Share News

డిజిటల్ వేదికల్లో దిగజారుతున్న భాష!

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:43 AM

డిజిటల్ విప్లవం సమాచార ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. ఒకప్పుడు వార్తలను సేకరించి, పరిశీలించి, సంపాదకీయ ప్రమాణాలతో ప్రజల ముందుకు తీసుకువచ్చే బాధ్యత ప్రధానంగా మీడియా సంస్థలదే. కానీ నేడు...

డిజిటల్ వేదికల్లో దిగజారుతున్న భాష!

డిజిటల్ విప్లవం సమాచార ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. ఒకప్పుడు వార్తలను సేకరించి, పరిశీలించి, సంపాదకీయ ప్రమాణాలతో ప్రజల ముందుకు తీసుకువచ్చే బాధ్యత ప్రధానంగా మీడియా సంస్థలదే. కానీ నేడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, వివిధ సామాజిక మాధ్యమాల ఆవిర్భావంతో చేతిలో స్మార్ట్‌ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తీ ఒక ప్రసారకర్తగా మారిపోయాడు. భావ ప్రకటనా స్వేచ్ఛ విస్తరించడం, కొత్త గొంతుకలకు వేదిక లభించడం ప్రజాస్వామ్యానికి సానుకూల పరిణామాలే! కానీ అదే సమయంలో ద్వంద్వార్థాలు, అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే రాజకీయ వ్యాఖ్యలు, సంచలనాల కోసం భాషను దిగజార్చడం వంటి ప్రమాదకర ధోరణులు కూడా విస్తృతమయ్యాయి. ఇది ప్రజా చర్చల నాణ్యతను దెబ్బతీస్తున్న సామాజిక పరిణామంగా మారింది.

నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రధాన పోటీ ప్రజల దృష్టిని ఆకర్షించడానికే పరిమితమైంది. ఏ కంటెంట్ ఎక్కువ మంది చూస్తారు? వీడియోకి ఏ థంబ్‌నెయిల్‌ ఎక్కువ కోపాన్ని లేదా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది? అనే అంశాలే డిజిటల్‌ వేదికలు అల్గోరిథమ్‌లను నడిపిస్తున్నాయి. నిజానిజాలు, భాషా సంస్కారం, సామాజిక బాధ్యత కంటే ‘ఎంగేజ్‌మెంట్’కు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ఫలితంగా ఎక్కువ వ్యూస్‌ కోసం, యాడ్‌ రెవెన్యూ కోసం కంటెంట్ తయారు చేసేవారు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే భాషను, ద్వంద్వార్థాలను, వ్యక్తిగత విమర్శలను ఆశ్రయిస్తున్నారు. ఈ దృష్టిని ఆకర్షించే పోటీ మధ్య విలువలు లుప్తమవుతున్నాయి.

అనేక యూట్యూబ్ రాజకీయ చానెళ్లు విధానాల విశ్లేషణ, పాలనా సమీక్ష, రాజ్యాంగ అంశాల చర్చలను పక్కనబెట్టి వ్యక్తుల చుట్టూ రాజకీయాలను కేంద్రీకరిస్తున్నాయి. వ్యక్తిగత దూషణలు, వ్యంగ్యాలు, పరుష పదజాలం, అవమానకర సంభాషణలు సాధారణమైపోయాయి. అత్యంత ఆందోళన కలిగించే అంశం ద్వంద్వార్థ భాష వినియోగం. ఒకప్పుడు కొన్ని వాణిజ్య వినోద కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యానాల్లోనూ, సామాజిక మాధ్యమాల చర్చల్లోనూ సాధారణమవుతోంది. ప్రత్యక్షంగా అసభ్య పదాలు ఉపయోగించకుండా సంకేతాల రూపంలో, వ్యంగ్యాల రూపంలో, అవమానకర సూచనల రూపంలో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కొత్త సంస్కృతిగా మారింది. చట్టపరంగా నేరంగా పరిగణించలేని ఈ భాష కూడా సమాజంలో సంభాషణ ప్రమాణాలను క్రమంగా దిగజారుస్తోంది.


పాత్రికేయ దృష్టితో చూస్తే ఇది మరింత ఆందోళనకర పరిణామం. సంప్రదాయ జర్నలిజం వాస్తవ నిర్ధారణ, సందర్భానుసార విశ్లేషణ, భాషా సంస్కారం, సంపాదకీయ బాధ్యత వంటి ప్రమాణాలపై నిర్మితమైంది. డిజిటల్ మీడియా సమాచార ప్రజాస్వామ్యాన్ని విస్తరించినప్పటికీ, సంపాదకీయ పర్యవేక్షణను గణనీయంగా తగ్గించింది. అనేక స్వతంత్ర యూట్యూబ్ చానెళ్లకు సంస్థాగత బాధ్యత లేదు. ఫలితంగా వాస్తవ నిర్ధారణ స్థానంలో వేగం, విశ్లేషణ స్థానంలో అభిప్రాయం, ఆధారాల స్థానంలో ఉద్వేగం చోటుచేసుకుంటున్నాయి.

భాష దిగజారడం ఒక్కటే సమస్య కాదు. సంచలన శీర్షికలు, తప్పుదోవ పట్టించే థంబ్‌నెయిల్స్, సందర్భం లేకుండా కత్తిరించిన వీడియోలు, ఏకపక్ష రాజకీయ వ్యాఖ్యానాలు ప్రజల అవగాహనను కూడా వక్రీకరిస్తున్నాయి. సంక్లిష్ట రాజకీయ అంశాలను ఆలోచించి విశ్లేషించాల్సిన చోట ప్రేక్షకులను తక్షణ భావోద్వేగ ప్రతిస్పందనల వైపు నెడుతున్నాయి. ఫలితంగా ప్రజాస్వామ్యంలో అవసరమైన హేతుబద్ధ చర్చలకు బదులుగా విభజన, పరస్పర ద్వేషం పెరుగుతున్నాయి.

ఈ పరిస్థితిని సరిదిద్దడానికి బహుముఖ చర్యలు అవసరం. మొదటగా– డిజిటల్ వేదికలు కేవలం వ్యూస్‌ ఆధారంగా కాకుండా కంటెంట్ నాణ్యత, విశ్వసనీయతకు కూడా ప్రాధాన్యం ఇచ్చే విధంగా తమ అల్గోరిథమ్‌లను మార్పు చేయాలి. ఫ్యాక్ట్‌ చెకింగ్‌ సంస్థలతో కలిసి పనిచేస్తూ, అసభ్య, విద్వేషపూరిత భాషను ప్రోత్సహించే చానెళ్లపై చర్యలు తీసుకోవాలి. రెండవది– ప్రభుత్వాలు నియంత్రణ పేరుతో భావ ప్రకటనా స్వేచ్ఛను పరిమితం చేయకుండా డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించాలి. వార్త, అభిప్రాయం, వ్యంగ్యం, దుష్ప్రచారం మధ్య తేడాను గుర్తించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. విద్యా వ్యవస్థలో మీడియా లిటరసీని ఒక ముఖ్యమైన అంశంగా చేర్చాలి. మూడవది– పాత్రికేయ రంగం తన మూల విలువలను మరింత బలోపేతం చేసుకోవాలి. వివరణాత్మక కథనాలు, గణాంకాల ఆధారిత విశ్లేషణలు, నిర్మాణాత్మక రాజకీయ చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సోషల్ మీడియా సంచలనాన్ని అనుకరించడం ద్వారా మీడియా విశ్వసనీయతను కోల్పోకూడదు. జర్నలిజం అసలైన బలం వేగంలో కాదు; విశ్వసనీయతలో ఉంది.


అలాగే పౌరసమాజ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, మీడియా సంఘాలు కలిసి డిజిటల్ సంభాషణకు స్వచ్ఛంద నైతిక నియమావళిని రూపొందించాలి. బాధ్యతాయుతమైన డిజిటల్ జర్నలిజాన్ని ప్రోత్సహించే పురస్కారాలు, ప్రోత్సాహకాలు కూడా ఈ దిశగా ఉపకరిస్తాయి.

భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. అయితే స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది. అసభ్యతను సహజంగా అంగీకరించకుండా సంభాషణలో సంస్కారం, వాస్తవికత, పరస్పర గౌరవం నిలబెట్టడం కాలానుగుణ అవసరం. ప్రజాస్వామ్యం బలపడేది భిన్నాభిప్రాయాల వల్ల మాత్రమే కాదు; ఆ భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే భాష నాణ్యత వల్ల కూడా.

బత్తుల సత్యనారాయణ (జర్నలిస్ట్‌)

ఇవి కూడా చదవండి

మళ్లీ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కువైట్, జోర్డాన్‌పై ఐఆర్‌జీసీ తాజా దాడులు..

గోరింటాకు అందాలు.. ఆరోగ్యానికీ మంచిదే..

Updated Date - Jul 16 , 2026 | 05:43 AM