Share News

కొంతే గ్రహించాం బ్రౌన్‌ గొప్పతనం

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:20 AM

‘దేశమైనా చూడు కోశమైనా చూడు’ అని ఆర్యోక్తి. మొదటిది లోకజ్ఞానాన్నిస్తే రెండోది భాషా జ్ఞానాన్నిస్తుంది. అలాంటి భాషా సంపదకు భాండాగారాలైన నిఘంటువులు...

కొంతే గ్రహించాం బ్రౌన్‌ గొప్పతనం

‘దేశమైనా చూడు కోశమైనా చూడు’ అని ఆర్యోక్తి. మొదటిది లోకజ్ఞానాన్నిస్తే రెండోది భాషా జ్ఞానాన్నిస్తుంది. అలాంటి భాషా సంపదకు భాండాగారాలైన నిఘంటువులు సి.పి. బ్రౌన్‌ అద్భుతమైన కృషి వల్ల మన తెలుగువారికి సమకూరాయి. 1852లో సి.పి. బ్రౌన్‌ ఇంగ్లిషు–తెలుగు, తెలుగు–ఇంగ్లిషు నిఘంటువులు అచ్చయ్యాయి.

1806లో మామిడి వెంకయ్య తెలుగు నిఘంటువు రాసినా అది అచ్చవలేదు. దాని ఆధారంగా 1821లో కేంబెల్ డిక్షనరీ వచ్చింది (A.D Campbell, Telugoo and English). దీన్ని బ్రౌన్ చూశాడు. దాని మీద ‘జెంతూ (GENTOO) అని పిలవబడే తెలుగు భాష’ అని ఉంది. ఇంగ్లిష్ వాళ్ళు తెలుగుభాషనూ, తెలుగువారినీ ‘జెంతూ’ అనేవారు. బ్రౌన్ ‘a wrong word for the Telugu language’ అన్నాడు. ఆయన ఈ కేంబెల్ డిక్షనరీకి 16 వేలకు పైగా పదాలు చేర్చి తన నిఘంటువు ప్రచురించాడు. ‘తెనుగు తెట్టె’ ‘తెలుగులగని’ వంటి పదిహేను పేర్లు పరిశీలించి, చివరికి ‘బ్రౌణ్యం’ అని పేరు పెట్టి సంస్కృత సంప్రదాయాన్ని గౌరవించాడు.

ఆయన తన నిఘంటువులో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉదాహరణకు ‘ర’ ఒత్తు ‘U’ ఆకారంలో ఉంటే అచ్చుకి అడ్డం అని భావించి దానిని ‘C’ లాగా మార్చాడు. ఇప్పుడు ముద్రణలో దీన్నే వాడుతున్నాం. ‘కోరమాండల్’కి మూలం ‘కురుమండలం’ అన్నాడు. ‘జనని సంస్కృతంబు ఎల్లభాషలకును’ అనే వాదం తప్పన్నాడు. ‘‘ఇంగ్లిష్‌పై లాటిన్ ప్రభావం ఉన్నట్టే తెలుగుపై సంస్కృత ప్రభావం ఉంది’’ అన్నాడు. ‘‘తెలుగులో అక్షరాలెక్కువ అనే దొరల విమర్శ తప్పు. ఒక్కొక్క ధ్వనికీ ఒక్కొక్క అక్షరం ఉండటమే దానికి కారణం’’ అన్నాడు.

తెలుగుపై ఇంత ప్రేమ చూపిన బ్రౌన్‌కి తెలుగనే భాష ఉందని 1817 వరకూ తెలియదు. ఆయన 1798 నవంబర్ 10న కలకత్తాలో పుట్టాడు. 1816లో ఈస్టిండియా కంపెనీ సివిల్ ఉద్యోగిగా చేరాడు. రెండు భాషలు నేర్చుకోమంటే తెలుగుతో బాటు మరాఠీ ఎంచుకున్నాడు. కానీ తెలుగు మీదే మమకారం పెంచుకున్నాడు. తన 34 ఏళ్ల ఉద్యోగ జీవితంలో 30 ఏళ్ళు తెలుగుకే సేవ చేశాడు. రిటైరయ్యాక ఇంగ్లండ్‌ దేశానికి పోయి 1884 డిసెంబర్ 12 న 87వ ఏట కన్ను మూశాడు.


తెలుగు భాషకు ఇంత సేవ చేసిన బ్రౌన్ పట్ల మనవాళ్లు తగిన కృతజ్ఞత చూపించారా అంటే ఆధారాలను బట్టి లేదనే అనుకోవాలి. శబ్దరత్నాకరానికి, సూర్యరాయాంధ్ర నిఘంటువుకి మూలం బ్రౌణ్యమే. కానీ అన్యాయంగా శబ్దరత్నాకర కర్త తన పీఠికలో బ్రౌన్ పేరే ప్రస్తావించలేదు. గిడుగు రామ్మూర్తి తన ‘శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శనము’ వ్యాసంలో, ‘‘బ్రౌణ్య నిఘంటువు రచించినవారు పండితులు ప్రఖ్యాత పండితులు, జూలూరు అప్పయ్య పండితులు మొదలైనవారు’’ అని బ్రౌన్ తన డిక్షనరీలను పండితులతో రాయించాడనే అపోహకు తావిచ్చారు. కానీ బ్రౌన్‌ పండితులు ఇచ్చిన అర్థాలను గుడ్డిగా స్వీకరించలేదు. ఉదాహరణకు, బ్రౌన్ అర్థాల కోసం రాసిన లేఖకు రావిపాటి గురుమూర్తి శాస్త్రి జవాబు చూడండి. ‘‘తమరు ‘అలవోక’, ‘డాబాలు’ అనే పదాల అర్థాలడిగారు. ‘అలవోక’ శబ్దానికి స్వేచ్ఛ, అనిచ్ఛ, అప్రయత్నము, అశ్రమము, కారణము, అని నానార్థాలున్నాయి. సందర్భాన్ని బట్టి గ్రహించాలి. ‘డాబా’ అనగా వెండితో గాని బంగారుతో గాని చేసిన మొలతాడు యొక్క బిళ్ల. ఉత్తరదేశంలో ఇలాంటి మొలతాడు 4, 5, వరుసలుగా చుట్టి బిళ్ళలతో మొలకు ధరించేవారు. అది డాబా మొలతాడు’’. అన్నాడు. ఈ గురుమూర్తి శాస్త్రి ఆనాటి ప్రభుత్వ కాలేజీలో పండితుడు. బ్రౌన్ ‘అలవోక’ పదానికి శాస్త్రి గారి అర్థాలనుగాక, సొంతంగా ‘‘sportively, amusingly, playfully, easily, carelessly’’, ‘‘వేడుకగా, విలాసముగా, ఆట్లాటగా, అవలీలగా, అలక్ష్యముగా, అసడ్డగా, ఉపేక్షగా’’ అనే అర్థాలను ఇచ్చాడు. ఇది చాలదా బ్రౌన్ కృషి అర్థం కావడానికి?

బ్రౌన్ ఇంగ్లిష్ మన వాళ్లకు అర్ధం కాలేదు. ఉదా: ‘అత్తి’ పదానికి బ్రౌన్ ‘This tree has no apparent blossoms’ అంటే సూర్యారాయాంధ్ర నిఘంటు కర్తలు ‘‘అత్తిచెట్టు పువ్వులు లేకనే కాయలు కాచును, బ్రౌ,’’ అని ఇచ్చారు. ‘నక్కిళ్ళు’కి బ్రౌన్ ‘lockjaw’ అని ఇస్తే శబ్దరత్నాకరంలో ‘పక్కపండ్ల కీళ్ళు’ అన్నారు. ‘‘ఆంగ్ల భాషలో ప్రావీణ్యమే కాదు, ఆంగ్ల వార్తాపత్రికలోని ప్రతి కాలమ్‌నీ సరిగ్గా అర్థం చేసుకోగలిగే బ్రాహ్మణున్ని నేను చూడలేదు’’ అని బ్రౌన్ అందుకే అన్నాడేమో!


బ్రౌన్ డిక్షనరీలో బొమ్మలు వేయించాలనుకున్నా, మన ముద్రణ అభివృద్ధి చెందలేదు. అయినా ‘మహాభారతం’లోని ‘శకట వ్యూహం’, ‘గర్భగృహం’ అర్థాల దగ్గర బొమ్మలు వేయించాడు. ‘పచ్చ’కి సఫేద పచ్చ, కప్పుపచ్చ, కాటుకపచ్చ.... అంటూ ఎన్ని భేదాలు గీయించాడో! ‘మృణ్మయ పాత్ర’ దగ్గర ‘పాత్ర విశేషం’ అని వదిలేస్తే ఏమీ అర్థం కాదని, ఏ పాత్ర ఎట్లా ఉంటుందో చెప్పాలనుకున్నాడు. అటికె, గంగాళం దుత్త కడవ, చెరవ, చట్టి, చెంబు ఇలా వీటన్నిటికీ వరుసగా బొమ్మలు గీయించాడు. బ్రౌన్ ఇంత విస్తృతంగా చేసిన మార్పుల్ని ఏ తెలుగువాడూ పట్టించుకున్న పాపాన పోలేదు.

తెలుగు సామెతలను 1868లో ‘ఆంధ్ర లోకోక్తి చంద్రిక’ పేరుతో ఎమ్‌.డబ్ల్యూ. కార్ ప్రచురించాడు. కానీ మొదటగా తెలుగు సామెతల్ని రికార్డు చేసిన వ్యక్తిగా బ్రౌన్‌ పేరే చెప్పుకోవాలి. తన నిఘంటువుకు చేర్చిన పాద సూచికల్లో ఎన్నో సామెతలను నమోదు చేసాడు. కొన్ని ఆయన నిఘంటువు లోకే చేరలేదు. ఉదా: ‘పెద్దాపె దండు మంకెనకు చేటు’ సామెతకు ఇంగ్లీష్‌ అనువాదాన్ని కూడా రాసుకున్నాడు కానీ అచ్చయిన ఆయన డిక్షనరీలోకి ‘మంకెన’ (a hamper) పదమైతే వచ్చింది కానీ ‘పెద్దాపె’ పదం కానీ, ఈ సామెత కానీ రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ‘తెలుగు సామెతలు’ పుస్తకాన్ని మూడుసార్లు ముద్రించినా (1959, 1965, 1974). వీటిలో బ్రౌన్ సేకరించిన సామెతలు సగం కూడా రాలేదు. బ్రౌన్ కృషిని ఎంత చెప్పినా తక్కువే. ‘కాదంబరి’ రాసిన బాణభట్టుని ‘బాణో చ్ఛిష్టమ్ జగత్సర్వమ్’ అన్నాడో పండితుడు. మన భాష సర్వాన్ని ‘బ్రౌణోచ్ఛిష్టమ్’ అని చెప్పుకున్నా అతిశయోక్తి కాదేమో!

(నవంబర్ 10 సి.పి. బ్రౌన్ జయంతి)

పి.యస్. ప్రకాశరావు

99637 43021

ఈ వార్తలు కూడా చదవండి

ఓట్‌చోరీపై రాంలీలా మైదాన్‌లో పోరాటం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో 29 తులాల బంగారం మాయం

Updated Date - Nov 02 , 2026 | 02:20 AM