Share News

కుల దురహంకార హత్యలు ఇంకెన్నాళ్లు?

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:02 AM

భారతదేశం స్వాతంత్ర్యం సాధించి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా కుల దురహంకారం మాత్రం సమాజాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రేమించడం, తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కూడా...

కుల దురహంకార హత్యలు ఇంకెన్నాళ్లు?

భారతదేశం స్వాతంత్ర్యం సాధించి ఎనిమిది దశాబ్దాలు కావొస్తున్నా కుల దురహంకారం మాత్రం సమాజాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రేమించడం, తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కూడా కులం పేరుతో నేరంగా పరిగణిస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. కులాంతర ప్రేమలు, వివాహాలను అంగీకరించలేని ఆధిపత్య భావజాలం యువతీ యువకుల ప్రాణాలను బలితీసుకుంటోంది.

ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా మెట్‌పూర్ గ్రామంలో 21 ఏళ్ల సాన్యా పటేల్‌ వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో కన్న తండ్రే ఆమెను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. 2021లో గుంటూరు జిల్లా అప్పాపురంలో వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించిన బండారు గోపి అనే 19 ఏళ్ల యువకుడిని యువతి కుటుంబసభ్యులు హత్య చేసి కాలువలో పడేశారు. 2025లో అనంతపురం జిల్లాలో కులాంతర ప్రేమను అంగీకరించలేక భారతి అనే యువతిని ఆమె తండ్రే హత్య చేశాడు. అదే ఏడాది తిరుపతి జిల్లాలో... వేరే కులానికి చెందిన యువకుడితో సంబంధం కొనసాగిస్తోందనే కారణంతో 16 ఏళ్ల బాలికను ఆమె తల్లి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో యాస్మిన్ బాను, కర్నూలు జిల్లా ఆదోనిలో ఆడమ్ స్మిత్ కూడా హత్యలకు గురయ్యారు.

ఈ ఘటనలను పరిశీలిస్తే కుల దురహంకారం కేవలం వ్యక్తుల మధ్య సమస్య కాదని, సమాజంలో వేళ్లూనుకున్న కుల ఆధిపత్య వ్యవస్థకు సంబంధించిన సమస్య అని అర్థమవుతుంది. మహిళలను కుటుంబ గౌరవానికి ప్రతీకలుగా చూడటం, వారి వ్యక్తిగత స్వేచ్ఛను నిరాకరించడం పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం.

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కుల నిర్మూలనకు కులాంతర వివాహాల ప్రాధాన్యాన్ని వివరించారు. కుల గోడలను బద్దలుకొట్టకుండా సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగిన సమాజాన్ని నిర్మించడం సాధ్యం కాదు. అందువల్ల కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అర్హులైన జంటలకు ప్రోత్సాహక ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి నివాసం, ఉపాధి, భద్రతకు బాధ్యత తీసుకోవాలి. కుల దురహంకారంతో హత్యలు, దాడులకు పాల్పడేవారిపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి కఠిన శిక్షలు పడేలా చూడాలి.


కేంద్ర ప్రభుత్వం కుల దురహంకార హత్యల నివారణకు సమగ్ర జాతీయ విధానం రూపొందించాలి. సుప్రీంకోర్టు శక్తి వాహిని కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను అమలుచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేక రక్షణ విభాగాలు ఏర్పాటు చేసి, బాధితులకు తక్షణ పోలీసు రక్షణ, న్యాయ సహాయం, పరిహారం, పునరావాసం కల్పించాలి.

కుల దురహంకార హత్యలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, అలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ వ్యవస్థలను నిర్మించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. ప్రజాస్వామిక, ప్రగతిశీల, దళిత, మహిళా, యువజన సంఘాలు కూడా బాధిత జంటలకు అండగా నిలిచి కుల ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా సామాజిక చైతన్యాన్ని విస్తరించాలి.

అండ్ర మాల్యాద్రి

(కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 18 , 2026 | 03:02 AM