కేంద్రం కలిసొస్తేనే తుఫాన్లకు ఎదురీదేది!
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:00 AM
వచ్చేది ఎంత పెద్ద తుఫానైనా పర్యవేక్షించేది చంద్రబాబు నాయుడైతే దాన్ని అదుపు చేయటం సాధ్యమే అనిపిస్తుంది! నష్టాన్ని హద్దుమీరనివ్వని ముఖ్యమంత్రి కాబట్టి తుఫాన్లు తోక ముడిచి తీరం...
వచ్చేది ఎంత పెద్ద తుఫానైనా పర్యవేక్షించేది చంద్రబాబు నాయుడైతే దాన్ని అదుపు చేయటం సాధ్యమే అనిపిస్తుంది! నష్టాన్ని హద్దుమీరనివ్వని ముఖ్యమంత్రి కాబట్టి తుఫాన్లు తోక ముడిచి తీరం దాటుతాయి! ఒకదానివెనుక ఒకటిగా ‘అర్నబ్’, ‘మురసు’ సైక్లోన్లు వచ్చినప్పటికీ, అవి దూరాన పొడ చూపినప్పుడే సంసిద్ధంగా ఉండటం వల్ల, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవటం వల్ల– ఆ రెండు తుఫాన్ల వల్ల ప్రాణనష్టం తక్కువే జరిగింది.
మొదట అక్టోబర్ 28న వచ్చిన ‘అర్నబ్’ రూ.4,526 కోట్ల నష్టం చేసిందని అంచనా. ఈ తుఫాను వల్ల ఒరిస్సా దక్షిణ ప్రాంతాల్లో 90,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని లెక్కలు చెప్తున్నాయి. తర్వాత నవంబర్ 3న వచ్చిన ‘మురసు’ తుఫాను వల్ల 52,500 హెక్టార్లలో కాపుకొచ్చిన పంట నష్టమైంది. ఈ రెండు తుఫాన్ల వల్ల పోయిన ప్రాణాలు ఏడు మాత్రమేనని ప్రాథమిక అంచనాలో తేలింది. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్.టి.జి.యస్)తో పాటు సాంకేతిక నిపుణుల సహాయం వల్ల ప్రాణనష్టం, సంపద నష్టం తక్కువయ్యాయి. ఎప్పటి మాదిరే కేంద్ర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపిన తర్వాత, నష్టం ప్రాథమిక అంచనాలను లెక్కలోకి తీసుకొని, ధన సాయం, ఇతర సహకారాలు వస్తు రూపేణా అందజేసే అవకాశం ఉంది.
అక్టోబర్ 2014లో ‘హుద్ హుద్’ తుఫాను సంభవించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత చొరవతో అధికారుల కంటే ముందుండి మార్గదర్శకత్వం వహించి తుఫానుతో పోరాడారు. నాయకుడిగా ధన, మాన, ప్రాణాల రక్షణకు బలమైన కారణమయ్యారు. ప్రభుత్వాలన్నీ ఆపద సమయాల్లో ఎంతోకొంత ఆదుకొనే ప్రయత్నం చేస్తాయి. కానీ ప్రభుత్వాన్ని మొత్తం క్షేత్రస్థాయికి హుటాహుటిన తరలించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ముందుండి సహాయక చర్యలు చేపట్టడం చాలా అరుదు. అధికారం ఉన్నది అనుభవించటానికే అనుకొనే రాజకీయ నాయకుల మధ్య, ఆపదల్లో ప్రజలను ఆదుకోవటమే తన బాధ్యతగా, లక్ష్యంగా భావించే చంద్రబాబు వ్యవహార శైలి కారణంగానే సామాన్యుడి నుంచి అమిత ఆదరణ, మెప్పు లభిస్తాయి.
తుఫాను సమయంలో సముద్ర తీరాల్లో ఉండే మత్స్యకారుల జీవితం దినమొక గండంగా మారుతున్నది. ధైర్యం చేసి వేట కోసం సముద్రంలోకి వెళ్లేవారు క్షేమంగా తిరిగివచ్చేంత వరకు కళ్లలో ఒత్తులు వేసుకొని చూడాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, ఇలాంటి ఆపదలను ముందుగానే పసిగట్టే నిపుణుల అవసరమూ ఉంది. ముందుగానే వ్యూహాత్మక చర్యలు చేపట్టగలిగే నేర్పున్నవారు కావాలి. అలాగే రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వంలోని అధికారులకు మధ్య సాధ్యమైనంత సహకారం ముఖ్యం. రాష్ట్రాల అధికారులతో పాటు కేంద్రంలో పనిచేసే ఏజెన్సీలు సాధ్యమైనంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పంటలను ఈ దుర్ఘటనల నుంచి కాపాడే నైపుణ్యం ఎంతో ముఖ్యం. తుఫాన్ల నుంచి చాలా తక్కువ నష్టాలతో బయటకు వచ్చే వ్యూహాత్మక నిర్ణయాలు ప్రస్తుతం ఎంతో అత్యవసరంగా మారాయి. అదేవిధంగా తుఫాను తర్వాత నష్టపరిహారాలను క్రమపద్ధతిలో సత్వరం నిర్ణయించే ప్రభుత్వ ఏజెన్సీలు, క్షేత్రస్థాయిలో ఆ పరిహారాలను అందేలా తీసుకోవాల్సిన చర్యలు నిర్ణయాత్మకంగా మారాయి.
‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ (పంట ఇన్సూరెన్స్) పథకాన్ని కేంద్రం పదేళ్ల క్రితం మొదలుపెట్టింది. కానీ ఆ పథకం వినియోగం క్షేత్రస్థాయిలో అంతంతమాత్రంగానే ఉన్నది. వాతావరణ మార్పుల వల్ల, ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించే నష్టాలను తీర్చటానికీ, రైతులకు సాయపడటానికీ ఉద్దేశించిన ఈ పథకం అమలు అనుకున్న రీతిలో సాగటం లేదు. రైతులందర్నీ ఈ పథకం కింద చేర్చగలిగితే నష్టపోయిన రైతులకు కొంతలో కొంత ఊరట లభిస్తుంది. రాష్ట్రాలు తమ వంతుగా ఈ పథకాన్ని రైతుల్లోకి తీసుకొనిపోవాలి. క్షేత్రస్థాయిలో రైతులకు ఊరట కలిగించే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
మొదట్లో ఇచ్చిన నష్టపరిహారాలను ప్రభుత్వాలు తిరిగి వసూలు చేసే ఆలోచన ఉండేది కాదు. కానీ 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు ప్రకారం రెండేళ్ల క్రితం జాతీయ, రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్సు నిధులను రిలీఫ్ నిధులుగా లెక్కించకుండా, రికవరీ చేయటం ఈ స్కీములో భాగంగా మారింది. ఇది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రకృతి వైపరీత్యాలు దారుణమైన రీతిలో రాష్ట్రాలను అతలాకుతలం చేసి, జీవన విధానాన్ని దుర్భర స్థితిలోకి నెట్టివేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తనవంతు అత్యవసర ఆర్థిక సహాయంతో పాటు అన్ని విధాలా ఆదుకునే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా చర్యలు తీసుకున్నప్పుడే ఫెడరలిజానికి ఒక అర్థమూ, ప్రయోజనమూ ఉంటాయి. ‘సహకార ఫెడరలిజం’ను- ఇచ్చిపుచ్చుకునే తీరులో నిర్వహించగలిగినప్పుడే కేంద్రం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడినట్టు!
రావులపాటి సీతారాంరావు
ఈ వార్తలూ చదవండి
పారా అథ్లెట్ల పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి: ప్రధాని మోదీ