దళితబహుజన వాదానికి కొత్త పిలుపు
ABN , Publish Date - Jul 18 , 2026 | 02:34 AM
అడకత్తెరలో పోకచెక్క అనే సామెత ఉంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అనే సామెత కూడా ఉంది. ప్రస్తుతం ఈ సామెతలు అన్వయించే క్లిష్ట సందర్భంలో ‘హిందూ దళిత బహుజనులు’ ఉన్నారు. దళిత బహుజన పౌరులందరూ...
అడకత్తెరలో పోకచెక్క అనే సామెత ఉంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అనే సామెత కూడా ఉంది. ప్రస్తుతం ఈ సామెతలు అన్వయించే క్లిష్ట సందర్భంలో ‘హిందూ దళిత బహుజనులు’ ఉన్నారు.
దళిత బహుజన పౌరులందరూ నాస్తికులు కారు. వారికి మతం గురించిన ఆసక్తులు ఉంటాయి. వారు తమ మతాసక్తులు దెబ్బతినకుండా కాపాడుకోవడంలో ఏ తప్పూ లేదు. హిందూ దళిత బహుజనుల ఆసక్తులు రెండు: ఒకటి మతం, రెండు సామాజిక న్యాయం. కానీ హిందూ దళిత బహుజనులు ఈ రెండు ఆసక్తులనూ నెరవేర్చని రెండు భిన్న భావజాలాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వాటిల్లో ఒకటి ఆరెస్సెస్ హిందూ భావజాలం, రెండవది లౌకికవాద నాస్తిక దృక్పథం. ఈ రెండు దృక్పథాలు వారిలోని ఒక ఆసక్తిని నెరవేరిస్తే, ఇంకొక ఆసక్తిని నెరవేర్చే పరిస్థితి లేదు.
హింసను ఎదుర్కోవడం పట్ల గాంధీజీ జైనమత దృక్పథాన్ని ఆరెస్సెస్ భావజాలం నిరసిస్తుంది. మతం కంటే దేశానికే అగ్రతాంబూలం ఇస్తుంది. జైన, బౌద్ధ మతాలను భారతీయ మతాలుగా గుర్తిస్తోంది. మెజారిటీ ప్రజలైన హిందూ జాతి సాంస్కృతిక వైభవాన్ని గుర్తించి, వ్యక్తి సచ్ఛీలతకు, దేశభక్తికి పునాదులు వేస్తోంది. కానీ దళిత బహుజనుల సామాజిక న్యాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. వర్ణధర్మాలను(వృత్తి ధర్మాలను) భగవద్గీత గుణకర్మలతో ముడిపెట్టింది కానీ, పుట్టుకతో (Hereditary Profession) ముడిపెట్టలేదు. ఈ విధంగా భగవద్గీతలో చెప్పినదే ఆధునిక చింతన కూడా! కానీ మధ్యయుగాలలో అమలైన ‘Hereditary Profession’ను మాత్రమే ఆరెస్సెస్ స్థిరీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇది హిందూ దళిత బహుజనుల సామాజిక న్యాయానికి పెనుప్రమాదం! కాబట్టి హిందూ దళిత బహుజనులు ఆరెస్సెస్ వైపు మొగ్గుచూపడం ఆరోగ్యకరం కాదు. ఆరెస్సెస్‌లోగానీ, దాని అనుబంధ రాజకీయపార్టీ బీజేపీలోగానీ వారిమత, సాంస్కృతిక ఆసక్తులు నెరవేరుతాయి కానీ, సామాజిక న్యాయం సమకూరదు.
ఇక రెండవది, లౌకికవాద నాస్తిక దృక్పథం. నాస్తికత్వం భౌతిక జీవితానికి తప్ప, అలౌకిక అన్వేషణకు ప్రాధాన్యం ఇవ్వదు, ఖండిస్తుంది కూడా. సెక్యులరిస్టులు కానీ, మార్క్సిస్టులు కానీ నాస్తికులైనవారు మతాన్ని అధ్యయనం చేయరు. అవసరం కూడా లేదు అనుకుంటారు. కానీ వీరికి మతం పట్ల గుడ్డి నిరాకరణ మాత్రం ఉంటుంది. ఇక్కడ ఒక ప్రమాదం పొంచివుంది. మతం గురించి తెలియనివాళ్లకు ఆ జాతి సంస్కృతి తెలియదు. సంస్కృతి తెలియనివాళ్లకు ఆ జాతి భావావేశాలూ అర్థం కావు. ఇటువంటి నాస్తిక మేధావుల మధ్య, వారి సంస్థలలో దళిత బహుజనుల మతభావాలు సహజంగానే దెబ్బతింటాయి. ప్రశ్నకు గురవుతాయి. దళిత బహుజనులకు తమ మతం పట్ల, తమ సంస్కృతి పట్ల ఉన్న భావావేశాలు, ఈస్థటిక్స్ నాస్తిక సమూహాల మధ్య సంతృప్తి పొందవు.
ఈ విధంగా తమ సామాజిక న్యాయాన్ని విస్మరించిన ఆరెస్సెస్, బీజేపీ ఒకవైపు; తమ జాతినీ, సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే నాస్తికవాదం మరొకవైపు– ఈ రెండూ హిందూ దళిత బహుజనులకు ఆమోదయోగ్యం కాలేవు. ఈ క్రమంలోనే దళిత బహుజనులు ఈ రెండు భిన్నధృవాలకు మధ్యస్థంగా, స్వతంత్రంగా ఆలోచించక తప్పదు. ఆరెస్సెస్ శక్తులకు, నాస్తికవాద శక్తులకు దూరంగా తమ హిందూ దళిత బహుజన అస్తిత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. దళిత బహుజనుల్లో కొందరికి హిందూ పదాన్ని జోడించడమే ఇష్టం ఉండదు. అందుకు క్రిస్టియన్, ఇస్లాం మేధావులకు, లౌకికవాదులు, మార్క్సిస్టులకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. క్రిస్టియన్ మేధావులకు హిందూ దళితుల పట్ల అసహనం ఉండవచ్చు. హిందూ మతం వారిని గుళ్లకు దూరం చేసినా, ఊరి బయటకు తరిమినా ఇంకా ఆ మతాన్నే పట్టుకుని వేలాడుతున్నారని కోపం ఉండవచ్చు. ఈ కోపం సకారణమే. కాబట్టి మనం అర్థం చేసుకోనూవచ్చు. దళితులు, దళిత క్రిస్టియన్లు హిందూమతం పట్ల రియాక్షనరీస్‌గా మారడం సహజమే. అందుకు మనుధర్మ శాస్త్రమే కారణం. దీనిని హిందూ సమాజం బహిష్కరించవలసిందే!
ముస్లింల రియాక్షన్‌కు సామాజిక దౌష్ట్యాలు కారణం కాదు. హిందూమతం పట్ల వారి రియాక్షన్‌కు వారు నమ్మిన ఇస్లాం మతగ్రంథాలే కారణం. ముస్లింలు– హిందూమతంలోని అస్పృశ్యతను ప్రశ్నిస్తారు. వర్ణధర్మాన్ని ప్రశ్నిస్తారు. మనుధర్మ శాస్త్రాన్ని దండిస్తారు. బ్రాహ్మణాధిక్యతను ఎత్తిచూపుతారు. ఈ విమర్శలన్నిటినీ హిందూ దళిత బహుజనులు ఆహ్వానిస్తారు, ఆమోదిస్తారు కూడా! మైనారిటీ మతాలతో హిందూ దళిత బహుజనులు సహజీవనాన్ని కోరుకుంటారు. సహజీవనానికి అవసరమైన సంస్కరణలను ఆ మతాల నుంచి కూడా ఆశిస్తారు. ముస్లింలు యుద్ధ జిహాద్‌ను ఖండించాలని, ప్రపంచాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలనే అప్రజాస్వామికతను ప్రశ్నించాలని, అన్యమతాల పట్ల కాఫిర్లు అనే శత్రుభావాన్ని విడనాడాలని.. హిందూ దళిత బహుజనులు కోరుకుంటారు.
వర్తమానంలో హిందూ, ఇస్లాం శక్తులకు ఎవరి రాజకీయాలు వారికి ఉన్నాయి. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. 2030 సంవత్సరం అంటూ ఒకరు, 2047వ సంవత్సరం అంటూ ఒకరు తమ వ్యూహాలు అమలు చేయబోయే కాల నిర్ణయాలు కూడా జరిగిపోతున్నాయి. ఈ ప్రమాదానికి విరుగుడు ఆరెస్సెస్, బీజేపీలు కాదు. నాస్తిక మార్క్సిస్టులూ కాదు. హిందూ, అబ్రహామిక్ మతాల మధ్య అపోహలు లేని సహజీవనమే ఇప్పుడు కావలసినది. ఇందుకు అనుగుణంగా ఎవరి మతాలను వారు సంస్కరించుకోవలె, శుభ్రపరచుకోవలె, ప్రజాస్వామ్యీకరించుకోవలె!
హిందూ దళిత బహుజనవాదం మధ్యయుగాల మతవ్యవస్థను నిరాకరిస్తుంది. తమ మతాన్ని ప్రజాస్వామ్యీకరించుకునేందుకు పోరాడుతోంది. బ్రాహ్మణాధిపత్యాన్ని అంగీకరించదు. అన్ని చారిత్రక కాలాల్లోనూ మతగ్రంథాలను కాపాడుతూ వచ్చిన బ్రాహ్మణుల చారిత్రక పాత్రను గుర్తిస్తుంది. దేశమా? మతమా? అంటే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తుంది! మతాల పండుగల్లోగానీ, గుళ్లల్లో, దర్గాల్లో, చర్చిల్లోగానీ.. అన్ని మతాల ప్రజలూ పాల్గొనే ఒక మహత్తర సన్నివేశాన్ని కలగంటుంది. తమకంటే ఎక్కువగా అణగదొక్కబడిన పీడితుల ప్రయోజనాలకే పెద్దపీట వేయవలె. ఆ తరువాతే తమ ప్రయోజనాలను గుర్తించుకోవలె. పీడనను నిర్వచించేది కులమూ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రాంతమూ కావచ్చు. పట్టణమూ, పల్లెటూళ్ల మధ్యగల అవకాశ వ్యత్యాసాలూ కావచ్చు. ఈ విశాల దృక్పథాన్ని కూడా హిందూ దళిత బహుజనవాదం ప్రోత్సహిస్తోంది. జాతీయ సంస్కృతిని పాటించడానికి ఏ మత సంస్కృతులూ, ఆచారాలూ అడ్డుపడే సందర్భాలు రాకూడదని కోరుకుంటోంది. పల్లె ప్రాంతాల్లోని మాదిగ, మాలల ఆధ్యాత్మిక హక్కుల పోరాటాన్ని మొదటి కార్యాచరణగా స్వీకరిస్తోంది.
హిందూ దళిత బహుజనవాదం ఏకశిలా సదృశమైన మతాన్ని కోరుకోదు. వేదాలు, ఉపనిషత్తులు, శైవం, వైష్ణవం వంటి వాటిని కోరుకుంటుంది. ముక్కోటి దేవతలు, ఎల్లమ్మ, ముత్యాలమ్మ వంటి గ్రామదేవతలు, ఆదివాసీల దేవుళ్లు అన్నిటినీ హిందూ బహుళత్వంలో భాగంగా స్వీకరిస్తుంది. యోగులు, సాధువులు.. సూఫీలు, క్రిస్టియన్ సన్యాసులు.. అందరికీ పూజ్యభావంతో మోకరిల్లుతుంది. భారతీయ కులసమాజాన్ని ఒక ఆర్థికశాస్త్రంగా గుర్తిస్తుంది. తక్కువ కులాలకు తక్కువ ఆదాయ వృత్తులు, అగ్రకులాలకు ఎక్కువ ఆదాయ వృత్తులు సమాజంలో ఆర్థిక అగాథాలకు దారితీశాయని నమ్ముతుంది. మార్క్సిజాన్ని ఆర్థికశాస్త్రంగా పరిగణించి ప్రేరణపొందే అవకాశాలను పరిశీలిస్తుంది. ఆసక్తి ఉన్న హిందూ మేధావులకు ఇవన్నీ చర్చనీయాంశాలే.
ముల్లాలు, పీఠాధిపతుల నుంచి కాకుండా ఒకనాటి మన దక్కన్ సంస్కృతి నుంచే స్ఫూర్తిని పొందుదాం. జనసామాన్యంలో మిణుకుమంటున్న సహజీవన కళను దేదీప్యమానం చేద్దాం. మన జాతీయ ఆసక్తులతో సంపూర్ణంగా ఐక్యం అవుదాం. హిందూ మతంలోని బహుళత్వం మాయం కాకుండా కాపాడుకునే బాధ్యత మన మేధావులదే!
బండి నారాయణస్వామి
కథారచయిత, నవలాకారుడు
ఈ వార్తలనూ చదవండి:
130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్!
భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు