Share News

సముద్రం మీద చెరగని సంతకం

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:49 AM

చేరన్ రుద్రమూర్తి గారి ‘టెలిఫోన్ కాల్’ కవితలోని ఈ చివరి పంక్తులు ఇప్పుడు చదువుతుంటే మనసు కలచివేస్తోంది. యుద్ధం, నిర్వాసితత్వం, ప్రేమ, జ్ఞాపకాల మధ్య ఒక కవి సృజనాత్మక...

సముద్రం మీద చెరగని సంతకం

‘‘అయితే యిదే నా ఆఖరి ఫోన్ కాల్.

యిక మేం బయలుదేరాలి’’

చేరన్ రుద్రమూర్తి గారి ‘టెలిఫోన్ కాల్’ కవితలోని ఈ చివరి పంక్తులు ఇప్పుడు చదువుతుంటే మనసు కలచివేస్తోంది. యుద్ధం, నిర్వాసితత్వం, ప్రేమ, జ్ఞాపకాల మధ్య ఒక కవి సృజనాత్మక ప్రయాణం వారి జీవితం.

చేరన్‌ జాఫ్నా విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రం అభ్యసించారు. ఒక కెనడా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేశారు. మనదేశ కాలమానం ప్రకారం ఈ నెల 19న తొలిగడియల్లో కెనడాలో వారి చివరి శ్వాస గాలిలో కలిసిపోయిందని తెలిసినప్పటి నుంచి నా మనసంతా దిగులు. వారి కవిత్వంతో నాకు ప్రత్యేకమైన సాహిత్యానుబంధం ఉంది. వారి కవితలను తెలుగులోకి అనువాదం చేసాను.

1960లో శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతానికి సమీపంలోని అలవెట్టి గ్రామంలో జన్మించిన చేరన్ రుద్రమూర్తి, ఆధునిక తమిళ సాహిత్యంలో విశిష్ట కవిగా ఎదిగారు. తండ్రి టి. రుద్రమూర్తి తమిళ సాహిత్యంలో ‘మహాకవి’గా ప్రసిద్ధులు. అలా సాహిత్య వాతావరణంలో పెరిగిన చేరన్‌కు చిన్ననాటి నుంచే తమిళ సంప్రదాయ కవిత్వంతోపాటు ఆధునిక సాహిత్య ధోరణులతో పరిచయం ఏర్పడింది. కవిగా మాత్రమే గాక పాత్రికేయుడిగా, నాటక రచయితగా, సామాజిక పరిశోధకుడిగానూ వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతి అస్తిత్వం, వలసలు, నిర్వాసితత్వం, జాతీయవాదం, సాంస్కృతిక జ్ఞాపకాలు ఆయన పరిశోధనల్లో ముఖ్యమైన అంశాలు. వారి సాహిత్య జీవితాన్నీ, పరిశోధనా జీవితాన్నీ విడివిడిగా చూడలేం. రెండింటిలోనూ మనిషి అస్తిత్వం, చరిత్ర, అధికార సంబంధాలు, జ్ఞాపకాల పట్ల ఒక నిరంతర అన్వేషణ కనిపిస్తుంది.

చేరన్ కవిత్వంలో సముద్రం ఒక ముఖ్యమైన ప్రతీక. ఆయన బాల్యం గడిచిన నేలకు సముద్రంతో ఉన్న అనుబంధం ఆయన సృజనాత్మక ఊహాశక్తిని ప్రభావితం చేసింది. సముద్రం ఆయన కవిత్వంలో ప్రకృతి సౌందర్యానికి మాత్రమే ప్రతీక కాదు. అది జ్ఞాపకం. ప్రయాణం. వియోగం. దూరం. ఒక్కోసారి మాతృభూమికీ, నిర్వాసిత జీవితానికీ మధ్య నిలిచిన భౌగోళిక సరిహద్దు. మొదట్లో రాసిన కవిత్వంలోని సముద్ర సౌందర్యం– తరువాతి కవిత్వంలో యుద్ధం, హింస, నిర్వాసితత్వం వంటి అనుభవాలతో కొత్త అర్థాలను సంతరించుకుంది. తమిళంలో పదిహేనుకుపైగా పుస్తకాలను వెలువరించిన చేరన్‌ రచనలు దాదాపు ఇరవై భాషల్లోకి అనువాదమైయ్యాయి. లక్ష్మీ హామ్‌స్ట్రోమ్ అనువదించిన ‘ఎ సెకెండ్ సన్‌రైస్’ వారి కవిత్వాన్ని అంతర్జాతీయ పాఠకులకు పరిచయం చేసింది. కవిత్వంతోపాటు ఆయన చేసిన పరిశోధనలు కూడా ముఖ్యమైనవి. ‘హిస్టరి అండ్ ద తమిళ్ డయస్పోర ఇమేజినేషన్’, ‘తమిళ్ కల్చర్ ఇన్ ద గ్లోబల్ కాంటెక్స్‌ట్‌’ మొదలైన ఎన్నో రచనలు, సంపాదకత్వ గ్రంథాలు వారి మేధో ప్రయాణంలోని ముఖ్యమైనవి. ఈ రచనలను చూసినప్పుడు చేరన్ కవిత్వంలో వ్యక్తం చేసిన ప్రశ్నలనే సామాజిక పరిశోధనలో మరొక విధంగా అన్వేషించారని అనిపిస్తుంది. ఒకవైపు కవిత్వంలో మానవ విషాదాన్ని అనుభూతి స్థాయిలో వ్యక్తం చేయటం, మరొకవైపు పరిశోధనతో ఆ విషాదానికి కారణమైన చారిత్రక, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవటం ఈ రెండు ప్రక్రియలూ ఆయన సృజనాత్మక జీవితంలో పరస్పరం సంభాషించుకున్నాయి.


శ్రీలంక తమిళుల చరిత్రలోని యుద్ధం, హింస, నిర్వాసితత్వం చేరన్ కవిత్వానికి ముఖ్యమైన చారిత్రక నేపథ్యం. అయితే వారి కవిత్వంలో యుద్ధం కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు. అది మనిషి జీవితాన్ని, భాషను, జ్ఞాపకాలను, సంబంధాలను, అస్తిత్వాన్ని సమూలంగా మార్చివేసే అనుభవం. యుద్ధం గురించి రాయటమంటే కేవలం విధ్వంసాన్ని వర్ణించటం కాదు. ఆ విధ్వంసంలో కనిపించకుండా పోయిన మనుషులను తిరిగి గుర్తించటం. చరిత్ర నమోదు చేయని వారి జీవితాలను జ్ఞాపకాల్లో నిలబెట్టటం. నేను తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసిన వారి కవిత ‘పిల్లలు స్త్రీలు పురుషుల ఛాయాచిత్రాలు’ ఈ దృక్పథానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ:

‘‘ప్రతి హత్యకి వొక కథ వుంది

ప్రతి కథకి జ్ఞాపకాలు వున్నాయి

ప్రతి హత్య చరిత్రా తాజాగానే వుంది

కానీ వారి గొంతులు వినపడవ్.’’ – యుద్ధంలో మరణించినవారు చరిత్రకు సంఖ్యలు కావచ్చు. ఛాయాచిత్రాలు కావచ్చు. అధికారిక నివేదికలకు గణాంకాలు కావచ్చు. కానీ వాళ్లు ఒకప్పుడు జీవించిన మనుషులు. వాళ్లకు పేర్లు ఊర్లు ఉన్నాయి, కలలు, ప్రేమలు ఉన్నాయి. భవిష్యత్తుపై ఆశలున్నాయి. ఆ జీవితాలన్నీ ఒక హింసాత్మక చారిత్రక సందర్భంలో అంతమైపోయాయి. అయితే వారి మరణంతోపాటు వారి జీవితాల జ్ఞాపకాలు కూడా అంతమైపోవాలా? చేరన్ ఈ ప్రశ్నను అత్యంత మానవీయంగా మన ముందుంచుతారు.

మరణానికి ముందు ఫోన్ కాల్‌లో సంభాషణగా సాగే ‘టెలిఫోన్ కాల్’ కవితను శ్రీలంక అంతర్యుద్ధం చివరి దశలోని మానవ విషాదాన్ని గుర్తుచేసే చారిత్రక సందర్భం నేపథ్యంగా చదవాలి.

‘‘మేం తెల్ల జెండాలని యెగరవేసాం.

వాగ్ధత్త సందేశం కోసం

యెదురు చూస్తున్నాం.

దాని జాడే లేదు.’’ తెల్లజెండా ఇక్కడ ఒక సాధారణ దృశ్యం కాదు. అది ప్రాణరక్షణ కోసం చేసే అభ్యర్థన. మరణానికి అతిసమీపంలో ఉన్న మనుషులు ఒక సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సందేశం రాకపోవటంలోని నిశ్శబ్దమే కవితలో భయంకరవిషాదంగా మారుతుంది. ఆఖరి ఫోన్ కాల్ అంటే కేవలం ఒక సంభాషణ ముగియటం కాదు. ప్రపంచంతో మనిషికి మిగిలిన చివరి సంబంధం కూడా తెగిపోవటం. ఇక్కడ శాటిలైట్ టెలిఫోన్ ఒక సాంకేతిక పరికరం మాత్రమే కాదు. జీవితానికీ మరణానికీ మధ్య మిగిలిన చివరి సంభాషణ దారం. ఆ దారం కూడా తెగిపోయిన తర్వాత మిగిలేది నిశ్శబ్దమే. చేరన్ కవిత్వం ఆ నిశ్శబ్దానికి గొంతునిస్తుంది.


చేరన్ కవిత్వంలో మరో ముఖ్య అనుభవం నిర్వాసితత్వం. యుద్ధం మనుషులను వారి మాతృభూమి నుంచి దూరం చేస్తుంది. కానీ ఒక మనిషి తన నేలను విడిచి వెళ్లినప్పుడు కోల్పోయేది కేవలం భౌగోళిక ప్రదేశాన్ని మాత్రమే కాదు. తన జీవితానికి అర్థాన్నిచ్చిన పరిసరాలను, భాషను, సాంస్కృతిక జ్ఞాపకాలను, తన ఉనికిని గుర్తించిన మనుషులను కూడా. అది జ్ఞాపకంగా మిగులుతుంది. కలగా తిరిగి వస్తుంది. ఒక్కోసారి తిరిగి చేరుకోలేని ప్రదేశంగా అతన్ని వెంటాడుతుంది. చేరన్ కవిత్వంలో ఈ నిర్వాసిత అనుభవం కేవలం వ్యక్తిగతవేదన కాదు. ఒక సమూహపు చరిత్రతో ముడిపడిన అనుభవం. అయితే చేరన్ కవిత్వాన్ని కేవలం యుద్ధం, నిర్వాసితత్వం, రాజకీయ హింస అనే అంశాలకే పరిమితం చేయలేం.

వారి ప్రేమ కవిత్వంలో మరొక సంక్లిష్టమైన సృజనాత్మక ప్రపంచం ఉంది. ప్రేమ, వాంఛ, వియోగం, అపరాధభావం, సాన్నిహిత్యం, దూరం, మానవ సంబంధాల్లోని అసంపూర్ణత ఇవన్నీ వారి ప్రేమ కవిత్వంలో అత్యంత సున్నితంగా వ్యక్తమవుతాయి. నేను అనువదించిన ‘తిరిగిఛై’ కవిత ఈ దృక్పథానికి ఒక ఉదాహరణ:

‘‘యేమని నీకు తిరిగి పంపించను

మోహంలో జనించిన

రాగ తీవ్రతనా

నువ్వు

వదిలి వెళ్ళిన,

వడలిపోయిన,

వేడిలేని చిరునవ్వునా?’’ ఈ కవితలో ప్రేమ ముగిసిన తర్వాత మనిషి తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు.

ఒక అనుబంధం ముగిసిన తర్వాత మనం మరొక మనిషికి ఏమి తిరిగి ఇవ్వగలం? పంచుకున్న జ్ఞాపకాలనా? వాంఛలనా? అనురాగాన్నా? ఒకప్పుడు మన మధ్య ఉన్న సాన్నిహిత్యాన్నా? ప్రేమను ఒక వస్తువులా తిరిగి అప్పగించగలమా? ప్రేమలో మనం మరొక మనిషికి ఇచ్చేది యేంటి? ఆ అనుభవంలో మనం కోల్పోయేది ఏమిటి? ఈ ప్రశ్నలు కవితలో అంతర్లీనంగా కనిపిస్తాయి.

‘పిల్లలు స్త్రీలు పురుషుల ఛాయాచిత్రాలు’ కవితలో మనుషులు తమ జీవితాలను కోల్పోతారు. వారి కుటుంబాలు వారిని కోల్పోతాయి. చరిత్ర వారి ఉనికిని కూడా చెరిపేయాలని ప్రయత్నిస్తుంది. ‘టెలిఫోన్ కాల్’ కవితలో మనుషులు జీవించే అవకాశాన్ని, ప్రపంచంతో సంభాషించే చివరి సంబంధాన్ని కోల్పోతున్నారు. ‘తిరిగిఛై’ కవితలో ప్రేమించిన మనుషులు తమ సాన్నిహిత్యాన్ని, పరస్పర విశ్వాసాన్ని, ఒకప్పుడు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని కోల్పోతున్నారు. అయితే ఈ మూడు రకాల కోల్పోవటాలూ ఒకే స్వభావం కలిగినవి కావు. చేరన్ గారి ఈ మూడు కవితలను కలిపి చదివినప్పుడు కోల్పోవటం అనే అనుభవం ముఖ్యమైన అంతస్సూత్రం కనిపిస్తుంది.


యుద్ధం సృష్టించే సామూహిక విషాదానికీ, ప్రేమలోని వ్యక్తిగత వియోగానికీ మధ్య చారిత్రకమైన, నైతికమైన తేడాలున్నాయి. ఆ తేడాలను చెరిపేయకుండా, వాటి ప్రత్యేకతను నిలుపుకుంటూనే మనిషి అనుభవంలోని సంక్లిష్టతను చేరన్ కవిత్వం వ్యక్తం చేస్తుంది. ఆయన రాజకీయ కవిత్వంలో మానవీయ సున్నితత్వం ఉంది. ప్రేమ కవిత్వంలో అంతరంగ వైరుధ్యాల పట్ల లోతైన అవగాహన ఉంది. ఒకవైపు సామూహిక జ్ఞాపకాలను కాపాడాలనే తపన. మరొకవైపు వ్యక్తిగత అనుభవంలోని అసంపూర్ణతను అర్థం చేసుకోవాలనే అన్వేషణ. ఈ రెండింటి మధ్య చేరన్ సృజనాత్మక ప్రపంచం విస్తరించి ఉంది. చేరన్ కవిత్వాన్ని తెలుగులోకి అనువాదం చేయటం నాకు విలువైన సాహిత్యానుభవం.

ఇప్పుడు ఆయన లేరన్న వార్త తెలిసిన తర్వాత ఆ అనుబంధాలన్నీ జ్ఞాపకాలుగా తిరిగి వస్తున్నాయి. ఆయన కవిత్వంలో జ్ఞాపకం కేవలం గతానికి సంబంధించినది కాదు. వర్తమానాన్ని ప్రశ్నించే శక్తి కూడా. మనం ఎవరిని గుర్తుంచుకుంటాం? ఎవరిని మర్చిపోతాం? ఎవరి మరణాలను చరిత్రలో నమోదు చేస్తాం? ఎవరి గొంతులను వినిపించకుండా వదిలేస్తాం? ఈ ప్రశ్నలు చేరన్ కవిత్వాన్ని చదువుతున్నంతసేపూ మనల్ని వెంటాడుతాయి.

యుద్ధంలో మరణించినవారి గొంతులను, నిర్వాసిత జీవితాల వేదనను, ప్రేమలోని సున్నితమైన వైరుధ్యాలను, మనిషి అస్తిత్వంలోని విషాదాన్ని ఆయన కవిత్వం కొత్త పాఠకులకు చేరవేస్తూనే ఉంటుంది.

కుప్పిలి పద్మ

98663 16174

ఈ వార్తలూ చదవండి

కేంద్ర మంత్రి జైశంకర్‌తో నేపాల్ ప్రధాని బలేంద్ర షా భేటీ..

ఎమ్మెల్యే అసభ్య మెసేజీలు పెట్టినట్టు ఆరోపణ.. మద్రాస్ హైకోర్టు సీరియస్

Updated Date - Nov 23 , 2026 | 01:49 AM