మేధోమథనానికి నైతిక దిక్సూచి
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:12 AM
‘బాలగోపాల్ లేని సమాజం’ అనే మాట కేవలం భావోద్వేగ సంస్మరణ కాదు. ఆయన అకాల మరణం (1952–2009) ఆయన లేని సమాజం ఎదుర్కొంటున్న నైతిక, రాజకీయ...
‘బాలగోపాల్ లేని సమాజం’ అనే మాట కేవలం భావోద్వేగ సంస్మరణ కాదు. ఆయన అకాల మరణం (1952–2009) ఆయన లేని సమాజం ఎదుర్కొంటున్న నైతిక, రాజకీయ సంక్షోభాన్ని సూచించే మాట. ప్రజాస్వామిక మేధోమథనానికి నైతిక దిక్సూచిగా నిలిచారు బాలగోపాల్. బలహీనులపై జరిగే ప్రతి అన్యాయం పైనా మొదటగా స్పందించే గొంతుక ఆయనది. నిజ నిర్ధారణల ద్వారా రాజ్యాన్ని, సమాజాన్ని నిలదీసే ధైర్యం, కోర్టు–ఉద్యమం రెండింటినీ కలిపి నడిపే వ్యూహశీలి బాలగోపాల్. గణితశాస్త్రంలో పీహెచ్‌డీ అనంతరం కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసి, పూర్తిస్థాయి హక్కుల కార్యకర్తగా మారిన అరుదైన మేధావి. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పదిహేనేళ్లపాటు పనిచేసి, 1998లో మానవ హక్కుల వేదిక స్థాపకులలో ఒకరయ్యారు.
నకిలీ ఎన్‌కౌంటర్లు, లాకప్ మరణాలు, ఆదివాసీ–దళిత హక్కులు, భూ నిర్వాసితులు, పర్యావరణ విధ్వంసం, కార్మిక హక్కులు వంటి అన్ని రంగాల్లో నిజ నిర్ధారణలు, కోర్టు కేసులు, వ్యాసాలు, ప్రసంగాల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి బాలగోపాల్. ఆశయాలను కాగితంపై మాత్రమే కాదు, జీవితంలో కూడా ఆచరించిన అంబేడ్కర్ శైలి మేధావితనాన్ని బాలగోపాల్‌లో చూడవచ్చు. ‘దళితులలో దళితులు’ వంటి సూక్ష్మ విశ్లేషణలు, వివక్ష–అసమానతల తాత్విక మూలాలను చూపించే సామర్థ్యం ఇప్పుడు తక్కువ. ‘అధికారాన్ని సందేహించనివారు హక్కుల కార్యకర్తలు కాజాలరు’ అన్న నైతిక స్థైర్యం, ప్రభుత్వ హింసను మాత్రమేకాదు, ప్రతిహింసను కూడా మానవత్వ ప్రమాణంతో తూకం వేయడం ఇప్పుడు తక్కువగా కనిపిస్తోంది. ఆచరణ ప్రాతిపదికన అవగాహనను, అవగాహన ప్రాతిపదికన ఆచరణను మెరుగుపరచుకునే ధోరణి బాలగోపాల్‌ది.
ఆధిపత్యం నుంచి పుట్టిన అణచివేతను మాత్రమే కాదు, అన్ని వ్యవస్థీకృత ఆధిపత్యాలను హక్కులు కోణంలో చూసే విశాల దృక్పథం ఆయనది. కేవలం రాజ్యాన్ని మాత్రమే కాదు, సామాజిక ధోరణుల్లో, సంస్కృతుల్లో దాగివున్న ఆధిపత్యాలను కూడా ప్రశ్నించమని చెప్పారు. ప్రభుత్వ హింస మాత్రమే కాదు, దానికి తిరుగుబాటుగా వచ్చే ప్రతిహింస కూడా మానవత్వానికి జవాబుదారీగా ఉండాలని, లేకపోతే ఆ ఉద్యమాలు రాజ్యానికి మరో అనుకరణ అవుతాయని ఆయన వివరించారు.
బాలగోపాల్ రచనలు, వాదనలు హక్కుల ఉద్యమానికి ఒక భాషను, విశ్లేషణా పద్ధతిని ఇచ్చాయి. ‘దళితులలో దళితులు’ అనే పదబంధాన్ని వాడగలిగిన ఏకైక వ్యక్తి బాలగోపాల్ అని 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో ఆయన వాదనలను ఉటంకించారు. వివక్ష అసలు అర్థం అసమానతేనని, ఆ అసమానతను అనుభవిస్తున్న వర్గాల్లో కూడా సమానత్వ ప్రాతిపదికనే సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన ఎలుగెత్తి చాటారు.
ఇప్పుడు హక్కుల ఉల్లంఘనలను కేవలం సంఘటనలుగా చూస్తూ, వాటి వెనుక ఉన్న తాత్విక, నిర్మాణాత్మక కారణాలను విశ్లేషించే ధోరణి బలహీనపడింది. దళితులు, ఆదివాసులు, మైనార్టీలు, మహిళలు, కార్మికులు, పర్యావరణ బాధితులు వంటి వివిధ వర్గాల సమస్యలను వేరువేరుగా చూస్తూ, వాటి మధ్య ఉన్న అనుసంధానాన్ని చూపించే దృక్పథం తగ్గింది. నిజ నిర్ధారణలకు అవసరమైన సమయం, ధనం, భద్రతా ప్రమాణాలను భరించే ధైర్యం ఉన్న కార్యకర్తల సంఖ్య తగ్గింది. ఫలితంగా అన్యాయాలు జరుగుతున్నా, వాటిని పూర్తిస్థాయిలో ధ్రువీకరించి, ప్రజల ముందుకు తీసుకురావడం కష్టమవుతోంది.
బాలగోపాల్ కేవలం స్థానిక సమస్యలకే పరిమితం కాలేదు. కశ్మీర్ నుంచి కంధమాల్, పాలస్తీనా వరకు అనేక అంతర్జాతీయ విషయాలపై రచనలు చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను చూసినప్పుడు ఆ అమానవీయ హింసకు కారణాలను ఆయన మానవీయ కోణంలో తాత్వికంగా విశ్లేషించేవారు. ఇప్పుడు ఆ అంతర్జాతీయ దృక్పథం, మానవ తాత్వికతతో కూడిన విశ్లేషణ తక్కువ. ఫలితంగా, స్థానిక సమస్యలను ప్రపంచ సందర్భంలో చూడలేకపోవడంతో... హింస, యుద్ధం, వలసలు, పర్యావరణ సంక్షోభం వంటి అంశాల్లో మానవీయ కోణం బలహీనపడుతోంది.
బాలగోపాల్ లేని లోటును భర్తీ చేయడం అంటే ఆయన స్థానంలో మరొకరిని నిలబెట్టడం కాదు. ఆయన చూపిన దారిలో మనం నడవటం. ఆయన రచనలు, వాదనలు, కేసులు, నిజ నిర్ధారణలు ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఆయన తాత్విక దృక్పథం ఇంకా మనల్ని ప్రశ్నిస్తోంది. నిజానికి బాలగోపాల్ ఇప్పుడు ఉంటే, మణిపూర్ ఘటనలు, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం, ఇరాన్ ఒంటరిగా ఎదుర్కొన్న తీరు, కగార్ గురించి, రాజ్యం అవలంబిస్తున్న విధానాల గురించి తనదైన దృక్పథంతో రాసేవారు, మాట్లాడేవారు. ప్రజలకు వాస్తవాలను అర్థం చేయించేవారు.
విశ్వవిద్యాలయాల్లో, న్యాయ కళాశాలల్లో బాలగోపాల్ రచనలు, కేసులు, నిజ నిర్ధారణ నివేదికలను పాఠ్యాంశంగా చేర్చాలి. ‘రాజ్యాంగాన్ని ఎలా చూడాలి?’ దళితులలో దళితులు, ఎస్సీ వర్గీకరణపై ఆయన వ్యాసాలు, పాలస్తీనా, కశ్మీర్‌పై రచనలను చర్చా విషయాలుగా తీసుకోవాలి. కుల, మత, లింగ, తరగతి, భాషా, ప్రాంతీయ ఆధిపత్యాలన్నింటినీ హక్కుల కోణంలో చూడాలి. ‘ప్రజలకు సమస్యలున్నంత కాలం విశ్రమించకూడదు’ అని నమ్మిన బాలగోపాల్ మాటలను గుర్తుంచుకుని, ఆయన లేని లోటును మన ఆచరణ, మన పోరాటం, మన రచనలతో భర్తీ చేయడమే ఆయనకు నిజమైన నివాళి.
కత్తి కళ్యాణ్
(నేడు బాలగోపాల్ వర్ధంతి. ఉదయం 11 గంటలకు
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో స్మారకోపన్యాసం)
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..