Share News

అందమైన అక్షర శిల్పం

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:36 AM

బుచ్చిబాబు 1946 లో వ్రాసిన కథ ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’. ఈ కథలో ప్రధానమైన పాత్రలు రెండు. ఒకటి కథను పాఠకుడికి చెప్పిన ‘నేను’. రెండవది...

అందమైన అక్షర శిల్పం

బుచ్చిబాబు 1946 లో వ్రాసిన కథ ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’. ఈ కథలో ప్రధానమైన పాత్రలు రెండు. ఒకటి కథను పాఠకుడికి చెప్పిన ‘నేను’. రెండవది ‘కుముదం’ అనే స్త్రీ. ఈ ‘నేను’కు ఇరవైయేళ్ళ వయసులో కథ మొదలవుతుంది. కుముదానికి అప్పుడు పద్దెనిమిదేళ్ళు. అప్పటికే కుముదానికి పెళ్ళయింది. కథ ముగిసే నాటికి ‘నేను’ ముఫ్ఫై నాలుగేళ్ళ వయసువాడు. అప్పటికీ అవివాహితుడే. కుముదానికి ముఫ్ఫై రెండేళ్ళు.

మనలో చాలామంది మధ్య తరగతి జీవితాలు, పుట్టుక నుంచి గిట్టేదాకా మూస పోసినట్లు ఒకే రకంగా, ఒకే విధమైన రోజువారీ పనులతో, కొత్తదనమేమీ లేకుండా వుంటాయి కనుక, జీవితానికి అలా ఒక అర్థమంటూ లేకుండా బతకడమే తప్ప, మరే అర్థమూ లేదు అన్నది కథలోని ఇరువురు ప్రధాన పాత్రల మధ్య జరిగిన సంభాషణకు ముఖ్య విషయం.

‘‘ఎక్కడో ఎప్పుడో పుట్టడం, ఎవరో ఎవర్నో ఒప్పగిస్తే వారిని పెళ్ళాడడం, ఎందుకో తెలీకుండా పిల్లల్ని కనడం, ఎప్పుడో ఎక్కడో చచ్చిపోవడం. ఇది చాలామంది చేస్తున్నది. దీన్ని గురించి కథగా చెప్పుకునేందుకు ఏముంది ప్రత్యేకత? వ్యక్తిత్వం లేని ఈ జీవితాలు ప్రశాంతాన్ని పొందుతున్నాయి. కాని, అది బురద గుంటలో పురుగు పొందే ప్రశాంతత’’ – అంటాడు కథలో ‘నేను’ పాత్ర.

‘‘నాకేదో చెప్పాలనుంది. ఎట్లా చెప్పాలో తెలీడం లేదు. నేను చదువుకున్న దాన్ని కాదు’’, ‘‘సూర్యుడూ, చంద్రుడూ ఎప్పుడూ చూస్తూంటాను. కాని, ప్రతిసారి ఎందుకో క్రొత్తగా కనబడతాయి. మంచినీళ్ళు రోజూ త్రాగుతా. కాని ప్రతిసారి ఎంతో క్రొత్తగా వుంటాయి’’, ‘‘నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు. నేను అనుభవిస్తాను’’ – అంటుంది కుముదం పాత్ర.

కథాంతంలో, కుముదం న్యుమోనియాతో పోరాడుతూ హాస్పిటల్లో ఉండగా చూడడానికి వెళ్ళిన అతడు ‘అనుకోకుండా’ తన చేతిని ఆమె చేతిపై ఆనించబోగా, వెంటనే చేతిని లాగి దుప్పటిలో దాచేసుకుని ‘‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నాకోసం,’’ అంటుంది కుముదం.


కుముదం ఆ మాటలు కథలో అతడికి ఒక జ్ఞానోదయం! ఈ జ్ఞానోదయం అతడి ప్రపంచాన్ని తలక్రిందులు చేసి అతని జీవిత పరమావధినే తారుమారు చేసిందని ఒప్పుకుంటాడు. అదే కుముదం సాధించిన విజయం, ఆమె ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే ‘ఆమె గురించి కథ వ్రాయించేలా’ చేసిందని పాఠకుడికి రచయిత చివరలో చెప్పిన మాట.

కథాంతంలో కుముదం మాటల వలన అతడికి కలిగిన జ్ఞానోదయం రెండు సంగతులను చెప్పింది: ఒకటి – ‘అతడు తనను ప్రేమిస్తున్నాడు’ అన్న అభిప్రాయంలో కుముదం వుంది. రెండు – ‘తాను కుముదాన్ని ప్రేమిస్తున్నాడు’ అన్న అభిప్రాయంలో అతడు లేడు.

ఈ అయోమయం అసలుకు ఎవరిది? మొదటి నుంచి చూసుకుంటూ వస్తే: పదేళ్ళ వయసులో, ఆటలలో భాగంగా, ‘‘నన్ను గురించి కథ చెప్పవూ?’’ అని అతడిని అడిగింది కుముదం. అదే కుముదం పద్దెనిమిదేళ్ళ వయసులో ‘‘నన్ను గురించి కథ వ్రాయవూ?’’ అని అడిగింది. కుముదం వ్యక్తం చేసిన ఆ కోరిక గురించి ‘‘తన వ్యక్తిత్వాన్ని గుర్తుంచుకుని, దాని ప్రభావాన్ని ఇతరులకి తెలియచెయ్యాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ఆమె ఒక జీవి. ప్రత్యేకమైన ఉనికి గలది. ఆమెని తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది’’ అంటాడతను.

కుముదం అందమైనది కాదు. అసాధారణ స్త్రీ కాదు. అయితే, కొన్ని సందర్భాలలో మాత్రం జీవితానికి సంబంధించిన గంభీరమైన సంగతులను సైతం సులభంగా అర్థం చేసుకుని వ్యాఖ్యానించగల స్త్రీ వలె కనపడుతుంది:

‘‘మనం ప్రకృతికి దాస్యం చెయ్యడం తప్పదు. దాస్యం నేను సహించలేను. కానీ, అది తప్పదనుకుంటాను’’, ‘‘ప్రపంచాన్ని మనం ఏదేనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్నీ ఆశించకుండా, దూరంగా వుండి చెయ్యగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాల ముందు వాల్తుంది’’, ‘‘నేను నువ్వైతే ఏం చేద్దునో తెలుసా? నదీ తీరాన్న చిన్న తాటాకు పాక కట్టుకుంటాను. అందులో కూర్చుని, ఊరికే చదువు నేర్పుతానని చాటింపు వేయిస్తాను. మొదట ఏ పదిమంది పొలం కాపులో వస్తారు. సాయంత్రం వాళ్ళకి బోధించడం మొదలెడతాను. ఇరుగు పొరుగు నుంచి అనేకమంది కర్షకులు, కూలివాళ్ళు చదువు కోసం వస్తారు. ఉత్త చేతుల్తో రాకుండా, ఒకరు వుప్పు, చింతపండు, ఒకరు పాలు అలా నాకు కావల్సిన వాటిని వాళ్ళే సిద్ధం చేస్తారు. వారు నా శిష్య బృందం. వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటా. వారి తగాదాలకు తీర్పు చెపుతా. అంతే. అప్పుడు నా జీవితం వృథా అనుకోను’’. – ఇదీ కుముదం.


ఉద్యోగం సద్యోగం లేకుండా, అర్థంలేని భావుకత్వపు ఆలోచనలలోను, ఆచరణ సాధ్యం కాని ఆదర్శవాదంలోను కొట్టుకుపోతున్నట్లుగా కనిపించే అతని జీవితానికి ఒక దిశను చూపడానికి ప్రయత్నించింది కుముదం. అతడు కుముదం మాటలను ఖాతరు చెయ్యడు. కథ చివరలోనూ అదే స్థితిలో ఉంటాడు తప్ప మార్పేమీ వుండదు. వ్యర్థంగా జీవితాన్ని గడుపుతూ వచ్చి, చివరలో, కుముదం చేయి ముట్టుకోబోతాడు. ఆమె అంగీకరించదు. ఇక అదే ఆఖరి ప్రయత్నంగా ‘‘నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు – నా కోసం’’, ‘‘నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం....’’ మాట పూర్తికాకుండానే కళ్ళు మూసింది ఆమె.

మరణానికి ముందు కుముదం మాటల ప్రభావంతోనే ఆమె గురించి కథ రాయడం జరిగినదనడానికి సూచనగా, కథాంత వాక్యంలో ‘‘నా ప్రపంచాన్ని తలక్రిందులు చేసి నా జీవిత పరమావధినే తారుమారు చేసిన కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను?’’ అని ఉత్ప్రేక్షిస్తాడు అతడు. కథ మొదలు నుండి కుముదంలో ఏ ప్రత్యేకత లేదంటూనే, కుముదంను గురించి ఏది చెప్పినా ఉత్ప్రేక్షలనే అలంకారాన్ని జత చేసి తప్ప చెప్పడు. కథలో అది ఒక ప్రయత్నపూర్వక వైరుధ్యం. కథ ఆద్యంతం అలంకారికంగా సాగించిన శ్లేష!

కథ చదవడం ముగియగానే ఒక్క సందేహం కలుగుతుంది. ఈ కథలోని కుముదం అర్్ధాంతరంగా చనిపోకుండా, డెబ్భై ఎనభై ఏళ్ళు నిండుగా బతికి, ముసలితనంతో చనిపోయి ఉంటే ఏమై ఉండేది? ఏమీ అయి ఉండేది కాదని, అసలు కథే ఉండేది కాదని ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కథలో తాను సాధించి చూపాలనుకున్న సౌందర్యాన్ని కరుణరసభరితంగా చూపడం కోసం, వేరే మార్గం కనపడక, కథను అలా ముగించక తప్పలేదేమో అనిపిస్తుంది. నిపుణుడైన శిల్పి చేతిలో శిల అందమైన శిల్పంగా మలచబడి ఆనందాన్ని కలిగిస్తుంది. అలా మలచబడడంలో అందమైన శిల్పంగా మారడం తప్ప, జీవితాన్ని నిర్వచించి చెప్పే కొత్త అర్థము గాని, విలువ గాని ఉండవు. ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ కథ కూడా అటువంటిదే ఒక అందమైన అక్షర శిల్పం.

భట్టు వెంకటరావు

ఈ వార్తలూ చదవండి

పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్

క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!

Updated Date - Oct 05 , 2026 | 04:36 AM