Share News

సాంస్కృతికోద్యమ కేతనం ‘కానూరి’

ABN , Publish Date - Apr 10 , 2026 | 02:51 AM

ఆ కలం ఎన్నో కథలు రాసింది. మట్టిమనుషుల చెమట చుక్కల్ని సిరా చేసి, పాటగా, ఆటగా మలిచింది. ఆ గళం ఎన్నో వీరగాథలకు ఊయలయ్యింది. ఆ చెయ్యి ఎన్నో జానపద బాణీలు కట్టింది. డప్పుని, డోలక్‌ని, కాలి అందెను...

సాంస్కృతికోద్యమ కేతనం ‘కానూరి’

ఆ కలం ఎన్నో కథలు రాసింది. మట్టిమనుషుల చెమట చుక్కల్ని సిరా చేసి, పాటగా, ఆటగా మలిచింది. ఆ గళం ఎన్నో వీరగాథలకు ఊయలయ్యింది. ఆ చెయ్యి ఎన్నో జానపద బాణీలు కట్టింది. డప్పుని, డోలక్‌ని, కాలి అందెను, గజ్జెల సవ్వడిని స్వరంతో అనుసంధానంచేసి పాటను తేనెధారల్లా మార్చింది. ఆ ప్రజాకళల బాటసారి కానూరి వెంకటేశ్వరరావు (కానూరి తాత). 1916లో కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకా కోడూరు గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచీ భజనలూ, కళారూపాలంటే ఎంతో ఆసక్తి చూపేవారు. 15 సంవత్సరాల వయస్సులోనే భజన పాటలు, పౌరాణిక నాటకాల కళాకారుడుగా ఎదిగారు. 1943లో కోడూరులో కోసూరి పున్నయ్య దళం ప్రదర్శించిన ‘కష్టజీవి’ బుర్రకథ ప్రభావంతో ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడయ్యారు. 1944లో విజయవాడలో జరిగిన బుర్రకథ శిక్షణా శిబిరంలో బుర్రకథ కళాకారుడిగా ఎదిగారు. 1952 ఎన్నికల్లో కానూరి దళం రోజుకి 3, 4 ప్రదర్శనలు ఇస్తూ తిరిగింది. 1946 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆరంభమైన నేపథ్యంలో ‘మా భూమి’ నాటకం ప్రజాదరణ పొందింది. బుర్రకథలో హాస్యం చెప్పటంలో ఆయన సమయస్పూర్తి చెప్పుకోదగినది. పాలకవర్గ దోపిడీ శక్తులనూ, వారి రాజకీయాలను హాస్యస్ఫోరకంగా ఎండగట్టడంలో ఆయనది అందెవేసిన చేయి.

1956లో కానూరి కుటుంబం వరంగల్‌కు వలస వెళ్ళింది. బుర్ర కథ, ఒగ్గు కథ, తదితర కళారూపాలతో స్థానిక ప్రజా చైతన్యానికి ఆయన ఎంతో కృషిచేశారు. 1960 నుండి 1970 మధ్య ‘ప్రగతి భాగోతం’ అనే నాటకాన్ని రాసి, పల్లెల్లో విస్తృతంగా ప్రదర్శించారు. సీపీఐ(ఎం) నుంచి విప్లవకారులు చీలిపోయినపుడు, ఆయన విప్లవకారుల వైపు నిలబడ్డారు. 1974లో ఉస్మానియా యూనివర్సిటీలో పీడీఎస్‌యు విద్యార్థులతో పరిచయం ఏర్పడి, ‘అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’ను నెలకొల్పారు. ఎమర్జెన్సీ ఎత్తివేశాక వివిధ జిల్లాల్లో వున్న కళాకారులను సమావేశపరిచి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా పునరుద్ధరించి, అరుణోదయ వ్యవస్థాపకులయ్యారు. తుదిశ్వాస వరకూ కళారంగమే శ్వాసగా, ఆశగా బ్రతికారు.


ఆయనకు కళలూ, సాహిత్యంపై మంచి పట్టు వుంది. అక్షరాలతో ఆటలాడుకుని, పదాలతో పద్యమాలలు కట్టారు. ‘అమ్మా వందనం తెలుగులమ్మా వందనం’ అంటూ తెలుగు భాషను ప్రజల భాషగా మార్చి, ప్రజల చెంతకు చేర్చిన వారిని ఘనంగా కీర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో వందలాది శిక్షణా శిబిరాలు నిర్వహించి, వేలాది మంది కళాకారులకు శిక్షణ ఇచ్చారు. ఎంతోమంది అరుణోదయ కళాకారులను తీర్చిదిద్దిన జన చైతన్య దీప్తి కానూరి తాత. ప్రజా కళల పట్ల ఆయనకు గల అంకితభావం, విప్లవోద్యమ నిబద్ధత, క్రమశిక్షణ నేటి తరాలు పుణికిపుచ్చుకోవాల్సిన ఉత్తమ విలువలు. కానూరి వెంకటేశ్వరరావు (కానూరి తాత) 11వ వర్ధంతి సభ ఏప్రిల్ 10న మధ్యాహ్నం 2 గంటలకు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (కాట్రగడ్డ శ్రీనివాసరావు హాల్)లో జరుగుతుంది. ఏప్రిల్ 10, 11 తేదీలలో ‘అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య’ రాష్ట్ర 7వ మహాసభలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయి.

కె. గోవర్దన్‌

సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 02:51 AM