ఈ కుట్ర సిద్ధాంతాలకు కాలం చెల్లింది!
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:46 AM
ఢిల్లీ అధికార కారిడార్లలో కుట్ర సిద్ధాంతాలు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. నేటి రాజకీయ భారతంలో అవి గుసగుసల కంటే బిగ్గరగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవి రాజకీయ ఆయుధాలుగా పరిణమించాయి....
ఢిల్లీ అధికార కారిడార్లలో కుట్ర సిద్ధాంతాలు నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. నేటి రాజకీయ భారతంలో అవి గుసగుసల కంటే బిగ్గరగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవి రాజకీయ ఆయుధాలుగా పరిణమించాయి. దేశ రాజధానిని కుదిపేసిన విద్యార్థుల నిరసనలతో సంబంధమున్న సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సభ్యులు తాజా కుట్ర సిద్ధాంతాలకు లక్ష్యాలుగా ఉన్నారు. ప్రశ్నపత్రాల లీక్‌లు, తగ్గిపోతున్న ఉద్యోగావకాశాలు, నియామకాల్లో జాప్యాలపై లక్షలాది యువ భారతీయులు ఎందుకంతగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారో అర్థం చేసుకోకుండా, వారి ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నవారి ఉద్దేశాలను ప్రశ్నించేందుకే రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి.
వాంగ్‌చుక్, సీజేపీలు మోదీ ప్రభుత్వ ‘రహస్య రాజ్య వ్యవస్థ’ (డీప్ స్టేట్)లో భాగమే అని కాంగ్రెస్ శ్రేణుల్లో బాగా ప్రచారంలో ఉన్న ఒక సిద్ధాంతం చెబుతోంది. ‘నీట్’ పరీక్షల గందరగోళంపై ప్రజ్వరిల్లిన ఆందోళనల నుంచి రాజకీయలబ్ధి పొందకుండా కాంగ్రెస్‌ను నివారించేందుకే వాంగ్‌చుక్, సీజేపీని మోదీ సర్కార్ ‘డీప్ స్టేట్’ రంగంలోకి దించిందనేది ఆ సిద్ధాంత సారాంశం. ఇదొక అసాధారణ వాదన. దీనికి సాక్ష్యాధారాలు ఏవీ లేవు. అయితే వాస్తవాల కంటే అనుమానాలే మహా వేగంగా విస్తరిల్లి, వర్ధిల్లే వర్తమాన యుగంలో కుట్ర సిద్ధాంతాల శీఘ్రగతిన బాగా ప్రభావదాయక మవుతున్నాయి.
లద్దాఖ్‌కు మరింత స్వతంత్ర ప్రతిపత్తి నివ్వాలని డిమాండ్ చేస్తూ ఆ హిమాలయ ప్రాంతవాసులు ఏడాది క్రితం నిర్వహించిన ఆందోళనలో హింసాత్మక ఘటనలు సంభవించాయి. వాటికి సోనమ్ వాంగ్‌చుక్ బాధ్యుడు అనే ఆరోపణతో ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆరు నెలలపాటు జైలు నిర్బంధంలో ఉన్న తరువాత విడుదల చేశారు. అరెస్ట్ చేయడానికి కారణాలు ఏమిటో ప్రభుత్వం చెప్పనే లేదు. వాంగ్‌చుక్ జైలులో ఉన్న సమయంలో బీజేపీ సామాజిక మాధ్యమాలలో ఆయనను విదేశీ నిధులు పొందుతున్న ‘జాతి వ్యతిరేకి’గా చిత్రించారు. ‘చైనా ఏజెంట్’ అని కూడా ఆరోపించారు. తమ రాజకీయ కథనాలను సమర్థించుకోవడానికై వాంగ్‌చుక్ ఉపన్యాసాల నుంచి ఎంపిక చేసిన మాటలను ఉల్లేఖించారు.
ఇప్పుడు అదే వ్యక్తిని ఇంటెలిజెన్స్ బ్యూరో చేతుల్లో కీలుబొమ్మ అని కాంగ్రెస్ శ్రేణులు నిందిస్తున్నాయి. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటం, రాహుల్‌గాంధీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వాంగ్‌చుక్‌ను ఉపయోగించుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ‘చైనా ఏజెంట్‌గా ఆరోపణలకు గురైన వ్యక్తి భారత ప్రభుత్వ ఏజెంట్‌గా ఎలా పరిణమించాడు? తమ నీడను చూసి జడుసుకునే రాజకీయవాదుల భయానుమానాలలోని అసంబద్ధతను వాంగ్‌చుక్‌పై ఈ నిందలు బహిర్గతం చేస్తున్నాయి.
వాంగ్‌చుక్ నాకు రెండు దశాబ్దాలుగా తెలుసు. విద్యారంగం, పర్యావరణ పరిరక్షణలో ప్రశస్త కృషికి గాను 2008లో సీఎన్‌ఎన్–ఐబీఎన్ వార్తా సంస్థ వాంగ్‌చుక్‌ను ‘రియల్ హీరో’గా గౌరవించి సత్కరించిన సందర్భంలో నేను ఆయనను మొదటిసారి కలుసుకున్నాను. ఆనాటి సభలో నటుడు ఆమిర్‌ఖాన్ కూడా ఉన్నారు. ఆ తరువాత ఆయన నటించిన ‘త్రీ ఇడియట్స్’ సినిమా వాంగ్‌చుక్ జీవితం నుంచి స్ఫూర్తి పొందినట్టుగా ప్రచారం జరిగింది. విద్యారంగంలో మౌలిక మార్పులకు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పరిపూర్తికి, లద్దాఖ్ భవిష్యత్తుకు వాంగ్‌చుక్ చేస్తున్న కృషిని నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తూ వస్తున్నాను. వాంగ్‌చుక్ ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. గతంలో అన్ని రాజకీయ పార్టీలు సమున్నతంగా గౌరవించిన వ్యక్తి, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అన్నదానిపై ఆధారపడి ఆయన దేశద్రోహిగానో లేక ప్రభుత్వ ఏజెంట్‌గానో ఎలా అయ్యారు? మోదీ ప్రభుత్వం సైతం ఆయనను పలుమార్లు బహిరంగంగా ప్రశంసించింది. మార్చి 2023లో వాంగ్‌చుక్, ఆయన సతీమణితో సమావేశమైన తరువాత వారితో తాను దిగిన ఫొటో నొకదాన్ని ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు, వివిధ రంగాలలో ఆ దంపతులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. మూడు సంవత్సరాల తరువాత నీట్ వివాదంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకుగాను వాంగ్‌చుక్‌పై బీజేపీ నాయకుల గౌరవాభిమానాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వాంగ్‌చుక్ లేవనెత్తిన ప్రశ్నలపై చర్చించడానికి బదులుగా ఆయన ఉద్దేశాలను అనుమానిస్తున్నారు.
మరొక ఉదంతాన్ని కూడా ప్రస్తావించవలసి ఉన్నది. ‘లేహ్ అటానమస్ డెవలెప్‌మెంట్ కౌన్సిల్’ వాంగ్‌చుక్ ఆధ్వర్యంలోని హిమాలయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్స్’కు 1000 కనాల్స్ (8 కనాల్‌లు ఒక ఎకరానికి సమానం) భూమిని కౌలుకు ఇచ్చింది. ఆ తరువాత ఆ కౌలును రద్దు చేసింది. లద్దాఖ్ స్వతంత్ర ప్రతిపత్తి ఉద్యమంలో వాంగ్‌చుక్ కీలకపాత్ర వహిస్తున్న కారణంగానే ఈ రద్దు జరిగిందన్నది స్పష్టం. భిన్నాభిప్రాయ వ్యక్తీకరణను ప్రజాస్వామిక స్వేచ్ఛగా కాకుండా ఒక విరోధ చర్యగా పరిగణించడం వల్లే ఇలా జరిగింది. ప్రభుత్వ నిర్ణయాలతో విభేదించినవారు బెదిరింపులు, వ్యక్తిత్వ హననాలకు గురవుతున్నారు. మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ ఇలానే వ్యవహరిస్తోంది. పాత్రికేయులు, విద్యావేత్తలు, పౌర సమాజ కార్యకర్తలు అందరూ ఈ ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతూనే ఉన్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ని మోదీ సర్కార్ తొలుత నెలలపాటు పూర్తిగా ఉపేక్షించింది. సీజేపీ కార్యకర్తల నిరసన ఉధృతమైన తరువాతనే దాని ఉనికిని అంగీకరించడం సర్కార్‌కు అనివార్యమయింది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, సీజేపీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పరోక్ష ప్రతినిధి మాత్రమే. కారణం దాని స్థాపకుడు అభిజిత్ దీప్కే గతంలో ఆప్ సోషల్ మీడియాలో పనిచేయడమే! 2011లో అన్నాహజారే ఉద్యమం నుంచే ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభవించి, యూపీఏ ప్రభుత్వ పతనాన్ని వేగవంతం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ను ఇప్పటికీ బాధిస్తూనే ఉన్నది. అయితే చరిత్ర ఒక బందీఖానా కాకూడదన్న వివేకాన్ని చూపకపోతే ఎలా?
సీజేపీ కార్యకర్తలు పలువురితో నేను సంభాషించాను. పార్టీ రాజకీయాలు కాకుండా వ్యవస్థ పట్ల అసంతృప్తే వారి తిరుగుబాటుకు ప్రేరణ. ఈ ‘జనతా’ వాదులు అనుభవ శూన్యులు, అయితే.. ఆదర్శవాదులు. అప్పుడప్పుడు అవ్యవస్థితులు, అయితే.. కపటరహిత రాజకీయులు. తాము ఎందుకు ఈ ఆందోళనకు పూనుకున్నామని వారు నిర్మొహమాటంగా చెబుతున్నదాన్ని వినడం కంటే– ఏదో ఒక రాజకీయ పార్టీ ఏజెంట్లు అని కొట్టివేయడం చాలా తేలిక. అసలు ఈ నిర్లక్ష్య వైఖరే ఒక పెద్ద విషాదం.
పన్నెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను సహించలేకపోతోంది. అసమ్మతిని పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం లేదని లేదా దానిని అణచివేయవచ్చని విశ్వసిస్తోంది. విమర్శకులను విరోధులుగా, నిరసనకారులను కుట్రదారులుగా చూస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిని బలహీనపరిచేందుకు విదేశీ శక్తులతో కుమ్మక్కయినవారు చేస్తోన్న మరో ప్రయత్నమే సీజేపీ అని ప్రభుత్వం భావిస్తోంది.
తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న యువతపై రాజకీయ నిందారోపణలు చేయడం రాజకీయపక్షాలకు తగదు. కుట్రసిద్ధాంతాలలో పావులుగా వారిని పరిగణించకూడదు. అంతకంటే మెరుగైన విషయాలకు యువ భారతీయులు అర్హులు. ప్రశ్న పత్రాల లీక్‌కు కారణాలు ఏమిటో వారికి స్పష్టంగా వివరించాలి. ఉద్యోగ నియామకాల్లో జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పాలి. క్షీణిస్తున్న విద్యా ప్రమాణాలను ఎలా మెరుగుపరచనున్నారో స్పష్టంచేయాలి. తగ్గిపోతున్న ఉద్యోగావకాశాల విషయమై సంజాయిషీ చెప్పాలి. తమ ఆకాంక్షలను వినే ప్రభుత్వాలు, తమకు నాయకత్వం వహించే ప్రతిపక్షాలు యువభారతీయులకు అవసరం. మరీ ముఖ్యంగా తమ ధర్మాగ్రహాన్ని, ఆందోళనలను శంకించకుండా సహానుభూతితో ప్రతిస్పందించే రాజకీయవేత్తలు, రాజకీయ వాతావరణం వారికి అవసరం.
అవినీతి, అసమర్థ పాలనపై నిందలను తోసిపుచ్చేందుకు అధికార పక్షాలు కుట్ర సిద్ధాంతాలు చేయడం పరిపాటి. ప్రజల నిరసనలను రహస్య అజెండాల దృక్కోణంలో చూడడం కాకుండా, ఆ ఆందోళనలు లేవనెత్తిన ఇబ్బందికర ప్రశ్నలను అధికారంలో ఉన్నవారు, అధికారానికి ఆరాటపడుతున్నవారు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడే ప్రజాస్వామ్యాలు వర్ధిల్లుతాయి. శాంతియుత నిరసనలను కుట్రగా పరిగణించడం మానుకోవాలి. రాజకీయపక్షాలు మరింత జవాబుదారీతనం చూపాలి. ప్రభుత్వాలు నిర్మాణాత్మక సంస్కరణలతో పారదర్శక పాలననందించాలి. యువ భారతీయ పౌరుల జీవితోన్నతికి ఇవి అవసరం. వాటికి వారు అర్హులు. అంతకంటే అల్పమైన వాటిని వారు ఇంకెంత మాత్రం సహించరు.
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఇవి కూడా చదవండి
మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న
ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్