క్యాన్సర్: అవగాహనే కాదు కార్యాచరణా అవసరమే
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:59 AM
భారతదేశంలో క్యాన్సర్ నానాటికీ విస్తరిస్తోంది. ప్రతి ఏడాది 15 లక్షలకు పైగా కొత్త కేసులు నిర్ధారణ అవుతుండగా, దాదాపు 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2040 నాటికి ప్రతి ఏడాది కొత్త...
భారతదేశంలో క్యాన్సర్ నానాటికీ విస్తరిస్తోంది. ప్రతి ఏడాది 15 లక్షలకు పైగా కొత్త కేసులు నిర్ధారణ అవుతుండగా, దాదాపు 9 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2040 నాటికి ప్రతి ఏడాది కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటుతుందని, మరణాలు కూడా 12 నుంచి 15 లక్షల వరకు పెరుగుతాయని అంచనా. ప్రస్తుతం ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సమస్యను మరింత తీవ్రం చేస్తున్న అంశం– 60 శాతం కంటే ఎక్కువ రోగులు క్యాన్సర్ పురోగతి దశల్లో చికిత్సకు వస్తున్నారు. ఈ దశలో చికిత్స అవకాశాలు పరిమితంగా ఉంటాయి. జీవనావధి ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ప్రతి అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం రోజున, మనం అవగాహన గురించి మాట్లాడతాం. కానీ రోగులు వ్యాధి పట్ల భయంతో, నిర్లక్ష్యంతో చికిత్సకు ఆలస్యంగా వస్తున్నారు. అవగాహన మాత్రమే సరిపోవడం లేదు. ఇప్పుడు భారత్‌కు కావలసింది నిర్ణయాత్మకంగా పాటించే చర్యలు.
ఈ సంవత్సరం అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవ థీమ్ ‘యునైటెడ్ బై యూనిక్’. ప్రామాణికమైన, ఫలితమిచ్చే చర్యల వైపు అడుగులు వేయమని ఇది దేశాలకు సూచిస్తోంది. ఈ థీమ్ ప్రతి క్యాన్సర్ ప్రయాణం ప్రత్యేకమని గుర్తించి, రోగుల అనుభవాలు, విధానాలను నిర్ణయించడంలో మార్గదర్శకంగా ఉండాలని కోరుతోంది. మాటల నుంచి నిజమైన అమలుకు మార్పుగా, ప్రకటనల నుంచి బాధ్యతాయుత చర్యలకు మారవలసిన అవసరాన్ని ఈ థీమ్ సూచిస్తోంది.
మన దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఇప్పటికే శక్తిమంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం లక్షల మందికి అధిక వైద్య ఖర్చులు తగ్గించడంలో కీలకంగా నిలిచింది. నిధులు అందించడం మాత్రమే కాదు; కాన్సర్‌ను ముందస్తు నివారణ, ప్రారంభ దశలోనే గుర్తించాల్సి ఉంది. ఆయుష్మాన్ భారత్ కింద ఉన్న హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ క్రమ పద్ధతిలో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలి. రాష్ట్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సమగ్రంగా అమలు కావడం లేదు. శిక్షణ లోపాలు, బలహీనమైన రిఫరల్ వ్యవస్థలు, పర్యవేక్షణ లోపం ఉంటోంది.
క్యాన్సర్, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్‌ల నివారణ– నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం(ఎన్‌పీసీడీసీఎస్) ఒక బలమైన రూపురేఖను అందిస్తున్నది. అయితే, అమలు సరిగా జరగని కారణంగా దాని ప్రభావం తగ్గింది. ఎన్‌పీసీడీసీఎస్‌ను ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానం చేయాలి. దీంతో ప్రాథమిక వైద్యం నుంచి జిల్లా ఆసుపత్రులు, తృతీయ స్థాయి కేంద్రాలకు నిరవధిక రిఫరల్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. స్క్రీనింగ్ చేయించుకున్న ప్రతి వ్యక్తికీ అనుమానం నుంచి నిర్ధారణ వరకు, అక్కడి నుంచి చికిత్స వరకు– స్పష్టంగా అనుసరించగల మార్గం ఉండాలి.
పెద్ద నగరాల్లోని ఆసుపత్రుల మీద మాత్రమే భారత్ ఆధారపడకూడదు. జిల్లా ఆసుపత్రులు నిజమైన క్యాన్సర్ కేంద్రాలుగా పనిచేయాలి. ఇందుకు– అంకాలజీ ప్రాథమిక విషయాల్లో శిక్షణ పొందిన డాక్టర్లు కావాలి; పాథాలజీ, ఇమేజింగ్ సేవలు పనిచేయాలి; జిల్లా ఆసుపత్రులు, పెద్ద ఆసుపత్రులతో టెలికాన్సర్ బోర్డ్స్ ద్వారా శిక్షణ కావాలి; రిఫరల్ ఎలా చేయాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించి, సరైన కేంద్రానికి రిఫర్ చేయగల సామర్థ్యం ఉండాలి. ఇలా చేయడం ప్రాణనష్టాన్ని తగ్గిస్తుంది.
‘యునైటెడ్ బై యూనిక్’ అనే భావన క్యాన్సర్ సంరక్షణ కేవలం వైద్యపరమైనదే కాదు, అది లోతైన మానవీయత అంశమని మనకు గుర్తుచేస్తుంది. భయం, అపఖ్యాతి (స్టిగ్మా), అయోమయం, ఆర్థిక ఆందోళనలు వంటివి, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు రాకుండా రోగులను వెనక్కు తగ్గేలా చేస్తాయి. ప్రజాకేంద్రీకృత సంరక్షణ అంటే– నిజాయితీతో కూడిన, కరుణాత్మక సంభాషణ; విభిన్న వైద్య నిపుణుల సమూహ చర్చ ద్వారా నిర్ణయాలు; చికిత్సతో పాటు మానసిక, సామాజిక మద్దతు అందించడం; సమాచారంతో కూడిన నిర్ణయ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వడం... వీటితో ఫలితాలు మెరుగుపడతాయి.
క్యాన్సర్ ఫలితాలను మెరుగుపరచడంలో బలమైన క్యాన్సర్ రిజిస్ట్రీలు కీలకం. రోగుల సమాచారం, క్యాన్సర్ సంభవించే భౌగోళిక ధోరణులు, క్యాన్సర్ రకాలపై తులనాత్మక విశ్లేషణ ద్వారా ప్రమాద కారకాలను అంచనా వేయడం, వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవారిని గుర్తించడంతో పాటు క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్ కార్యక్రమాలను ప్రణాళిక చేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం దేశంలో కేవలం 38 జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీలు (PBCRs) మాత్రమే ఉన్నాయి. ఇవి దేశ జనాభాలో కేవలం 10శాతం మందిని మాత్రమే కవర్ చేస్తున్నాయి. విచారకరమైన విషయం ఏమిటంటే, వీటిలో ఎక్కువ భాగం పట్టణ ప్రాంతాల్లోనే ఉండగా, గ్రామీణ ప్రాంతాలకు అంకితమైనవి కేవలం రెండు మాత్రమే. సేకరించే డేటా నాణ్యతను నిర్ధారించడంలో ఈ రిజిస్ట్రీలు నిధుల కొరత కారణంగా పరిమితులు ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీ ఒక్కటి కూడా లేదు. ఆసుపత్రుల్లో నమోదయ్యే క్యాన్సర్ రోగుల వివరాలకే పరిమితమైన 268 ఆసుపత్రి ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీలు ఉన్నా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని PBCRలను ఏర్పాటు చేసి, సమర్థవంతంగా పనిచేయించాలి.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై పార్లమెంటరీ స్థాయి కమిటీ 2022 సెప్టెంబర్‌లో క్యాన్సర్‌ను ‘నోటిఫైయబుల్ వ్యాధి’గా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. అయితే, ఇది ఇప్పటివరకు వాస్తవరూపం దాల్చలేదు. క్యాన్సర్‌ను ‘గుర్తించదగిన వ్యాధి’గా ప్రకటించడం వల్ల క్యాన్సర్ మరణాలపై బలమైన, సమగ్ర డేటాబేస్‌ను ఏర్పాటు కావడమే కాకుండా, దేశంలో ఈ వ్యాధి సంభవించే స్థాయి, వ్యాప్తిని కచ్చితంగా నిర్ధారించడంలో సహాయపడుతుంది. భారతదేశం స్పష్టమైన లక్ష్యాలు, కాలపరిమితులను నిర్ధారించుకోవాలి. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం లక్ష్యంగా పెట్టుకోవాలి. జిల్లా స్థాయిలో నిర్ధారణ, రిఫరల్ సేవలు అందుబాటులో ఉండాలి. క్యాన్సర్ చికిత్స కారణంగా కుటుంబాలు ఎదుర్కొనే తీవ్రమైన ఆర్థిక భారాన్ని నివారించాలి.
క్యాన్సర్‌పై అవగాహన ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే వెళ్తోంది. ఇకపై మన ప్రతిస్పందనను నిర్వచించాల్సింది కార్యాచరణే. ప్రతి క్యాన్సర్ ప్రయాణం ప్రత్యేకమైనదని మనం విశ్వసిస్తే, ప్రారంభ దశలో గుర్తించి కాపాడిన ప్రతి జీవితం మన విజయానికి కొలమానం కావాలి. భారతదేశం అవగాహన నుంచి కార్యాచరణ వైపు దృఢంగా ముందుకు సాగాలి.
డా. పి.రఘురామ్
వ్యవస్థాపక డైరెక్టర్
కిమ్స్–ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్
(నేడు అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం)
ఇవీ చదవండి:
సర్పంచ్‌గా పోటీ చేయాలని..కన్నకూతురినే చంపేశాడు