Share News

బీజేపీ కుట్రలపై కాంగ్రెస్‌ విజయం!

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:01 AM

ఒక అబద్ధాన్ని పదేపదే చెప్తే అదే నిజమైపోతుందన్న గోబెల్స్‌ సిద్ధాంతాన్ని బీజేపీ వందశాతం ఒంటబట్టించుకున్నది. మహిళా రిజర్వేషన్ విషయంలో బీజేపీ పనిగట్టుకుని చేస్తున్న అబద్ధపు ప్రచారమే...

బీజేపీ కుట్రలపై కాంగ్రెస్‌ విజయం!

ఒక అబద్ధాన్ని పదేపదే చెప్తే అదే నిజమైపోతుందన్న గోబెల్స్‌ సిద్ధాంతాన్ని బీజేపీ వందశాతం ఒంటబట్టించుకున్నది. మహిళా రిజర్వేషన్ విషయంలో బీజేపీ పనిగట్టుకుని చేస్తున్న అబద్ధపు ప్రచారమే దీనికి ఋజువు. ప్రజలను అయోమయంలో ముంచి రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నది బీజేపీ తాపత్రయం.

దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నదని 2023 లోక్‌సభ ఎన్నికలు నిరూపించాయి. ఈ పరిస్థితిని బీజేపీ సైతం గుర్తించింది. అందుకే 2029 లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నది. అందులో భాగంగానే మహిళా రిజర్వేషన్ అనే సెంటిమెంట్‌ను వాడుకోవాలని చూస్తున్నది.

మహిళల పట్ల బీజేపీకి నిజాయితీ ఏ పాటిదో ఒక గోద్రా, ఒక మణిపూర్ మారణహోమాల్ని గమనిస్తే తేలిపోతుంది. ఉన్నావ్, హథ్రాస్ ఘటనలను గుర్తుచేసుకుంటే అర్థమవుతుంది. మనుధర్మశాస్త్రాన్ని నూరిపోసే ఆరెస్సెస్‌ ఐడియాలజీని అమలు చేస్తూ, మహిళల అభివృద్ధి గురించి బీజేపీ మాట్లాడటమంటే.. దెయ్యాలు వేదాలు వల్లించడమే. ఆ పార్టీ ఉనికిలోకి వచ్చిన 46 ఏండ్లలో ఒక్క మహిళనైనా పార్టీకి ప్రెసిడెంట్‌ను చేయలేకపోయింది. పార్లమెంటరీ బోర్డులో పదిమంది ఉంటే మొక్కుబడిగా ఒక్క మహిళకే స్థానం ఇచ్చింది. నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బాధ్యతల్లో మహిళలను పూర్తిగా విస్మరించింది.

మహిళా రిజర్వేషన్‌ అంశాన్ని నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో ముడిపెట్టి ఈ మొత్తం వివాదానికి కారణమైందే బీజేపీ. నిజంగానే చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలన్న చిత్తశుద్ధే ఉంటే డీలిమిటేషన్‌తో లింకు పెట్టేదే కాదు. ఒకవైపు డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలతో పాటు పలు చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని అనేక పార్టీలు అసంతృప్తితో ఉన్న సంగతి బీజేపీకి తెలియందేమీ కాదు. అయినా ఉద్దేశపూర్వకంగానే మహిళా రిజర్వేషన్‌ను, డీలిమిటేషన్‌ను కలగలిపి రాజ్యాంగ సవరణ పేరుతో కొత్త డ్రామా ఆడింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమని తెలిసినా, అంతటి బలం లేదని దానికి అర్థమైనా, ఈ బిల్లును ఎందుకు పెట్టింది? మహిళా రిజర్వేషన్‌ను విపక్షాలే అడ్డుకున్నాయని కార్నర్ చేయడానికే ఈ కథ నడిపించిందని స్పష్టంగా అర్థమవుతున్నది.

డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా ఇప్పుడున్న 543 సీట్లలోనే 33శాతం మహిళలకు రిజర్వు చేయడానికి విడిగా బిల్లు పెడితే సంపూర్ణంగా మద్దతు ఇస్తామని, ఇప్పటికిప్పుడు ఆమోదం తెలుపుతామని కాంగ్రెస్ సహా ‘ఇండియా’ కూటమి పార్టీలన్నీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాయి. కానీ రాజకీయమే తప్ప మహిళలకు సీట్లు ఇవ్వాలన్న సదుద్దేశం ఏ కోశానా బీజేపీకి లేదు. నిజానికి 2023లో మహిళా బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. మహిళలకు అవకాశాలు ఇవ్వాలని బీజేపీ అనుకుంటే ఆ బిల్లులో ‘2026 తర్వాత జరిగే సెన్సస్’, ‘డీలిమిటేషన్’ అంటూ ఎందుకు షరతులు పెట్టినట్టు? ఇప్పుడు హడావిడిగా 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలని రాత్రికి రాత్రి ఎందుకు నిర్ణయం తీసుకున్నట్టు? కేవలం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోడానికే ఈ కుట్ర అంతా.


ఇప్పుడున్న సీట్లలో మహిళలకు 33శాతం ఇవ్వడానికి మనసు రాని బీజేపీ.. సీట్లు పెంచిన తర్వాతనే ఇవ్వాలనుకోవడం ఆ పార్టీ వంచనకు నిదర్శనం. సీట్ల సంఖ్యను పెంచకపోతే మహిళలకు ఇవ్వలేరా? పురుషుల సీట్లను మహిళలకు త్యాగం చేయాలన్న ఆలోచన మాత్రం ఆ పార్టీకి లేదు. సీట్లు పెంచిన తర్వాతే అనే షరతు పెట్టడం వెనుకనే మహిళాభివృద్ధి పట్ల ఆ పార్టీకి ఏ పాటి శ్రద్ధ ఉన్నదో అర్థమవుతున్నది.

కాంగ్రెస్ సహా విపక్షాలు ఓడించింది మహిళా రిజర్వేషన్ బిల్లును కాదు– డీలిమిటేషన్ బిల్లును, దానికి అవసరమైన సవరణలు చేసే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లునే అంటూ బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి. గతంలో మూడు సాగుచట్టాలు రైతుల సంక్షేమం, బాగు కోసమేనంటూ మోదీ నమ్మబలికారు. రైతాంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకోక తప్పలేదు. టీవీల ద్వారా మొదటిసారి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు మోదీ కుట్రను పసిగట్టిన రాహుల్‌గాంధీ.. విపక్షాలను ఏకం చేసి పెను ప్రమాదాన్ని నివారించారు.

కేంద్రం అనుకుంటున్న ప్రస్తుత విధానంలో డీలిమిటేషన్‌ ద్వారా చిన్న రాష్ట్రాలకు, దక్షిణాదికి జరిగే నష్టాన్ని, అన్యాయాన్ని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఏడాది మార్చిలో చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలోనే స్పష్టత ఇచ్చారు. గతంలో ఇందిరాగాంధీ, వాజపేయి అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కూడా అమలు చేయాలన్నారు. రాబోయే పాతికేళ్ళ వరకు లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచవద్దని దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించవద్దని కేంద్రానికి స్పష్టం చేశాయి. దక్షిణాది రాష్ట్రాలను ఒక్క తాటి మీదకు తేవడంలో రేవంత్‌రెడ్డి సక్సెస్ అయ్యారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసి, మోదీ కుట్రను లోక్‌సభ వేదికగా ఓటింగ్ రూపంలో పటాపంచలు చేసి రాహుల్‌గాంధీ విజన్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు.

బీజేపీ కాళ్ళకింద నేల కదులుతున్నది. పుష్కరకాలంగా నిరంకుశ విధానాలతో పాలన సాగించిన మోదీ, బీజేపీ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇంతకాలం మతపరంగా ప్రజల మధ్య చీలిక సృష్టించిన బీజేపీ, ఇప్పుడు దేశ ఉత్తర–దక్షిణ భాగాల మధ్య విభజన రేఖ ఏర్పరిచేందుకు డీలిమిటేషన్‌ను ఎంచుకున్నది. దక్షిణాది రాష్ట్రాలు, ప్రజలు ఎంతమాత్రం బానిస స్వభావంతో బతకడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికైనా బీజేపీ దాని కుట్రబుద్ధిని మార్చుకుని నిజాయితీతో వ్యవహరించాలి.

వేముల వీరేశం

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్

ఇవి కూడా చదవండి

ఆర్టీసీ సమ్మెలో ఆందోళనకర పరిణామాలు..

చిన్న నౌకలనూ కాల్చేయండి.. అమెరికా నేవీకి ట్రంప్ కీలక సూచనలు

Updated Date - Apr 24 , 2026 | 01:01 AM