రూపాయిని ఇలా ఎంతకాలం నిలబెట్టగలరు?
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:30 AM
ప్రధాని నరేంద్రమోదీ ఈ మధ్యనే పన్నెండేళ్ళ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ పన్నెండేళ్లలో రూపాయి విలువ చాలాసార్లు పడి, మళ్లీ లేవడం జరుగుతోంది. మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు...
ప్రధాని నరేంద్రమోదీ ఈ మధ్యనే పన్నెండేళ్ళ ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ పన్నెండేళ్లలో రూపాయి విలువ చాలాసార్లు పడి, మళ్లీ లేవడం జరుగుతోంది. మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు (మే 2014 నాటికి) అమెరికన్ డాలర్‌తో రూపాయి మారక విలువ 58.3గా ఉండేది. జూన్ 2026 నాటికి అది రూ.94.5 వద్ద ఉంది. రూపాయి మారకపు విలువ పడిపోకుండా ఉండాలంటే, ‘విదేశీ మారక ద్రవ్యం’ పెరగాలి. ఆ పనిలో ఇప్పుడు భారత ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంకూ తలమునకలై ఉన్నాయి.
దీనికోసం ‘ఫుల్లీ యాక్సెస్‌బుల్ రూట్’ విధానాన్ని ప్రభుత్వం విస్తృతం చేయబోతోంది. - 15, 30, 40 ఏళ్ల ప్రభుత్వ బాండ్లను విడుదల చేయడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు ఇప్పటికే ఉన్న పరిమితులను తొలగించడం, దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5శాతం పన్ను మినహాయింపు, ప్రభుత్వ బాండ్ల విక్రయంపై 20శాతం పన్ను నిలిపివేయడం వంటి సడలింపుల్ని చేపడుతోంది.
ఇలా చేస్తే, ఎగుమతులు పెరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు రావడం, ప్రవాస భారతీయుల నుంచి డబ్బు పంపకాలు పెరగడం, విదేశీ రుణాలు లేదా డిపాజిట్లు పెరగడం, దిగుమతులపై ఖర్చు తగ్గడం లాంటివి జరుగుతాయని, ఫలితంగా ఫారెక్స్ పెరిగి, కనీసంగా 30–40 బిలియన్ డాలర్లు వస్తే, రూపాయి బలపడుతుందని ప్రభుత్వ అభిప్రాయం. విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరగడానికి ఇప్పటి వరకూ అన్ని ప్రభుత్వాలు చెబుతున్నవీ, చేస్తున్నవీ ఇవే. జూన్ 16నాటి ‘ఆంధ్రజ్యోతి’లో చిదంబరం చెప్పింది కూడా ఇదే. కొన్నిచోట్ల మోదీని ముద్దుగా విమర్శించినా ఈయన కూడా ఆ ‘తాను’లో ముక్కే. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న 2013లో ‘టేపర్ టాంట్రం’ అనే ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు (‘అమెరికా కేంద్ర బ్యాంక్’ వడ్డీ రేట్లు తగ్గించగానే, పెట్టుబడులన్నీ భారత్ వంటి దేశాలకు వెళ్లిపోయి, వడ్డీ రేట్లు కొంచెం పెంచగానే తిరిగి అమెరికాకు చేరినప్పుడు) రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 68కి పడిపోయింది. అప్పుడు ఆయనకు ఆర్థిక సలహాదారు అయిన రఘురామ్ రాజన్ ఎలాంటి సలహాలు ఇచ్చారో, ఇప్పుడు మోదీకి కూడా అనంత నాగేశ్వరన్ అలాంటి సలహాలే ఇస్తున్నారు. ఆ సలహా పేరే– ‘ఫుల్లీ యాక్సెస్ బుల్ రూట్.’
ఆర్థిక పరిభాషలో దీన్ని ‘హాట్ మనీ ఫ్లో’ అంటారు. అంటే- ‘స్వల్పకాలిక విదేశీ మూలధన ప్రవాహం’. విదేశీ పెట్టుబడిదారులు తమ తమ లాభాల కోసం ఒక దేశంలోకి వేగంగా తీసుకువచ్చే డబ్బు ఇది. (ఇది ఎంత వేగంగా వస్తుందో, అంతే వేగంగా తిరిగి వెళ్లిపోతుంది.) 1950–60ల నుంచే ‘అంతర్జాతీయ ఆర్థిక రంగం’లో ఈ మాట విస్తృతంగా వాడుకలో వచ్చింది. ఇదొక ‘ప్రమాదకరమైన ఆర్థిక ధోరణి’. ఇలాంటి ధోరణి వల్లనే 1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. దీని వలన థాయ్‌లాండ్ కరెన్సీ ‘తాయ్ బాత్’ విలువ కుప్పకూలిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా డబ్బు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. ఆ ప్రభావం ఇండోనేసియా, దక్షిణ కొరియా, మలేసియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు కూడా వ్యాపించింది. పెట్టుబడిదారులు లాభాలు కనిపించినంత వరకు డబ్బు పెట్టారు. ప్రమాదం ఉందనిపించగానే ఒకేసారి డబ్బు వెనక్కి తీసుకున్నారు. దీంతో స్థానిక కరెన్సీల విలువలు ఒక్కసారిగా 30 నుంచి 80శాతం వరకు పడిపోయాయి. అనేక కంపెనీలు, బ్యాంకులు దివాలా తీశాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. కొన్ని దేశాలు ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ’ దగ్గర సహాయం తీసుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయాయి.
‘‘హాట్ మనీ త్వరగా వస్తుంది, కానీ భయం కలిగితే అంతే త్వరగా పారిపోతుంది. కాబట్టి దానిపై ఎక్కువ ఆధారపడకూడదు’’ అని టర్కీ ఆర్థికవేత్త డాని రాడ్రిక్ చెప్పారు. ‘‘ప్రతీ దేశం తన అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ఆర్థిక విధానాలను రూపొందించుకోవాలి. విదేశీ మూలధనం, స్వేచ్ఛా వాణిజ్యం ఉపయోగకరమే. కానీ వాటికి పరిమితులు ఉండాలి. ఆర్థిక మార్కెట్లను పూర్తిగా తెరవడం వల్ల సంక్షోభాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పరిశ్రమలను, ఉద్యోగాలను రక్షించుకునే విధానాలకు అవకాశం ఉంచాలి. అలాగే- ‘ఆ డబ్బును విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల మీదా, పారిశ్రామికీకరణ మీదా ఉపయోగించకుండా తక్కువ వడ్డీ వచ్చే విదేశీ ఆస్తుల్లో ఉంచడం న్యాయం అనిపించుకోదు’ అన్నారు ఆయన.
హా-జూన్ చాంగ్ (దక్షిణ కొరియా ఆర్థికవేత్త), ఆలిస్ ఆమ్స్‌డెన్ (అమెరికా ఆర్థికవేత్త)... వీళ్ళిద్దరూ కూడా ‘‘దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలు ఎంతో కొంత అభివృద్ధి చెందాయంటే అది స్వేచ్ఛా మార్కెట్ వల్ల కాదు, ప్రభుత్వ ప్రణాళికలు, పారిశ్రామిక విధానాల వల్లనే అభివృద్ధి చెందాయి. ప్రభుత్వం పరిశ్రమలకు మార్గనిర్దేశం చేయడం, రుణాలు ఇవ్వడం, ఎగుమతులను ప్రోత్సహించడం చాలా కీలకం’’ అని చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ వేగంగా పడిపోకుండా ఉండాలంటే, హాట్ మనీ ఒక్కదాన్నే మార్గంగా పెట్టుకోకుండా, తయారీ రంగంలో పెట్టుబడుల్ని పెడుతూ, ఎగుమతుల్ని బాగా పెంచుకోవాలని, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాలని, ప్రభుత్వ వ్యయం పెంచి ఉద్యోగాలు సృష్టించాలని, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ వంటి పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి అని చెప్పినవాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం పెట్టుబడిదారీ ప్రపంచంలో ఉన్నాం. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఇక్కడ రూపాయి పడిపోవడం, లేవడం సర్వసాధారణం. వాటిని పూర్తిగా నియంత్రించే ఆర్థిక వాతావరణం ఉండదు. కాని, రూపాయిని నిలబెట్టాలంటే, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచడం అనే ఒక్క దాంట్లోనే కాకుండా, రూపాయిని నిలబెట్టే ప్రక్రియని దేశీయంగా కూడా ప్రయత్నించాలి. అవి– ద్రవ్యోల్బణం నియంత్రణ, ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, దేశీయ పొదుపుల పెంపు, పారిశ్రామికీకరణ, ఉత్పాదకత పెంపు, దిగుమతి ఆధారాన్ని తగ్గించడం, ఇంధన స్వావలంబన. అన్నింటికన్నా, ప్రజల్లో ‘కొనుగోలు శక్తిని’ పెంచే దిశగా ప్రయాణించడం!
నన్నూరి వేణుగోపాల్
ALso Read:
18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల