‘కాగ్’కు భయపడేదెవరు?
ABN , Publish Date - Jul 18 , 2026 | 02:29 AM
‘ప్రజాస్వామ్య వ్యవస్థ లోపాలమయం. అయితే ఇతర పాలనా వ్యవస్థలన్నిటి కంటే అదే ఉత్తమం’ అన్నాడు విన్‌స్టన్ చర్చిల్. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎందుకు ఉత్తమమైన పాలనా వ్యవస్థగా పరిగణిస్తామంటే, ఈ వ్యవస్థలో...
‘ప్రజాస్వామ్య వ్యవస్థ లోపాలమయం. అయితే ఇతర పాలనా వ్యవస్థలన్నిటి కంటే అదే ఉత్తమం’ అన్నాడు విన్‌స్టన్ చర్చిల్. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎందుకు ఉత్తమమైన పాలనా వ్యవస్థగా పరిగణిస్తామంటే, ఈ వ్యవస్థలో అనేక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండడం వల్ల. అయితే ప్రజాస్వామ్యంలోనున్న బ్యాలెన్సింగ్ వ్యవస్థల్ని మన పాలకులు నిర్వీర్యం చేస్తున్నందువల్ల ఉత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థ కాస్తా నేడు ఉత్త వ్యవస్థగా మారిపోయింది.
మనకున్న అత్యుత్తమ రాజ్యాంగ వ్యవస్థలలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఒకటి. ఇది స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థ. కాగ్ ప్రధానంగా మూడు రకాలైన ప్రభుత్వ ఆడిట్లను నిర్వహిస్తుంది. అవి– ప్రభుత్వాల నిబంధనలు, ఆదేశాలు, సూచనల ఆచరణ, పథకాలు, కార్యక్రమాల అమలు అంచనా, ఫైనాన్షియల్ ఆడిట్ (ప్రభుత్వ ఖాతాలు, ప్రభుత్వరంగ సంస్థల ఖాతాలు). ‘కాగ్’ ఏటా తన ఆడిట్ నివేదికలను కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి, రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌లకు సమర్పిస్తుంది. ఆ తర్వాత వాటిని పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెడతారు. ఈ ఆడిట్‌లను ప్రవేశపెట్టిన తర్వాత అవి బహిరంగ పత్రాలవుతాయి. కనుక వాటిపై ఎవరైనా చర్చ చేయొచ్చు. ‘కాగ్’ ఒక సలహా సంస్థ మాత్రమే. తన నివేదికలను అమలు చేయాలని శాసించే అధికారం కాగ్‌కు లేదు. అయితే కాగ్ నివేదికలను ప్రభుత్వం అధికార ప్రతిపక్ష పార్టీలతో కూడిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC)కి పంపుతుంది. పీఏసీ ఆ నివేదికలను వివరంగా సమీక్షించాల్సి ఉంటుంది. ‘కాగ్’ లేవనెత్తిన అంశాలపై వివరణలు కోరుతూ ఆయా లోపాలపై ప్రభుత్వం విచారణలకు ఆదేశిస్తుంది. అంతేకాదు, తాము చేసిన సిఫార్సులపై తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదికలు (యాక్షన్ టేకెన్ రిపోర్ట్) ఇవ్వాలని ప్రభుత్వాన్ని పీఏసీ కోరుతుంది. ఈ మొత్తం ప్రక్రియ వల్ల పన్ను కట్టే ప్రజల సొమ్ము ఏ విధంగా ఖర్చు అవుతున్నదో అందరికీ తెలుస్తుంది. అలాగే ఏయే ప్రభుత్వ పథకాల్లో లోపాలు జరిగాయో, అవినీతి ఎక్కడ ఉన్నదో తెలుస్తుంది. లోపాలు, అవినీతి ఆడిట్‌లో తేలిన తర్వాత వాటిని దర్యాప్తు సంస్థలకు నివేదించి బాధ్యుల్ని గుర్తించి వారిపై కేసులు పెడతారు.
‘కాగ్’ ఆడిట్ నివేదికల ఆధారంగానే 2011లో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం, 2013లో బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం బయటపడ్డాయి. ‘కాగ్’ నిర్వహించే పోస్టుమార్టంలో ఇలాంటి అక్రమాలు ఎన్నో బయటపడడానికి ఆస్కారం ఉంది. అయితే, మన పాలకులు అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని బలహీనపరుస్తున్న విధంగానే ‘కాగ్’ నివేదికలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఒకప్పుడు పార్లమెంట్, అసెంబ్లీల బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో ‘కాగ్’ నివేదికలను ప్రవేశపెట్టేవారు. ప్రతిపక్ష పార్టీలు అందులోని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేవి. అక్రమాలపై దర్యాప్తు చేయిస్తామని అధికార పార్టీ హామీ ఇచ్చేవరకు ప్రతిపక్షాలు పోరాడేవి. ‘కాగ్’ ఆడిటింగ్ ప్రామాణికం కనుక ప్రభుత్వం తప్పనిసరిగా అక్రమాలపై చర్యలు చేపట్టేందుకు సుముఖత చూపేది.
కానీ నేటి పాలకులు వ్యవస్థల్లో ఉన్న లొసుగుల్ని ఆధారం చేసుకుని తప్పించుకోవాలని చూస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 151 ప్రకారం ‘కాగ్’ నివేదికలను శాసనసభల ముందు ఉంచడానికి ఎటువంటి కాలపరిమితి లేదు. కనుక పలు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాల చివరిరోజున మొక్కుబడిగా ‘కాగ్’ నివేదికలను ప్రవేశపెడుతున్నాయి. ఆ నివేదికలలో ఏమున్నదో సభ్యులు, మీడియా, ప్రజలు తెలుసుకునేలోపు శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడతాయి. దాంతో, అసెంబ్లీలో ‘కాగ్’ నివేదికలపై చర్చ జరగడం లేదు. గతంలో ఢిల్లీ ప్రభుత్వం ‘కాగ్’ నివేదికలను నాలుగేళ్ల పాటు తొక్కిపెట్టింది. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇటువంటి అసాధారణ జాప్యం జరిగింది.
‘కాగ్’కు ఉన్న సహజ పరిమితులలో అది నేరుగా ప్రైవేటు సంస్థలను ఆడిట్ చేయలేదు. అంతేకాదు, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ)లో చేపట్టే పనులను కూడా ఆడిట్ చేయలేదు. ప్రస్తుతం, దాదాపుగా అన్ని రకాల భారీ ప్రాజెక్టులూ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న నేపథ్యంలో సదరు ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవకతవకలు, అవినీతిని ఎవరూ బయటపెట్టలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ‘కాగ్’ పరిధిని ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిసి పనిచేసే ప్రైవేటు సంస్థలకూ విస్తరించాల్సిన అవసరం ఉంది. కానీ, ఈ దిశగా నిర్ణయం తీసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అలాగే ‘కాగ్’ నివేదికలను నిర్ణీత కాలవ్యవధిలో చట్టసభలలో ప్రవేశపెట్టాలన్న నిబంధన విధించాలని కోరడానికి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చొరవ తీసుకోవటం లేదు.
‘కాగ్’ ఆడిటింగ్ నివేదికలలో మరో కీలకమైన పార్శ్వం కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై అది అందించే వాస్తవాలు. ఇవి ప్రభుత్వాల పరిపాలనా సామర్థ్యానికి కొలమానంగా నిలుస్తాయి. జూన్ 18, 2026న కాగ్ వెల్లడించిన కొన్ని ఆర్థిక అంశాలు పరిశీలించినప్పుడు మన దేశం, కొన్ని రాష్ట్రాలు ఏ దిశగా పయనిస్తున్నాయో అర్థం అవుతున్నది. ‘కాగ్’ తాజా నివేదిక ప్రకారం, గత పదేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాల ఖర్చులు 13శాతం పెరిగాయి. జీతాలు, పెన్షన్లు, అప్పులపై వడ్డీ చెల్లింపులకే రాష్ట్రాల ఆదాయంలో అధిక భాగం పోతోంది. ఆశ్చర్యకరమూ, ఆందోళనకరమూ అయిన అంశం ఏమంటే దేశంలోని 12 రాష్ట్రాలు పెన్షన్ల కోసం వెచ్చించే మొత్తం కంటే, తీసుకున్న రుణాల మీద వడ్డీలకు చెల్లించేది ఎక్కువగా ఉంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఓవర్ డ్రాఫ్టు (చేబదుళ్లు) సౌకర్యంలో 62శాతం మేర పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకున్నట్లు తెలిపింది. కీలకమైన మరో అంశం– రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 32.8శాతం మించి రుణాలు స్వీకరించరాదన్న నిబంధనను పక్కనపెట్టి 2024–25 ఆర్థిక సంవత్సరంలో 35.69శాతం మేర 13 రాష్ట్రాలు రుణాలు స్వీకరించాయని, అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
‘కాగ్’ నివేదికలపై అటు చట్టసభల్లోగానీ, వెలుపలగానీ చర్చలు జరగడం బాగా తగ్గిపోయింది. అంటే ప్రభుత్వాల్లో జవాబుదారీతనం లోపించింది. ‘కాగ్’ వెల్లడించే అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటే అర్థం.. ప్రభుత్వ పథకాల అమలులో జరిగే అవినీతి అవకతవకలపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవని. గతంలో ‘కాగ్’ నివేదిక ఆధారంగా– తప్పు చేసిన కాంట్రాక్టర్లకు భారీగా జరిమానా వేసేవారు. ఆ నివేదికల ఆధారంగానే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, (సీవీసీ), లోకాయుక్త, అవినీతి నిరోధక శాఖ మొదలైన వ్యవస్థలు అవినీతిపరుల భరతం పట్టేవి. ఇప్పుడు అది నామమాత్రంగా మారిపోయింది.
‘కాగ్’ నివేదికలపై చర్చలు, చర్యలు లేనప్పుడు ‘కాగ్’ వల్ల ప్రయోజనం ఏమిటి? దాని నివేదికలకు దిక్కూ మొక్కూ లేనప్పుడు, పాలనలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి పాతర వేసినప్పుడు కాగ్ ఉండి కూడా లాభం ఏమిటి? ఉన్నతమైన ఈ రాజ్యాంగ వ్యవస్థకు గ్రహణం పట్టించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
సి. రామచంద్రయ్య
ఏపీ శాసనమండలి సభ్యులు
ఈ వార్తలనూ చదవండి:
130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్!
భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు