Share News

అట్టు తిరగేసినట్టే

ABN , Publish Date - May 18 , 2026 | 05:59 AM

బుగతబావుల తిట్లుతోటి వొల్లు దులుపుకోని లెగిసీదొకప్పుడు కోడెఁవకల మా మాలపేట, సిరుగుల గోనిగుడ్డల కన్నాలకాసి రెబ్బకొండ రొజ్జగాలి తుమ్మ...

అట్టు తిరగేసినట్టే

బుగతబావుల తిట్లుతోటి వొల్లు దులుపుకోని లెగిసీదొకప్పుడు

కోడెఁవకల మా మాలపేట,

సిరుగుల గోనిగుడ్డల కన్నాలకాసి రెబ్బకొండ రొజ్జగాలి తుమ్మ ముళ్ళులాగ రెచ్చిపోయి మా కంపగోడల గుడిసిల్లోకి సొచ్చిపోయీది,

తడకతలుపుల సందుల్లోనుంచి దోతరుపుసేసి

దూరిపోయిన ఆకలిబేపులకి మా గొందింట్ల పలకరించి

పారాసికాలాడీవి కాలేసిన దాకలే,

నాయుడోరి బక్కలసాల నున్నగ తుడిసి నరాలు తేలిన కటిక్కర్రల్లాటి సేతులు మొండి గీట్రుగంపలై పోయీవి,

ఇలాకత్తలకాసి నాయురాలమ్మ మునోకత్తల కొచ్చిందాకా ఇంటి ముంజూరు కింద ‘అమ్మా బుక్కడు గెంజి బోసీవా’ అని ఎండిన డొక్కను నొత్తలసత్తుగిన్ని సేసి వొంగోని యెదురు సూసీది మాలపేట గూనిముదిమి,

కసిన్ని టీనీలు సుక్కల్తోటి కడుపుమంట సల్లబరుసుకోవాలని ఊరుమద్దిని టీపాక ముందల కొయ్యకి దోపిన తలకిందుల గాజు గళాసులై తలొంచుకొని ఎదురు సూసీవి కుసులొసులైన కుక్కి మంచాల్లాగ మాలపేట ముసిలి ముడతలు,

సిరుగుల కోకముక్కల్లోన దాగోలేక మాయాడ గుంటల యీడు సిగ్గుకి సిఁవిడిపోయీది.

పొద్దల్లా నాయుళ్ళ పొలాలంట పారిన కంబార్ల సెఁవటంతా సాయంత్రంకి బుక్కడు కల్లుసుక్కై యీదుల్లంట పొర్లీది,

ఏ గడపల అడుగెట్టినా..

ఇన్నుమున్నూరుగాలమూ కుక్కిమంచం గన్నిల్లోన ముద్దై మూలగని ఎఁవికిల గూలు పలకరించకపోతే.. మీరేసినంత వొట్టు,

బక్కలెనక గొడిముక్కలై పరుగులెట్డమంతే రెండో నగువేత్తారుగానీ

బడిసాలెక్కడుందో యెరగని మాపిక్కురుగుంటలకి అచ్చరమ్ముక్క పొల్తి పట్టడమంతే అదంత మిట్టమీదుందేటి?

సంకటమొత్తే సచ్చీజావులవ్వాల గానీ మందో మాకో యిచ్చిన మాందాతేడి?

ఊరి కాపలాకి దండాసోడు, సాటింపుకి బారికోడు, ఊరబాయికి ఉప్పరోడు, సావుకవురుకి సచ్చరోడు,

ఇన్ని మాటలేల?

పేటంతే మరేటి కాదు.. ఊరు ముడ్డి కింద పీటసెక్క,

ఇలగ్గాదని సెప్పి...

ఊరుదారాన్ని పట్నంకొసకి ముడేసి, సెఁవట కాలవలై కెరటాలేసింతరవాత గదా మనుసులుమై తలలెత్తి మా కాలుమీద మాము నిలబడగలుగుతున్నామిప్పుడు,

కసింత గడుసుతనమబ్బింతరవాత గదా మేడలై మెడలెత్తినాయి మా పురిపాకలు,

సూటూబూటూ యేసుకున్న మారాజు కొడుకు సూపుడేలు సూపించిన దార్లోన నడబట్టి గదా

యీరోజు బోరిరుసుకోని తిరుగుతండ్రు పేట బిడ్డలు,

మమ్మల్ని లోపలకి రానివ్వని సదువులతోటలోన సొరబడి దోసిడు అచ్చరాలపువ్వుల్ని యేరుకో బట్టే గదా

యిస్తిరి మడతలు నలగని గుడ్డల్లోన యెన్నెల పువ్వులై ఎలిగిపోతన్నారు మా పిక్కిరోలు,

తెల్లటి మల్లిపువ్వులాటి పంచిగట్టి, సేతులమొయ్య పూరాకమీజు తొడిగి, ఊరి పెద్దల మద్దిని కురిసీల కూకుంతండంతే మావోడు..

పెద్దాయన సేతిలోని పొస్తకం వల్లేనని పొద్దుటే

ఆ బొమ్మ పాదాల్దగ్గిట పువ్వులెడతారు సంగం కుర్రోలు,

ఎద్దెప్పుడూ వొకపక్కే తొంగోదు నాయన్లారా

కడికొడెల్లి ఒక తీరుగే ఉండిపోము మనుసులుం!

‘రాజే కింకరుడగు.. కింకరుడే రాజగు’ అని పజ్జిం పాడిన సందాయమే!

వోడలు బళ్ళవుతాయి.. బళ్ళు వోడలవుతాయి

అంతా... అట్టు తిరగేసినట్టే.

లాంగుల్య

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 05:59 AM