బాధాసర్పదష్టుల సాహితీ బంధువు
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:40 AM
‘‘ఆ కూలిన ఇంటిలో ఏడుస్తున్నదెవరు? ఆమెకేమైంది?’’ అని అడిగాడు ఉపాధ్యాయుడు అఘోరనాథుడు. అందుకు తరగతిలో ఒక 11 ఏళ్ళ బాలుడు...
‘‘ఆ కూలిన ఇంటిలో ఏడుస్తున్నదెవరు? ఆమెకేమైంది?’’ అని అడిగాడు ఉపాధ్యాయుడు అఘోరనాథుడు. అందుకు తరగతిలో ఒక 11 ఏళ్ళ బాలుడు సమాధానమిస్తూ, ‘‘ఆమె ఒక పేదరాలు. ఇళ్లలో పాచిపని చేస్తూ గుడ్డి భర్తను చూసుకునేది. నిన్న రాత్రి ఆ భర్త పోయాడు. ఒంటరిదైపోయింది. అందువల్ల కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది. వీరు గొప్పింటి వారిలాగా దుఃఖాన్ని బిగ్గరగా ప్రదర్శించరు మాస్టర్ ముషాయ్!’’ అంటూ వయస్సుకు మించిన అనుభవజ్ఞునిలా, దుఃఖ నిర్వచనం చేశాడు. అప్పుడు అఘోరనాథుడు మనస్సులో ‘‘దుఃఖపు భిన్న రూపాల్ని గమనించగలిగిన ఈ బుడతడు పెద్దవాడయ్యాక మానవ మనస్తత్వ పరిశీలనలో ప్రసిద్ధికెక్కుతాడు’’ అని అనుకున్నాడు. బెంగాలీ సాహిత్య వినీలాకాశంలో చల్లని పున్నమి చంద్రునిలా భాసిల్లి, బాధిత హృదయాల కన్నీటి గాథలను కరుణ రసాత్మకంగా చిత్రీకరించిన శరత్ చంద్ర ఛటర్జీయే ఆ బాలుడు. ఒక్క బెంగాలీలనే కాక అన్ని దేశ భాషల పాఠక జన హృదయాలను కదిలించి, ద్రవింపజేసి మహా రచయితగా నీరాజనాలందుకున్నాడు.
శరత్ తన కథల్లో జీవితపు అనేక విషయాలతోపాటు నైతిక మాతృత్వం అనే ఉన్నత భావనకు హృద్యంగా జీవం పోశాడు. స్త్రీ జీవితం సార్థకం, పరిపూర్ణం అయ్యేది సొంత బిడ్డలను కని, మాతృత్వాన్ని అనుభవించడమని చాలామంది భావిస్తారు. ఎంతోమంది స్త్రీలు కూడా అలానే ఆలోచించే మనోధర్మానికి భిన్నంగా శరత్ తన రచనల్లో మాతృత్వం అనేది రక్తసంబంధానికి మాత్రమే పరిమితమైనది కాదు, ఎవరైతే పేగుబంధంలేని ఇతరుల పిల్లలపై కూడా మమత, ప్రేమ, అప్యాయతలను కురిపిస్తారో వారు నిజమైన మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తారని చెబుతాడు. ఇలాంటి మాతృత్వం నుండి పెల్లుబికే మమకారం స్వార్థం నుండి జనించినది కాదు. దీని వెనుక మంచీచెడుల, న్యాయాన్యాయాల స్పృహ ఉంటుంది.
ఒకోసారి మనుష్యుల మధ్య భావోద్వేగాలు చెలరేగి, వివేకాన్ని కోల్పోయి, పరుషంగా మాట్లాడడం, అనుచితంగా ప్రవర్తించడం జరుగుతుంది. అది కొన్ని సందర్భాలలో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. శరత్ రాసిన ‘బిందుగారబ్బాయి’ కథలో పెద్ద కోడలు కొడుకును, చిన్న కోడలు తన సొంత బిడ్డగా ప్రేమిస్తుంది. ఆ పిల్లాడి పెంపకం విషయంలో కోడళ్ళు ఒకరినొకరు కోపంతో గట్టిగా వాదించుకొని, పంతాలకు–పట్టింపులకుపోయి, వేర్వేరు కాపురాలు పెడతారు. ఆ తరువాత వారిద్దరూ పశ్చాత్తాపం చెందినప్పుడు, పెద్ద కోడలుతో ఆమె భర్త ఇలా అంటాడు: ‘‘క్షమించడం నీవు నేర్చుకొనకపోతే నీ పెద్దరికానికి విలువేముంది?’’ ఇతరులను క్షమించ గలిగేవారే నిజంగా పెద్దవారని శరత్ అభిప్రాయం.
‘శ్రీకాంత్’ నవలను శరత్ ఆటో బయోగ్రఫీయని చాలామంది భావిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సాహితీవేత్త రోమారోలా, ఆ నవల మొదటి భాగం చదివి ప్రపంచ సాహితీ అగ్రగణ్యుల్లో శరత్ ఒకరని, నోబెల్ బహుమతికి అర్హుడని ప్రకటించాడు. ఈ నవలలో అన్నదా దీదీ, రాజ్యలక్ష్మి, అభయ, కమలలత ప్రధాన స్త్రీ పాత్రలు. ఒక్కొక్కరిది ఒక విషాద కథ. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం పతియే ప్రత్యక్ష దైవం. ఆ పతి దుష్టుడు, దుర్మార్గుడు, హంతకుడైనప్పటికీ అతని వెంట నడవాలి. ఈ నీతి సూత్రాన్ని మనోవాక్కాయకర్మగా నమ్మిన అన్నదా దీదీ, హంతకుడై పారిపోయి, తిరిగి పాములుపట్టే వాని వేషంలో వచ్చిన భర్త వెంట వెళ్ళిపోతుంది. ఎవడితోనో లేచిపోయిందనే అపవాదుతో సమా జానికి దూరంగా వెలివేయబడుతుంది. అష్టకష్టాలు అనుభవిస్తుంది. భర్త పాము కాటుకు బలై మరణించిన తరువాత ఎవరికి కనిపించకుండా పోతుంది. ఇక్కడ శరత్, ఒకవైపు మత శాస్త్రాలు బోధించే స్త్రీ పాతివ్రత్యానికి (Chastity) ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సమాజంలో స్త్రీత్వం (womanhood) విలువను గుర్తించడం లేదని విచారిస్తాడు. మరో పాత్ర అభయను అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త ఆమె మానాన వదలివేసి ఉద్యోగానికై బర్మా వెళ్ళిపోతాడు. ఆమె అదే గ్రామానికి చెందిన రోహిణీ బాబును తోడు తీసుకొని భర్తను వెతుక్కుంటూ బర్మా వెళుతుంది. అప్పటికే ఆ భర్త బర్మా స్త్రీని పెళ్లిచేసుకొని ఉంటాడు. అలా అభయ రావడాన్ని సహించలేని భర్త ఆమెను చాలా హింసిస్తాడు. భరించలేక అభయ తిరిగి రోహిణీబాబు వద్దకు వచ్చి ఉంటుంది. అది చూసి దిగ్భ్రాంతికి గురైన శ్రీకాంతబాబుతో అభయ ‘‘నేను కేవలం భార్యను అయినంత మాత్రాన ఆయన అనుమతి లేకుండా ఇంత సుదూరం రావడానికి సాహసించాను. వచ్చి ఆయన ఆనందానికి భంగం కలిగించాను. స్త్రీలలో ఇంతటి సాహసాన్ని ఏ పురుషుడు సహించలేడు. అందుకు శిక్ష ఇది’’ అని, కుడిభుజంపై పైట కొంగును తొలగించి చూపుతుంది. కొరడాతో కొట్టిన దెబ్బకు లోతుగా చీరుకుపోయి ఉంటుంది. ‘‘ఇలాంటి దెబ్బలు నీకు చూపలేని చోట్ల చాలా ఉన్నాయి. నా భర్త అతని బర్మా భార్యతో సుఖంగా జీవించుగాక! అందుకు నాకు అభ్యంతరం లేదు. అయితే నిన్ను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను. ఒక భర్త కొరడా బలంతో భార్యకుగల అన్ని హక్కులను కాలదన్ని, చీకటి రాత్రిలో ఆమెను ఒంటరిగా ఇంట్లోనుండి బయటకు గెంటివేస్తే, వేద మంత్రాల శక్తి వల్ల మాత్రమే ఆమె తన బాధ్యతలకు, విధులకు కట్టుబడి ఉండాలా?....ఈ అర్థం, పర్థం లేని మంత్రాలు ఉచ్చరించిన వెంటనే గాలిలో కలిసిపోయాయి. అసత్యాలుగా మారిపోయాయి. అయితే అవే పెళ్ళి ప్రమాణాలు నాకు సంకెళ్ళుగా మారాయి. వాటి బరువు అంతా నామీద మోపబడింది. ఎందుకు? నేను స్త్రీ కావడం వల్లనేకదా!... అలాంటి ఘోర నేరాన్ని చేసిన భర్తను సహించి, ఒక జీవచ్చవంలా పడి ఉండడమే భార్య అంతిమ ఆశయమా?....’’ ఇలా ఈ అభయ పాత్ర ద్వారా శరత్ దుష్టులైన భర్తల దూషణలకు, అవమానాలకు, తిరస్కారాలకు, హింసకు గురైన భార్యల తరఫున ప్రశ్నల కొడవళ్ళను సంధిస్తాడు. ఇక ఈ నవలలోని మిగతా స్త్రీ పాత్రలైన రాజ్యలక్ష్మి, కమలలత కూడా విధివంచితులే. వీరి పట్ల ఇంతటి కాఠిన్యాన్ని ప్రదర్శించిన సమాజ ఆలోచనలలో మార్పును కాంక్షిస్తాడు శరత్.
శరత్ రాజకీయ వైఖరి ఎల్లప్పుడూ గాంధీ మార్గానికి భిన్నంగా రాజీలేని విప్లవ పోరాట పంథాకు అనుకూలంగా ఉండేది. ప్రముఖ సాహిత్యవేత్తగానేగాక స్వాతంత్రోద్యమంలో పోషించిన క్రియాశీల పాత్ర వలన విద్యార్థులకు, విప్లవకారులకు ఆయన ఎంతో అభిమాన పాత్రుడయ్యాడు. ఆయన్ను కలుసుకోవడానికి ఎక్కడెక్కడినుండో వచ్చేవారు. వీరందరితోనున్న పరిచయం వల్లనూ, వివిధ దేశాల విప్లవ పోరాటాల చరిత్రను నిశితంగా అధ్యయనం చేయడం వల్లనూ రాజీలేని విప్లవ పోరాట పంథా తాత్విక అవగాహనను అయన పథేర్ దబీ (భారతి) నవలలో సవ్యసాచి లాంటి అద్భుత పాత్ర ద్వారా ఆవిష్కరించగలిగాడు. ఈ నవల సృష్టించిన సంచలనానికి బెంబేలెత్తిన నాటి బ్రిటీష్ వలస ప్రభుత్వం దాన్ని నిషేధించింది.
శరత్ అభిప్రాయం ప్రకారం జీవితంలో చివరి ప్రశ్న అంటూ ఏదీ ఉండదు. ఒక ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు, మరొక కొత్త ప్రశ్న లేదా ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి సమాధానాలు వెతకాలి. ఇలా జరుగుతూనే ఉంటుంది. నిరంతరం మారుతున్న ప్రపంచపు వాస్తవిక నియమమిది. శరత్ జీవితపు చరమాకంలో రాసిన ‘శేష ప్రశ్న’ నవలలో ప్రధాన పాత్ర కమల ఫ్యూఢల్ ఆచారాలకు, సంప్రదాయాలు, కట్టుబాట్లకు తలవంచదు. వాటిని తర్కబద్దంగా ఎదిరిస్తుంది. స్త్రీల వివాహానికి సంబంధించి ఆమె ఇలా అంటుంది: ‘‘జీవితంలో జరిగే అనేక సంఘటనలలో వివాహం ఒకటి. అంతకుమించి ఏమీ కాదు. ఎప్పుడైతే స్త్రీలు దీన్ని తమ జీవిత సర్వస్వంగా భావించారో, ఆనాటి నుండి వారి జీవితంలో పెద్ద విషాదం ప్రారంభమైంది.... మాతృత్వమే స్త్రీ జీవితానికి అంతిమ ఘనతయని ఎవరైతే ఉద్భోదిస్తున్నారో, దాన్ని అలంకారాలతో, ఆడంబరంగా ఆరాధిస్తున్నారో వారు మొత్తం స్త్రీ జాతిని మోసగిస్తున్నారు.’’
శరత్ తన సాహిత్య కృషికి మూల ప్రేరణ గురించి ఇలా చెప్పాడు: ‘‘ఎవరైతే తమ సర్వస్వాన్ని ఇచ్చి, ప్రతిఫలంగా ఏమీ పొందకుండా ఉన్నారో, వారు వంచితులుగా, అభాగ్యులుగా, అణచివేత బాధితులుగా ఉన్నారు. వారు మానవమాత్రులే అయినప్పటికీ వారి కన్నీళ్ళకు సమాజం స్పందించడం లేదు. చుట్టూతా ఇంతటి సంపద ఉన్నప్పటికీ దానిపై వారికి కనీస హక్కు ఎందుకు లేదో వారి నిస్సహాయ, దుర్భర జీవితాలు ఎప్పటికీ గుర్తించలేవు. అలాంటి ప్రజల ఆవేదనలే నన్ను సాహితీ సృజనకు పురికొల్పాయి. అలాంటి ప్రజలే నన్ను వారి ప్రతినిధిగా ఇతరుల ఎదుట వారి ఫిర్యాదును విన్నవించమని పంపించారు. నా కార్యభారమంతా వారితోనే.’’
ఇక ‘శ్రీకాంత్’ నవలలో రైల్వేలైను నిర్మాణ కూలీల దుర్భర బ్రతుకుల గురించి శరత్ ఇలా రాస్తాడు: ‘‘సమాజానికి దూరమై, కుటుంబ పునాదులను కోల్పోయిన, అన్ని సహజ సంబంధబాంధవ్యాలు తెగిపోయిన వీరిని మట్టి తవ్వడానికి గుంపులుగా తెచ్చి ఈ గూడ్సు వ్యాగన్లలో పడవేయడం జరిగింది. ఇక్కడ వీరు అన్ని మానవ విలువలను పూర్తిగా కోల్పోయారు. భూమినుండి మట్టిని త్రవ్వి, కూలిపైసలను పొందడం తప్ప వీరిలో మరేమీ మిగిలి లేదు. మనుష్యులను పశువులుగా చేస్తే తప్ప, పశువులతో చేసే పనిని చేయించుకోలేమని బహుశా ఈ సభ్యసమాజం గుర్తించి ఉంటుంది... మనిషి మరణం యెడల నాకు ఎక్కువ బాధకలగదు, మానవ విలువల మరణం నన్ను అమితంగా బాధిస్తుంది.’’ ఇలా మనుష్యులలో మానవ సారాన్ని పూర్తిగా హరించివేసి, దిగజార్చే పెట్టుబడిదారీ విధానం అప్పటికే మనదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైనాన్ని శరత్ చిత్రీకరిస్తాడు. ఆ మహా రచయతకు వినమ్ర నివాళి.
(150వ జయంతి సంస్మరణ)
ఎస్. గోవిందరాజులు
94403 69647
ఈ వార్తలూ చదవండి
పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్
క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!