Share News

బతకడమెలాగో చెప్పిన బసవన్న

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:44 AM

బసవేశ్వరుడి మనస్సు, బుద్ధి ఈ విశ్వమంత విశాలమైనవి. సకల ప్రాణులతో– చివరికి చెట్టు చేమ, కొండలు, కోనలు, రాళ్ళు రప్పలతో.. అన్నిటితో మమేకమయ్యాడు. రాగద్వేషాలకు, ఈర్ష్య అసూయలకు..

బతకడమెలాగో చెప్పిన బసవన్న

బసవేశ్వరుడి మనస్సు, బుద్ధి ఈ విశ్వమంత విశాలమైనవి. సకల ప్రాణులతో– చివరికి చెట్టు చేమ, కొండలు, కోనలు, రాళ్ళు రప్పలతో.. అన్నిటితో మమేకమయ్యాడు. రాగద్వేషాలకు, ఈర్ష్య అసూయలకు, మమకారాలకు, ద్వంద్వాలకు అతీతంగా బతికాడు. అమృతోపమానమైన జీవితం ఆయనది. ఎవరికీ భయపడలేదు, తలవంచలేదు. ఎవరినీ ద్వేషించలేదు, అసహ్యించుకోలేదు. బసవన్న అసహ్యించుకున్నదల్లా– అజ్ఞానాన్ని, అహంకారాన్ని, దురభిమానాన్ని, మూఢనమ్మకాల్ని, కులాల పేరిట సాగే కుమ్ములాటల్ని, మతాల పేరిట జరిగే మారణ కాండల్ని, మనుషుల్లోని హెచ్చుతగ్గుల్ని, మహిళల్ని చిన్నచూపు చూసే నేలబారుతనాన్ని.

బసవేశ్వరుడు 12వ శతాబ్దికి చెందినవాడు. అప్పటి పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయి. అవేమీ మెరుగుకాలేదు. మనుషుల మధ్య అంతరాలు, అగాధాలు అలాగే ఉన్నాయి. కులాలు, మతాలు, కుత్సితాలు, కుమ్ములాటలు, మానభంగాలు, అత్యాచారాలు, దోపిడీలు, దుర్మార్గాలు పెరిగాయేగానీ తగ్గలేదు. కులమతాల సరిహద్దులులేని నవసమాజాన్ని నిర్మించాలని, మనుషుల మధ్య మనుషులే సృష్టించిన అంతరాలను కూలదోయాలని, సంకుచితత్వాలు లేకుండా విశాల ప్రాతిపదికన న్యాయం, ధర్మం, సమానత్వం, మానవత్వం ఈ నాలుగూ నాలుగు స్తంభాలుగా ఒక విశ్వమానవ కుటుంబాన్ని నిర్మించాలనుకున్నాడు. అందుకోసం ఆయన తన జీవితాన్ని ధారపోశాడు.

బసవేశ్వరుణ్ణి తలిస్తే చాలు ఒక బుద్ధుడు, ఒక జీసస్, ఒక మహాత్మాగాంధీ కళ్ల ముందు మెదులుతారు. మనం ఎందుకు పుట్టాం? ఈ ప్రశ్న చాలాసార్లు వేశాడాయన. ఎదుటివాడికి సాయం చేసేందుకు పుట్టాం. ఎవరా ఎదుటి వాళ్ళు? ‘పతితులు, భ్రష్టులు, దగాపడిన తమ్ముళ్ళు, స్నేహం కోసం చేతులు చాచి ఆ చేతుల్నే కాల్చుకున్నవాళ్ళు, పడ్డవాళ్ళు, లోబడ్డవాళ్ళు, చెడ్డవాళ్ళు.. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళకు సాయం చెయ్యాలిట. మనల్ని మనం ఉన్నతులుగానూ భావించకూడదు, న్యూనతా పరుచుకోకూడదు. ఎదుటివాడిలోని ఔన్నత్యాన్ని, వాడి కష్టాన్నీ చూడగలగాలి. అదీ జీవిత పరమార్థం.

సర్వజీవుల పట్ల అనుకంపన, ప్రేమ కావాలన్నాడు. సోమరితనాన్ని నిరసించాడు. శ్రామికుల్ని చిన్న చూపు చూడడం, కాయకష్టం చేసుకుని బతికేవారిని గౌరవంగా చూడకపోవడం.. శతాబ్దాలుగా జరుగుతోంది. దీన్ని బసవన్న నిరసించాడు. పనే దైవం అని, శ్రమకు గౌరవం, హుందాతనం ఉండాలని భావించి వాటికి చిరప్రతిష్ఠను చేకూర్చాడు. ఎవరూ శ్రమ ఫలాన్ని దోచుకోడానికి వీల్లేదు. నువ్వూ, నీ కుటుంబం కడుపారా తినగా మిగిలినది సమాజ సేవకు వెచ్చించాలి. భాగవతం కూడా ఇదే చెబుతోంది. శివుణ్ణి సదా స్మరిస్తూ.. గురువుకు దేహాన్ని, లింగానికి మనస్సును, జంగమానికి ధనాన్ని వెచ్చించే దాసోహ భక్తే నిజమైన భక్తి అని బసవన్న నమ్మాడు. ప్రేమతో, భక్తిపూర్వకంగా చెయ్యని ఏ పనినీ భగవంతుడు తనదిగా భావించడని తెలిపాడు.


బసవన్న భావుకుడు. ఆయన కవిగా పుట్టలేదు. కవిత్వమే అతన్ని వరించింది. అలతి అలతి పదాలతో అనంతమైన జీవన సత్యాలను, విలువలను సందర్భోచితంగా చెప్పి అందరినీ మెప్పించినవాడు. కవిత్వ రహస్యం, జనం నాడి తెలిసినవాడు. అక్షరశిల్పి ఆయన. ‘పలికితే ముత్యాల హారంలా ఉండాలి’ అని మాట గురించి చెబుతాడు ఒకచోట. కన్నడ సాహిత్యంలో అసంఖ్యాకంగా వచనకారులున్నారు. వారిలో బసవన్నది అగ్రస్థానం. ప్రపంచంలో జరిగే ఉద్యమాలన్నీ త్రిగుణాలలో ఏదో ఒకదానిని ఆశ్రయించి ఉంటాయి. రజో, తమోగుణంతో చేసే ఉద్యమాలు హింసను ప్రేరేపిస్తాయి. సాత్విక ఉద్యమాలు అభ్యుదయాన్ని కాంక్షిస్తాయి అంటాడు బసవన్న.

ఇక్కడ చెల్లితే ఎక్కడైనా చెల్లుతారు. ఇక్కడ చెల్లకపోతే ఎక్కడా చెల్లరు. లోకంలో చెల్లాలంటే ఎవరికైనా రుజువర్తనం కావాలి. శీలవర్తనం కావాలి. శీలం సకల శ్రేయోమూలం. మనం ఇక్కడ చేసే పనులతో రేపెప్పుడో స్వర్గం వస్తుందనుకుంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ చేస్తున్న పనులతో ప్రతిరోజునూ స్వర్గతుల్యం చేసుకోమంటాడు బసవన్న.

‘స్వామీ! నీ కోసం డబ్బున్నవాళ్ళు చాలా మంది భక్తితో గుళ్ళు, గోపురాలు కడుతున్నారు. పేదవాణ్ణి నేనేం కడతాను? నా శరీరాన్నే నీకు అర్పణ చేస్తున్నాను. నేను కట్టబోయే గుడికి నా కాళ్ళు స్తంభాలు. నా శరీరమే దేవాలయం. నా శిరస్సు బంగారు గోపురం. పరమేశ్వరా! నేను చెప్పే ఈ మాట విను.. ఇటుకలతోనూ సిమెంటుతోనూ కట్టే గుడి ఏనాటికైనా శిథిలమవుతుంది. కానీ, నిన్నే మోస్తూ నిరంతరం కదిలే ఈ ఆలయానికి నీ ఆజ్ఞ లేకుండా పాడవడం తెలీదు’ అంటాడు బసవన్న.

బసవన్న మతపరంగా సాధించదలచింది ఏకేశ్వరోపాసన. సమాజపరంగా ప్రయత్నించింది సర్వమానవ సమానత్వం. బసవన్న ఏం చెప్పినా భక్తే దానికి పునాది. విప్రుని మొదలు అంత్యజుని వరకూ అందరూ ఒకటే అని చెబుతూ– స్థలం ఒక్కటే శివాలయానికీ మాలవాడికీ! జలం ఒక్కటే శౌచానికీ, ఆచమనానికీ!! అంటాడు. భేద సంస్కృతిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడు బసవన్న.

కె. మల్లికార్జునప్ప

(ఏప్రిల్‌ 20: బసవేశ్వరుని జయంతి)

ఇవి కూడా చదవండి..

మళ్లీ హోర్ముజ్ దిగ్భంధనం.. ప్రకటించిన ఇరాన్ సైన్యం..

అమెరికా సైనికులకు భోజనం పెడతాం.. ఇరాన్ వ్యంగ్య వ్యాఖ్యలు

Updated Date - Apr 19 , 2026 | 12:44 AM