Share News

జనగణనకు ముందు కులాల స్థిరీకరణ జరగాలి!

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:12 AM

కులాలవారీగా జనగణన జరగడానికి ముందు ప్రామాణికంగా కులాల స్థిరీకరణ జరగడం అవసరం. లేదంటే పాలనా పరంగానే కాకుండా సామాజికంగా కూడా తీవ్రనష్టం జరిగే...

జనగణనకు ముందు కులాల స్థిరీకరణ జరగాలి!

కులాలవారీగా జనగణన జరగడానికి ముందు ప్రామాణికంగా కులాల స్థిరీకరణ జరగడం అవసరం. లేదంటే పాలనా పరంగానే కాకుండా సామాజికంగా కూడా తీవ్రనష్టం జరిగే ప్రమాదం ఉంది. దేశంలోనే కాకుండా రాష్ట్రాలలో కూడా ప్రాంతాలను బట్టి ఒకే కులాన్ని పలు రకాల పేర్లతో పిలుస్తారు. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్లను ఏకరూపంలో కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో 107 కులాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో 138 కులాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల సంగతి ఎలావున్నా, మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ జాబితాకు, రాష్ట్ర ప్రభుత్వ జాబితాకు వ్యత్యాసం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఒక కులం కొన్ని రాష్ట్రాలలో బీసీ జాబితాలో ఉంటే, మరో రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో ఉంది. ఉదాహరణకు రజకులు ఆంధ్రప్రదేశ్‌లో బీసీ జాబితాలో ఉండగా, ఇతర రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా ఒక రాష్ట్రంలో ఒక కులం ఓసీ జాబితాలో ఉంటే, అదే కులం మరో రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉంది. ఉదాహరణకు కమ్మ కులం ఆంధ్రప్రదేశ్‌లో ఓసీ జాబితాలో ఉంటే, కర్ణాటకలో బీసీ జాబితాలో ఉంది. అలాగే కర్ణాటక రాష్ట్రంలో గౌడ కులం ఓసీ జాబితాలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీ జాబితాలో ఉంది.

అంతేకాకుండా ఒకే కులం ప్రాంతాన్ని బట్టి వేరు వేరు పేర్లతో చలామణిలో ఉంది. ఉదాహరణకు కాపు కులాన్ని ఆయా ప్రాంతాలను బట్టి ఒంటరి, తెలగ, బలిజ, కాపు, నాయుడు అని వ్యవహరిస్తున్నారు. కాపు కులానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో తూర్పు కాపుగా, తెలగ కాపుగా ఉన్నాయి. వీటిలో తూర్పు కాపు బీసీ జాబితాలో ఉండగా, తెలగ కాపు ఓసీ జాబితాలో ఉంది. ఇంచుమించు ఈ కులాల మధ్య వివాహ సంబంధాలు ఉన్నాయి. దీనిని బట్టి ఒకే కులమైనా ఒక ప్రాంతంలో బీసీలైతే, మరో ప్రాంతంలో ఓసీలవుతున్నారు. ఇదే విధంగా వెలమ కులంలో కూడా మూడు, నాలుగు విభాగాలున్నాయి. వీరిలో పద్మనాయక వెలమ మాత్రమే ఓసీ జాబితాలో ఉండగా, కొప్పుల వెలమ, వెలనాటి వెలమ కులాలు బీసీ జాబితాలో ఉన్నాయి. ఓసీ కులమైన బ్రాహ్మణులలో కూడా శ్రీవైష్ణవులు, వైదికులు, నియోగులు, ద్రవిడ బ్రాహ్మణులు వంటి అనేక ఉప కులాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే అన్ని కులాలకూ ఆయా ప్రాంతాలను బట్టి వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కులాల పేర్లను స్థిరీకరించడం చాలా అవసరం. స్థిరీకరించిన కులాల పేర్లను జనాభా సేకరణ పత్రంలో ముద్రించి ఉంటే సర్వే చేసే సిబ్బందికి ప్రజల నుంచి కుల వివరాలను సేకరించడం సులభంగా ఉంటుంది.


షెడ్యూల్ ప్రకారం 2026లో గృహాల సర్వే పూర్తి కాగా, కులాల వివరాలతో కూడిన జనగణన 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నది. జనగణన సర్వే నిర్వహించే సిబ్బంది ఎటువంటి ప్రశ్నలతో వివరాలు సేకరిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రజల నుంచి 40 ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారని తెలిసింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జనాభా వివరాల సేకరణకు ముందే రాష్ట్రాల వారీగా ప్రామాణికమైన కులాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. జనాభా వివరాల సేకరణ పత్రంలో ఆ కులాల జాబితా ఉండాలని, అప్పుడు ప్రజలు ఆ జాబితాలో తమ కులం ఏమిటో చెబుతారని వారు ఆ తీర్మానంలో వివరించారు. ఈ విధానం వల్ల ప్రజలు ఎవరికి వారు తమకు తోచిన కులం పేరు చెప్పకుండా నిర్దిష్టంగా తమ కులాన్ని తెలియజేసే అవకాశం ఉంటుందని ప్రస్తావించారు. వాస్తవంలో కూడా వ్యవహారికంగా మనకు నిత్యం కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ, రజక, నాయీ బ్రాహ్మణ, గౌడ, యాదవ, పద్మశాలి, పల్లెకారులు వంటి పది పదిహేను చేతివృత్తి కులాలు కనిపించినా, జాబితాలో మాత్రం చాలా కులాలు కనిపిస్తాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలోనే బీసీ కులాల జాబితాలో 138 కులాలు ఉండగా, తెలంగాణలో 112 కులాలు ఉన్నాయి.

ప్రస్తుతం నిర్వహించనున్న కులాలవారీ జనగణన సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో ఎటువంటి విధానాలు అవలంబించారో అధ్యయనం చేయడం అవసరం. 1931లో బ్రిటిష్‌ వారు చివరిసారిగా పూర్తిస్థాయిలో కులాల వారీగా జనగణన చేశారు. ఆ తర్వాత మరో నాలుగు పర్యాయాలు ప్రయత్నాలు జరిగినా సాంకేతికంగా ఆచరణకు నోచుకోలేదు. 1941లో కూడా కులాల వారీగా జనగణన నిర్వహించినా, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఏర్పడిన పాలనాపరమైన ఇబ్బందుల వల్ల వెలుగులోకి రాలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 2001 మధ్య జరిగిన జనగణనల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వివరాలు మాత్రమే సేకరించారు. అయితే 2011లో కేంద్ర ప్రభుత్వం ‘సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్’ పేరిట కులాల వారీగా జనాభా వివరాలను సేకరించింది. అయితే ఈ వివరాల సేకరణలో లోపాలు జరిగాయనే కారణంగా వాటిని బహిర్గతం చేయలేదు.


1931 సర్వేలో ఆనాడు భారతదేశంలో 4,147 కులాలు ఉన్నట్టుగా ప్రకటించారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీ కులాల వర్గీకరణ నిమిత్తం కేంద్రం నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ ఆరు సంవత్సరాలపాటు అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా 2,600 ఓబీసీ కులాలు ఉన్నట్టుగా పేర్కొంది. అయితే సంఖ్యాపరంగా వ్యత్యాసం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వ దృష్టిలోకి రాని సంచార కులాలు ఇంకా ఉన్నాయా? లేక కొన్ని కులాలు అంతరించిపోయాయా? అనేది తెలుసుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది నుంచి జరగబోయే జనగణన ద్వారా ఇటువంటి అనేక విషయాలు అవగతమయ్యే అవకాశం ఉంటుంది.

కులాల వారీగా జరిగే సర్వే భారతదేశ అభివృద్ధిలో ఎంతో కీలకం కానున్నది. అభివృద్ధి విషయంలో కులాల మధ్య ఎటువంటి వివక్ష ఉంది? విద్య, ఆర్థిక అంశాలలో ఎవరు వెనుకబడి ఉన్నారు? వంటి సమాచారాన్ని బట్టి ఏయే వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ తరహా అభివృద్ధి పనులు చేపట్టాలనే అవగాహన ఏర్పడుతుంది. అందువల్ల కులగణన ఏదో మొక్కుబడిగా కాకుండా శాస్త్రీయంగా, నిర్దిష్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.

అన్నవరపు బ్రహ్మయ్య

పాత్రికేయులు

Also Read:

9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్‌ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు

కూటమి ప్రభుత్వంపై కుట్రలను తిప్పికొట్టాలి: నారా లోకేశ్

Updated Date - Sep 17 , 2026 | 02:19 AM