సీబీఎన్... ఆ పేరే ఒక బ్రాండ్!
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:42 AM
చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ. ఆయనను అర్థం చేసుకోవడం అంటే కేవలం రాజకీయాలను అర్థం చేసుకోవడం కాదు, భవిష్యత్తును ఎలా నిర్మించాలో తెలుసుకోవడం. సాధారణ నాయకులు...
చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ. ఆయనను అర్థం చేసుకోవడం అంటే కేవలం రాజకీయాలను అర్థం చేసుకోవడం కాదు, భవిష్యత్తును ఎలా నిర్మించాలో తెలుసుకోవడం. సాధారణ నాయకులు కాలానికి అనుగుణంగా మారుతారు, కానీ అరుదైన నాయకులు కాలాన్నే మార్చేస్తారు. ఈ కోవకు చెందినవారే చంద్రబాబు. ఆయన నిర్ణయాలు ఈ రోజుకే పరిమితం కావు, రాబోయే తరాల భవిష్యత్తును నిర్మించే దిశగా సాగుతాయి.
ఆయన రాజకీయంగా ఎదిగిన విధానం, సాధారణంగా కనిపించే ప్రయాణం కాదు. అది అడుగడుగునా సవాళ్లతో కూడిన ఒక దీర్ఘకాలిక సాధన. ప్రజలతో మమేకమై, పరిపాలనను వారికి చేరువ చేశారు. ప్రతి అంశాన్ని డేటాతో అర్థం చేసుకునే అలవాటు ఆయనను ఒక ప్రత్యేక నాయకుడిగా తీర్చిదిద్దింది. నిర్ణయం తీసుకునే ముందు సమాచారం సేకరణ పద్ధతిని ఆయన అలవాటు చేసుకున్నారు. ఇది తర్వాత ఆయన పాలనలో కనిపించే రియల్ టైమ్ గవర్నెన్స్‌కు పునాది అయింది.
1995లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆర్థిక లోటు, పరిపాలనా నిర్వీర్యం, అభివృద్ధి లోపం రాష్ట్రాన్ని వెనక్కి లాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన చర్యలు కేవలం పాలనా నిర్ణయాలుగా కాకుండా, స్టేట్ రీకన్‌స్ట్రక్షన్ మిషన్‌గా మారాయి. ప్రభుత్వ వ్యయ నియంత్రణ, వనరుల సమర్థ వినియోగం, పారదర్శకతపై దృష్టి వంటి అంశాల ద్వారా రాష్ట్రాన్ని ఒక క్రమబద్ధమైన అభివృద్ధి మార్గంలో నడిపించారు. వరల్డ్ బ్యాంక్‌తో కలిసి అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు దీర్ఘకాలంలో రాష్ట్రానికి బలమైన ఆర్థిక పునాది వేశాయి.
హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చడం ఆయన దూరదృష్టికి ఒక ప్రతీక. బిల్ గేట్స్‌ను అప్పట్లో ఇక్కడికి తీసుకురావడం, హైటెక్ సిటీని నిర్మించడం, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం ద్వారా ఆయన ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల పటంలో నిలిపారు. ఇది ఒక ఆర్థిక వ్యూహకర్తగా ఆయనను నిలబెట్టింది. ఆయన రూపొందించిన విజన్ 2020, భారతదేశంలో అభివృద్ధి ప్రణాళికలకు ఒక మార్గదర్శకంగా నిలిచింది. అదే విధంగా కేంద్ర రాజకీయాల్లో కూడా ఆయన ప్రభావం గణనీయంగా ఉంది.
రాజధాని కూడా లేకుండా విభజించిన సమయంలో అందరి చూపు ఆయనపైనే. ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుందని 2014లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ ఐదేళ్లు అభివృద్ధి విషయంలో ఆయన చేసిన కృషి అనేక స్థాయిల్లో కనిపిస్తుంది. ఒక పిలుపుతోనే దాదాపు 30 వేల మంది రైతులు, సుమారు 34 వేల ఎకరాల భూమిని అమరావతి కోసం స్వచ్ఛందంగా సమర్పించారు. నాయకత్వంపై ప్రజల నమ్మకానికి ఇది అపూర్వ నిదర్శనం. అమరావతి నిర్మాణానికి ఒక వైపు పూనుకుంటూ, మరో వైపు జలవనరుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా పోలవరాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆర్టీజీఎస్ ద్వారా సాంకేతిక ఆధారిత పరిపాలన... అన్నీ సమన్వయంతో ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత.
ఆయనకు భూదేవి వంటి ఓర్పు, ఆకాశమంత నేర్పు ఉన్నాయని 2019–24 మధ్య కాలం స్పష్టంగా చూపించింది. చంద్రబాబు రాజకీయ జీవితంలో అత్యంత కఠిన దశగా నిలిచిన ఈ కాలంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎదురైన ఒత్తిళ్లు, కేసులు, చివరకు జైలు జీవితం ఇవన్నీ ఆయన సహనాన్ని పరీక్షించాయి. అయినా స్థైర్యంగా నిలిచి, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతూ, టీడీపీని మరింత బలపరిచారు. బహుశా అందుకేనేమో 2024 ఎన్నికల్లో టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తే 135 స్థానాల్లో గెలిచింది. కూటమి ప్రభుత్వం ఒక స్థిరమైన పాలనకు సంకేతంగా మారింది. అమరావతికి చట్టబద్ధత లభించడం, పోలవరం పూర్తి దశకు చేరుకోవడంతో పాటు పెట్టుబడులు తిరిగి రాష్ట్రానికి రావడం... ఒక పునరుజ్జీవన దశను సూచిస్తున్నాయి. విశాఖపట్నంలో గూగుల్, అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్, రాయలసీమలో స్టీల్ ప్లాంట్‌లు రావడం చూస్తుంటే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు నాంది పలికినట్లుగా ఉంది.
సామాజిక న్యాయం విషయంలో ఆయన దృష్టి ఎప్పుడూ సమగ్రంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతి కోసం తీసుకున్న చర్యలు, పేదలను ధనికులుగా మార్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ ఆయన ఇంక్లూజివ్ గ్రోత్ ఆలోచనకు నిదర్శనం. రాజ్యాంగానికి కట్టుబడి, ప్రతి నిర్ణయాన్ని చట్టపరంగా, న్యాయపరంగా తీసుకోవడం ఆయన వ్యక్తిత్వంలో ముఖ్యమైన లక్షణం. మహాత్ముడు చూపిన అహింసా మార్గం, బీఆర్ అంబేడ్కర్ ప్రతిపాదించిన రాజ్యాంగబద్ధత, అన్న ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవ భావన, జ్యోతిరావ్ పూలే చూపిన సామాజిక న్యాయం ఈ విలువలు ఆయన రాజకీయ ప్రయాణానికి మార్గదర్శకాలు.
బి.సి. జనార్దన్‌రెడ్డి
రహదారులు, భవనాల శాఖ మంత్రి
(ఏప్రిల్ 20: చంద్రబాబు పుట్టినరోజు)
ఇవి కూడా చదవండి..
మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..
అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు