Share News

విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగేదెలా?

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:36 AM

మే మాసాంతంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా మేరకు నిరాశాజనకంగా ఉన్నది. జూన్‌ ఆరంభంలో ప్రభుత్వం విధానపరమైన చర్యలు చేపట్టింది. వీటిలో భాగంగా ప్రవాస భారతీయులు, అర్హత కలిగిన విదేశీ సంస్థలు...

విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగేదెలా?

మే మాసాంతంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా మేరకు నిరాశాజనకంగా ఉన్నది. జూన్‌ ఆరంభంలో ప్రభుత్వం విధానపరమైన చర్యలు చేపట్టింది. వీటిలో భాగంగా ప్రవాస భారతీయులు, అర్హత కలిగిన విదేశీ సంస్థలు నిర్దిష్ట భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో ఎలాంటి పరిమాణాత్మక పరిమితులు లేకుండా పెట్టుబడి పెట్టేందుకు అనుమతించే ‘ఫుల్లీ యాక్సెసబుల్‌ రూట్‌’ అనే విధానాన్ని కొత్తగా 15, 30, 40 సంవత్సరాల ప్రభుత్వ బాండ్లకూ విస్తరిస్తున్నట్టు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. విదేశీ పోర్ట్‌ ఫోలియో మదుపుదారులపై ఇప్పటివరకు ఉన్న నిర్దిష్ట పరిమితులు, గరిష్ఠ పరిమితులను కూడా తొలగించారు. విదేశీ మదుపుదారులను దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5శాతం పన్ను చెల్లింపు నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ప్రభుత్వ బాండ్ల విక్రయంపై 20శాతం పన్నును నిలిపివేస్తున్నట్టు కూడా ఆ ఆర్డినెన్స్‌ ప్రకటించింది. ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన విదేశీ పౌరులు మొదలైనవారికి ఉద్దేశించిన FCNR (B) డిపాజిట్లను సేకరించేందుకు కూడా బ్యాంకులకు ఆర్బీఐ అనుమతినిచ్చింది.

ఇవన్నీ ప్రశస్త చర్యలు, సందేహం లేదు. గతంలో వాటిని అమలుపరిచినప్పుడు, మంచి ఫలితాలనిచ్చినివిగా నిరూపితమయ్యాయి. ప్రస్తుత క్లిష్టపరిస్థితులలో అవి దేశంలోకి విదేశీ కరెన్సీల ప్రవాహాన్ని పెంపొందిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలను 30 నుంచి 40 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల మేరకు పెంపొందించవచ్చని అంచనా. విదేశీ మారక ద్రవ్య నిల్వల పెరుగుదల రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు అవకాశమున్నది. చిక్కిపోతున్న రూపాయి మన గౌరవనీయ ప్రధానమంత్రికి ఒక రాజకీయ సమస్యగా పరిణమించింది. డాలర్‌–రూపాయి మారకం విలువను రూ.40గా నియంత్రిస్తామని 2014లో ఆయన హామీ నిచ్చారు. ఉవ్వెత్తున ఎగసిన కడలి తరగను అలా నిలిచిపోవాలని కింగ్‌ కాన్యూట్‌ ఆదేశించిన చందంగా మన ప్రధానమంత్రి వాగ్దానమూ ఉన్నది సుమా!

సరే, ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నష్టాలు వాటిల్లే అవకాశమూ ఉన్నది. ఆ నష్టాలేమిటో మనం ఇప్పుడు తర్కించనవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి, ఆర్బీఐకి ఆ చర్యలు చేపట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ఆ చర్యలు అసలు చేపట్టకపోతే జరిగే నష్టం మరింత అధికంగా ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభంలోకి జారిపోతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం చాలా నెలలుగా, మరీ ముఖ్యంగా ట్రంప్‌ సుంకాలు, ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయెల్‌ యుద్ధం, భగ్గుమన్న చమురు ధరలు, సరఫరా గొలుసులు విచ్ఛిన్నమైన నాటి నుంచి ఆ నిరాకరణ స్వరం మరింత హెచ్చింది. భారత్‌లో మదుపు చేసే విషయంలో విదేశీ మదుపుదారులు చాలా జాగ్రత్త వహిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం, దేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం మొదలైన పరిణామాలు ముంచుకొస్తున్న ముప్పును స్పష్టంగా సూచించాయి. అయినా ఆ ప్రమాద ఘంటికలను ప్రభుత్వం పట్టించుకోనేలేదు.


2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి స్థిర ధరల వద్ద గ్రాస్‌ ఫిక్స్‌డ్‌ కేపిటల్‌ ఫార్మేషన్‌ (స్థూల స్థిర మూలధన నిర్మాణం జీఎఫ్‌సీఎఫ్‌) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 32.3శాతంగా మాత్రమే ఉంటోంది. ఈ జీఎఫ్‌సీఎఫ్‌ ప్రభుత్వ రంగం, గృహరంగం (రియల్‌ ఎస్టేట్‌, భవన నిర్మాణం), ప్రైవేట్‌ రంగాల మధ్య ఇంచుమించు సరిసమానంగా విభజితమై ఉంది. పెట్టుబడులు మరింతగా పెట్టేలా ప్రైవేట్‌ రంగం దిగ్గజాలను పాలకులు పదే పదే కోరుతున్నారు, బుజ్జగిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యాపారవేత్తలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్స్ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అయినా మదుపులు పెట్టేందుకు ప్రైవేట్‌ రంగం సమ్మతించడం లేదు. ముఖ్యంగా తయారీ రంగంలో మదుపులకు ససేమిరా అంటోంది. స్థిర ధరల వద్ద స్థూల విలువ జోడింపు (జీవీఏ– గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌– ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా రంగంలో సరుకుల సేవల నికర విలువను గణించే కొలమానం)లో మాన్యుఫాక్చరింగ్‌ వాటా ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో చాలా సంవత్సరాలపాటు 17శాతంగా మాత్రమే ఉన్నది (జీడీపీ= జీవీఏ+సరుకులపై నికర పన్నులు).

ఆర్బీఐ నెలవారీ బులెటిన్లు, ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ సమీక్షలు దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఆరోగ్యదాయకంగా ఉన్నాయనే సంతృప్తిని కలిగిస్తూ వచ్చాయి. అయితే ఈ బులెటిన్లు, సమీక్షలూ మరీ ఆశాజనకంగా ఉన్నాయని, యథార్థ పరిస్థితులను కప్పిపుచ్చుతున్నాయని, ముంచుకొస్తున్న ముప్పును సరిగ్గా గుర్తించడం లేదని చాలామంది ఆర్థికవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నారు. వ్యవస్థాగత బలహీనతలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ ప్రతినిధులు వాక్చాతుర్యం ప్రదర్శిస్తున్నారని కూడా పలువురు ఆర్థికవేత్తలు తీవ్రంగా ఆక్షేపించారు.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు చేపట్టిన చర్యలతో ప్రభుత్వం సంతృప్తితో మిన్నకుండిపోతే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండబోదు. ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ ఒక ఇంటర్వ్యూలో ఆర్థిక వ్యవస్థ విషయమై ప్రభుత్వ ప్రస్తుత ఆలోచనా విధానాన్ని సంగ్రహించి చెప్పారు. బంగారం దిగుమతులపై పరిమితులు విధించడాన్ని గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వకుండా, ‘బంగారం దిగుమతులపై పరిమితులు విధించిన విషయం తనకు తెలియదని’ అన్నారు! అనంత నాగేశ్వరన్‌ ప్రభుత్వ ప్రధాన సలహాదారు. దేశానికి సంబంధించిన సమస్త ఆర్థిక వ్యవహారాలపై ఆయనకొక దృక్పథం ఉండి తీరాలి. కీలక ఆర్థిక కార్యకలాపాలపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ఆయన బాధ్యత. మరి బంగారం దిగుమతులపై పరిమితులు విధించిన విషయం ఆయనకు తెలియకపోవడమేమిటి? ఈ అంశంపై ఆయన గుంభనంగా మాట్లాడారు. కారణమేమిటి? యూపీఏ ప్రభుత్వం తన తుదినాళ్ల (2013–14)లో బంగారం దిగుమతులపై పరిమితులు విధించినప్పుడు నరేంద్ర మోదీ ఇలా ప్రతిస్పందించారు: ‘ఆర్థికమంత్రి మీ మంగళసూత్రాలను అపహరిస్తున్నారు’. నాటి మోదీ విమర్శలు తెలిసి ఉన్న కారణంగానే అనంత నాగేశ్వరన్‌ అలా మాట్లాడి ఉండవచ్చు. అయినా బంగారం దిగుమతులకు అడ్డంకులు సృష్టించడం మినహా ప్రభుత్వానికి మరో మార్గం లేదు అనే విషయాన్ని కూడా ఒప్పుకుని తీరాలి.


మరింత ముఖ్యమైన విషయమేమిటంటే గృహ సంబంధిత రుణాలు జీడీపీలో 41శాతానికి పెరిగిపోగా పొదుపు మొత్తాలు జీడీపీలో 6శాతానికి తగ్గిపోయాయి. తక్కువ పొదుపులు పారిశ్రామిక పెట్టుబడులకు అందుబాటులో ఉన్న దేశీయ మూలధనాన్ని పరిమితం చేస్తాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ విదేశీ పెట్టుబడులపై మరింత ఆధారపడవలసిరావడం అనివార్యమవుతుంది. విలాస వస్తువులను కొనుగోలు చేసే చాలా తక్కువ మంది సంపన్నులలో మినహా వినియోగ వ్యయమూ బాగా తగ్గిపోయింది. ఎమ్‌ఓఎస్‌పీఐ (మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌– గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ) వివిధ అంశాలపై వెల్లడించే అంకెలను పాలకులు విశ్వసించకుండా ఉండడం మంచిది. ఆ గణాంకాలు తమ పాలనా దక్షతకు అద్దం పడుతున్నాయని ప్రకటించుకోవడమూ పాలకులకు సరికాదు. చెప్పవచ్చినదేమిటంటే స్థూల ఆర్థిక గణాంకాలపై ఆధారపడడం అభివృద్ధిలో అసమానతను కప్పిపుచ్చుతుంది.

ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం చేయవలసినదేమిటి? ప్రభుత్వ వ్యయాలను నేరుగా పెంచాలి లేదా ప్రజల చేతుల్లోకి మరింతగా డబ్బు చేర్చాలి. ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి: ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి; వినియోగంపై పన్నులు తగ్గించాలి. గ్రేట్‌ నికోబార్‌ కాంటైనర్‌ పోర్ట్‌ –కమ్‌– ఎయిర్‌పోర్ట్‌ లాంటి పర్యావరణ హానికరమైన ప్రాజెక్టులకు స్వస్తిచెప్పాలి; విద్యా రుణాలను మరింతగా పెంచాలి. గ్రామీణ ఉపాధిహామీ పథకం తదితర శ్రమ–సాంద్ర ప్రజా ప్రయోజన సంక్షేమ పథకాలను పునరుద్ధరించి మరిన్ని నిధులు వాటికి కేటాయించాలి. త్రాగునీరు, గ్రామీణ రహదారులు, గ్రామీణాభివృద్ధి పథకాలు, పట్టణ గృహ నిర్మాణం మొదలైన వాటికి కేటాయించిన నిధులను గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో వలే కాకుండా సంపూర్ణంగా ఖర్చు చేయాలి. మంజూరు చేసిన ప్రభుత్వోద్యోగాలలో ఖాళీలను, ప్రత్యేకించి క్లాస్‌ 3, క్లాస్‌ 4 ఉద్యోగాలు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, నర్సులు, పోలీసు దళాలలో జవానులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రైల్వేస్‌లో కార్మికులు మొదలైన ఉద్యోగాలలో ఖాళీలను సత్వరమే భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ప్రోద్బలించాలి. నిక్కచ్చిగా చెప్పాలంటే ఆ ఉద్యోగ ఖాళీల భర్తీ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం తప్పనిసరిగా ఒత్తిడి చేయాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువజనులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఉద్యోగాలవి. వాటిని భర్తీచేయడం వల్ల సమాజ శ్రేయస్సుకు, ఆర్థిక పురోగతికి ఇతోధిక మేలు జరుగుతుందని మరి చెప్పనవసరం లేదు.

ప్రభుత్వాలు తమ విధ్యుక్త ధర్మాలను ప్రజలకు ఉత్తేజకరంగా నిర్వర్తించాలి. అప్పుడే భవిష్యత్తు పట్ల వారిలో ఆశాభావం నెలకొంటుంది. ఆ సమున్నత లక్ష్యాల పరిపూర్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన శక్తిసామర్థ్యాలను వినియోగించాలి. ప్రజలలో విభేదాలు రెచ్చగొట్టే, ఆర్థికాభివృద్ధికి ఏ మాత్రం దోహదం చేయని భావజాలపరమైన రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. సామాజిక సామరస్యానికి, సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే పరిపాలన అందించాలి.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 01:36 AM