జనసంఘ్ జాతీయ మహాసభ సాధారణ రాజకీయ సమావేశం కాదు. అది స్వాతంత్ర్యానంతరం భారతదేశానికి దిశా నిర్దేశనంతో పాటు ఏ మార్గంలో అభివృద్ధి జరగాలి? అన్న ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన ఒక ఆలోచన. పాశ్చాత్య దేశాల మాదిరిగా యాంత్రిక అభివృద్ధిని గుడ్డిగా అనుసరించాలా? లేదా మన సంస్కృతిని, సమాజాన్ని కాపాడుకుంటూ ఆధునికతను స్వీకరించాలా? ఈ సందిగ్ధంలో జనసంఘ్ స్పష్టంగా చూపిన బాట– భారతీయత ఆధారంగా భారతదేశ అభివృద్ధి ఉండాలి అని.

జనవరి 23 నుంచి 26 వరకూ జరిగిన నాటి ఈ భారతీయ జనసంఘ్ 12వ వార్షిక మహాసభ ఒక మైలురాయి. ఇక్కడే, ఆధునిక హిందూ జాతీయవాద ఆలోచనాస్రష్ట పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ... పాశ్చాత్య భౌతికవాదం, మార్క్సిస్టు సిద్ధాంతాల దుష్ట ప్రభావాలను తిరస్కరిస్తూ, భారతీయ సనాతన జ్ఞాన సంప్రదాయంపై ఆధారితమైన ఏకాత్మ మానవత అనే సమగ్ర తత్వశాస్త్రాన్ని ప్రకటించారు. ఏకాత్మ మానవత అభివృద్ధిని ఆపేది కాదు. అభివృద్ధికి దిశ చూపించేది. అభివృద్ధి అంటే– గ్రామం నుంచి రాజధాని వరకూ సమాన అవకాశాలు కల్పించడం; పేదరికం నిర్మూలనతో పాటు స్వాభిమానాన్ని నిర్మించడం; ఆర్థిక బలంతో పాటు సాంస్కృతిక ఆత్మవిశ్వాసం పెంపొందించడం.

ఈ మహాసభకు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో అదే విజయవాడలోనే ఈ నెల 23, 24 తేదీలలో జరగనున్న సదస్సులో ఎనిమిది కాలాంశాలు ‘నేటి కాలానికి ఏకాత్మ మానవ దర్శనం ఆవశ్యకత’, ‘రాజకీయ, సాంస్కృతిక దృష్టికోణం, భారతీయత–ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం’, ‘ఆర్థిక పరిపుష్టి–వికేంద్రీకరణ, సమగ్ర ఆలోచనా విధానం ద్వారా విశ్వదర్శనం–భారతీయ రక్షణ’, ‘ఏకాత్మ మానవ దర్శనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన’, సమకాలీన అనువర్తనాలు–భవిష్యత్తు కార్యాచరణ లాంటి అనేక అంశాలను చర్చిస్తారు.

1965 మహాసభను ఒక సాధారణ సమావేశంగా చూడకూడదు; ఇది ఒక దార్శనిక పరివర్తన. ఈ మహాసభలో అధ్యక్షులుగా ఎన్నికైన దీనదయాళ్... జనసంఘ్ పార్టీ ‘సూత్రాలు– విధానాలు’ ద్వారా ఏకాత్మ మానవతను ప్రధాన భావనగా స్థాపించారు. ఈ తత్వం భారతదేశాన్ని ఒక సజీవ సమష్టిగా భావిస్తూ, భౌతిక పురోగతిని ఆధ్యాత్మిక సంపూర్ణతతో ఏకీకృతం చేస్తుంది. ఈ సిద్ధాంతం బలవంతంగా భారతీయులపై రుద్దుతున్న పాశ్చాత్య భావజాలాల్ని, సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ, భారతీయ ధర్మ–సంస్కృతికి అనుగుణమైన విధానాలను దీనదయాళ్ జీ ప్రతిపాదించారు.


ఇందులోని కీలకమైన సూత్రాలు... అంత్యోదయ– సమాజంలోని అంతిమ వ్యక్తి (చిట్టచివరి వ్యక్తి) ఉద్ధరణను ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం. స్వదేశీ, స్వావలంబన– విదేశీ ఆధారితను తగ్గించి, స్థానిక ఆవిష్కరణలు, వనరులను ఉపయోగించడం. వికేంద్రీకరణ– కేంద్రీకృత శక్తి నుంచి గ్రామీణ, స్థానిక స్థాయిలకు అధికార వికేంద్రీకరణ. నైతిక ఆర్థికత– లాభాపేక్షకు మించి, సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ఆర్థిక వ్యవస్థ.

ఈ మహాసభ నేపథ్యంలో దీనదయాళ్ జీ సాంస్కృతిక స్వాభిమానాన్ని, సమగ్రాభివృద్ధి ప్రణాళికలను బలపరచడం ద్వారా, జనసంఘ్‌ను ఒక రాజకీయ శక్తిగా ఎదిగేలా చేశారు. 1965లో జనసంఘ్ కలగన్న ఆలోచనలే 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రత్యక్ష రూపం దాల్చాయి. స్వదేశీ ఆర్థిక దృష్టి, ఆత్మనిర్భర్ భారత్, మౌలిక సదుపాయాల విప్లవం, జాతీయ భద్రతలో స్పష్టత, విదేశాంగ విధానంలో సమర్థత లాంటివి లోతుగా అమలు చేస్తూ, విశ్వశక్తిగా మన దేశం ఎదుగుతోంది. ఆత్మనిర్భర్ భారత్– స్వదేశీ ఉత్పాదనను ప్రోత్సహిస్తూ, విదేశీ ఆధారితను తగ్గించడం. ఇది దీనదయాళ్ గారి స్వావలంబన సూత్రానికి సాక్ష్యం. ఉదాహరణకు మేకిన్ ఇండియా. అంత్యోదయ సాకారం– పీఎం కిసాన్‌, వీబీ జీరామ్‌జీ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అణగారిన వర్గాల జీవితాల్ని మారుస్తున్నాయి. సాంస్కృతిక పునరుత్థానం– ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, యోగా– ఆయుర్వేద ప్రపంచీకరణ లాంటివి ఏకాత్మ మానవతా ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. డిజిటల్ వికేంద్రీకరణ– డిజిటల్ ఇండియా, యూపీఐ వంటివి ప్రజల ఆర్థిక స్వావలంబనను పెంచుతున్నాయి. పర్యావరణ సమతుల్యత– ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, గ్రీన్ ఎనర్జీ వంటి కార్యక్రమాలు మానవ–ప్రకృతి సమన్వయాన్ని బలపరుస్తాయి. జాతీయ భద్రత– స్వదేశీ రక్షణ పరికరాలు (తేజస్ ఫైటర్, బ్రహ్మోస్ మిస్సైల్స్), 5 ట్రిలియన్ డాలర్‌ ఆర్థిక లక్ష్యాలు సమగ్ర అభివృద్ధి ఫలితాలు.

2023 జీ–20 సమ్మిట్‌లో ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్, వసుధైక కుటుంబకం ఆధునిక వ్యాఖ్యానం. ఈ ఆలోచన భారతదేశాన్ని విశ్వగురుగా స్థాపిస్తుంది. అయితే, ఈ విజయాలు సవాళ్లు లేకుండా రాలేదు. ఆధునిక కాలంలో విభజనవాద శక్తులు, గ్లోబల్ అనిశ్చితులు లాంటివి ఎదురైనా తట్టుకుని ముందుకు వెళుతున్నాం.


ఈ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న సదస్సు 1965 మహాసభను పునఃస్మరణ చేస్తూ ‘దీనదయాళ్ జీ దృక్పథం ఎలా అభివృద్ధిని సమగ్రంగా రూపొందించింది, ఆధునిక భారతదేశం దానిని ఎలా సాకారం చేస్తోంది’ అనే అంశాలపై లోతైన చర్చలు జరపనుంది. ఈ సదస్సు కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కోసమే కాదు, భవిష్యత్తును రూపొందించుకోవడం కోసం కూడా. ‘‘మనం జీవితాన్ని సమగ్ర దృష్టితో చూడాలి’’ అని దీనదయాళ్ జీ అనేవారు. నేటి తరానికి ఏకాత్మ మానవతా దర్శనం చక్కటి మార్గదర్శకం చేస్తుందనడంలో సందేహం లేదు.

సాదినేని యామినిశర్మ

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

ఇవి కూడా చదవండి

8 యుద్ధాలను ఆపాం.. దావోస్‌లో ట్రంప్ పాతపాట

విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం.. బాధితులను స్టేషన్‌కు పిలిస్తే అధికారులదే బాధ్యత

Updated Date - Jan 22 , 2026 | 04:03 AM