Share News

పాతికేళ్లుగా అదే భయం!

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:51 AM

న్యాయం కోసం న్యాయస్థానాల మెట్లు ఎక్కిన బాధితురాలికి, అదే న్యాయవ్యవస్థ నుంచి వెలువడే మరో ఉత్తర్వు భయాన్ని కలిగిస్తే అంతకంటే విషాదం...

పాతికేళ్లుగా అదే భయం!

న్యాయం కోసం న్యాయస్థానాల మెట్లు ఎక్కిన బాధితురాలికి, అదే న్యాయవ్యవస్థ నుంచి వెలువడే మరో ఉత్తర్వు భయాన్ని కలిగిస్తే అంతకంటే విషాదం ఏముంటుంది? గుజరాత్‌ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురై, కుటుంబ సభ్యులను కోల్పోయిన బిల్కిస్‌ బానో ఉదంతం ఇప్పుడు అనేక ప్రశ్నలను దేశం ముందుంచుతోంది. ఇద్దరు దోషులకు యావజ్జీవ శిక్షల అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల బెయిల్‌ మంజూరు చేయడం కేవలం ఒక న్యాయపరమైన పరిణామం కాదు. బాధితుల భద్రత, గౌరవం, న్యాయప్రక్రియలో వారి భాగస్వామ్యానికి సంబంధించిన గంభీరమైన అంశం.

2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో అప్పటికి ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్‌ బానోపై ఒక మూక సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఆమె మూడేళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. ఆమె న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా మొదట్లో తగిన స్పందన లభించలేదు. ఫిర్యాదు నమోదు, పోలీసు దర్యాప్తు, సాక్ష్యాల సేకరణలో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. బెదిరింపులు కూడా ఆమె పోరాటాన్ని మరింత కఠినతరం చేశాయి. ఇరవై ఏళ్లకు పైగా అనేక న్యాయస్థానాలు మారిన కేసు ఇది. రెండేళ్ల క్రితం ఈ కేసులోని ఇద్దరు దోషులు తమకు కింది కోర్టు విధించిన శిక్షలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని, వారిలో ఒకరు శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని దోషుల తరఫు న్యాయవాదులు వాదించారు. దోషుల అప్పీళ్లకు స్పందిస్తూ అక్టోబర్‌ 28న జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం వారికి యావజ్జీవ శిక్ష నిలిపివేసి బెయిల్‌ మంజూరు చేసింది. నవంబరు 16న ఈ ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి.

ఈ తాజా ఉత్తర్వులపై బిల్కిస్‌ బానో స్పందన అందరినీ కలచివేసింది. తనకు సమాచారం ఇవ్వకుండా, తన వాదన వినకుండా కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకూ తన కుటుంబ సభ్యులకూ భయం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. 24 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నానని, తన మూడేళ్ల చిన్నారి కుమార్తె సలేహా జ్ఞాపకం కూడా తన పోరాటంలో భాగమని తెలిపారు. ఆ పసిపాప బతికి ఉండాల్సిందని, ఆమె జ్ఞాపకం న్యాయం కోసం డిమాండ్‌ చేస్తోందని, తాజా ఉత్తర్వులను సవాలు చేస్తానని ప్రకటించారు. తనకు దక్కిందనుకున్న భద్రత మళ్లీ చేజారిపోతుందేమోననే ఆందోళన ఆమెది. ఆ ఆందోళన మాటలకే పరిమితం కాలేదు. ఆ ఇద్దరు దోషుల బెయిల్‌ ఉత్తర్వుల తర్వాత ఆమె తన కుటుంబంతో కలిసి నవంబరు 2 లేదా 3 తేదీల్లోనే గుజరాత్‌ను విడిచివెళ్లినట్లు బిల్కిస్‌ బానో మామ అబ్దుల్‌ రజాక్‌ మన్సూరీ వెల్లడించారు. గతంలో నివాస ప్రాంతాలను మార్చుకుంటూ గుజరాత్‌లోనే ఉంటున్న కుటుంబం, ఈసారి రాష్ట్రాన్నే విడిచిపెట్టాల్సి వచ్చింది.


ఇక్కడే బాధితురాలి హక్కులకు సంబంధించిన కీలకమైన ప్రశ్న ఎదురవుతోంది. నేరం జరిగినప్పుడు బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి పోరాడాలి. విచారణ సమయంలో సాక్ష్యాల కోసం పరుగులు తీయాలి, దోషులకు శిక్ష పడిన తర్వాత కూడా వారి ముందస్తు విడుదలను సవాలు చేయడానికి మరోసారి కోర్టుల మెట్లు ఎక్కాలి. ఇప్పుడు శిక్ష అమలును నిలిపివేసి బెయిల్‌ ఇచ్చినప్పుడు కూడా ఆమెకు కనీస సమాచారం అందలేదు. దాడికి గురైన వ్యక్తి న్యాయప్రక్రియలో కేవలం సాక్షిగా మాత్రమే మిగిలిపోవాలా? తన భద్రత, తన కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల్లో ఆమె గొంతుకు స్థానం ఉండకూడదా? బెయిల్‌ మంజూరుకు చట్టపరమైన కారణాలు ఉండవచ్చు. కానీ బాధితురాలి హక్కులను పరిగణనలోకి తీసుకునే విధానపరమైన బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది.

మహిళల భద్రత గురించి నినాదాలు చేయడం ఒక ఎత్తయితే, న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలికి చివరి వరకు అండగా నిలవడం మరో ఎత్తు. నేరం జరిగినప్పుడు సమాజం ఆవేశపడటం, కొద్దిరోజుల తర్వాత మరో వార్తలో మునిగిపోవడం సాధారణమైపోయింది. కానీ బాధితురాలికి ఆ ఘటన ఆమె జీవితాన్ని నిరంతరం వెంటాడే జ్ఞాపకం. పిల్లలు, కుటుంబ సభ్యుల భద్రత, భవిష్యత్తుపై నమ్మకం అన్నీ దానితో ముడిపడి ఉంటాయి. అందుకే న్యాయవ్యవస్థ బాధ్యత శిక్ష విధించడంతో ముగిసిపోదు. బాధితురాలు భయం లేకుండా జీవించే పరిస్థితులు కల్పించడం, ఆమెకు న్యాయపరమైన సహాయం అందించడం, అవసరమైన భద్రతను నిర్ధారించడం వ్యవస్థలో భాగం కావాలి. నేరం చేసినవారికి శిక్ష పడటం న్యాయంలో ఒక భాగం మాత్రమే. బాధితురాలు మళ్లీ భయంతో జీవించాల్సిన అవసరం లేకుండా చేయడం, ఆమె గౌరవాన్ని కాపాడటం, తన గొంతును వినిపించుకునే అవకాశం కల్పించడం అంతే ముఖ్యం.

యండి. ఉస్మాన్‌ఖాన్

ఇవి కూడా చదవండి..

అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..

అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..

Updated Date - Nov 27 , 2026 | 03:51 AM