Share News

ముసుగులు తొలగిన మతతత్వం!

ABN , Publish Date - May 23 , 2026 | 03:12 AM

‘వారు నాకు ఓటు వేయలేదు. వారి బాగోగులకు నేను బాధ్యత వహించను’– పశ్చిమ బెంగాల్‌ శాసనసభకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రితేశ్‌ తివారీ అన్న మాటలవి. ఈ ఉద్ఘాటన మానవ ధర్మ ప్రేరితమేనా...

ముసుగులు తొలగిన మతతత్వం!

‘వారు నాకు ఓటు వేయలేదు. వారి బాగోగులకు నేను బాధ్యత వహించను’– పశ్చిమ బెంగాల్‌ శాసనసభకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రితేశ్‌ తివారీ అన్న మాటలవి. ఈ ఉద్ఘాటన మానవ ధర్మ ప్రేరితమేనా? ఒక్క క్షణం ఆలోచించండి. ఆ మాటల్లోని అనైతికత, దుర్మార్గం అర్థమవుతుంది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రజాప్రతినిధి అలా మాట్లాడవచ్చునా? పరిపాలన, పౌరసత్వ హక్కులు ఇప్పుడు మతపరమైన ఓటింగ్‌ సరళిపై ఆధారపడి ఉన్నాయని ఆ ప్రజాప్రతినిధి ప్రభావశీలంగా సూచించడమే కాదూ ఆ ప్రకటన? ముస్లింలు తనకు ఓటు వేయనప్పుడు తాను ప్రాతినిధ్యం వహించేందుకు వారు సరైన అర్హులు కారని ఆ బెంగాలీ ఎమ్మెల్యే ఆ మాటలతో చెప్పకనే చెప్పాడు.

రవీంద్రుడి ఆత్మ క్షోభించి ఉంటుంది. విశాల భారతావని ఆ మహాకవిని మరచిపోనట్లయితే కొత్త ‘ప్రజాప్రతినిధి’ కుత్సిత పలుకులకు భగ్గుమనేది కాదూ? అలా జరగలేదు! ఇదే, బహుశా, ఈ బెంగాల్‌ ముచ్చటలోని అత్యంత ఆందోళనకరమైన విషయం. వర్తమాన భారతదేశంలో నేడు మనం కంటున్నవీ వింటున్నవీ కేవలం మతతత్వ రాజకీయాలు కావు. అవి ఇంతకు ముందు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తోంది మతతత్వ రాజకీయాల సర్వవ్యాపకత్వం. అవును, అవి సర్వసాధారణమైపోయాయి. ఆ బెంగాలీ అన్న మాటలను గతంలో ఎవరైనా వదరి ఉంటే వారి రాజకీయ జీవితాలకు అవి భరతవాక్యాలు అయివుండేవి. అయితే ఇప్పుడు అవి కేవలం ఎన్నికల ప్రలాపమని, పట్టించుకోవల్సినంత ముఖ్యమైనవి ఏ మాత్రం కావని కొట్టివేస్తున్నారు!

మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించేందుకు రాజకీయులు ఇంకెంత మాత్రం సంకోచించడం లేదు. గతంలో గోప్యంగా చేసిన ఆ పనిని ఇప్పుడు బాహాటంగా అడ్డూ అదుపులేని రీతిలో నిస్సంకోచంగా చేస్తున్నారు. అందుకే కాబోలు భారత జాతీయ కాంగ్రెస్‌ను ‘కొత్త ముస్లిం లీగ్‌’ అని కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు అభివర్ణించారు.


రిజిజు వ్యాఖ్య వెనుక ఉన్న వాదన ఏమిటో నిశితంగా చూద్దాం. అసోం, బెంగాల్‌ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు అందరూ దాదాపుగా ముస్లిం అభ్యర్థులే అయినందున కాంగ్రెస్‌ ఒక మతతత్వ పార్టీగా పరిణమించింది. అవును, అసోంలో ఎన్నికైన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో 18 మంది ముస్లింలే. అలాగే బెంగాల్‌లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇరువురూ ముస్లింలే. సరే, కేరళలో కాంగ్రెస్‌ మిత్రపక్షం ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ ఎన్నికల్లో జయాపజయాలను ప్రభావశీలంగా నిర్ణయించే రాజకీయ శక్తి. అయితే కాంగ్రెస్‌ను మతతత్వ పార్టీగా నిందిస్తున్నవారు ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 650 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో అత్యధికులు ముస్లిమేతరులే. అయినప్పుడు కాంగ్రెస్‌ మతతత్వ పార్టీ ఎలా అయింది?

ఆ ప్రశ్నకు సమాధానం అంక గణితంలో కాకుండా రాజకీయ సందేశం– ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు చేసే ప్రసంగాలు, ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారం– లో ఉన్నది. ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యాన్ని అనుమానాస్పదం చేయడమే అసలు లక్ష్యం. ప్రధానస్రవంతి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులుగా ముస్లిం అభ్యర్థులు చెప్పుకోదగిన సంఖ్యలో ఎన్నికైనప్పుడు సదరు పార్టీపై మతతత్వ పార్టీ అనే ముద్ర వేయడమే అటువంటి వ్యాఖ్యలు చేసేవారి అభీష్టం. మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యాన్ని చట్టవిరుద్ధం చేయడం, మెజారిటీ వర్గ ఆధిపత్యాన్ని జాతీయ వాదంగా చూపడమే రిజిజు వ్యాఖ్య పరమార్థం. ఈ రాజకీయ విలోమం చాలా చాలా ప్రమాదకరమైనది. బెంగాల్‌లో సువేందు అధికారి పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన హిందువులకు బీజేపీకి ఓటువేయమని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. గెలిచిన తరువాత వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ముస్లిం ఓటర్లకు తమ పార్టీకి ఓటువేయమని విజ్ఞప్తి చేసి ఉంటే ఏమయివుండేది?

లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత హిందువులపైనే ఎందుకు మోపుతున్నారని పలువురు తరచు ప్రశ్నిస్తున్నారు. ముస్లిం ఓటర్లు ప్రధానంగా ముస్లిం అభ్యర్థులకే ఎందుకు ఓటు వేస్తున్నారు? ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి విజయం సాధించగలడా? ఇవి న్యాయబద్ధమైన ప్రశ్నలే. వీటికి సమాధానం ఒక రాజకీయ వాస్తవాన్ని గుర్తించడంలో ఉన్నది: భారత జనాభాలో హిందువులు 80శాతంగా ఉన్నారు. పరిపూర్ణ భద్రతా భావంతో నిండు ఆత్మ విశ్వాసంతో ఉన్న మెజారిటీ హిందువులు మాత్రమే దేశం మెజారిటేరియన్‌ జాతీయవాదంలోకి జారిపోకుండా నివారించగలరు.


సరే, లౌకికవాదం బలహీనపడడం బీజేపీతో మాత్రమే ఆరంభమయిందా? అలా భావించడం, ఆ సంక్షోభానికి ఆ పార్టీనే తప్పుపట్టడమంటే ఆత్మ వంచన చేసుకోవడమే అవుతుంది. లౌకికవాద పార్టీలుగా పరిగణన పొందుతున్న రాజకీయ పక్షాలు రెండు చారిత్రక తప్పిదాలకు పాల్పడ్డాయి. ముస్లింల సామాజిక పురోగతి, ఆర్థికాభ్యుదయానికి చిత్తశుద్ధితో కృషి చేయకుండా వారిని తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఓటు బ్యాంకుగా చూడడం మొదటి చారిత్రక నేరం. మితవాద ముస్లిం మతాచార్యుల ఒత్తిడికి లొంగిపోయి షాబానో కేసు తీర్పును కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేయడమైనా, లేదా ప్రాంతీయ పార్టీలు తమ ప్రతీకాత్మక రాజకీయాల ద్వారా ముస్లింల అభద్రతా భావాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమైనా ముస్లింలకు తరచు పంపుతున్న సందేశం: మాకు ఓటు వేయండి. మిమ్ములను హిందూ మితవాదుల నుంచి సంరక్షిస్తాం. సంరక్షణ రాజకీయంగా మారింది. అయితే సాధికారత అరుదుగా లభించింది.

లౌకికవాద పార్టీలు పాల్పడిన రెండో చారిత్రక తప్పిదం కూడా మొదటిదాని వలే లౌకికవాద విలువలకు తీవ్ర నష్టం చేసింది. హిందూ ఓట్లను బీజేపీకి కోల్పోతామనే భయంలో లౌకికవాదాన్ని దృఢవిశ్వాసంతో పరిరక్షించడానికి బదులుగా మృదు హిందుత్వను పాటించడంలో ఉత్సాహం చూపాయి. తద్వారా బీజేపీని సమర్థంగా ఎదుర్కోగలమని విశ్వసించాయి. 1980ల్లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం బాబ్రీమసీదుకు దశాబ్దాలుగా వేసి ఉన్న తాళాలను తెరవడాన్ని గుర్తు చేసుకోండి. అలాగే 2017లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ సందర్శించని హిందూ దేవాలయం ఏదైనా ఉన్నదా? లౌకికవాద పార్టీలు ఎప్పుడైతే మృదు హిందూత్వను పాటించడంలో నిమగ్నమయ్యాయో అప్పుడే మతవాద భావజాలానికి రాజకీయ ఆమోదం లభించేందుకు అనుద్దేశపూర్వకంగా తోడ్పడ్డాయి. దీనికి తోడుగా అస్తిత్వ రాజకీయాలు ప్రబలమయ్యాయి. ముస్లింలకు మరింత అధికంగా రాజకీయ ప్రాతినిధ్యం, వారు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు మొదలైన అంశాల ప్రాతిపదికన అసదుద్దీన్‌ ఓవైసీ తదితర ముస్లిం నాయకులు అస్తిత్వ రాజకీయాలను బలోపేతం చేశారు. మృదు హిందుత్వ, అస్తిత్వ రాజకీయాలు ఒక విషవలయమై మున్నెన్నడూ లేని ప్రమాదకర పరిస్థితికి దారితీశాయి. హిందూ మెజారిటీవాద రాజకీయ ప్రలాపాలు ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంపొందించాయి. ఈ అభద్రత ముస్లిం అస్తిత్వ రాజకీయాలను బలోపేతం చేశాయి. తీవ్రవాద ముస్లిం రాజకీయాలు హిందువుల్లో భయాందోళనలు సృష్టించి మితవాద, మతవాద భావజాలాలవైపు మొగ్గేలా చేశాయి.


ఇదిలా వుండగా రాజ్యాంగ బద్ధ పాలన కుంచించుకుపోవడం అంటే రాజ్యాంగ సంస్థలు బలహీనపడడం, సమాఖ్య పాలనా పద్ధతులు క్షీణించడం, ప్రజాస్వామ్య నియమాల ఉల్లంఘన ఆరంభమయింది. రాజకీయ ఆమోదయోగ్యతను మతపరమైన గుర్తింపు నిర్ణయించడమే ఆ విపత్కర మార్పుకొక నిదర్శనం. దశాబ్దాల క్రితం ఎ.ఆర్‌. అంతూలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. హిందూ ఓటర్లు అత్యధికంగా ఉన్న కాన్పూర్‌ నుంచి 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ గెలుపొందారు. ఇప్పుడు అటువంటి విజయాలను ఊహించగలమా? 20 కోట్ల మందికి పైగా ముస్లింలు ఉన్న భారత్‌లో ఒక్క రాష్ట్రానికి సైతం ముస్లిం ముఖ్యమంత్రి లేడు; 18 రాష్ట్రాలలో ముస్లిం మంత్రి ఒక్కరంటే ఒక్కరూ లేరు; బెంగాల్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యేలలో ఒక్క ముస్లిం కూడా లేడు; పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నికైన ముస్లిం ఎంపీ ఒక్కరూ లేరు.

హిందూత్వ అప్రతిహత పురోగతి మూలంగా రాజకీయ భారతంలో ముస్లింలు ఉనికిని దాదాపుగా కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. ఒక మత వర్గాన్ని ప్రధానస్రవంతి రాజకీయాల నుంచి మినహాయిస్తే ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’ (అందరి సహకారంతో అందరి అభివృద్ధి) అనే పాలనా ఆదర్శం ఎలా సాకారమవుతుంది? ఇవి ఇబ్బందికరమైన ప్రశ్నలు. అయితే పాలకులకు బాధాకరమనిపించే ప్రశ్నలు అడగడాన్ని ఆపివేస్తే ప్రజాస్వామ్యం నశించిపోతుంది. మతతత్వ రాజకీయాలను ఇప్పుడు ఇంకెంత మాత్రం పథ భ్రష్ట వ్యవహారాలుగా చూడకపోవడమే వర్తమాన భారతదేశ అసలు విషాదం. వాటిని ఎన్నికల సర్వసాధారణ విషయంగా అంగీకరించడం అంతకంతకూ అధికమవుతోంది. ఇదే నిజమైన ప్రమాదం. మన ప్రజాస్వామ్యానికి సంభవిస్తున్న ఎనలేని హాని. దేశ పౌరులు ప్రాథమికంగా ఒకరినొకరు సహచర భారతీయులుగా కాకుండా హిందువులుగా, ముస్లింలుగా భావించుకోవడం ప్రారంభమైతే మన రాజ్యాంగ లౌకికవాదం అంతఃశక్తిని కోల్పోయి నిరర్థకమవుతుంది. ఇదే సంభవిస్తే మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం సంకుచితమైపోతుంది. పౌరసత్వ విశాల భావనలు నశించిపోతాయి. మతవిశ్వాసాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు మృగ్యమైపోతాయి. స్వరూప స్వభావాలు మారిపోయిన రాజకీయ భారతం అశుభ సూచకమైన ‘హిందూ పాకిస్థాన్‌’ సదృశమవుతుంది.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

e(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఇవి కూడా చదవండి..

ఆ పెళ్లికి వెళితే నన్ను బతకనీయరు.. మీడియాపై ట్రంప్ సెటైర్లు

యురేనియాన్ని వదులుకోం

Updated Date - May 23 , 2026 | 03:12 AM