Share News

తెలంగాణ సమస్యలు తీరిస్తేనే అధికారం!

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:18 AM

రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలలో ఎనిమిది సీట్లను భారతీయ జనతా పార్టీకి తెలంగాణ సమాజం కట్టపెట్టింది. తద్వారా సగం వరకు శాసనసభ స్థానాలలో పార్టీ పరోక్షంగా, మునుపెన్నడూ లేనంత బలం...

తెలంగాణ సమస్యలు తీరిస్తేనే అధికారం!

రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలలో ఎనిమిది సీట్లను భారతీయ జనతా పార్టీకి తెలంగాణ సమాజం కట్టపెట్టింది. తద్వారా సగం వరకు శాసనసభ స్థానాలలో పార్టీ పరోక్షంగా, మునుపెన్నడూ లేనంత బలం పొందింది. రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరేయాలని కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. కానీ కేంద్ర ప్రభుత్వంలోని పార్టీ అధినాయకులపై తెలంగాణకు చెందిన పలు సమస్యల పరిష్కారం కోసం మంత్రులు, పార్లమెంటు సభ్యులు తగినంత ఒత్తిడి చేయడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేదనతో రాష్ట్రానికి చెందిన బీజేపీ కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు, పత్రికల ద్వారా అభ్యర్థిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైనట్టు కనబడుతున్నది.

రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ అందించిన సహకారం విషయం తెలంగాణ సమాజానికి సైతం తెలిసిందే. ఈ విషయాన్ని మరిచి, ప్రధానమంత్రి పదే పదే తల్లిని చంపి బిడ్డను బతికించారు అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు చెప్పాలి. ఈ అంశం తెలంగాణ బీజేపీ పార్లమెంటు సభ్యులను ఒక విధంగా బోనులో నిలబెడుతున్నది. తెలంగాణ సమాజం మంచి చెడ్డలను ఏకాంతంలోనైనా అధినాయకత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.

కేంద్రం పరిష్కరించవలసిన సమస్యలను, వివిధ శాఖలలో పెండింగ్‌లో ఉన్న పనుల పరిష్కారం దిశగా ఎంపీలు పనిచేస్తేనే బీజేపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, తగిన సహకారం అందిస్తే ప్రజల్లో ఎన్నదగిన గుర్తింపు కలుగుతుంది. బీజేపీ ఎంపీలు, మంత్రులు తెలంగాణ సమస్యల పట్ల కేంద్రంలో మోకాలు అడ్డకపోవచ్చు కానీ, తగిన సమయంలో సమస్యలు కొలిక్కిరాకపోతే జాగరూకమైన తెలంగాణ ప్రజలు మోకాలు అడ్డుతున్నారేమో అనుకునే ప్రమాదం ఉంది.


ఎల్లకాలం హిందువుల పేరున ఓట్లను పొందలేరు. తెలంగాణ నేల స్వభావం ఉద్యమాల చరిత్రతో కూడుకున్నది. నిశ్శబ్దంగా తుఫాను ముందు సముద్రం వలె ఇక్కడి సమాజం ఉంటుంది దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటేనే బీజేపీ అధికారానికి మార్గం సుగమం అవుతుంది. ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా గోతులు తవ్వుకుంటూ పోతే అసలుకే మోసం వస్తుంది. పక్క రాష్ట్రంలోని అధికార పార్టీ కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుంటున్న విషయం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడి బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. బీసీ ముఖ్యమంత్రి, కుల జనగణన అంటే... అవి నినాదాలుగా మిగిలిపోతాయి. అటువంటివి ఆచరణలో అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నాయకులపై ఉన్నది.

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలకు అవినీతి ఆరోపణల కేసులను అప్పజెప్పమని తరచుగా డిమాండ్ చేశారు. తీరా కేసులను అప్పగించిన పిదప, ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వీటన్నింటినీ కూడా తెలంగాణ మేధావి వర్గం పరిగణనలోకి తీసుకొంటుంది. సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం కూడా చెబుతుంది. తెలంగాణ ప్రజల మట్టి ఉద్యమ స్వభావాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు సరైన సమయంలో తగు చర్యలు తీసుకోవాలి. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తేనే భవిష్యత్తులో రాష్ట్రంలో కాషాయ జెండాకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

జూకంటి జగన్నాథం

కవి, రచయిత

ALso Read:

18 నగర వనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2026 హజ్ యాత్రికులకు రూ. లక్ష సబ్సిడీ విడుదల

Updated Date - Jul 02 , 2026 | 01:18 AM