మరస్పర్శ మానవస్పర్శను మించగలదా!
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:22 AM
భారతదేశపు నేటి రాజకీయ నాయకులకు ‘కృత్రిమ మేధ’ ఒక ఊతపదమైపోయింది. కొందరైతే అనాదిగా వస్తున్న ‘మానవ కేంద్రీకృత ప్రజారోగ్య సంరక్షణ’ కంటే ఈ కృత్రిమమేధతో కూడిన మరబొమ్మల...
భారతదేశపు నేటి రాజకీయ నాయకులకు ‘కృత్రిమ మేధ’ ఒక ఊతపదమైపోయింది. కొందరైతే అనాదిగా వస్తున్న ‘మానవ కేంద్రీకృత ప్రజారోగ్య సంరక్షణ’ కంటే ఈ కృత్రిమమేధతో కూడిన మరబొమ్మల వైద్య సంరక్షణే మెరుగన్న ఆపోహతో మాట్లాడుతున్నారు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు, ఏకంగా భవిష్యత్తులో కృత్రిమమేధతో కూడిన ఆసుపత్రులు, రోగ పరీక్షా కేంద్రాలు, మందుల దుకాణాలూ తెరిచేస్తామనే బీరాలు పలికేంతవరకూ విషయం వెళ్లిపోయింది.
వైద్య విధానమంతా ఇద్దరు వ్యక్తులతో ముడిపడి ఉంటుంది. మొదటి వ్యక్తి– నిజంగా రుగ్మత ఉన్న, లేదా ఉందని భావిస్తున్న రోగి. రెండో వ్యక్తి– వైద్యుడు. వీరిరువురి మధ్య వ్యవహారాన్నే వైద్య పరిభాషలో మనం సంప్రదింపు (కన్సల్టేషన్) అంటున్నాం. ఆధునిక వైద్య చికిత్సా విధివిధానం ఇలా ప్రాథమికంగా వినడం, మాట్లాడటం, స్పృశించడం, వైద్యునికీ రోగికీ నడుమ కాలాతీతమైన ఒక బాంధవ్యాన్ని నెలకొల్పడం అనే నాలుగు మూలస్తంభాలపై ఆధారపడి ఉంది. టెక్నాలజీ పెరిగేకొద్దీ ఈ విధానంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు వైద్యుడు రోగితో మాట్లాడే సమయం తగ్గిపోయింది. దానికి బదులుగా, ఉక్కిరిబిక్కిరి చేసే మెడికల్ టెస్టుల ఆధారంగా రోగాన్ని నిర్ధారించడం పెరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితిలోకి అదనంగా కృత్రిమమేధను కూడా చొప్పిస్తే అది గోరుచుట్టు మీద రోకలిపోటయ్యే ప్రమాదం ఉన్నది.
వైద్యుడు–రోగి ఇరువురూ రోగనిదాన క్రియలో ఎంతో కీలకం. రోగి బెడ్ వద్దకు వైద్యుడు ఆత్మీయంగా చేరగానే రోగికి కొండంత అండ దొరికినట్టు ఉంటుంది. వైద్యుడి స్పర్శ రోగి దేహానికి అమృత సమానంగా, వైద్యుడి మాట రోగి మనసుపై మంత్రంగా పనిచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వసనీయమైన వైద్యుడు రోగికి ప్రసాదించే ఆ ఒక్క కరస్పర్శ– సంజీవిని. అలాంటిది, ఒక రోబోటిక్ స్పర్శ ఈ సజీవ స్పర్శకు సరితూగుతుందా? అసలైన మానవ స్పర్శను సమూలంగా తొలగించి ఆ లోటును భర్తీ చేయగలుగుతుందా?
ఆధునిక చికిత్సా విధానంలో వైద్యుడు నిర్వహించే మరో పార్శ్వం కూడా ఉంది. రోగనిర్ధారణకు ప్రామాణికాలుగా ఎన్నో విధివిధానాలు, దశలవారీ సూచనలు ఉపలభ్యం అవుతూ ఉండొచ్చు. కానీ అనుభవజ్ఞుడైన వైద్యుడు వీటన్నింటినీ గుడ్డిగా అనుసరించడు. తన తెలివినీ, విజ్ఞానాన్నీ, ఏళ్ల తరబడి గడించిన అపారమైన అనుభవాన్నీ రంగరించి ఒక్కొక్క రోగికీ సంబంధించిన రుగ్మతను అతడి ప్రత్యేక శరీర ధర్మానుగుణంగా నిర్ధారిస్తాడు. హెచ్చుతగ్గులను బేరీజు వేసి మరీ తగిన చికిత్సను సూచిస్తాడు. ఎందుకంటే, అన్నింటినీ ఒకే రాటకు కట్టలేం. ఒకే రోగానికి వేరు వేరు వ్యక్తులు వేరు వేరు విధంగా ప్రతిస్పందిస్తారు. ఆ స్పందించిన తీరుపై ఆధారపడి వైద్యుడి చికిత్స ఉంటుంది. అది ఎప్పుడూ ఎవరికి తగ్గట్టు వారికిగా వ్యక్తిగతీకరించబడి ఉంటుంది. అంతేతప్ప, జనసామాన్యంగా, ‘పిడుగుకు, బియ్యానికి ఒకే మంత్రం’లా, ఒక మూసలో పోసినట్టు ఉండదు. ఇలాంటి నైశిత్యం మరమనిషి తరం కాదు!
సమగ్ర బుద్ధితో, సందర్భ శుద్ధితో, ఏళ్ల తరబడి అనుభవంతో వైద్యుడు చేసే రోగ నిర్ధారణ విధానంతో కృత్రిమ మేధ ఎన్నటికీ తలపడలేదు. తన విషయ సంపదతో రోగనిర్ధారణ సమయంలో కచ్చితత్వానికి కొంత ఆలంబనగానూ, శస్త్ర చికిత్సలో మర చేతుల చేత సునిశితత్వాన్ని సాధించే ఒక విలువైన పనిముట్టుగానూ మాత్రమే ఆధునిక వైద్యుడికి ఈ కృత్రిమమేధ ఉపయోగపడుతుంది. ఆ పరిధికి మాత్రమే కృత్రిమమేధ ఉపయోగాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, నేటి వైద్యంలో అవధులు దాటిన కృత్రిమమేధ వినియోగం సృష్టించే ఆపదలు ఎన్నో మనం ఇప్పటికే కళ్లారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. కొందరు రోగులు కృత్రిమ మేధ సహాయంతో తమకు తామే రోగ నిర్ధారణను పూర్తి చేసేసుకుని, ఆ తర్వాత మొక్కుబడిగా, ‘శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదన్న’ట్టుగా మాత్రమే వైద్యుడి దగ్గరకు వస్తున్నారు. ఈ ఒరవడి ఎంతో ప్రమాదకరం.
నా స్వానుభవం ఒకటి ఇక్కడ చెప్పదలచాను. ఒక మహిళకు మొహం మీద పెద్ద ప్రమాదం లేని దద్దుర్లు వచ్చాయి. కానీ ఆమె కృత్రిమ మేధను వాడి ఆ దద్దుర్లను ‘సిస్టెమిక్ లూపస్ ఎరితమటోసిస్’ (SLE) అనే భయంకరమైన ఆటో ఇమ్యూన్ వ్యాధిగా నమ్మింది. ఎంత నచ్చచెప్పినా ఆమె వినలేదు. చివరికి అది SLE కాదని తేల్చడానికి అనవసరంగా ఎన్నో పరీక్షలను ఆమెకు చేయించాల్సి వచ్చింది. ఆ ఫలితాలన్నీ నెగిటివ్‌గా వచ్చాక గానీ ఆమె ఊపిరి పీల్చుకోలేదు. ఇలా కృత్రిమమేధపై పూర్తిగా ఆధారపడిపోయిన అజ్ఞానంతో ఎందరో అనవసర వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు.
కృత్రిమమేధ ఆధునిక వైద్య విజ్ఞానాన్ని మెరుగుపరిచే ఒక అనుబంధంగా ఉపయుక్తం కావచ్చు. కానీ దాని స్థానాన్ని పూర్తిగా ఆక్రమించగలిగే ఒక ప్రత్యామ్నాయం మాత్రం ఎన్నటికీ కాలేదు. ఇది ముమ్మాటికి నిజం.
డా. రఘురామారావు
విశ్రాంత ఆచార్యులు (డెర్మటాలజీ)
ఇవి కూడా చదవండి..
‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News