వ్యాకరణవేత్త, భాషా శాస్త్రవేత్త
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:53 AM
నవల, నాటకం, శతకం, పద్యం, వచనకవిత్వం వంటి వివిధ ప్రక్రియలలో గ్రంథాలు రచించడమే కాక, అనువాద రచనలు, ప్రసంగ వ్యాసాలు, వ్యాకరణంపై సిద్ధాంత వ్యాసాలు, భాషాశాస్త్ర పరిచయ గ్రంథాలు, బాలవ్యాకరణ...
నవల, నాటకం, శతకం, పద్యం, వచనకవిత్వం వంటి వివిధ ప్రక్రియలలో గ్రంథాలు రచించడమే కాక, అనువాద రచనలు, ప్రసంగ వ్యాసాలు, వ్యాకరణంపై సిద్ధాంత వ్యాసాలు, భాషాశాస్త్ర పరిచయ గ్రంథాలు, బాలవ్యాకరణ వ్యాఖ్యాన గ్రంథాలను కలిపి ముప్పైకి పైగా రచనలు చేశారు బొడ్డుపల్లి పురుషోత్తం. ఆయన నిరంతర పరిశీలకుడు, పరిశోధకుడు. జాతీయ స్థాయిలో జరిగిన ‘ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ కాన్ఫరెన్సులు’లో పాల్గొని అనేక పరిశోధన పత్రాలు సమర్పించారు.
వ్యాకరణ శాస్త్రగత రహస్యాలను ఆధునిక శబ్ద శాస్త్రంతో సమన్వయిస్తూ బోధించాలని నిర్ణయించిన మార్గదర్శి.. తన గురువర్యులు ఆచార్య గంటిజోగి సోమయాజికి అంకితంగా తేటగీతిలో పురుషోత్తం రచించిన భాషాశాస్త్ర పద్యకృతి ‘వాగనుశీలనం.’ పురుషోత్తం పీహెచ్‌డీ పరిశోధనా సిద్ధాంత గ్రంథం ‘తెనుగు వ్యాకరణ వికాసం’ ఆంధ్రదేశంలో వ్యాకరణాల గురించి చేసిన మొట్టమొదటి పరిశోధనగా గుర్తింపు పొందింది. భాషాశాస్త్ర దృష్టితో తెలుగు వ్యాకరణాన్ని విశ్లేషించిన విశిష్ట గ్రంథమిది. ఆచార్య దువ్వూరి వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో, ఆచార్య రవ్వా శ్రీహరితో కలిసి ‘వ్యాకరణ పదకోశం’ తయారు చేశారు పురుషోత్తం. వ్యాకరణ వాఙ్మయంలోని సంజ్ఞలను, పారిభాషిక పదాలను సేకరించి, వివరించి, విశ్లేషించిన గ్రంథరాజమైన ఈ పదకోశాన్ని తెలుగు అకాడమీ, హైదరాబాద్ ముద్రించింది. పురుషోత్తం రచనలన్నీ ఒక ఎత్తయితే, ‘ది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్’, తిరువనంతపురం వారు ఆయన చేత రచింపజేసిన ‘తెలుగు వ్యాకరణ సిద్ధాంతాలు’ అనే గ్రంథం ఒక్కటీ మరో ఎత్తు. దీనిని ఆంగ్లంలో రచించడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పురుషోత్తం కృషికి విశేష గుర్తింపు లభించింది.
‘ఉపన్యాస కేసరి’ బిరుదాంకితులైన పురుషోత్తం... యావదాంధ్రదేశంలోనే కాక, అమెరికాలో కూడా పర్యటించి రామాయణం, భారతం, భాగవతం గురించి, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీ అరవిందుల గురించి విస్తృత ప్రసంగాలు చేశారు. అనేక సాహిత్య, ఆధ్యాత్మిక మాసపత్రికలకు వ్యాసాలు రచించారు. ఆకాశవాణి, విజయవాడ కేంద్రం నుంచి నలభై సంవత్సరాలకు పైగా అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగాలు చేశారు.
వి.ఆర్.ఎస్. & వై.ఆర్.ఎన్. కళాశాల, చీరాలలో పనిచేస్తున్నప్పుడే, 1958లో ‘తెలుగు నిరుక్త రచన’ (Telugu Etymological Dictionary) ప్రాజెక్టులో పరిశోధన విద్యార్థిగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. ఆ ప్రాజెక్టులో పనిచేస్తూనే, ఆచార్య గంటిజోగి సోమయాజి మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీలో చేరి, 1964లో ‘తెనుగు వ్యాకరణ వికాసము’ అనే పరిశోధనా సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. తరువాత బొబ్బిలి కళాశాలలో ఒక ఏడాది అధ్యాపకులుగా పనిచేసి, తమ సొంత ఊరు అయిన బాపట్లలో ‘ఆర్ట్స్ అండ్ సైన్స్’ కళాశాల ఏర్పడటంతో అందులో అధ్యాపకులుగా చేరారు.
1968లో గుంటూరు జిల్లా నల్లపాడు ఏయూ పీజీ సెంటర్‌లో అధ్యాపకునిగా, తరువాత 1976 నుంచి నాగార్జున విశ్వవిద్యాలయంలో రీడరుగా పనిచేశారు. 1985లో ఆచార్యులుగా, తెలుగు –ప్రాచ్య శాఖాధ్యక్షులుగా ఉన్నారు. ‘జాతీయ ఆచార్యులు’గా యూజీసీ వారిచే గౌరవం పొందిన పురుషోత్తం... బెనారస్, ఢిల్లీ, మైసూరు, అన్నామలై విశ్వవిద్యాలయాలలో తమ ప్రసంగాల పరంపరలను వెలువరించారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉన్నప్పుడే ఆ విశ్వవిద్యాలయానికి ఒక ‘గీతం’ (Nagarjuna University Anthem) రచించి, తన శిష్యురాళ్లచే స్వరపరచి పాడించారు. ఇప్పటికీ ఆ గీతమే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ సభల ప్రారంభ సమయాలలో వినబడుతోంది. పురుషోత్తం పర్యవేక్షణలో 18 మంది పీహెచ్‌డీలు, 19 మంది ఎం.ఫిల్ డిగ్రీలు పొందారు. ఆయన చేయించిన పరిశోధనలు ఊరకనే మూసలో పోసినట్లు కాకుండా, చక్కని అధ్యాయ విభజనలతో, నూతన శోధనలతో కూడి ఉండేవి.
ప్రాచీన, ఆధునిక ఆంధ్ర సాహిత్యాలను గురించి, తెలుగు సమాస, కారక వైఖరులను గురించి, ఛందస్సు, వ్యాకరణాలను గురించి, కవుల భాషా–శైలి విశేషాలను గురించి పరిశోధనలు చేయించారు. ప్రతి సిద్ధాంత వ్యాసంలోనూ పరిశోధకుడు తనదైన సిద్ధాంతాన్ని స్థాపించాలనేవారు. సాహిత్యాంశాల మీద పరిశోధన చేయించేటప్పుడు, అందులోని భాషా విషయాలను కూడా పరామర్శింపజేసేవారు. పరిశోధక పర్యవేక్షకుడిగా ఆయనకు ఎన్నో విషయాల మీద లోతైన అవగాహన, అధ్యయనం, విషయ వివేచన చేయగల సామర్థ్యం ఉండేది.
1987 జూలైలో ఉద్యోగ విరమణ పొందారు. జీవితంలో ఎదురైన ఎన్నో ఒడుదుడుకులను, కష్టనష్టాలను దాటుకుంటూ తనదైన లక్ష్యాన్ని అందుకున్న ‘కర్మవీరుడు’ పురుషోత్తం. తాను ఎక్కిన ప్రతి మెట్టును స్వయంకృషితో నిర్మించుకున్న నిత్య కృషీవలుడు. మరొక అరుదైన విషయం ఏమిటంటే... మన్నవ సత్యనారాయణ అనే అంధ విద్యార్థి చేత పరిశోధన చేయించటం పురుషోత్తం సహనానికి, ఉదార హృదయానికి నిదర్శనం.
కఠినమైన వ్యాకరణశాస్త్ర విషయాన్ని తన సహజమైన హాస్యప్రవృత్తితో మేళవించి బోధించడం పురుషోత్తం వైలక్షణ్యం. బోధన, శోధన, రచనా వ్యాసంగం వారికి అత్యంత ప్రీతిపాత్రం. ఆకాశవాణి, విజయవాడ కేంద్రం నుంచి నలభై సంవత్సరాలకు పైగా అనేక సాహిత్య కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగాలు చేశారు. ఈ విధంగా నిత్య పరిశోధకునిగా, నిరంతర వ్యాసంగ తత్పరునిగా, కవిగా, విమర్శకునిగా, వ్యాకరణవేత్తగా తన జీవన ప్రస్థానాన్ని సాగించారు పురుషోత్తం. 1926, జూలై 22న బాపట్లలో బొడ్డుపల్లి సుబ్బమ్మ, వీర రాఘవయ్యలకు జన్మించిన ఈయన 2000, ఫిబ్రవరి 4న కీర్తిశేషులయ్యారు. దాదాపు 30కు పైగా గ్రంథాలు రచించిన పురుషోత్తం యూజీసీ వారిచే జాతీయాచార్య పురస్కారాన్ని పొందిన తొలి అధ్యాపకులు. వీరి శిష్యులు ఎంతోమంది ఇప్పటికీ పలు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు.
ఈతకోట సుబ్బారావు
(నేడు బొడ్డుపల్లి పురుషోత్తం శత జయంతి)
ఇవి కూడా చదవండి
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్
12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..