Share News

ఉద్యమసారథి దాశరథి

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:56 AM

పందొమ్మిదేండ్ల వయస్సు గల ఒక యువకుడు ఆవేశంతో నవాబు సైనికులు తెలంగాణ ప్రజానీకంపై జరుపుతున్న భయంకరమైన హింసా చర్యల్ని హృదయవిదారకంగా ఒక సభలో వర్ణిస్తూ మధ్య మధ్య తాను రచించిన కొన్ని పద్యాలను చదవడం ప్రారంభించాడు. ఆయనే దాశరథి....

ఉద్యమసారథి దాశరథి

పందొమ్మిదేండ్ల వయస్సు గల ఒక యువకుడు ఆవేశంతో నవాబు సైనికులు తెలంగాణ ప్రజానీకంపై జరుపుతున్న భయంకరమైన హింసా చర్యల్ని హృదయవిదారకంగా ఒక సభలో వర్ణిస్తూ మధ్య మధ్య తాను రచించిన కొన్ని పద్యాలను చదవడం ప్రారంభించాడు. ఆయనే దాశరథి. సభ్యుల్ని ఉర్రూతలూగిస్తూ–

‘‘ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులన్‌ బడగొట్టి మంచి మా/ గాణములన్‌ సృజించి ఎముకల్‌ నుసిఁజేసి పొలాలు దున్ని భో/ షాణములన్‌ నవాబునకు స్వర్ణమునింపిన రైతుదే తెలం/ గాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?’’

పోలీసులు వచ్చి ఆ యువకుణ్ణి బంధించారు. జనాన్ని చెల్లాచెదురు చేసి, అక్కడకు 20 మైళ్ల దూరంలోనున్న నెల్లికుదురు గ్రామంలోని పోలీసు ఠాణాకు తీసుకెళ్లారు. పోలీసుల కాపలా నుంచి తప్పించుకుని.. ఎత్తుగా పెరిగిన జొన్నపైరుల చాటున దాగుతూ పరుగెత్తి, తోవలో ఒక ఏరుదాటి మహబూబాబాద్‌ అడవిలో చొరబడి, రాత్రి 10 గంటల దాకా పరుగెత్తి నాగారం గ్రామానికి చేరుకున్నారు. తిండి తిప్పలు లేకుండా సుమారు 30 మైళ్లదాకా పరుగెత్తడం, నడవడం వల్ల దాశరథి ఒళ్లంతా హూనమయింది. మిత్రుడొకరు ఆయనను దాచి, చికిత్స చేసి రక్షించారు. అప్పటి నుంచి వేషం మార్చుకొని నిజాం ప్రభుత్వానికి చిక్కకుండా తన కార్యక్రమం ప్రారంభించారు.

నిజాం ఉక్కు పిడికిట్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తోటి ప్రజల ఆర్తరావాలకు దాశరథి గుండె రగిలే కుంపటిగా మారింది. మానవత్వానికి, రాక్షసత్వానికి మధ్య జరిగే సంఘర్షణ ఆయనకు కవితా వస్తువైంది. దాశరథి అనగానే నిజాం వ్యతిరేకోద్యమ కవిత్వం వెంటనే గుర్తుకొస్తుంది. ఆయన జైలు గోడల మీద బొగ్గుతో రాసిన పద్యం అగ్నిని కురిపిస్తుంది. ‘‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నినుబోలిన రాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రత్నాల వీణ’’. నిజాం సంస్థానం దురంతాలమయం. నిజాం రాజు అకృత్యాలకు అంతం లేదు. అందుకే దాశరథి అలా ఎలుగెత్తారు.

‘‘ఇటు వసంతం లేదు, సహింపరాని/ గ్రీష్మ హేమంత కాల కాళికలె గానీ/ ఇట ఉషస్సులు లేవు, భరింపరాని/ అంబువాహ సందోహ నివాళిగాని’’... కవితా విశ్వరూపాన్ని మనముందుంచారు. నిజాం నిరంకుశ పాలనతో ప్రజల బాధ హృదయ విదారకంగా వినపడుతోంది. సామాన్యుల రక్తం పిండి సామ్రాజ్యాన్ని నిర్మించుకొంటున్న కసాయి ప్రభుత్వం చేసే అరాచక కృత్యాలకు కవి అంతరంగం అగ్నిగుండంలా మండింది. అతని నాల్కల మీద అగ్నిధారగా కవిత ఆవిర్భవించింది. సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయి, మానభంగాలు సరేసరి. తెలుగు మాట్లాడడానికి వీలులేదు. ఆస్తుల దోపిడీలు, గృహ దహనాలూ.. ఈ అమానుష, దారుణ, దుస్సహ, దుష్ట కృత్యాలు తెలంగాణాన్ని నరకలోకం కన్న మిన్నగా చేశాయి. దాశరథి ఉగ్రుడయ్యారు, కవిత్వాన్ని ఒక విల్లుగా ఎక్కుపెట్టారు. ‘‘మా నిజాం రాజు, తరతరాల బూజు’’ అనడానికి ఎన్ని గుండెలు కావాలి. దానికి ఫలితం.. అతనిని ఇనుప గొలుసులు వరించాయి. నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలు శ్రీకృష్ణ జన్మస్థానమైంది. దాశరథి ఈసారి నిరసన వచనంలో గళం విప్పారు.


‘‘ఇదే మాట ఇదే మాట పదేపదే అనేస్తాను

కదంతొక్కి పదంపాడి ఇదే మాట అనేస్తాను

జగత్తంత రగుల్కొన్న కృథాజ్వాల వృథాపోదు

అడుగడుగున యెడద నెత్రు గడగడమని త్రాగినావు

పడతుల మానాలు దోచి గుడగుడమని హుక్కత్రాగి

జడియక కూర్చుండి నీవు మడికట్టుక నిలిచినావు

దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు

వద్దంటే గద్దెయెక్కి పెద్దరికం చేస్తావా

మూడుకోట్ల చేతులు నీ మేడను పడతోస్తాయి, మెడను విడదీస్తాయి.

నీకు నిలుచు హక్కు లేదు, నీకింకా దిక్కు లేదు’’

ప్రేక్షకుని వలె గాక ప్రజల కష్టనిష్ఠూరాలలో తానొకడుగా కలసిపోయినాడు. అందుచేతనే దాశరథి ‘అగ్నిధార’లో అణుమాత్రమైనా కాల్పనికత గానీ, అవాస్తవికత గానీ కనిపించదు. తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతిబింబం దాశరథి కవిత్వం. జాతీయ భావాలతో నిండి విప్లవాత్మకమై విలసిల్లిన దాశరథి రచనలు నిద్రాణమై ఉన్న తెలంగాణ ప్రజానీకాన్ని మేల్కొల్పడానికి ఎంతో తోడ్పడతాయి. దుర్మార్గుల కిరాతకాలకు లోనైన పీడిత ప్రజానీకపు వాణి దాశరథి కంఠంలో ప్రతిధ్వనించింది. తన మాతృభూమి తెలంగాణను చూచుకొని మురిసిపోయి ‘‘ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ’’ అని పొంగిపోయారు. మహారణ్యమైన తెలంగాణ భూమిని మాగాణ మొనర్చిన రైతుదేగాని తెలంగాణము, నిజాం నవాబుది కాదని సింహగర్జన చేశారు దాశరథి. తెలంగాణలో ‘సమర సాహిత్యం’ ఆరంభమైంది. క్రూరాతిక్రూరమైన నవాబు పరిపాలనకు వ్యతిరేకంగా ధైర్యంతో దాశరథి కలం చిందులు తొక్కింది. ‘‘దిగిపొమ్మని జగత్తంత/ నగారాలు కొడుతున్నది/ దిగిపోవోయ్‌ తెగిపోవోయ్‌/ ఇదే మాట ఇదే మాట/ పదేపదే అనేస్తాను’’ అని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎలుగెత్తి నిజాం నవాబును శపించాడు దాశరథి.

1948, జనవరి 11న సాయంత్రం నిజామాబాద్‌ జైల్లో రాజకీయ ఖైదీలు ఆహారం కోసం బారకాసుల నుంచి బయటకు వచ్చినప్పుడు అనేకమంది రజాకార్లు మారణాయుధాలతో జైలులోకి ప్రవేశించి వారిపై దాడి చేశారు. చాలామంది ఖైదీలకు గాయాలయ్యాయి. వారు ప్రాణరక్షణార్థం బారకాసుల్లోకి పారిపోయారు. కానీ దాశరథి రజాకార్ల చేతికి చిక్కి, విపరీతంగా దెబ్బలు తిని నిర్జీవంగా పడిపోయారు. మిగతావారంతా దాశరథి చనిపోయాడని భావించారు. మరునాటి ఉదయానికి వారికి వొళ్లు తెలిసింది. నిజానికి దాశరథికి అది పునర్జన్మే. ఆ తరువాత ఆయనను హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలుకు పంపివేశారు. పోలీసు చర్య జరిగిన తరువాత ఇతర రాజకీయ ఖైదీలతో పాటు దాశరథికి కూడా విముక్తి లభించింది. వారి త్యాగం ఫలించింది.

కె. ప్రభాకర్‌

సినీకవి

(నేడు దాశరథి జయంతి)

ఇవి కూడా చదవండి

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..

Updated Date - Jul 22 , 2026 | 12:56 AM