ఆత్మగౌరవానికి ప్రతీక లేబర్ అడ్డాలు
ABN , Publish Date - May 09 , 2026 | 01:27 AM
లేబర్ అడ్డాలు (కార్మిక కూడళ్లు) కేవలం పనికోసం వేచిచూసే ప్రదేశాలు కావు, అవి శ్రమజీవుల ఆత్మగౌరవానికి, స్వాభిమానానికి ప్రతీకలు. కష్టజీవుల ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు...
లేబర్ అడ్డాలు (కార్మిక కూడళ్లు) కేవలం పనికోసం వేచిచూసే ప్రదేశాలు కావు, అవి శ్రమజీవుల ఆత్మగౌరవానికి, స్వాభిమానానికి ప్రతీకలు. కష్టజీవుల ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేబర్ అడ్డాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 80 లక్షల మంది అసంఘటిత కార్మికుల సమస్యలకు పరిష్కార మార్గంగా, వారిని గౌరవప్రదమైన జీవనం వైపు నడిపించే కేంద్రాలుగా ఈ అడ్డాలు మారబోతున్నాయి. తెల్లవారుజామునే లేచి, ఎండనక, వాననక పని కోసం రోడ్డెక్కి, ఆత్మవిశ్వాసంతో కష్టపడే శ్రామికులకు నైతిక బలం ఈ అడ్డాలు. కూటమి ప్రభుత్వం కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు లేబర్ అడ్డాల వద్ద ఆధునిక వసతులు, విశ్రాంతి గదులు కల్పించాలని నిర్ణయించింది.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే– ‘‘ఆత్మగౌరవం లేని జీవితం వ్యర్థం. ఆత్మగౌరవంతో జీవించాలంటే మనిషి కష్టాలను అధిగమించాల్సి ఉంటుంది’’. ఒకప్పడు నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్ళాలంటే కూలి చేయాల్సిందే. ఉన్న ఊరిలో ఉపాధి లేక పట్టణాలకు వలసపోయి అడ్డా కూలీలుగా మారిన ఉదంతాలు కోకొల్లలు, గ్రామాల నుంచి పని కోసం నగరంలోని కూలీ అడ్డాకు తరలివచ్చేవారు. ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రంలో పర్యటించినప్పుడు కుటుంబాన్ని పోషించడానికి ఆ కష్టజీవులు పడుతున్న తపనకు పుల్ స్టాఫ్ పెట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు మదిలో మెదిలింది. నిరుపేద కుటుంబాలు మనుషులుగా తల ఎత్తుకుని బతికినప్పుడే కదా అభివృద్ధి అని ఆయన భావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కూలీలకు ఏదో ఒక ప్రయోజనం చేకూర్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన ప్రారంభించింది. ఆ ప్రణాళికకు అనుగుణంగా భవన నిర్మాణ కార్మికులు పనుల కోసం రోజూ ఉదయం రోడ్లపక్కన వేచి చూసే పని లేకుండా లేబర్ అడ్డాలకు శ్రీకారం చుట్టింది.
మేడే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా పమిడిముక్కలో ఈ లేబర్ అడ్డాను లాంఛనంగా ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 15 నగరాల్లో ఈ అడ్డాలను నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీటిని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా మార్చనున్నారు. స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులిస్తారు. తద్వారా వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి స్కిల్డ్ లేబర్‌గా తయారు చేస్తారు. ఇప్పటికే నైపుణ్యం ఉన్న వారికి కూడా మరింత శిక్షణ ఇచ్చి హైపవర్ స్కిల్డ్ లేబర్‌గా గుర్తిస్తారు. తద్వారా కార్మికుల సంక్షేమం, జీవితాలను సమూలంగా మార్చాలన్నది చంద్రబాబు ఉద్దేశం. అంతేకాకుండా ఈఎస్‌ఐ ఆస్పత్రుల ద్వారా వీరికి మెరుగైన వైద్యం అందిస్తారు.
కార్మికుల సేవలు అవసరమైన ప్రజలు నేరుగా లేబర్ చౌక్‌కు వెళ్ళి సంప్రదించొచ్చు. అంతేకాకుండా కార్మికులకు పక్కా చిరునామా, వీరందరి కోసం తగిన సదుపాయాలతో ప్రత్యేక భవనాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అందుకు సంబంధించి స్ధల సేకరణ కూడ జరుగుతున్నది. లేబర్ అడ్డాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.15 లక్షలు చొప్పున ఖర్చు చేస్తారు. వీటిలో తాగునీటి సదుపాయం, పురుషులు, మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, వంద నుంచి రెండు వందల మంది కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారు.
వచ్చే ఏడాదిలో రాష్ట్రానికి మరిన్ని ప్రైవేట్ కంపెనీలు రానున్నాయి. ఆయా కంపెనీల నిర్మాణాలు సాగేటప్పుడు వారికి నైపుణ్యం ఉన్న కార్మికులు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న కార్మికులను పెంచడం ద్వారా పెట్టుబడిదారులు వేర్వేరు ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోకుండా స్థానికులకు ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఆ దిశగా అడుగులు వేయడం వల్ల కార్మికులకు మేలు జరుగుతుందని, రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందనే ముందు చూపుతోనే ఆయన లేబర్ అడ్డాలకు శ్రీకారం చుట్టారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కార్మికుల సంక్షేమం కోసం కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయకుండా వారి కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం కూటమి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం.
వాసంశెట్టి సుభాష్
కార్మికశాఖ మంత్రి
ఇవి కూడా చదవండి...
పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం