Share News

‘దరువు’ ఒక ప్రభంజనం!

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:30 AM

‘‘చీకటిలోనే పాటలు పుడతాయి’’ అంటాడు కవి మఖ్దూం మోహియుద్దీన్‌. అలా పుట్టిన పాటలు వెలుగు కాగడాలుగా మారుతాయి. అణగారిన ప్రజల గుండెగొంతుకగా నిలుస్తాయి. అలాంటి పాటలే...

‘దరువు’ ఒక ప్రభంజనం!

దరువు ఎల్లన్న

‘‘చీకటిలోనే పాటలు పుడతాయి’’ అంటాడు కవి మఖ్దూం మోహియుద్దీన్‌. అలా పుట్టిన పాటలు వెలుగు కాగడాలుగా మారుతాయి. అణగారిన ప్రజల గుండెగొంతుకగా నిలుస్తాయి. అలాంటి పాటలే చరిత్ర సృష్టిస్తాయి. తెలంగాణ నేల మీద పాట లేని ఊరు లేదు, ఉద్యమమూ లేదు. మట్టి మనుషులను తట్టి లేపడంలో పాట పోషించిన పాత్ర విస్మరించలేనిది. అలాంటి పాటల పుట్ట ‘దరువు’. అది తెలంగాణ ఉద్యమ చైతన్య వేదిక.

సిద్ధిపేట కేంద్రంగా 1999లో విద్యార్థుల చేతుల్లో పురుడు పోసుకున్న సంస్థ ఇది. అప్పటికే తెలంగాణలో సాహిత్య, సాంస్కృతిక సంఘాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వామపక్ష భావజాలంతో వీచే గాలులు ప్రజల కష్టాలకు పల్లవులు, చరణాలుగా మారాయి. అలాంటి వాతావరణంలో తెలంగాణ విముక్తే లక్ష్యంగా, బహుజన రాజ్యాధికారమే గమ్యంగా దరువు సంస్థ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. క్రమంగా సిద్ధిపేట నుండి తెలంగాణ ఉమ్మడి పది జిల్లాలకు విస్తరించింది. 2009 ఉద్యమ కాలంలో దరువు ఎల్లన్న రాసిన ‘‘వీరులారా... వందనం’’ పాట ఒక ప్రభంజనం సృష్టించింది. అసువులు బాసిన విద్యార్థి అమరవీరుల త్యాగాన్ని ఎలుగెత్తి చాటింది. బిడ్డల్ని కోల్పోయిన తల్లుల దుఃఖానికి దోసిలి పట్టింది. ప్రతీ వేదిక మీద వేలాదిమందిని కోరస్‌గా మార్చింది.

‘‘మల్లెపువ్వుల్లారా... మట్టివాసనలారా.../ సేను సెలకల్లారా... గోరువంకల్లారా.../ మీరైనా చూసిన్రా బాలాకిషోరాల....’’ అంటూ సమస్త ప్రకృతిని అమరవీరుల జాడను చెప్పుమని అడిగాడు రచయిత. ఒక సుందర స్వప్నం కోసం రాలిన పసిమొగ్గల తీరును అర్థం చేయిం చిన ఈ పాటను ఉద్యమకాలం గుండెలకు హత్తుకున్నది. మలిదశ ఉద్యమ పాట అనగానే గుర్తుకు వచ్చే అతికొద్ది పాటల్లో ఇది ముఖ్యమైనది.


‘దరువు’ చైతన్యవేదిక కేవలం తెలంగాణ సాధనకే పరిమితం కాలేదు. అది బహుజనుల విముక్తి కోసం గొంతెత్తి, వారి జీవితాలను గానం చేసింది. బహుజన మహనీయుల త్యాగాలను ఒడిసి పట్టింది. పాశ్చాత్య ప్రభావాలను గ్లోబలైజేషన్‌ పరిణామాలను సైతం పాటలు, వ్యాసాలుగా సృజించింది. అలా ‘దళిత రత్నాలు’, ‘తెలంగాణ విద్యార్థి పాట’, ‘ఉస్మానియా విద్యార్థుల గుండెచప్పుడు’, ‘కొట్లాట’, ‘గజ్జెల మోత’ వంటి క్యాసెట్లుగా వెల్లువెత్తింది దరువు. అలాగే ‘మా తొవ్వ’, ‘వీరులారా వందనం’, ‘ఓ యుద్ధం’ వంటి పుస్తకాలనూ వెలువరించింది. ప్రజా చైతన్యమే పరమావధిగా అలుపెరుగని కృషి చేస్తూ అనేక మైలురాళ్లను దాటిన దరువు ప్రస్థానం ఇవాళ రజతోత్సవానికి చేరుకుంది.

(నేడు రవీంద్ర భారతిలో ‘దరువు’ రజతోత్సవ వేడుకలు)

పసునూరి రవీందర్‌

77026 48825

ఈ వార్తలు కూడా చదవండి

పల్నాడు జిల్లాలో దారుణం.. ఆరేళ్ల కుమారుడికి గడ్డి మందు తాగించిన తండ్రి..

నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

Updated Date - Apr 20 , 2026 | 05:30 AM