Share News

‘సీఎం విజయ్‌’ చరిత్రలో నిలిచిపోవాలంటే!

ABN , Publish Date - May 27 , 2026 | 01:02 AM

తమిళనాడు ముఖ్యమంత్రిగా మీరు సాధించిన అసాధారణ విజయానికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలు మీ నాయకత్వంపై అపారమైన నమ్మకాన్ని ఉంచారు. వారి జీవితాలను మెరుగుపరచడానికి,...

‘సీఎం విజయ్‌’ చరిత్రలో నిలిచిపోవాలంటే!

తిరు సి. జోసెఫ్ విజయ్,

తమిళనాడు ముఖ్యమంత్రి గారికి

తమిళనాడు ముఖ్యమంత్రిగా మీరు సాధించిన అసాధారణ విజయానికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలు మీ నాయకత్వంపై అపారమైన నమ్మకాన్ని ఉంచారు. వారి జీవితాలను మెరుగుపరచడానికి, సమ్మిళిత అభివృద్ధితో కూడిన పరిపాలనా నమూనాను నిర్మించడానికి మీ పదవీ కాలం ఒక చారిత్రాత్మక అవకాశం. నేను రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని, తెలంగాణ విద్యాకమిషన్‌ చైర్మన్‌గా ఇటీవలి వరకు పనిచేశాను. ప్రజా పరిపాలనలో విస్తృతంగా పనిచేసిన అనుభవంతో రాబోయే ఐదేళ్లలో మీ ప్రభుత్వ దిశానిర్దేశాన్ని రూపొందించడంలో ఉపయోగపడే కొన్ని సూచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

కొత్తగా ఎన్నికైన నాయకులు తరచుగా ఐఏఎస్‌ అధికారులపై ఎక్కువ ఆధారపడతారు. అయితే ఎందరో నిజాయితీ, సామాజిక నిబద్ధత, ధైర్యం ఉన్న అధికారులు ఉన్నట్టే, మరెందరో నిర్ణయాలు తీసుకోవడానికి భయపడుతూ యథాతథ స్థితిని కొనసాగించేవారు, లేదా మితిమీరిన బ్యూరోక్రాటిక్ ధోరణితో వ్యవహరించేవారు కూడా ఉన్నారు. అందువల్ల పోస్టింగ్‌లు, బదిలీలను అధికారుల సమర్థతలకు అనుగుణంగా కేటాయించాలి. రెవెన్యూ, జీఎస్టీ, విద్యుత్ వంటి శాఖలకు నిబంధనలు అమలు చేయగల అధికారులు అవసరమైతే, విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖలకు మానవీయ కోణం, సంక్షేమ దృక్పథం ఉన్న అధికారులు కావాలి.

మీ ప్రభుత్వం ఒకేసారి చాలా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం కంటే, పరిమిత సంఖ్యలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే అంశాలపై దృష్టి సారించాలి. కొన్ని ముఖ్యమైన సంస్కరణలను వచ్చే ఐదేళ్ళలో అమలు చేస్తే అవి తమిళనాడులో పరిపాలనా నాణ్యతను, ప్రజల జీవితాలను మార్చగలవు.


1. తమిళనాడులో పెద్ద సంఖ్యలో పాఠశాలలు ఉన్నప్పటికీ, వాటిలో ఎక్కువ పాఠశాలలు చాలా చిన్నవిగా, నాణ్యమైన విద్యను అందించడానికి తగిన వనరులు లేనివిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి బ్లాక్‌లో 6–8 పాఠశాలలను గుర్తించి, వాటిని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేలా తమిళనాడు పబ్లిక్ స్కూల్స్‌గా అభివృద్ధి చేయవచ్చు. ప్రతి పాఠశాలలో కనీసం 5 ఎకరాల స్థలం, నాణ్యమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా సౌకర్యాలు, వంటశాలలు, డైనింగ్ హాళ్లు, డిజిటల్ లెర్నింగ్ టూల్స్, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం ఉండాలి. ఈ పాఠశాలలు నర్సరీ నుండి తొమ్మిది వరకు ఇంగ్లీష్‌ మాధ్యమంలో విద్యను అందించాలి. సుమారు 1,500–2,000 మంది విద్యార్థులకు సేవలందించాలి. అదేవిధంగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాలను మంచి ప్రమాణాలతో ఆధునీకరించాలి. విశ్వవిద్యాలయాలకు మెరుగైన విద్యా స్వయంప్రతిపత్తిని కల్పించాలి, ఆధునీకరించాలి. ఫ్యాకల్టీ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి.

2. వైద్యానికి పెట్టే ఖర్చులు ఎన్నో కుటుంబాలను అప్పులపాలు చేసి పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అర్హులైన వైద్యులు, సిబ్బంది, ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులతో సమానమైన ఆధునిక పరికరాలతో సూపర్–స్పెషాలిటీ ప్రమాణాలతో మార్చవచ్చు. ఈ ఆసుపత్రులలో నిపుణులైన వైద్యులకు మార్కెట్‌లో ఉన్న జీతాలను ఇవ్వాలి. సమర్థవంతంగా అమలు చేస్తే ఇది జిల్లాల్లో ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. రాష్ట్రం ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లలో ఒకటి నిరుద్యోగం. పెద్ద సంఖ్యలో చదువుకున్న యువతకు ఫార్మల్ డిగ్రీలు ఉన్నప్పటికీ ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు లేవు. నిరుద్యోగ యువతను వారి అర్హతలు, నైపుణ్యాలతో కేంద్రీకృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేయడానికి రాష్ట్రవ్యాప్త ‘స్కిల్ బ్యాంక్’ను ఏర్పాటు చేయవచ్చు. యజమానులు ఈ వ్యవస్థ ద్వారా నేరుగా అభ్యర్థులను రిక్రూట్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్, నర్సింగ్, అగ్రికల్చర్, ఫార్మా, నిర్మాణ రంగం, జనరల్ డిగ్రీ నేపథ్యాలు ఉన్న గ్రాడ్యుయేట్లు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్‌తో సహా ఉపాధి నైపుణ్యాలపై నాలుగు నుండి ఆరు నెలల పాటు నిర్మాణాత్మక శిక్షణ ఇప్పించాలి.

4. నాణ్యమైన విత్తనాల కొరత, నిల్వ చేసే మౌలిక సదుపాయాలు సరిపోకపోవడం, బలహీనమైన మార్కెట్ సదుపాయం, దళారీల దోపిడీ వంటి తీవ్రమైన నిర్మాణాత్మక సవాళ్లను రైతులు ఎదుర్కొంటున్నారు. కోల్డ్ స్టోరేజీలు, వేర్‌హౌస్‌లు, ఫుడ్–ప్రాసెసింగ్ పరిశ్రమలు, బలమైన అగ్రికల్చరల్ కోఆపరేటివ్‌ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ సంస్కరణలను చేపట్టవచ్చు. ఒక ప్రత్యేక ధాన్య సేకరణ యంత్రాంగం రైతులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించాలి. దీర్ఘకాలిక వ్యవసాయ సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించడానికి ఒక పెద్ద ‘రైతు అభివృద్ధి నిధి’ (ఫార్మర్స్ డెవలప్‌మెంట్ ఫండ్)ను ఏర్పాటు చేయవచ్చు.


5. పోలీస్ స్టేషన్లు అవినీతి సంస్థలుగా చెడ్డపేరు తెచ్చుకున్నాయి. పోలీసు వ్యవస్థను పౌర–స్నేహపూర్వక వ్యవస్థగా మార్చాల్సిన అవసరం ఉంది. పౌరులు డిజిటల్ సేవా కేంద్రాల (మీ సేవ) ద్వారా ఫిర్యాదులను సమర్పించగలిగేలా ఉండాలి. వాటిని ఎఫ్‌ఐఆర్‌లా మార్పు చేసే పద్ధతి ఉండాలి. ఎఫ్‌ఐఆర్‌ల నమోదును పారదర్శకంగా పర్యవేక్షించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. పోలీసింగ్‌లో రాజకీయ జోక్యాన్ని గణనీయంగా తగ్గించాలి.

6. విజిలెన్స్, అవినీతి నిరోధక సంస్థలను కఠినమైన జవాబుదారీ విధానాలతో బలోపేతం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఏటా తమ ఆస్తి ప్రకటనలను సమర్పించాలి, వీటిని స్వతంత్ర సంస్థ పర్యవేక్షించాలి. పేరున్న విశ్రాంత అధికారులు, పౌర సమాజ ప్రతినిధులతో ‘యాంటీ కరప్షన్ కమిషన్’ను ఏర్పాటు చేయవచ్చును. అన్ని ప్రభుత్వ సంస్థల లావాదేవీలు, ఆమోదాలను పారదర్శక డిజిటల్ వ్యవస్థల్లోకి అనుసంధానించాలి.

7. రాష్ట్రంలో 10–15శాతం కుటుంబాలు స్థిరమైన నివాసం, పోషకాహారం లేదా జీవనోపాధి లేక తీవ్ర పేదరికంలో జీవిస్తున్నాయి. ప్రభుత్వం ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి ఐదేళ్ల ప్రత్యేక మిషన్‌ను ప్రారంభించవచ్చు. ప్రాథమిక రెండు గదుల ఇల్లు, ఉచిత విద్యుత్ కనెక్షన్లు, రాయితీతో కూడిన ఎల్పీజీ సదుపాయం, బియ్యం కార్డులు, ప్రత్యేక హెల్త్ కార్డులు, చిన్న వ్యాపారాల కోసం జీవనోపాధి గ్రాంట్లు, పిల్లలకు రెసిడెన్షియల్ విద్యా మద్దతు వంటివి అందించాలి.

8. ఉపాధి కల్పనకు, ఆర్థికవృద్ధికి పారిశ్రామికీకరణ కీలకం. అభివృద్ధి కేవలం కొన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా జిల్లాల అంతటా విస్తరించాలి. రాష్ట్రంలో ముఖ్యమైన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లపై దృష్టి సారించి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్‌ను రూపొందించవచ్చు. విమానాశ్రయాల విస్తరణ, సమగ్ర పారిశ్రామిక మండలాలు పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడతాయి. సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ఒక సంస్థాగత రూపంలోకి తీసుకురావాలి.

9. మీ మొదటి పదవీ కాలంలో కనీసం 10శాతం గ్రామాలు, మున్సిపాలిటీలను మంచి ప్రమాణాలతో కూడిన మోడల్ ‘స్మార్ట్ విలేజ్’, ‘స్మార్ట్ మున్సిపాలిటీలు’గా మార్చవచ్చు. ఈ ప్రాంతాలు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రోడ్లు, ప్రజారవాణా, వ్యర్థాల నిర్వహణ, ఆసుపత్రులు, పాఠశాలలు, పోలీసింగ్, పబ్లిక్ పార్కులు, డిజిటల్ గవర్నెన్స్‌లో ఉన్నత ప్రమాణాలను ప్రదర్శించాలి.


10. అభివృద్ధి విధానంలో మహిళా సాధికారత ప్రధాన కేంద్రంగా ఉండాలి. మహిళల ఆర్థిక భాగస్వామ్యానికి, సామాజిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు (SHGs) బలమైన సాధనాల్లో ఒకటిగా కొనసాగుతున్నాయి. పొదుపు సంఘాల ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేయాలి. రుణాలు, రాయితీలు అప్పుల భారంగా కాకుండా ఉత్పాదక ఆస్తులుగాను స్థిరమైన జీవనోపాధిగాను మారేలా చూడటంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచే నాయకులను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీ పదవీ కాలం నిజాయితీ, ధైర్యం, పరివర్తనాత్మక ప్రజా సేవకు నిదర్శనంగా గుర్తుండిపోతుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.

ఆకునూరి మురళి

ఐఏఎస్ (రిటైర్డ్)

ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

Updated Date - May 27 , 2026 | 01:02 AM