ఒంటిచేత్తో బహుజన విద్యా విప్లవం!
ABN , Publish Date - May 23 , 2026 | 03:06 AM
ఈ దేశంలో అణగారిన వర్గాలు బాగుపడాలంటే వారికి రెండే మార్గాలు: ఒకటి చదువు, రెండు రాజ్యాధికారం. ఈ రెండే ఇప్పటి దాకా మన సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకొచ్చాయి....
ఈ దేశంలో అణగారిన వర్గాలు బాగుపడాలంటే వారికి రెండే మార్గాలు: ఒకటి చదువు, రెండు రాజ్యాధికారం. ఈ రెండే ఇప్పటి దాకా మన సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకొచ్చాయి. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో దళితులు ఈమాత్రమైనా ఎదగడానికి చదువే వారిని ముందుకు నడిపింది. అలాంటి విద్యను ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలనే తపన పూలే–అంబేడ్కర్ల కాలం నుండే ఆచరణ రూపం దాల్చింది. తెలుగు నేల మీద కూడా దళితులు, వెనకబడిన తరగతులు చదువుకోవాలనే ప్రయత్నాలు గడిచిన వందేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రా ప్రాంతంలో క్రైస్తవ మిషనరీల వల్ల దళితులకు చదువు అందింది. తెలంగాణలో మాత్రం అది ఆలస్యమైంది. కొంత వరకు సదాలక్ష్మీ, ఈశ్వరీబాయి వంటి వారు దళిత అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. ఆ తరువాత విద్యా ఉద్యమం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి డా. అప్పికట్ల భరత్ భూషణ్.
దళితుల్లో విద్యావంతులు ఉద్యోగాల్లోకి వచ్చినా, రాజకీయాల్లోకి వచ్చినా ముందు తమ ఎదుగుదల గురించే ఆలోచిస్తారు. భరత్ భూషణ్‌కు ఈ స్వార్థం తెలియదు. తాను రైల్వే శాఖలో దక్షిణ మధ్య రైల్వేకు జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగినా ఏనాడు మూలాలను మరిచిపోలేదు. చేతనైనంత సామాజిక సేవ చేస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా పేద పిల్లలు చదువుకుంటే ఒక తరం బాగుపడుతుందనే దార్శనికుడు ఆయన. అందుకే ఆయన తన చుట్టూ ఉన్న వాళ్లతో ఎప్పుడూ చెప్పే మాట ‘‘చదువుతోనే మన బతుకుల్లో వెలుగులు నిండుతాయి’’ అని. భరత్ భూషణ్ ఒక్కడే కాదు, ఆయన కుటుంబంలోనే ఇలాంటి ఆదర్శప్రాయులు ఉన్నారు. ఆయన తండ్రి అప్పికట్ల జోసెఫ్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. అట్లా ఒక ప్రజాప్రతినిధి వారసుడిగా భరత్ భూషణ్ ఈ సమాజంలోకి వచ్చారు. మొదట ఐఏఎస్ సాధించి ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నారు. అది కాకుండా ఐఆర్‌టీఎస్ వచ్చింది. ఒకవైపు ఉత్తమ ఆఫీసర్‌గా తన విధులు నిర్వహిస్తూనే మరోవైపు తన జాతి అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.
గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది యువత ఆర్థిక ఇబ్బందుల వల్ల డ్రాపవుట్స్‌గా మిగిలిపోతుంటారు. అలాంటి వారి పట్ల ఆపద్బాంధవుడిగా మారాడు భరత్ భూషణ్. అంబేడ్కర్ చెప్పినట్టు తనను అందించిన సమాజానికి ‘పే బ్యాక్’ చేయాలనే సంకల్పాన్ని నరనరాన నింపుకున్నాడు. అందుకే తన జీతం డబ్బుల నుండి కొంత పేద విద్యార్థుల చదువుల కోసం కేటాయించాడు. అలా ఒకరిద్దరికి కాదు, వందల సంఖ్యలో పేద విద్యార్థులను చదివించి ప్రయోజకులను చేశాడు. ఇది అక్షరాల నిజం. 1344 మంది కేవలం ఈ ఒక్క విద్యాప్రదాత వల్లే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అది కూడా చిన్నాచితక కాదు. అందులో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్–1, గ్రూప్–2 వంటి ఉన్నత ఉద్యోగాలు సాధించినవారు కూడా ఉన్నారు. అట్లా ఒక తరాన్ని ఒకడుగు ముందుకు వేయించిన మహా మనీషి భరత్ భూషణ్.
బహుజన మహనీయుల గురించి చాలామంది వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తారు. కానీ, వారి ఆశయాలను నిజం చేసేవాళ్లు కొందరే. ఆ కొందరిలో ముందు వరసలో నిలిచే పేరు భరత్ భూషణ్. ఆయన ఒక్కడే ఒక ఉద్యమం. అతడే ఒక సైన్యం. ఆయన మాత్రమే కాకుండా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన దళిత ఆఫీసర్లను కూడగట్టాడు. తన దారిలో పయనింపజేశాడు. మనం నడిచి వచ్చిన దారిలో మరికొందరికి చేయూతను ఇవ్వాలని దిశానిర్దేశం చేశాడు. ఫలితంగా అనేకమంది ముందుకు వచ్చారు. ఇట్లా ఒక విద్య విప్లవాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు భరత్ భూషణ్. ఎవ్వరైనా తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. తమ పుట్టుకకు ఒక అర్థాన్ని వెతుక్కోవాలి. అలా ఈ విద్యాప్రదాత చేసిన విలువైన సేవలకు ఒక పద్మశ్రీ ఇచ్చినా తక్కువే. వేలాది కుటుంబాల గుండెల్లో ఆయన అందించిన స్ఫూర్తి సజీవంగా ఉంది. తనలో ఉన్న ఈ సేవాతత్పరత వల్ల ఆయనను అందరు ‘బహుజనుల బిగ్ బ్రదర్’ (బిగ్ బి)గా పిలుస్తుంటారు. బహుశా అంబేడ్కర్ బ్రతికి ఉంటే భరత్ భూషణ్ వంటి నాయకుణ్ణి చూసి మురిసిపోయేవాడు. ఇలా రెండు తెలుగు రాష్ర్టాల్లో బహుజనుల విద్యా ప్రదాతగా మన మధ్యలోనే చాలా నిరాడంబరంగా నిలబడ్డ నిలువెత్తు శిఖరం భరత్ భూషణ్.
డా. పసునూరి రవీందర్
(ఈ నెల 24న భరత్ భూషణ్‌కు
‘బంధు సొసైటీ’ జీవన సాఫల్య పురస్కార ప్రదానం)
ఇవి కూడా చదవండి..
ఆ పెళ్లికి వెళితే నన్ను బతకనీయరు.. మీడియాపై ట్రంప్ సెటైర్లు