వెన్నెల నీడ
ABN , Publish Date - Jun 08 , 2026 | 02:08 AM
ఏ భాషలోనైనా అక్షరాలకు పరిమితులుంటాయి గానీ, అనుభవాలకి పరిమితులేముంటాయి? భావాలను ఆ గుణింతాలలోకి గుంజి గుండెలు పగలకొట్టడానికి హద్దులేముంటాయి? అలాంటి చొరబాటుదారుడు...
బద్ర్ అంటే అరబిక్‌లో పూర్ణ చంద్రుడు. 91ఏళ్ల జీవితం, 18000 షేర్స్.. అంత వెన్నెలకు దోసిలి పట్టగలుగుతుందా మన ఆకాశం?
ఏ భాషలోనైనా అక్షరాలకు పరిమితులుంటాయి గానీ, అనుభవాలకి పరిమితులేముంటాయి? భావాలను ఆ గుణింతాలలోకి గుంజి గుండెలు పగలకొట్టడానికి హద్దులేముంటాయి? అలాంటి చొరబాటుదారుడు సయ్యద్ మహ్మద్ బషీర్ (బషీర్ బద్ర్). ప్రపంచమంతా త్యాగాలను గుర్తు చేసుకుంటున్న ఈద్ అల్ -అధా వేళ భోపాల్‌ను అమావాస్య ఆక్రమించింది. వెన్నెల రహస్యాల గుట్టువిప్పిన ఆ గుండె మే 28 మిట్టమధ్యాహ్నం చివరి శ్వాస తీసుకుంది. జీవితాంతం జ్ఞాపకాలను గానం చేసిన ఆయన ఆ నీడలను వదిలి అల్జీమర్స్‌తో వెళ్లిపోయారు.
1935లో అయోధ్యలో జన్మించి, అలీగఢ్ ముస్లిం విశ్వ విద్యాలయంలో చదువుకుని, మీరట్ కళాశాలలో పదిహేడేళ్లు ఉర్దూ బోధించారు బషీర్ బద్ర్. 1987లో చెలరేగిన అల్లర్లలో ఆయన ఇంటితోపాటు, పుస్తకాలు, రాత ప్రతులు పరశురామప్రీతి అయ్యాయి. తీవ్ర మానసిక క్షోభకు గురైన బద్ర్ కవిత్వానికి విరామం ఇచ్చారు. దశాబ్దం తర్వాత భోపాల్ వెళ్లి, డాక్టర్ రహత్‌ను ద్వితీయ వివాహం చేసుకున్న అనంతరం 1999లో తిరిగి రాయడం ప్రారంభించారు. ‘ఒక్క ఇల్లు కట్టుకోవడానికే తండ్లాతున్నాం/ మొత్తం బస్తీని తగలెట్టడానికి నువ్వే మాత్రం తడబడవు’ వంటి పాపులర్ గజల్స్ అప్పుడు రాసినవే. 69 గజల్స్‌తో వెలువడిన ‘ఆస్’ సంపుటికి 1999లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అదే ఏడాది భారత ప్రభుత్వ నుంచి పద్మశ్రీ అందుకున్నారు. ‘ఇకాయ్’, ‘ఆహత్’, ‘ఆమద్’, ‘ఇమేజ్’ వంటి గజల్ సంపుటాలతో ఉర్దూ సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
మోదీ, భుట్టో, ఖర్గే తదితర ప్రముఖులు బద్ర్ షేర్లను ఉటంకించారు. జగజ్జీత్ సింగ్ తన సంగీతంతో వాటిని మరింతమందికి చేరువ చేసారు. రాజ ప్రాసాదాల్లోని భాషను గల్లీల్లోకి తీసుకొచ్చారు బద్ర్. కేవలం ఇరవై అక్షరాల ద్విపదతో ఏకాంతాన్నీ, దుఃఖాన్నీ, మౌనాన్నీ, వేదననీ అద్వితీయంగా ఒడిసిపట్టుకున్నారు.
నీ జ్ఞాపకాల కాంతిని నాతోనే వుండనివ్వు
ఏ దారుల్లో ఈ జీవితం అస్తమిస్తుందో తెలీదు
శత్రుత్వాన్ని తీవ్రంగానే కొనసాగించు, కానీ కాస్త హద్దు వుండనీ
మనం మళ్లీ స్నేహితులమైతే సిగ్గు పడాల్సి రాకూడదు
జీవితమా, నువ్వు సమాధికంటే తక్కువ చోటిచ్చావు
కాళ్లు చాపితే, తల గోడకు తగులుతోంది
నవ్వు కౌగిలించుకుందామని చేతులు చాస్తే,
కరచాలనం కూడా చేయరు
ఇది కొత్త తరహా నగరం, కలుసుకునేప్పుడు
కాస్త దూరం పాటించు
ఇక్కడ పైదుస్తులకే విలువ, లోపలి మనుషులకు లేదు
అందుకే గ్లాసు పెద్దది పెట్టు, అందులో మద్యం తక్కువున్నా.
అకారణంగా కళ్లల్లో నీళ్లూరుతాయి
దుఃఖించడానికి కారణాలు కావాలా
కళ్లలోనే మిగిలావు, హృదయంలోకి దిగి చూడలేదు
నౌకా యాత్రికుడికి సముద్రం లోతు తెలియదు.
నేను పగలంతా అలసి పోయాను,
నువ్వు రాత్రంతా మేల్కొన్నావు
ఈ మలుపు దగ్గర ఒకింత ఆగుదాం,
ఓ సాయంత్రం నీతో గడపనివ్వు
పరిచయం, అనువాదం : దేశరాజు
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News