దళితుల వాటా డబ్బు ఎవరి అభివృద్ధికి?!
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:09 AM
దళితుల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ‘దళితుల జీవితాల్లో మార్పు ఎక్కడ కనిపిస్తోంది?’ అనే ప్రశ్నకు మాత్రం సమాధానం...
దళితుల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ‘దళితుల జీవితాల్లో మార్పు ఎక్కడ కనిపిస్తోంది?’ అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. దళిత విద్యార్థులు ఇంకా స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. హాస్టళ్లలో సమస్యలు కొనసాగుతున్నాయి. భూమిలేని దళిత కుటుంబాలు పెరుగుతున్నాయి. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. విదేశీ విద్య కోసం విద్యార్థులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిరుద్యోగ యువత శిక్షణ కోసం ఉన్న స్టడీ సర్కిల్స్ సరిగ్గా పనిచేయడం లేదు. దళితుల శ్మశాన సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఎస్సీ కార్పొరేషన్ ఒక్క దళితునికీ ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.
అసలు మోసం ఎక్కడ జరుగుతోంది? ‘ప్రభుత్వం ఒక సాధారణ పథకాన్ని అమలు చేస్తుంది. ఆ పథకం లబ్ధిదారుల్లో కొంతమంది ఎస్సీలు ఉంటారు. ఆ తరువాత ఆ ఖర్చులో కొంత భాగాన్ని ‘ఎస్సీల కోసం ఖర్చు చేశాం’ అని సబ్‌ప్లాన్ ఖాతాలో చూపిస్తుంది.’’ వాస్తవానికి... దళితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకం ఒకటి, అందరికీ వర్తించే సాధారణ పథకం మరోటి. అయితే, మారుతున్న ప్రభుత్వాలు కొత్త పేర్లతో అమలు చేస్తున్న సాధారణ సంక్షేమ పథకాల ఖర్చులను సబ్‌ప్లాన్‌లో చూపిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య తేడాను చెరిపివేయడం వల్లే సబ్‌ప్లాన్ నిధుల అసలు లక్ష్యం దెబ్బతింటోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. పథకాల పేర్లు మారుతున్నాయి. కానీ దళితుల వాటా డబ్బు నిజంగా దళితుల అభివృద్ధికి ఖర్చు అవుతోందా? అనే ప్రశ్న మాత్రం అలాగే ఉంది. సబ్‌ప్లాన్ నిధులు దళితుల హక్కు. ఆ హక్కును కాపాడుకోవాలంటే ప్రతి గ్రామంలో సబ్‌ప్లాన్‌పై అవగాహన పెరగాలి. ప్రతి దళిత యువకుడు బడ్జెట్ చదవాలి. ప్రతి సామాజిక సంస్థ నిధుల వినియోగాన్ని ప్రశ్నించాలి. హక్కులు అడిగితే రావు. వాటిని పోరాడి సాధించుకోవాలి. దళితుల వాటా డబ్బు దళితుల అభివృద్ధికే ఖర్చయ్యేలా ప్రభుత్వాలను ప్రశ్నించాలి.
అండ్ర మాల్యాద్రి,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేవీపీఎస్
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..