ఇంటర్ విద్యను ముంచొద్దు
ABN , Publish Date - May 19 , 2026 | 12:26 AM
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో కలువుతారట! ఇది తిరోగమన చర్య. 55 ఏళ్ల క్రితం అప్పుడు అమలులో ఉన్న 11వ తరగతి, మల్టీపర్పస్ స్కూలు విద్యను రద్దు పరుస్తూ వాటి స్థానంలో ఎందుకు...
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో కలువుతారట! ఇది తిరోగమన చర్య. 55 ఏళ్ల క్రితం అప్పుడు అమలులో ఉన్న 11వ తరగతి, మల్టీపర్పస్ స్కూలు విద్యను రద్దు పరుస్తూ వాటి స్థానంలో ఎందుకు ఇంటర్మీడియట్ స్థాయిని ప్రవేశపెట్టారో ఈ తిరోగమన చర్యకు పాల్పడుతున్న పెద్దలు ఆలోచించారా? అప్పటికే కొఠారి నేతృత్వంలో నివేదిక సమర్పించిన జాతీయ ‘విద్యా కమిషన్–1964’ పన్నెండవ తరగతి వరకు పాఠశాల విద్య కొనసాగాలన్న భావనతో ఉన్నా, అందుకు భిన్నంగా ఆలోచించి, మారుతున్న ప్రాపంచిక పరిస్థితులను అంచనా వేసుకొని విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్‌కు ప్రత్యేక స్థాయిని కల్పించిన ఆనాటి విద్యా పారంగతుల సూచనలను పరిగణనలోకి తీసుకున్నారా?
ఉన్నత విద్యకు ముఖద్వారం లాంటిది ఇంటర్ స్థాయి. పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకు మధ్య వారధిగా ఇంటర్ విద్యకు రూపకల్పన చేశారు. దీనిని ఎంసెట్, నీట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాయడానికి అర్హత పొందే కోర్స్‌గా దిగజార్చిన ఘనత ప్రైవేట్ జూనియర్ కాలేజీలది. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పెరిగి మొత్తం విద్యావ్యవస్థను తమ కబంధ హస్తాల్లో బంధించడానికి అవకాశం కల్పించిన అపరాధం గత ప్రభుత్వాలది. ఆ తప్పిదాలను సరిదిద్దకుండా ఇంటర్ స్థాయి అస్తిత్వానికే ఎసరు పెడతామని విధాన నిర్ణయం చేయాలనుకోవడం సబబు కాదు. ఇంటర్మీడియట్ వ్యవస్థలో లొసుగులు ఉంటె, వాటిని సవరించే ప్రయత్నం చేయకుండా, స్వతంత్ర వ్యవస్థ స్థాయిని పీకి పారేసి, పాఠశాల విద్యలో కలిపేస్తే అంతా సర్దుకుంటుందని అనుకోవడం అవగాహనారాహిత్యం!
ప్రతి దానికీ అమెరికా వైపు చూసే మానసిక దౌర్బల్యం మన జనాల్లోనే కాదు ప్రభుత్వ వర్గాల్లో కూడా ఉండడం మన దౌర్భాగ్యం. అమెరికాలో 12వ తరగతి వరకు ఒకే స్కూల్లో ఉంటుంది కాబట్టి మనమూ అదే పద్ధతి పాటిద్దాం అనుకుంటే– గుడ్డెద్దు పంట చేనులో పడ్డ విధంగా విద్యావ్యవస్థ తయారవుతుంది. అమెరికాలో అది ‘టర్మినల్ కోర్స్’, మన రాష్ట్రంలో ఉన్నత విద్యకు విద్యార్థులను సంసిద్ధులను చేసేది ఇంటర్ విద్య. అందుకే దీనిని ఉన్నత విద్యకు ‘ముఖ ద్వారం’ అన్నారు.
ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. 11వ తరగతి స్థానంలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టిన ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ కార్యదర్శిగా రాజగోపాల్ ఉండేవారు. అమెరికాలో ఉన్నత మాధ్యమిక విద్యాస్థాయి (హయ్యర్ సెకండరీ) స్థితిగతులను అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించే బాధ్యతను అప్పజెప్పి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆ దేశానికి పంపించింది. ఆయన అక్కడి స్కూలు వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి, మన దేశ–రాష్ట్ర పరిస్థితుల కనుగుణంగా ఉండే విధంగా స్కూల్ నుంచి 11వ తరగతిని, అప్పుడు అమలులో ఉన్న ఒక సంవత్సరం కాల వ్యవధిలో పూర్తి చేసే ప్రీ యూనివర్సిటీ కోర్స్ (పీయూసీ)ను కలిపి రెండు సంవత్సరాల ఇంటర్ విద్యకు రూపకల్పన చేస్తూ నివేదిక సమర్పించారు. ఇదంతా ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు కనుసన్నల్లో జరిగింది.
ప్రపంచం జ్ఞాన విస్ఫోటనం చెందుతున్న మార్గంలో పయనిస్తున్నది. దినదినమూ పోగుపడుతున్న విజ్ఞానమంతా విద్యార్థుల చేతుల్లోనే ఇమిడిపోతున్నది. ప్రతి పిల్లవాడూ సమాచారానికి, పరిశోధనలకు, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు ప్రభావితుడవుతున్నాడు. ఇక ఎంతమాత్రమూ 15 ఏళ్ళు దాటిన పిల్లవాడు స్కూలు విద్యార్థిగానే ఉండకూడదు. కళాశాలలో జరిగే బోధనా పద్ధతిలోకి ప్రవేశించాలి.
వ్యాపారస్తుల ప్రమేయం ఎక్కువై ఇంటర్మీడియట్ విద్య కునారిల్లిపోతున్నది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో అధికారుల పర్యవేక్షణ కరువై పరిస్థితి కొన్నిచోట్ల వెర్రితలలు వేస్తున్నది. పరీక్షల నిర్వహణ, ప్రైవేట్ కాలేజీల అనుమతులకే ఇంటర్మీడియట్ బోర్డు పరిమితమైపోవడం విషాదం. ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు, ఆ స్థాయిని రద్దు చేసి, పాఠశాల విద్యలో కలపడం అనేది సరి అయిన పరిష్కారం కానే కాదు. ప్రైవేట్ ప్రమేయాన్ని నివారించాలి. బోధనా పద్ధతులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనే విధంగా కళాశాలలను పరిపుష్టం చెయ్యాలి. విషయ సేకరణతో మాత్రమే ఆగిపోకుండా విద్యార్థులను పరిశోధన వైపు ప్రోత్సహించే విద్యావిధానం ఆవిష్కృతం కావాలి.
ఎ. రాజేంద్రబాబు
పూర్వ అధ్యక్షులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్ల సంఘం
ఇవి కూడా చదవండి..
మహిళలకు ఫ్రీ బస్సు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక శాఖ.. సీఎం సతీశన్
అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా