మన ‘బొద్దింక’లకు చైనా ‘ఎలుకలు’ ప్రేరణా?
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:05 AM
కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో బాగానే అలజడి చేసింది. మన దేశంలో కూడా బంగ్లాదేశ్, నేపాల్‌లలో లాగా ఒక యువజన విప్లవం వస్తుందనీ, ప్రభుత్వం కుప్పకూలుతుందని కూడా ఆశించినవాళ్ళు లేకపోలేదు. దీన్ని...
కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో బాగానే అలజడి చేసింది. మన దేశంలో కూడా బంగ్లాదేశ్, నేపాల్‌లలో లాగా ఒక యువజన విప్లవం వస్తుందనీ, ప్రభుత్వం కుప్పకూలుతుందని కూడా ఆశించినవాళ్ళు లేకపోలేదు. దీన్ని ఒక గొప్ప ఉద్యమంగా చిత్రించడంలో ఎవరి పాత్ర ఉంది అన్నది ఒక ప్రశ్న.
ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా గల దేశాలు చైనా, భారత్‌లు. మనం చైనాను కూడా దాటి వెళ్ళాం. మన దేశంలో దాదాపు నలభై లక్షలమంది గ్రాడ్యుయేట్లు ప్రతి ఏటా యూనివర్సిటీల నుంచి బయటకు వస్తున్నారని ఒక లెక్క. చైనాలో దాదాపు పన్నెండు లక్షలమంది యువతీ యువకులు ప్రతి ఏటా గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. గత నాలుగైదేళ్ళుగా అక్కడ ఈ పరిస్థితి ఒక సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. ఉత్పత్తి రంగంలో ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా పిలవబడే చైనాలో యువతీ యువకులు ఒక విచిత్ర ధోరణిలో తమ నిరసనను తెలుపుతున్నారు. చైనా ప్రభుత్వం అనుసరించే ఐరన్ బౌల్ పాలసీలో (Iron Bowl Policy) ఉద్యోగం ఉంటుంది కానీ అతి తక్కువ జీతంతో అతి ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తుంది. అక్కడి 9–9–6 అనే విధానంలో వారంలో ఆరు రోజులు ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు పని చేయాలి. ఇటీవల కాలంలో యూనివర్సిటీల సంఖ్య పెరగడం వల్ల, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసినవాళ్ళు చాలామంది మార్కెట్‌లోకి రావడం వల్ల వారికి ఇలాంటి ఉద్యోగాలు నచ్చడం లేదు. వారు తమ నిరసనలు ఏ విధంగా తెలపాలి? నిరసన తెలుపడానికి బదులు వాళ్ళు కేవలం ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రులపై ఆధారపడి తల్లిదండ్రులకు ఇంటి పనులలో తోడ్పడుతూ ఉండడానికే నిశ్చయించుకున్నారు. 2021లో ‘ఊరికే ఉండడమే న్యాయం’ (lying flat is justice) అని ఒక స్లోగన్ సోషల్ మీడియాలో వచ్చింది. యువత అంతా దానికి అనుకూలంగా స్పందించింది. ఆ తర్వాత మరొక స్లోగన్ ‘సమాజం కుళ్ళిపోనీ’ (let it rot) అంటూ వచ్చింది. 2025లో ఈ యువతరం వారు తమని తాము ‘ఎలుకలు’ (rat people) అని పిలుచుకోవడం ప్రారంభించారు. ఎలుకలు ఎలాగైతే కలుగులో ఉంటూ ఒక దరిద్ర జీవనాన్ని గడుపుతుంటాయో అలాగే తాము కూడా తమ గదుల్లో ఉంటూ అతిసరళమైన జీవన శైలిలో బతికేయాలన్నది ఈ చైనా యువత ఉద్దేశం. బహిరంగంగా ఆందోళనలు చేస్తే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుంది కాబట్టి వారు కేవలం ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియాలో తమ భావాలను పంచుకుంటూ, మానసిక స్వేచ్ఛను పొందడానికి నిశ్చయించుకున్నారు. ఇది ప్రభుత్వ విధానాలకు ఒక రకమైన సహాయ నిరాకరణ ఉద్యమం. అక్కడి జిన్ పింగ్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. దేశభక్తిని పెంచుకోవాలని చెబుతోంది. ప్రభుత్వం చెప్పిన మాట యువత వినడం లేదు. చైనాలో దీని సామాజిక పరిణామాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. వివాహాల సంఖ్య పడిపోతోంది, జనాభా తగ్గుతోంది. వివాహం వద్దు, పిల్లలు వద్దు, సొంత ఇల్లు వద్దు అని యువత ఈ మూడింటిని నిరాకరిస్తోంది. ‘ఊరికే పడుకోవడమే న్యాయం’ అనే నినాదం వల్ల ఉత్పత్తి రంగం కూడా దెబ్బతినే పరిస్థితిలో ఉంది.
చైనా లాగానే అత్యధిక యువత ఉన్న దేశం మనది. ప్రపంచంలో చాలా దేశాల కంటే జీడీపీ క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇక్కడి యువతలో చైనాలో వచ్చిన రీతిలో గొప్ప అలజడి ఏమీ రాలేదు. ఏమీ అలజడి లేకపోవడం రాజకీయ పార్టీలకు ఒక విషమ పరిస్థితి. ఏదైనా పరీక్ష పేపర్ లీక్ కావడం అనేది ఒకప్పుడు అతి సాధారణమైన విషయం. అప్పుడెప్పుడూ దేశవ్యాప్త ఆందోళనలు జరగలేదు, కొత్త రాజకీయ పార్టీలు రాలేదు. దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొందరు న్యాయవాదులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యను పూర్తిగా వక్రీకరించి నిరుద్యోగ యువతకు వర్తింప చేశారు. ఆ విధంగా మొదలైన బొద్దింకల వీపులపై స్వారీ చేసి ప్రభుత్వాన్ని దించాలని పార్టీలు ఆశపడడం సహజం. జంతర్ మంతర్ తర్వాత మొదలైన కేసుల విచారణలో కూడా ఇలాంటి విషయాలు బయటపడటాన్ని చూస్తున్నాం.
చైనాలో నిశ్శబ్దంగా వచ్చిన ఉద్యమాన్ని భారతదేశంలోకి దించడంలో ఏ బుద్ధి జీవుల పాత్ర ఉందో తెలియదు. మన దేశంలోని బుద్ధి జీవులకు ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలోని బుద్ధి జీవులు తోడుగా ఉంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. దేశాన్ని బలహీనపరచడం, అంతర్గతంగా విచ్ఛిన్నం చేయడమే ఎజెండాగా ఉన్న బుద్ధి జీవులు అనేకులు ఉన్నారు. అలాంటివారితో పార్టీ స్థాపించడం ఆశ్చర్యమేమీ కాదు.
దాదాపు ఒక సంవత్సరం క్రితం అమెరికాలో ఉన్న ఒక మిత్రుడి ద్వారా నన్ను పరిచయం చేసుకొని ఒకాయన ఇంటర్వ్యూ చేశాడు. ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్న భారతదేశంలో జెన్ జీ విప్లవం వస్తుందా అని. ఒకవేళ వస్తే ఏ విధంగా రావచ్చు, ఏ ఏ శక్తులు కలవచ్చు మొదలైన ప్రశ్నలన్నీ సంధించాడు. భారతదేశంలో ఎలాంటి విప్లవమూ రాదని నేను చెప్పాను. చిన్న దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌లతో మనల్ని పోల్చుకోలేమనీ, ఏ ఒక్క రాజకీయ ఉద్యమమూ విప్లవాన్ని సాధించలేదనీ, ఎవరైనా మహాత్ముడి లాంటి గొప్ప వ్యక్తి ఉంటే ప్రజల్ని ఉత్తేజపరచడం ద్వారా గొప్ప ఫలితాలు సాధించగలడనీ, అందుకు విరుద్ధమైన వ్యక్తి ఐతే దేశాన్ని నాశనం చేయగలడనీ చెప్పాను. బెర్నార్డ్ షా మాటల్లో చెప్పాలంటే మధ్యతరగతి నైతికత (middle class morality) మన సమాజానికి కొంతవరకు రక్ష.
అయితే ప్రస్తుత యువతకు మార్గాంతరం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చైనాలో ఉన్న సమస్య మనకు కూడా ఉంది. విభిన్న వర్గాలు, భాషలు, జాతులు ఉండడంవల్ల సమస్య ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్య దేశం కావడం వల్ల ప్రభుత్వాల ఉనికి మాత్రం ప్రమాదానికి దగ్గరలోనే ఉంటుంది.
అరవిందరావు
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..