Share News

ఎస్‌హెచ్ఓలకు ‘లా’ అర్హత తప్పనిసరి!

ABN , Publish Date - May 15 , 2026 | 01:13 AM

భారతదేశంలో న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలంటే, మొదటి మెట్టు అయిన పోలీసింగ్ కూడా అదే స్థాయిలో నిష్పక్షపాతంగా న్యాయపరంగా ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే, స్టేషన్ హౌస్ ఆఫీసర్...

ఎస్‌హెచ్ఓలకు ‘లా’ అర్హత తప్పనిసరి!

భారతదేశంలో న్యాయ వ్యవస్థ బలంగా ఉండాలంటే, మొదటి మెట్టు అయిన పోలీసింగ్ కూడా అదే స్థాయిలో నిష్పక్షపాతంగా న్యాయపరంగా ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ) స్థాయిలో ఉన్న అధికారుల చేతుల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు, కేసుల ప్రారంభ దశ విచారణలు ఉండగా, వారికి న్యాయశాస్త్రంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యవస్థలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌హెచ్ఓ స్థాయికి చేరుకునే పోలీసు అధికారులకు తప్పనిసరిగా ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉండాలనే ఆలోచన ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

మన దేశంలో పోలీస్ నియామకాలలో లా డిగ్రీ తప్పనిసరి అర్హతగా లేదు. సాధారణ డిగ్రీ సరిపోతుంది. శిక్షణ సమయంలో భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సాక్ష్యాధారాల చట్టం వంటి ప్రాథమిక చట్టాలు నేర్పిస్తారు. అయితే ఈ శిక్షణ ఎక్కువగా ఫీల్డ్ స్థాయి పనుల మీదే కేంద్రీకృతమై ఉంటుంది. కేసు నమోదు సమయంలో ఏ చట్టం వర్తించాలి, ఎలాంటి సెక్షన్లు పెట్టాలి, కోర్టులో కేసు నిలబడేలా ఎలా రూపొందించాలి వంటి అంశాలపై లోతైన అవగాహన రావడం లేదు. కొన్ని సందర్భాల్లో కేసు తీవ్రత ఎక్కువగా ఉన్నా, బలహీనమైన సెక్షన్లు మాత్రమే నమోదవుతాయి. మరికొన్ని సందర్భాల్లో చిన్న గొడవలు, వ్యక్తిగత విభేదాల కేసుల్లో కూడా అవసరానికి మించి కఠినమైన సెక్షన్లు నమోదవుతున్నాయి. ఈ రెండు విధానాలూ తప్పే.

కోర్టులలో ఇలాంటి లోపాలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో సరైన సెక్షన్లు లేకపోవడం లేదా సంబంధం లేని సెక్షన్లు ఉండడం వల్ల న్యాయమూర్తులు తరచూ కేసు సవరణలు సూచిస్తున్నారు. కొన్నిసార్లు అదనపు దర్యాప్తు ఆదేశాలు కూడా ఇస్తున్నారు. దీనివల్ల కేసుల పరిష్కారం ఆలస్యం అవుతోంది. ప్రత్యేకంగా లైంగిక దాడులు, ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలు వంటి క్లిష్ట కేసుల్లో సరైన చట్టపరమైన అవగాహన లేకపోతే దర్యాప్తు బలహీనంగా మారుతుంది. ఈ లోపం చివరకు కోర్టులో కేసు నిలబడే అవకాశాలను తగ్గిస్తుంది.


ఈ నేపథ్యంలో ఎస్‌హెచ్ఓ స్థాయిలో లా డిగ్రీ తప్పనిసరి చేయడం ఒక అవసరమైన సంస్కరణగా కనిపిస్తోంది. లా చదివిన అధికారి ఎఫ్‌ఐఆర్ సమయంలోనే సరైన సెక్షన్లు ఎంపిక చేస్తాడు. కేసు స్వభావానికి తగిన చట్టపరమైన దారిని నిర్ణయిస్తాడు. సాక్ష్యాల విలువ, కోర్టులో నిలిచే అంశాలపై ముందుగానే అవగాహన ఉండటం వల్ల దర్యాప్తు మరింత క్రమబద్ధంగా సాగుతుంది. ఇది న్యాయం వేగంగా జరిగే అవకాశాలను పెంచుతుంది. అదేవిధంగా లా పరిజ్ఞానం ఉన్న ఎస్‌హెచ్ఓలు ఉంటే బాధితులతో వ్యవహరించే విధానంలో కూడా మార్పు తీసుకువస్తారు. బాధితుల హక్కులు, చట్టపరమైన రక్షణలు, సున్నితమైన అంశాలపై అవగాహన ఉండడం వల్ల పోలీసింగ్ మరింత సమర్థవంతంగా, న్యాయపరంగా ఉంటుంది. అయితే ఈ మార్పును వెంటనే అమలుచేయడం సవాలే. అందుకే దశలవారీగా అమలుచేయాలి. ఇప్పటికే ఉన్న అధికారులకు న్యాయ శిక్షణను విస్తరించడం, కొత్త నియామకాలలో లా అర్హతను తప్పనిసరి చేయడం వంటి మార్గాలు ఆలోచించాలి.

శ్రీనివాస్‌గౌడ్ ముద్దం

ఇవీ చదవండి:

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

'నీట్' మరలా ఎప్పుడు ఉండొచ్చంటే.?

Updated Date - May 15 , 2026 | 01:13 AM