ఆందోళనల వెనుకున్నది అధికార దాహమే!
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:43 AM
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే నిద్రాణమై ఉన్న భారత వ్యతిరేక అదృశ్య శక్తులు ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు...
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే నిద్రాణమై ఉన్న భారత వ్యతిరేక అదృశ్య శక్తులు ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు, వాటి వెనకున్న కారణాలను అన్వేషిస్తే విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతలు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం సహజం. భారతదేశం వంటి ఆదర్శ ప్రజాస్వామ్య రాజ్యంలో గతంలో ఎన్నో ఆందోళనలు జరిగాయి కానీ, ఇంత విద్వేషపూరితమైన, అసాధారణమైన పరిస్థితులు చూడటం బహుశా ఇదే మొదటిసారికావచ్చు. ఇవన్నీ చూస్తుంటే దేశంలో జరుగుతున్న అసహన రాజకీయాలు రూపుమార్చుకొని, అంతమొందించే రాజకీయాలుగా రూపాంతరం చెందాయన్న విషయం తెలుస్తోంది.
పక్కా ప్రణాళిక ప్రకారం విచ్ఛిన్నకర శక్తులు దేశంలో అలజడి సృష్టించడానికి ఎదురుచూస్తుండగా వచ్చిన ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని, అవి తమ దుశ్చర్యలకు రూపం కల్పించినట్టుగా ఈ ఆందోళన కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా అధికారం కోసం అర్రులు చాస్తూ వస్తున్న అవకాశవాద రాజకీయ నాయకులు తమ నిజస్వరూపాన్ని, ఈ దేశం పట్ల వారికున్న దురుద్దేశాన్ని, దేశ ప్రజల సంక్షేమం పట్ల వారికున్న నిర్లక్ష్య భావాన్ని నేడు బట్టబయలు చేస్తున్నారు.
ఇరవై ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేసిన వాంగ్‌చుక్ గత చరిత్ర కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలతోనే ముడిపడి ఉంది. చైనాకు మద్దతుగా, పీఓకేను ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పాకిస్థాన్‌లో కలపాలని వాదించిన వ్యక్తి. పర్యావరణ కార్యకర్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన వాంగ్‌చుక్ చేసినవన్నీ దేశ వ్యతిరేక కార్యకలాపాలే.
నిజంగా ఇది నీట్ కోసం జరిగిన ఉద్యమమే అయితే, అక్కడ నీట్ విద్యార్థులు కానీ, కనీసం వారి తల్లిదండ్రులు కానీ కనిపించలేదు. ఇప్పటివరకూ దేశంలో వందల పేపర్ లీకేజీలు జరిగాయి. అది వ్యవస్థలోని లోపాలను ప్రతిసారీ ఎత్తిచూపుతూనే ఉంది. అదీగాక, రీ–ఎగ్జామ్ జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత, నిందితులను గుర్తించి అరెస్టు చేసిన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగడం వెనుక వారి ఉద్దేశం ఏమిటి? అధికార దాహంతో వ్యవహరిస్తున్న శక్తులు తమ దుష్ట ఉద్దేశాలను అమలు చేయడానికి యువత బలహీనతలను అవకాశంగా మార్చుకుంటున్నాయి. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లో వలే ఇక్కడ కూడా అశాంతి సృష్టించేలా దేశద్రోహ కార్యక్రమాలు చేపట్టి, ప్రభుత్వంపై తిరుగుబాటు జరుగుతున్నట్లు చిత్రీకరించాలనే వారి కుట్ర బయటపడుతోంది. కాక్రోచ్ పార్టీ నాయకులు కొంతకాలం క్రితం జంతర్ మంతర్ వద్ద చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని బహిర్గతం చేశాయి.
అంతేకాకుండా, ఆందోళనల సమయంలో మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, అసభ్య వ్యాఖ్యలు చేయడం, మహిళా జర్నలిస్టులను దుర్భాషలాడడం వంటి ఘటనలు ఏ ఉద్యమానికీ సమర్థనీయమైనవి కావు. ఇంటర్నెట్‌ను నిలిపివేసిన పరిస్థితుల్లో కూడా మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఆందోళనలకు రూపకల్పన చేయడం, నిఘా వర్గాలకు చిక్కకుండా హింసాత్మక చర్యలను నిర్వహించడం వంటి అంశాలను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రేరేపిత ఉద్యమం కాకపోతే కేవలం జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు వచ్చినవారు.. భద్రతా దళాల కన్నుగప్పి ప్రధాని నివాసంపై దాడికి యత్నించడం, ఒక్కసారిగా ప్రతిపక్ష నాయకులు ప్రధాని నివాసానికి చేరుకుని ఆందోళన చేయటం రాజకీయ కుట్ర కాక మరేమిటి? అంతకు మూడు రోజుల ముందు అమెరికా వంటి దేశం తన పౌరులకు అడ్వైజరీ జారీ చేయడం గమనించాల్సిన విషయం. ఆందోళనకారులకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే విషయాన్ని కూడా కేంద్ర నిఘా సంస్థలు పరిశీలిస్తున్నాయి.
ప్రపంచంలోని కొన్ని దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. భారతదేశాన్ని అంతర్జాతీయంగా అస్థిరంగా చూపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే, దేశంలో రాజకీయంగా బలపడలేని, ప్రజా మద్దతు లేని నాయకులు, ‘అసహనం’ పేరుతో గతంలో ఉద్యమాలు చేసినవారు, ఆపరేషన్ కగార్ ఆపి నక్సల్స్‌ను కాపాడాలని చర్చలు జరపాలన్నవారు, అవార్డులు వాపస్ ఇచ్చిన ప్రముఖులను ఇప్పుడు తమ డిమాండ్లకు మద్దతుగా నిలబెట్టే ప్రయత్నం చేయడం రాజకీయ అసహనం కాక మరేమిటి? అలాంటి రాజకీయ పార్టీలు నేటి ఆందోళనకారులకు తోడవడం వారి ఉద్దేశాలను బట్టబయలు చేసింది. అక్కడకు వచ్చిన యువత సహజంగా వచ్చినవారు కాదు; వివిధ రాజకీయ పార్టీలు పంపిన పెయిడ్ బ్యాచ్‌లుగా కనిపించారు. అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులపై కూడా దాడులు చేశారు. పోలీసులపై, సాయుధ బలగాలపై చెలరేగి, వారిని రెచ్చగొట్టి లాఠీచార్జికి ప్రేరేపించే ప్రయత్నం జరిగింది. గతంలో హైదరాబాద్‌లో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను జాతీయ సమస్యగా చిత్రీకరించినట్లుగానే, ఇక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటై ఆ మంటల్లో చలి కాచుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పటికీ తెలంగాణలో నక్సల్ సానుభూతిపరులకు, అర్బన్ నక్సల్స్‌కు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఆశ్రయం ఇస్తూ, సమయం వచ్చినప్పుడు వారిని రాజకీయ దాడులకు వాడుకుంటోంది.
విదేశాల్లో పుట్టిన కాక్రోచ్ పార్టీ... ప్రతిపక్షాలతో చేరి, తమకున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటూ, మోదీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేంద్ర మంత్రులు పార్లమెంట్ వేదికగా చర్చకు అంగీకరించారు. కానీ, చర్చలో పాల్గొనకుండా తమ విధ్వంసక చర్యలను కొనసాగించడానికి మొగ్గు చూపిన కాక్రోచ్ పార్టీ అంతరంగం అర్థమవుతోంది. ప్రధాని మోదీ ఈ పేపర్ లీకేజీ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని, ఇప్పటికే సంబంధిత మంత్రులతో చర్చించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. పేపర్ లీకేజీల విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపించి, వేగంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు.
బలహీనమైన దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన హింసాత్మక పరిణామాలను భారతదేశంలో కూడా పునరావృతం చేయాలనే కుట్రలు ఎప్పటికీ విజయవంతం కావు. చైతన్యవంతమైన భారత యువత ఇవన్నీ గమనిస్తూనే ఉంది. గోరంతను కొండంతగా చూపిస్తూ యువతను, విద్యార్థులను రెచ్చగొట్టే రాజకీయాలను దేశం సహించదు. సమయం వచ్చినప్పుడు ఈ దేశ యువత ప్రతిపక్షాలకు తప్పక సమాధానం ఇస్తుంది.
ఎన్. రాంచందర్‌రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
ఇవి కూడా చదవండి
మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న
ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్