Share News

వికసిత భారతానికి దీన్‌దయాళ్‌ దారి

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:34 AM

భారత రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు వారు నిర్వహించిన పదవుల ద్వారా గుర్తుండిపోతారు. మరికొందరు తమ ఆలోచనలు, సిద్ధాంతాలు, జీవన విలువలతో తరతరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారు...

వికసిత భారతానికి దీన్‌దయాళ్‌ దారి

భారత రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు వారు నిర్వహించిన పదవుల ద్వారా గుర్తుండిపోతారు. మరికొందరు తమ ఆలోచనలు, సిద్ధాంతాలు, జీవన విలువలతో తరతరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారు. పండిట్‌ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ రెండో కోవకు చెందినవారు.

1916 సెప్టెంబర్ 25న జన్మించిన దీన్‌దయాళ్‌జీ చిన్ననాటి నుంచే అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదురైనా ఆయన ఎక్కడా కుంగిపోలేదు. కష్టాలను అధిగమిస్తూ దేశసేవే తన జీవిత ధ్యేయంగా బతికారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా సామాజిక సేవలో ప్రవేశించారు. 1953 నుంచి 1968 వరకు జనసంఘ్‌లో వివిధ కీలక బాధ్యతలను నిర్వహిస్తూ పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేశారు. కేవలం సిద్ధాంతాలను పదేపదే వల్లించడం వల్ల సమాజం మారదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అవి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తాయి. సంఘ్ ఏ కార్యానికి తనను నియమించిందో, దానికే సంపూర్ణంగా అంకితమై పనిచేశారు.

స్వాతంత్ర్యానంతరం భారతదేశం పాశ్చాత్య దేశాల సిద్ధాంతాలను యథాతథంగా అనుసరించకుండా భారతీయ జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయం, సమాజ స్వభావానికి అనుగుణంగా దేశాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. క్యాపిటలిజం, కమ్యూనిజం వంటి సిద్ధాంతాల్లోని పరిమితులను అధిగమిస్తూ, వ్యక్తి–సమాజం–ప్రకృతి–పరమాత్మ మధ్య సజీవ సమన్వయాన్ని ప్రతిపాదించిన సమగ్ర భారతీయ ఆలోచనా విధానమే ఏకాత్మ మానవతావాదం.

దీన్‌దయాళ్‌జీ దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం సంపద పెరగడం కాదు. మనిషి శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ– అన్ని కోణాల్లో సమగ్రాభివృద్ధి చెందాలి. వ్యక్తి అభివృద్ధి... కుటుంబం, సమాజం, దేశాభివృద్ధితో అనుసంధానమై ఉండాలి. ప్రకృతిని దోచుకోవడం కాదు, ప్రకృతితో సమన్వయంగా జీవించడం ఆయన ఆలోచనలో ముఖ్యమైన అంశం. అందుకే నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభం, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమతుల్యతల నేపథ్యంలో ఏకాత్మ మానవతావాదం మరింత ప్రాధాన్యంగా మారింది. ఆధునిక సాంకేతికత, ఆర్థిక ప్రగతి అవసరమే. అయితే వాటితో పాటు మానవ గౌరవం, సామాజిక బాధ్యత, ప్రకృతి పరిరక్షణ, భారతీయ విలువలు కూడా ముందుకు సాగాలి.

సమాజంలోని అత్యంత వెనుకబడిన వ్యక్తి అభ్యున్నతి సాధించినప్పుడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని దీన్‌దయాళ్‌జీ విశ్వసించారు. అందుకే ‘అంత్యోదయ’ ఆయన ఆలోచనా విధానంలో అత్యంత కీలకమైన భావనగా నిలిచింది. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు లభించాలి. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలి. ఇదే అంత్యోదయ స్ఫూర్తి. నేడు దేశాభివృద్ధిలో పేదల సంక్షేమం, సామాజిక సాధికారత, స్వావలంబన, మౌలిక సదుపాయాల విస్తరణ, చివరి వ్యక్తికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరడం వంటి అంశాలకు ప్రాధాన్యం లభించడం దీన్‌దయాళ్‌జీ ఆలోచనల సమకాలీనతను తెలియజేస్తోంది.


దీన్‌దయాళ్‌జీ రాజకీయ హుందాతనానికి నిదర్శనాలైన కొన్ని సంఘటనలున్నాయి. 1967లో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్న సమయంలో భిన్న సిద్ధాంతాలకు చెందిన పార్టీలతో కలిసి పనిచేశారు. కమ్యూనిస్టులతో రాజకీయ పోటీ ఉన్నా, వారిని శత్రువులుగా చూడకుండా, ఉన్నతమైన రాజకీయ సంస్కృతిని ప్రదర్శించారు. దీన్‌దయాళ్‌జీ కేవలం సిద్ధాంతకర్త మాత్రమే కాదు. వేలాది కార్యకర్తలకు మనోధైర్యం నింపిన గొప్ప నాయకుడు. విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, వాటినే మన బలంగా మార్చుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చేవారు. తాష్కెంట్ ఒప్పందం తరువాత జనసంఘ్ సభలో కార్యకర్తలను సముదాయించిన తీరు ఆయన నాయకత్వంలోని హుందాతనాన్ని, కార్యకర్తల పట్ల ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది.

నేటి రాజకీయ వాతావరణంలో చిన్న విషయాలు కూడా తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. కానీ దీన్‌దయాళ్‌జీ కాలంలో రాజకీయ ప్రత్యర్థితో కూడా ఒక నైతిక బాధ్యతతో వ్యవహరించే సంస్కృతి ఉండేది. ఆర్గనైజర్ పత్రికలో ఆనాటి హోం మంత్రి చవాన్‌ను ఉద్దేశించి గాడిద రూపంలో కార్టూన్ వచ్చినప్పుడు ఆ విధంగా కార్టూన్ వేయాల్సింది కాదన్నారు.

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 1965లో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్ జాతీయ మహాసభలో ఏకాత్మ మానవతావాదం అధికారికంగా స్వీకరించిన చారిత్రక వేదికగా ఆ నగరం నిలిచింది. ఆ సిద్ధాంతం ఆవిర్భవించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడలో నిర్వహించే ‘పునర్‌దర్శనం’ సమ్మేళనం కేవలం ఒక కార్యక్రమం కాదు. అది ఒక ఆలోచనా పునర్విమర్శ. దేశాభివృద్ధికి నాటి తరం చేసిన ఆలోచనలను నేటి తరానికి పరిచయం చేయడం అవసరం. ఆయన జీవితం, రచనలు, ప్రసంగాలు, రాజకీయ ప్రయాణంపై మరింత లోతైన అధ్యయనం జరగాలి.

నేడు భారతదేశం ప్రపంచంలో ఒక శక్తిమంతమైన దేశంగా ఎదుగుతున్న వేళ, అభివృద్ధి ప్రయాణం భారతీయ మూలాలను మరచిపోకూడదు. ఆర్థిక ప్రగతితో పాటు సామాజిక సమరసత, సాంస్కృతిక ఆత్మవిశ్వాసం, పర్యావరణ పరిరక్షణ, మానవ గౌరవం, స్వావలంబన– ఇవన్నీ సమానంగా ముందుకు సాగాలి. యువతకు అవకాశాలు, రైతులకు బలం, మహిళలకు సాధికారత, కార్మికులకు గౌరవం, పేదలకు భద్రత, అట్టడుగు వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలి. దేశాభివృద్ధి ఫలాలు ప్రతి వ్యక్తికి చేరాలి. ఇదే దీన్‌దయాళ్‌జీ ప్రతిపాదించిన సమగ్ర అభివృద్ధి భావనకు నిజమైన అర్థం.

1968 ఫిబ్రవరి 11న దీన్‌దయాళ్‌జీ భౌతికంగా మనకు దూరమైనా, ఆయన ఆలోచనలు భారత రాజకీయ, సామాజిక చింతనలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆయనను జయంతి, వర్ధంతి సందర్భాల్లో స్మరించుకోవడం మాత్రమే సరిపోదు. ఆయన చూపిన మార్గంలో నడవాలి.

పీవీఎన్ మాధవ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌

(నేడు పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ 110వ జయంతి)

ఈ వార్తలనూ చదవండి:

ఆ భయంకర సాఫ్ట్‌వేర్‌ని రద్దు చేయండి.. ఈసీఐనెట్ యాప్‌పై శశిథరూర్

కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు

Updated Date - Sep 25 , 2026 | 03:34 AM