ప్రభుత్వం వద్దన్న ‘దళిత’ పదాన్ని వాడగలమా?
ABN , Publish Date - Oct 29 , 2026 | 03:45 AM
భాషలో కొన్ని పదాలకు నిఘంటువు చెప్పే అర్థం కంటే చరిత్ర చెప్పే అర్థమే ఎక్కువ. ఈ అర్థాల వెనుక సామాజిక అనుభవం, ఉద్యమం, సాహిత్యం ఉంటాయి. ‘దళిత’ అన్నది అటువంటి పదమే...
భాషలో కొన్ని పదాలకు నిఘంటువు చెప్పే అర్థం కంటే చరిత్ర చెప్పే అర్థమే ఎక్కువ. ఈ అర్థాల వెనుక సామాజిక అనుభవం, ఉద్యమం, సాహిత్యం ఉంటాయి. ‘దళిత’ అన్నది అటువంటి పదమే. అధికార వ్యవస్థలో షెడ్యూల్డ్ కులాలను సూచించేటప్పుడు ‘దళిత్’, ‘హరిజన్’ వంటి పదాలకు బదులు రాజ్యాంగబద్ధమైన ‘షెడ్యూల్డ్ కులం’ అన్న మాటనే వాడాలని ప్రభుత్వం సూచనలు చేసిన నేపథ్యంలో ఒక ముఖ్యమైన ప్రశ్న ముందుకొస్తోంది. ఇదే నియమాన్ని అకడమిక్ వ్యవస్థకూ వర్తింపజేయాలా? ‘దళిత సాహిత్యం’, ‘దళితవాదం’, ‘దళిత సాహిత్య విమర్శ’, ‘దళిత్ స్టడీస్’ వంటి స్థిరపడిన పరిభాషలను ఇప్పుడు మార్చాలా?
‘దళిత్’ అన్నది రాజ్యాంగంలో వాడిన అధికారిక పదం కాదు. ‘షెడ్యూల్డ్ క్యాస్ట్’ అన్నదే నిర్దిష్ట రాజ్యాంగ న్యాయ పరిభాష. 2018 మార్చి 15వ తేదీన ‘కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ’ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక సర్క్యులర్‌ను పంపింది. 1982, 1990, 2012 నాటి పూర్వ సూచనలను గుర్తు చేస్తూ, షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన వ్యక్తులను సూచించేటప్పుడు ‘‘అధికారిక లావాదేవీల్లోను, వ్యవహారాల్లోను, ధ్రువీకరణ పత్రాల్లోను’’ ఇంగ్లీషులో ‘Scheduled Caste’ అన్న పదాన్నీ, ఇతర భారతీయ భాషల్లో దానికి తగిన అనువాదాన్నీ వాడాలని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు డాక్టర్ మోహన్‌లాల్ మహర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో 2018 జనవరి 15న ఇచ్చిన ఉత్తర్వు దీనికి నేపథ్యం. అదే సంవత్సరం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మీడియాకు ఇచ్చిన అడ్వయిజరీలో కూడా షెడ్యూల్డ్ క్యాస్టులకు చెందిన వ్యక్తులను సూచించేటప్పుడు ‘దళిత్’కు బదులుగా రాజ్యాంగబద్ధమైన పదాన్ని వాడాలని సూచించింది. అయితే ‘దళిత సాహిత్యం’ వంటి చారిత్రక, సాహిత్య పరిభాషను ఉపయోగించరాదని ఆ అడ్వయిజరీ పేర్కొనలేదు. ఇక్కడ ఒక కీలకమైన భేదాన్ని గుర్తించాలి. ప్రభుత్వ రికార్డులో ఒక వ్యక్తి సామాజిక వర్గాన్ని గుర్తించడం ఒక విషయం. సాహిత్య చరిత్రలో ఏర్పడిన ఒక ఉద్యమాన్ని ‘దళిత సాహిత్యం’గా అధ్యయనం చేయడం మరో విషయం.
‘దళిత’ అనే పదం భారతీయ సామాజిక, సాహిత్య చరిత్రలో ప్రత్యేకమైన ప్రయాణం చేసింది. అంబేడ్కర్ ఆలోచనల ప్రభావంతో మహారాష్ట్రలో ఏర్పడిన సామాజిక చైతన్యం, 1970ల దళిత్ పాంథర్స్ ఉద్యమం దీనికి కొత్త సాంస్కృతిక, సాహిత్య వ్యక్తీకరణను ఇచ్చాయి. మరాఠీలో బలంగా రూపుదిద్దుకున్న దళిత రచన తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ తదితర భారతీయ భాషలకు విస్తరించింది. తెలుగు సాహిత్యంలోనూ దళిత కవిత్వం, కథ, నవల, ఆత్మకథ, దళితవాదం, దళిత సాహిత్య విమర్శ ప్రత్యేక అధ్యయన రంగాలుగా స్థిరపడ్డాయి. దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పాఠ్యప్రణాళికల్లో కూడా ‘దళిత’ పదం విస్తృతంగా వాడకంలో ఉంది. ‘దళిత్ స్టడీస్’ వంటి ఎన్నో కోర్సుల్లో ‘దళిత’ పదం అకడమిక్ పరిభాషగా స్థిరపడిపోయింది.
ఇక్కడే అసలు ప్రశ్న వస్తున్నది. ‘దళిత్ లిటరేచర్’ను ‘షెడ్యూల్డ్ క్యాస్ట్ లిటరేచర్’గా మార్చితే రెండూ ఒకే భావాన్ని వ్యక్తం చేస్తాయా? ‘షెడ్యూల్డ్ కులం’ అనేది రాజ్యాంగపరంగా నిర్వచితమైన వర్గం. ‘దళిత సాహిత్యం’ అనేది మాత్రం చారిత్రక అనుభవం, సామాజిక చైతన్యం, ప్రతిఘటన, సాహిత్య వ్యక్తీకరణల నేపథ్యంలో రూపుదిద్దుకున్న భావన. ఈ రెండు పదాల భావపరిధులు సమానమైనవి కావు. ఒకదాన్ని మరొకదానితో యాంత్రికంగా భర్తీ చేస్తే సాహిత్య, చారిత్రక అర్థపరిధి మారవచ్చు.
అదే సమయంలో ‘దళిత్’ అనే పదాన్ని ప్రతి వ్యక్తీ లేదా ప్రతి సమూహమూ స్వీయగుర్తింపుగా అంగీకరిస్తుందని కూడా భావించలేము. ఈ పదాన్ని అభ్యంతరకరంగా భావించే దృక్పథాలూ ఉన్నాయి. అందుకే వ్యక్తుల సామాజిక వర్గాన్ని అధికారికంగా నమోదు చేసే సందర్భంలో రాజ్యాంగ పరిభాషను పాటించాలన్న ప్రభుత్వ సూచనకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉన్నది.
విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ లేదా చట్టబద్ధ సంస్థలే కాబట్టి మరో ప్రశ్న సహజంగా వస్తుంది: వాటి పరిపాలనా పత్రాలు అధికారికమైనవే అయినప్పుడు పాఠ్యప్రణాళికల్లోని ‘దళిత్’ అన్న పదం వాడకం పరిస్థితి ఏమిటి? ఇక్కడ పత్రం స్వభావంతో పాటు పదం ఉపయోగిస్తున్న ప్రయోజనాన్ని కూడా చూడాలి. ఒక విద్యార్థి సామాజిక వర్గాన్ని నమోదు చేయడం పరిపాలనాపరమైన గుర్తింపు. ఒక చారిత్రక సాహిత్య ఉద్యమాన్ని పాఠ్యాంశంగా పేర్కొనడం అకడమిక్ వర్గీకరణ.
18 సెప్టెంబరు 2026 తేదీన చిత్తూరు జిల్లా కలెక్టరు అధికారికంగా ఒక ఉత్తర్వు వెలువరించారు. జిల్లాలో అందరు అధికారులతోపాటు, ద్రవిడ యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీలకు కూడా ఈ ఉత్తర్వులను ఉద్దేశించారు. ఇందులో ‘హరిజన్’, ‘గిరిజన్’ పదాలతోపాటు ‘దళిత్’ పదాన్ని కూడా అధికారిక వ్యవహారాలలోను, లావాదేవీలలోను, ధ్రువీకరణ పత్రాలలోను వాడకూడదని, అందుకు బదులు ‘షెడ్యూల్డ్ క్యాస్ట్’ అని ఇంగ్లీషు గానీ, లేదా స్థానిక భాషల్లో అందుకు సరిసమానమై అనువాదాన్ని గానీ వాడాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయాలను కూడా కలెక్టరు తమ ఉత్తర్వు పరిధిలోకి చేర్చిన ఈ సందర్భంలో– ‘‘దళిత’’ పదం వెనుక ఉన్న సామాజిక అనుభవం, ఉద్యమం, సాహిత్య అర్థాన్ని మరచిపోయి ఆ పదాన్ని మొత్తంగా వాడటం మానేయాలా అన్న ప్రశ్న ఏర్పడుతున్నది.
డా. వేలం పళని
అసోసియేట్ ప్రొఫెసర్, ద్రవిడ విశ్వవిద్యాలయం
ఈ వార్తలనూ చదవండి:
బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్
’ఫర్జీ’ వెబ్‌సిరీస్ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు