Share News

కామన్ స్కూల్ విధానమే ఉత్తమం!

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:54 AM

విద్యా వివక్షను రూపుమాపాలంటే కామన్ స్కూల్ విధానం తప్పనిసరి. కామన్ స్కూల్ అంటే నిర్ధారించిన ఆవాస ప్రాంతంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఒకే స్కూల్ ప్రజలకు...

కామన్ స్కూల్ విధానమే ఉత్తమం!

విద్యా వివక్షను రూపుమాపాలంటే కామన్ స్కూల్ విధానం తప్పనిసరి. కామన్ స్కూల్ అంటే నిర్ధారించిన ఆవాస ప్రాంతంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఒకే స్కూల్ ప్రజలకు అందుబాటులో ఉంచడం. రాజైనా, బంట్రోతైనా వారి పిల్లలు అదే పాఠశాలలో చదువుకునే ఏకీకృత పాఠశాల వ్యవస్థ. ఇది కుల, మత వైషమ్యాలు లేని విద్యా వ్యవస్థ. ఈ పాఠశాల అంశానికి వచ్చినప్పుడు ఫిజికల్ యాక్సెస్, సోషల్ యాక్సెస్ రెండూ ఉంటాయి. ఫిజికల్ యాక్సెస్ ప్రకారం– సర్వశిక్షా అభియాన్ నిబంధనలు, వివిధ విద్యా కమిషన్లు సిఫార్సు చేసిన విధంగా కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఇలా యాక్సెస్‌కు దూరమయినప్పుడు ఆయా విద్యార్థులకు ఉచితంగా రవాణా సౌకర్యం ద్వారా తాత్కాలిక యాక్సెస్ కల్పించాలి.

ఇక సోషల్ యాక్సెస్ రెండు రకాలు 1) ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మూగ, బధిర, అంధ పాఠశాలలు(బ్రెయిలీ) ఏర్పాటు చేయాలి. అయితే మానసిక విచలితులు, మానసిక ఎదుగుదల లేని పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా గుర్తించినా, వారికి సోషల్ యాక్సెస్ పాఠశాలల కంటే ఫిజికల్ యాక్సెస్ పాఠశాలల్లో ఉంచడమే సరైన విధానం. ఎందుకంటే వారికి తల్లిదండ్రుల ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. 2) మాతృభాషాపరమైన, సాంస్కృతికపరమైన వైవిధ్యం కలిగిన వారికి ప్రత్యేక పాఠశాలలు. ఉదాహరణకు ఏకలవ్య పాఠశాలలు. ఈ రెండు యాక్సెస్ పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. విద్యాహక్కు చట్టం–2009 కూడా 5–14 సంవత్సరాల పిల్లల విద్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పింది.

అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాలు; చైనా, రష్యా లాంటి సోషలిస్టు దేశాల్లో కూడా ఆవాస ప్రాంతాలవారీగా ఏకీకృత పాఠశాల వ్యవస్థ అదీ ప్రభుత్వ రంగంలోనే అందుబాటులో ఉంది. కానీ, మన దేశంలోనే విద్యను ఆవాస ప్రాంత నియంత్రణ, నియమాలు లేకుండా విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాల వ్యవస్థను అనుమతించడం వల్ల విద్యావ్యవస్థ వెర్రితలలు వేసింది. ఒకే ఆవాస ప్రాంతంలో అవసరాలకు మించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు విద్యార్థుల నమోదు, స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ఎంతసేపూ విద్యా మార్పులు పేరుతో మరో తప్పుడు వైఖరి వైపే పాలకులు మొగ్గుచూపుతున్నారు.


తెలంగాణలో 30,022 ప్రభుత్వ బడుల్లో ఇప్పటికే నాలుగు వేల పాఠశాలలు మూతపడ్డాయి. తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలోని గణాంకాల ననుసరించి 19వేల ప్రాథమిక పాఠశాలల్లో 13వేలు... 50 మంది కంటే తక్కువ నమోదుతో కొనసాగుతున్నాయి‌. ఉన్నత పాఠశాలలు 5,500, ప్రాథమికోన్నత పాఠశాలలు 4,100లో కూడా మూడింట రెండొంతులు అదే స్థాయిలో ఉన్నాయి. 19లక్షల విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతుంటే, 36లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుతున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా అత్యధిక విద్యార్థులున్న ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించకుండా, ప్రభుత్వ బడులను అవసరమైన మార్పులతో సంస్కరించకుండా చేపట్టే చర్యలేవీ నిర్దిష్ట ఫలితాలు ఇవ్వవు.

నాణ్యమైన ఉచిత విద్య ప్రభుత్వ బడిలో దొరుకుతుందనే గట్టి నమ్మకం మాత్రమే ప్రభుత్వ విద్యా సంస్థలలో నమోదు పెంచుతుంది. కాబట్టి ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆవాస ప్రాంతం వారీగా ఏకీకృత కామన్ పాఠశాల వ్యవస్థకు రూపకల్పన చేయాలి. అంతేగాక, ఆవాస ప్రాంతంలో ప్రైవేటు విద్యా సంస్థలను నిషేధించాలి లేదా నియంత్రణ చర్యలు చేపట్టాలి. నిజంగా పాలకవర్గాలు ఈ పనిని చిత్తశుద్ధితో చేయగలిగితే విద్యా సమానత, విద్యా ప్రజాస్వామికీకరణ, అంతరాలు లేని శాస్త్రీయ విద్య అందుబాటులోకి వస్తుంది. కామన్ స్కూల్ విధానం మాత్రమే ప్రజలకు ఏకైక విద్యా ప్రత్యామ్నాయం.

ఎన్. తిర్మల్

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 03:54 AM