జగన్ అరాచకీయమే కూటమికి రక్ష!
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:24 AM
జగన్ పాలనలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండింది. పోలీసు తాలింపు పెట్టిన కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు, దాడులు, బూతులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ అరాజకీయ...
జగన్ పాలనలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండింది. పోలీసు తాలింపు పెట్టిన కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు, దాడులు, బూతులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ అరాజకీయ చరిత్రకు ఫుల్‌స్టాప్ పెట్టి, నిలువెల్లా తగలబడిపోతున్న రాష్ట్రాన్ని కాపాడిన నేతగా నిస్సందేహంగా నారా చంద్రబాబు నాయుడు భావితరాలకు గుర్తుండిపోతారు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చట్టపరంగా అరాచకశక్తుల పీచమణిచే తిరుగులేని అధికారం ఆయన కనుసన్నలలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆ బాట పట్టలేదు. ఈ ఊహాతీత సంయమనం అటు తెలుగుదేశ శ్రేణులకూ, ఇటు సామాన్య జనానికీ మింగుడుపడలేదు. రాష్ట్రాన్ని చెరబట్టినవారిని వారి పాపాలకు వదిలేసి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు. అందుకే, రాష్ట్రంలో ఈ రోజు ప్రశాంత జీవన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ పార్టీ నేతలు తరచుగా ప్రస్తావించే ‘రెడ్ బుక్’కు బూజు పట్టడానికి కూడా కారకులు చంద్రబాబు నాయుడే. ఆయన శాంతికాముక, అభివృద్ధి మైండ్‌సెట్ కారణంగానే ఆ పుస్తకానికి పనిలేకుండా పోయింది.
అందుకే అరాచక శక్తులకు మళ్ళీ ధైర్యం వచ్చింది. బలం కూడదీసుకుని నోటితో దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగిన కుటుంబ పరిస్థితులకు ఫ్యాక్షన్ నేపథ్యం లేకపోవడం; ఆయన యూనివర్సిటీ స్థాయిలో చదువుకుని ఉండడం; ఆంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ కుమార్తెను వివాహమాడడం; ప్రజల మధ్యనే తొలి నుంచీ మసలడం; జాతీయ స్థాయి నేతలతో సాంగత్యం; అబ్దుల్ కలాం, వాజపేయి దగ్గరి నుంచి చండ్ర రాజేశ్వరరావు, ఇంద్రజిత్ గుప్తా, ఏచూరి సీతారామ్... ప్రకాశ్ కారత్ వంటి కమ్యూనిస్ట్ యోధానుయోధులతోపాటు, ములాయంసింగ్ యాదవ్ వంటి జాతీయ స్థాయి నేతలతో భుజం భుజం కలిపి రాజకీయాలలో పనిచేసే అవకాశం లభించడం... ఇలాంటి రాజకీయ, జీవితానుభవాలు ఆయన వ్యవహార శైలిని ఉన్నతంగా తీర్చిదిద్దాయి. నేలబారు, చిల్లర, దిగజారుడు రాజకీయాలకు ఆయనను దూరంగా ఉంచాయి.
ఒక గంట ఖాళీ దొరికితే రాష్ట్రానికి ఏమి అదనపు సదుపాయం కల్పించాలా, ఏ సాంకేతికతను కొత్తగా పరిచయం చేయాలా అని ఆయన ఆలోచన చేస్తుంటే, ఆయన ప్రత్యర్థులు మాత్రం ఉన్న సమయాన్నంతా చంద్రబాబు నాయుడు మీదా, లోకేశ్ మీదా ఎలా బురద గుమ్మరించాలా అని ఆలోచించటానికే వెచ్చిస్తున్నారు. వారిద్దరి చుట్టూ తిరగడమే రాజకీయం అన్న స్థాయిలోనే ప్రత్యర్థుల ఆలోచన ఆగిపోయింది. రాష్ట్రం మంచి చెడ్డలు వారి ఆలోచనా పరిధికి అందనంత దూరంగా ఉండిపోయాయి. ఇటువంటి వారిని కూడా సహించి రాగద్వేషాలకు అతీతంగా తన పని తాను క్రియాశీలకంగా చేసుకుపోవడం చూస్తుంటే నేడు చంద్రబాబు నాయుడు కోపతాపాలు జయించిన ఒక మహర్షి లాగా కనిపిస్తున్నారు.
ఆయన హయాంలో ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా కంటి మీద కునుకు తీస్తున్నారు. అర్ధరాత్రుళ్లు అపరాత్రుళ్లు ఏ ఆగంతుకులో, పోలీసులో గోడలు దూకో, తలుపులు బద్దలు కొట్టో ఇళ్లల్లోకి దూరి తమను నిద్ర మంచాల మీద నుంచే ఎత్తుకుపోతారేమోనన్న భయం ఇప్పుడు లేదు. పోలీసులు జనం మీద అకారణంగా పడడం లేదు. దళితుల మీదైనా సరే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైళ్లకు పంపడం మన పోలీసులకు తెలిసిన విద్యే అయినా, ఆ అరాచకాలు ఇప్పుడు వినపడటం లేదు. ఫిర్యాదులు ఇవ్వడానికి వెళ్ళే బాధితుల మీదే ఎదురు కేసులు పెట్టి లాకప్‌లలో వేయడం లేదు. వారి పాత బాసుల హయాంలో లాగా పోలీసులు అరాచకావతారాల్లో తాండవం చేయడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఏ ప్రజాస్వామిక వ్యవస్థలోనైనా సామాన్య ప్రజలకు కావలసింది తమను వేధించని, భయపెట్టని ప్రభుత్వ యంత్రాంగం. తమ బతుకులు తమను స్వేచ్ఛగా, నిర్భీతిగా బతకనిచ్చే రాజకీయ వ్యవస్థ. ఆ స్వేచ్ఛా వాయువులే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్భయంగా పీలుస్తున్నారు. జగన్ బృందం చేష్టలు, మాటలు, ఆరోపణలు చూస్తున్న ప్రజలకు ఒక క్లారిటీ వస్తున్నది. గత పాపాలపై అయిదు పైసల పశ్చాత్తాపం కూడా జగన్ బృందంలో కనపడదు. వాళ్ళను మళ్ళీ అడుగుపెట్టనిస్తే రాష్ట్రం రావణకాష్టం అయిపోతుంది. ‘రాజకీయ నేతలు’ అనే నిర్వచనం అసలు వీరికి వర్తించదు. 2019కి ముందు ప్రజల్లో ఇలాంటి స్పష్టత లేదు. ఇప్పుడు ఎవరేమిటో తెలిసింది. ఇప్పుడు ‘జగన్ నెవర్ అగైన్’ అంటూ ఎవరూ ప్రత్యేకంగా నినాదాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ శ్రమేదో జగన్ బృందమే పడుతున్నది కదా!
భోగాది వేంకటరాయుడు
ఇవి కూడా చదవండి..
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి