పాడి పరిశ్రమలో ఇంధన పొదుపు ఇలా..
ABN , Publish Date - Jun 02 , 2026 | 02:40 AM
ఇరాన్–అమెరికా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి! మన దేశంలో ప్రతి రంగమూ ఇంధన సరఫరా, వినియోగాలపైనే ఆధారపడి ఉంది. ఇంధన పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన...
ఇరాన్–అమెరికా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి! మన దేశంలో ప్రతి రంగమూ ఇంధన సరఫరా, వినియోగాలపైనే ఆధారపడి ఉంది. ఇంధన పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో రాజకీయ నాయకులు స్పందించడం శుభసూచకం. ఇది మనందరికీ ఆదర్శనీయం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక డెయిరీ కంపెనీలు ప్రతిరోజూ రెండూ పూటలా లారీలు, ట్రాక్టర్లు, ఆటోలలో అనేక వేల గ్రామాల నుంచి తమ డెయిరీలు, పాల శీతల కేంద్రాలు, బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లకు పచ్చిపాలను రవాణా చేస్తున్నాయి. అలాగే శీతలపరచిన లేదా పాశ్చురైజ్డ్ పాలను మరల వినియోగ కేంద్రాలకు ట్యాంకర్లు, లారీలలో తరలిస్తున్నాయి. రైల్వేలు, రోడ్డు రవాణా సంస్థల తర్వాత అత్యధికంగా డీజిల్‌ను వినియోగించేది డెయిరీ రంగమే! కొన్ని చర్యల్ని పాటిస్తే డీజిల్ వినియోగం చాలా వరకు తగ్గుతుంది.
పూర్వం ఈ డెయిరీలు తమ పాల సేకరణను ఒకటి, రెండు జిల్లాలకు పరిమితం చేసేవి. గత కొన్నేళ్లుగా అనేక ప్రైవేటు డెయిరీలు ఈ రంగంలోకి ప్రవేశించడంతో సహకార, డెయిరీ కంపెనీలు తమ వ్యాపార మనుగడ కోసం సుదూరంగా ఉన్న జిల్లాల్లోని గ్రామాల్లో కూడా పచ్చిపాలను సేకరించి తమ తమ ఉత్పత్తుల కేంద్రాలకు తరలిస్తున్నాయి. వీరి మధ్య ఏర్పడ్డ పోటీ వల్ల ఒకే గ్రామం లేదా జిల్లాలో 3–4 డెయిరీలు పాల సేకరణ చేపట్టడం వల్ల రవాణా వాహనాల సంఖ్యతో పాటు ఇంధన వినియోగం గణనీయంగా పెరిగింది. వివిధ డెయిరీలు సమన్వయంతో వారి వారి అవసరాలకు అనుగుణంగా పాల సేకరణ పరిధుల్ని నిర్ణయించుకుని, క్రమశిక్షణను పాటిస్తే వాహనాల ఇంధన వినియోగం ఆదా అవుతుంది. కొన్ని గ్రామాల కూడళ్లలో మినీ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు (బల్క్ మిల్క్ కూలర్లు)ను ఏర్పాటు చేస్తే ఈ కేంద్రాలలో 3–4 పూటల్లో సేకరించిన పాలను ఒకేసారి ట్యాంకర్లలో ప్రధాన డెయిరీలకు తరలించవచ్చు. దీంతో రవాణా, ఇంధన వ్యయం చాలా వరకు తగ్గుతుంది. ఈ బల్క్ కూలింగ్ సెంటర్లకు సౌరశక్తిని వినియోగిస్తే ఖర్చు నామమాత్రంగా ఉంటుంది.
జాతీయ పాడి పరిశోధనా సంస్థ నాలుగు దశాబ్దాల నాడే విశేష పరిశోధనల ద్వారా రూపొందించిన రసాయనాలతో పచ్చిపాలను నిల్వ చేస్తే, అవి సాధారణ ఉష్ణోగ్రతలోనే రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ పాలను డెయిరీలో పాశ్చురైజ్ చేసి వినియోగదారులకు సరఫరా చేశాక వారు తమ గృహాలలో వాటిని వేడి చేస్తే... అందులో కలిపిన రసాయనాలు ఆవిరైపోతాయి. దీంతో వినియోగదారుల ఆరోగ్యానికీ, పాల ఉత్పత్తుల రంగూ రుచీ నాణ్యతకూ ఎటువంటి హానీ ఉండదు. శ్రీలంక, బంగ్లాదేశ్, కొన్ని ఆఫ్రికా దేశాలలో ఈ విధానం అమలులో ఉంది. దీనిని మన దేశంలో అమలుచేయడానికి ఆహార కల్తీ నివారణ చట్టాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
పాల రవాణాకు వాడే వాహనాలను విద్యుత్ వాహనాలుగా మారిస్తే రోజూ కొన్ని లక్షల లీటర్ల డీజిల్ వినియోగం ఆదా అవుతుంది. ఈవీ వాహనాల రీచార్జింగ్ సదుపాయాలను పాల శీతల కేంద్రాలు, డెయిరీల వద్ద ఏర్పాటు చేయాలి. ఈవీ వాహనాల మార్పునకు అవసరమయ్యే పెట్టుబడిని కాంట్రాక్టర్లకు డెయిరీలు ఏర్పాటుచేసి, నెలవారీ బిల్లుల్లో మినహాయించుకోవచ్చు. డెయిరీ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది వినియోగించే వాహనాలను కూడా విద్యుత్ వాహనాలుగా మార్చాలి. ఇకపై కంపెనీలు కొనే వాహనాలన్నీ ఇవే కావాలి. ఒకే వాహనంలో నలుగురు సిబ్బంది కలిసి ప్రయాణం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
డెయిరీ భవన సముదాయాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో 70–80 డిగ్రీల వరకు సూర్యశక్తి వల్ల వేడెక్కిన నీటిని బాయిలర్స్‌లోకి పంపి ఆవిరిని ఉత్పత్తి చేస్తే, బాయిలర్స్‌లో వాడే ఫర్నేస్ ఆయిల్ లేదా బొగ్గు వినియోగం సగానికి పైగా తగ్గుతుంది. ఈ విధానాన్ని 35 ఏళ్లనాడే మేఘాలతో చల్లగా ఉండే ఊటీ డెయిరీలో గుర్తించాను. అలాగే ఖాళీ పాల ప్యాకెట్లను సేకరించి రీ సైకిల్ చేయాలి. లేదా వీటికి వాడే పాలి ఎథిలిన్‌కు ప్రత్యామ్నాయంగా చౌకగా లభ్యమయ్యే సురక్షిత ప్యాకింగ్ ఫిల్మ్ కోసం అన్వేషించాలి. డెయిరీ రంగంపై ఇంధన సమస్య ప్రభావాల మీద లోతైన చర్చ అవసరం. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండియన్ డెయిరీ అసోసియేషన్, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, ఇతర డెయిరీ కంపెనీల యాజమాన్యాలు ముందుకొచ్చి జాతీయ, ప్రాంతీయ స్థాయి సదస్సులు నిర్వహించాలి. వీలయినంత త్వరగా వీటిని నిర్వహించి నిపుణుల సూచనలు తీసుకుని, వాటిని అమలుచేయాలి. ఇంధన పొదుపు మనందరి తక్షణ కర్తవ్యం.
యం.వి.జి. అహోబలరావు
విశ్రాంత అధికారి, సంగం డెయిరీ
ఈ వార్తలనూ చదవండి:
పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు..