Share News

ట్రంప్ కోటకు వర్జీనియాలో బీటలు !

ABN , Publish Date - Jan 29 , 2026 | 02:48 AM

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా ఎన్నికైన అబిగైల్‌ స్పాన్‌బెర్గర్‌ ప్రమాణ స్వీకార వేడుక ఒక చరిత్రాత్మక ఘట్టం. జనవరి 17న చిరుజల్లుల మధ్య...

ట్రంప్ కోటకు వర్జీనియాలో బీటలు !

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా ఎన్నికైన అబిగైల్‌ స్పాన్‌బెర్గర్‌ ప్రమాణ స్వీకార వేడుక ఒక చరిత్రాత్మక ఘట్టం. జనవరి 17న చిరుజల్లుల మధ్య జరిగిన ఈ వేడుకలో స్పాన్‌బెర్గర్ ధరించిన తెల్లటి దుస్తులు ఒక ఫ్యాషన్ ఎంపిక కాదు, దశాబ్దాల క్రితం మహిళలు ఓటు హక్కు కోసం పోరాడిన ‘సఫ్రగేట్’ ఉద్యమానికి ఆమె ఇచ్చిన ఘనమైన నివాళి. 1952 వరకు మహిళలకు ఓటు హక్కు కల్పించని రాష్ట్ర చరిత్రను తిరగరాస్తూ, నేడు మహిళా గవర్నర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టారు.

గవర్నరు ఎన్నికలో స్పాన్‌బెర్గర్ విజయం అసామాన్యమైనది. వాషింగ్టన్ డి.సి.లో రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉండగా, పొరుగునే ఉన్న వర్జీనియాలో డెమొక్రాట్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం విశేషమే. ట్రంప్ దూకుడు రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగుల కోతలు, పెరుగుతున్న ధరలు, ఆరోగ్య వ్యవస్థలో అనిశ్చితి వంటి అంశాలను స్పాన్‌బెర్గర్‌ తన ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారు. ఒక మాజీ సీఐఏ అధికారిగా, మూడుసార్లు కాంగ్రెస్ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకు పనికొచ్చింది. జాతీయ భద్రత, ఆర్థిక అంశాలపై ఆమెకున్న పట్టు మధ్యేవాద ఓటర్లను కూడా ఆమె వైపు తిప్పుకుంది. ‘‘వాషింగ్టన్ నుంచి వస్తున్న అనాలోచిత నిర్ణయాల నుంచి వర్జీనియా ఆర్థిక వ్యవస్థను కాపాడతాను’’ అన్న ఆమె నినాదం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. తన ప్రమాణస్వీకార ప్రసంగంలో స్పాన్‌బెర్గర్ కేంద్రంలోని ట్రంప్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. సివిల్ సర్వీస్ వ్యవస్థను దెబ్బతీయడం, పెరుగుతున్న ధరలు, ఆరోగ్య వ్యవస్థలో అనిశ్చితిపై ఆమె యుద్ధం ప్రకటించారు. ‘‘వర్జీనియా భవిష్యత్తును రాజులు లేదా ఒలిగార్చ్‌లు శాసించలేరు, ఇక్కడి ప్రజలే నిర్ణయిస్తారు’’ అని ఆమె అన్న మాటలు ట్రంప్ విధానాలకు సవాల్ విసిరాయి. భారత సంతతికి చెందిన గజాలా హష్మి పాత్ర ఈ ఎన్నికల్లో మరువలేనిది. హైదరాబాద్‌ లోని మలక్‌పేటలో జన్మించిన ఆమె, ఖురాన్ మీద ప్రమాణం చేసి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అమెరికా చరిత్రలోనే ఈ పదవిని చేపట్టిన తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించారు.


30ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేసిన గజాలా, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమె విజయం వలసదారులకు, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణం. అలాగే నాడు బానిసత్వానికి కేంద్రంగా ఉన్న వర్జీనియాలో, నేడు తొలి నల్లజాతీయుడైన జే జోన్స్ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టడం ఒక సామాజిక విప్లవం. స్పాన్‌బెర్గర్, హష్మి, జోన్స్‌ల బృందం వర్జీనియాలోని బహుళత్వాన్ని ప్రతిబింబిస్తోంది. రిపబ్లికన్ల పాలనలో గత నాలుగేళ్లుగా కొనసాగిన విభజన రాజకీయాలకు స్వస్తి పలికి, ఐక్యతతో కూడిన పాలనను అందిస్తామని ఈ బృందం చాటిచెప్పింది. అధికారం చేపట్టిన కొద్ది గంటల్లోనే స్పాన్‌బెర్గర్ సామాన్యులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా, విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా 10 కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వలసదారులను ఇబ్బంది పెట్టే పాత ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. స్థానిక పోలీసులు వలస చట్టాల అమలు కోసం తమ సమయాన్ని వృథా చేయకూడదని, ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. విద్యా బోర్డుల్లో మార్పులు చేస్తూ యువతకు పెద్దపీట వేశారు. స్పాన్‌బెర్గర్ విజయం వర్జీనియా రాష్ట్రానికే పరిమితం కాకుండా ఈ ఏడాదిలో జరగబోయే అమెరికా మధ్యంతర ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

కృష్ణ కానూరి

ఇవి కూడా చదవండి

ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’

రాజ్యాంగ నిష్ఠను త్యజిస్తున్న గవర్నర్లు!

Updated Date - Jan 29 , 2026 | 02:48 AM