వికేంద్రీకరణతోనే గ్రామ స్వరాజ్యం
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:56 AM
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ స్థాయి పరిపాలనకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. ‘గ్రామ స్వరాజ్యం’ అనే మహాత్మాగాంధీజీ స్వప్నాన్ని సాకారం చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ...
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ స్థాయి పరిపాలనకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. ‘గ్రామ స్వరాజ్యం’ అనే మహాత్మాగాంధీజీ స్వప్నాన్ని సాకారం చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక శక్తిమంతమైన సాధనంగా నిలుస్తుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జరుపుకుంటారు. 1993లో అమలులోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా లభించింది. ఈ చట్టం ద్వారా గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పరిషత్ అనే మూడు స్థాయిల వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజలకు పాలనలో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని కూడా బలోపేతం చేశారు. అలాగే 11వ షెడ్యూల్‌లో 29 అంశాలను పంచాయతీల పరిధిలో చేర్చి, గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే బాధ్యత అప్పగించారు.
అయితే ఈ చట్టం అసలు ఉద్దేశ్యం అయిన ‘స్వయం పాలన’ పూర్తి స్థాయిలో సాధ్యమైందా అనే ప్రశ్నకు సమాధానం ఇంకా స్పష్టంగా లేదు. పంచాయతీలకు నిజమైన అధికారాలు ఇవ్వాలంటే నిధులు, విధులు, సిబ్బంది... పూర్తి స్థాయిలో బదిలీ కావాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఈ వికేంద్రీకరణ అసంపూర్తిగా ఉంది. విధుల విషయంలో పంచాయతీలకు అప్పగించిన 29 అంశాలు ఉన్నా, వాటి అమలులో రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో పంచాయతీల పాత్ర పరిమితంగానే ఉంది. ఇది పంచాయతీలను స్వయంపాలనా సంస్థలుగా కాకుండా కేవలం అమలు సంస్థలుగా మార్చుతోంది.
నిధుల విషయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. పంచాయతీలకు స్వంత ఆదాయ వనరులు చాలా తక్కువ. పన్నులు, ఫీజులు వసూలు చేసే అవకాశాలు పరిమితంగా ఉండటంతో, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ కమిషన్ల పాత్ర కీలకంగా మారింది. ప్రత్యేకంగా 15వ ఫైనాన్స్ కమిషన్ (2021–26) స్థానిక సంస్థలకు గణనీయమైన నిధులను కేటాయించింది. తాగునీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సేవల కోసం టైడ్ గ్రాంట్లు అందించడం ద్వారా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చింది. పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, డిజిటల్ అకౌంటింగ్ వంటి చర్యలు పారదర్శకతను పెంచాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిధులతో గ్రామ ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ నిధుల వినియోగంలో కొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. టైడ్ గ్రాంట్లు ఎక్కువగా ఉండటం వల్ల పంచాయతీలకు స్వేచ్ఛ తగ్గుతోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయడానికి పరిమిత అవకాశాలే ఉన్నాయి. ఇక 16వ ఫైనాన్స్ కమిషన్ (2026–31) మరింత బాధ్యతాయుత వ్యవస్థను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ కమిషన్ పనితీరు ఆధారిత నిధులపై ఎక్కువ దృష్టి పెట్టింది. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ, బాధ్యతాయుత పరిపాలన వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
ఇదిలా ఉండగా రాష్ట్ర ఆర్థిక సంఘాల పాత్ర కూడా అత్యంత కీలకం. రాజ్యాంగం ప్రకారం, ప్రతి రాష్ట్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇది రాష్ట్ర ఆదాయాన్ని స్థానిక సంస్థలకు ఎలా పంచాలో సిఫార్సులు చేస్తుంది. కానీ వాస్తవంగా చాలా రాష్ట్రాల్లో ఈ సంఘాలు సమయానికి ఏర్పాటు కావడం లేదు. ఒకవేళ ఏర్పాటయినా వాటి సిఫార్సులు పూర్తిగా అమలు కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం పంచాయతీల ఆర్థిక పరిస్థితిపై కీలక అంశాలను వెలుగులోకి తీసుకువచ్చింది. పంచాయతీలకు భారీ ఆర్థిక లోటు, విద్యుత్ బిల్లుల బకాయిలు, స్వంత ఆదాయం తక్కువగా ఉండటం వంటి సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఇటీవల కొన్ని పరిపాలనా సంస్కరణలు చేపట్టింది. ప్రతి పంచాయతీకి ప్రత్యేక కార్యదర్శులను నియమించడం, డిజిటల్ వ్యవస్థలను ప్రవేశపెట్టడం, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు తీసుకుంటోంది. ఇవి పంచాయతీల పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అయితే ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. పూర్తి స్థాయిలో అధికారాల బదిలీ జరగకపోవడం, సిబ్బంది కొరత, ప్రణాళికా సామర్థ్యం లోపించడం, రాజకీయ, పరిపాలనా జోక్యం వంటి అంశాలు పంచాయతీల అభివృద్ధికి అడ్డంకులుగా ఉన్నాయి. ముఖ్యంగా పంచాయతీలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోకపోవడం పెద్ద సమస్య.
ఈ పరిస్థితుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సమగ్ర దృష్టికోణం అవసరం. మొదటగా నిధులు, విధులు, సిబ్బందిని పూర్తి స్థాయిలో పంచాయతీలకు బదిలీ చేయాలి. ఇది నిజమైన వికేంద్రీకరణకు తొలి అడుగు. రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫార్సులను తప్పనిసరిగా అమలు చేయాలి. పంచాయతీలకు స్వంత ఆదాయం పెంచుకునే అవకాశాలు కల్పించాలి. స్థానిక పన్నులు వసూలు చేసే అధికారాన్ని బలోపేతం చేయాలి. అదేవిధంగా, ఎన్నికైన ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచాలి. డిజిటల్ గవర్నెన్స్, ఆన్‌లైన్ అకౌంటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలి. గ్రామసభలను చురుకుగా నిర్వహించడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. సామాజిక ఆడిట్ల ద్వారా పారదర్శకతను నిర్ధారించాలి. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.
టి.ఎం.బి. బుచ్చిరాజు
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్
(నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం)
ఇవి కూడా చదవండి
ఆర్టీసీ సమ్మెలో ఆందోళనకర పరిణామాలు..
చిన్న నౌకలనూ కాల్చేయండి.. అమెరికా నేవీకి ట్రంప్ కీలక సూచనలు